Tuesday, August 31, 2010

ఏఐసీసీ ఓదార్పు జగన్నాటకంలో ఓ బ్రహ్మాస్త్రం

soniya-laugh
తనను ధిక్కరించి, వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్రకు సిద్ధమవుతోన్న కడప ఎంపి జగన్‌కు బ్రహ్మాస్త్రంగా ఉన్న వైఎస్‌ కార్డును దూరం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బ్రహ్మాండమైన ఎత్తుగడకు తెర లేపింది. అందులో భాగంగానే పార్టీపరంగా ఓదార్పు యాత్ర నిర్వహించి, కాంగ్రెస్‌ ద్వారా వైఎస్‌ పొందిన పేరు ప్రఖ్యాతలను జగన్‌ ఖాతాకు వెళ్లకుండా పార్టీపరంగా తానే సొంతం చేసుకునే వ్యూహం రచించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

తాను చెప్పినట్లు బాధిత కుటుంబాలందరినీ ఒకచోట చేర్చి పార్టీ పక్షాన సాయం చేయాలన్న ఆదేశాన్ని లెక్కచే యకుండా.. ప్రకాశం జిల్లా యాత్రకు సిద్ధమవుతున్న జగన్‌కు ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కార్డును దక్క కుండా చేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీపై పట్టు బిగించి, దానిని ప్రాంతీయ పార్టీ స్థాయికి మార్చి, అంతా తానయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సామాన్య, మధ్య తరగతి ప్రజానీకంలో సంపాదించిన పేరు ప్రతిష్ఠలనే పెట్టుబడిగా చేసుకుని జగన్‌ తన రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించు కుంటున్న విషయం తెలిసిందే.

అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా కనీసం పార్టీ పేరు గానీ, సోనియా, రోశయ్య పేరు గానీ ప్రస్తావించకుండా.. పేద, బడుగు బలహీన, మైనారిటీ వర్గాలకు తన తండ్రి వైఎస్‌ చేసిన మేలును వ్యూహాత్మకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికీ ఏదో ఒక మేలు చేసిన తన తండ్రి చనిపోయిన తర్వాత తాను ఒంటరిననుకున్నానని, కానీ ఇన్ని లక్షల మంది తనతో ఉన్నందున తాను ఒంటరిని కాదని తెలుసుకున్నానంటూ జగన్‌ పదే పదే భావోద్వే గంతో ప్రస్తావించడం వ్యూహాత్మకమేనంటున్నారు.

అదే సమయంలో ప్రజల సంక్షేమం కోసం పాటు పడిన తన తండ్రి వైఎస్‌ మృతి చెందిన తర్వాత సొంత పార్టీలోని కొందరు నేతలే కాకుల్లా పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా ‘రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తక్కువ చేసి, ఆయన కుమా రుడైన జగన్‌ను అవమానిస్తోందన్న’ సానుభూతి సంపా దించుకునే వ్యూహానికి తెరలేపారు. అదే సమయంలో బాధిత కుటుంబాలకు లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం ద్వారా.. వైఎస్‌ వల్ల రెండుసార్లు అధికారం పొందిన కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ కోసం మృతి చెందిన బాధిత కుటుంబాలను మర్చిపోయి నప్పటికీ తాను మాత్రం ఆయన వారసుడిగా వారిని ఆదుకుంటున్నానన్న సంకేతాలివ్వడంలో జగన్‌ విజయం సాధించారు.

ఆయన తన పర్యటనలో కేవలం రాజశేఖరరెడ్డి, తన ఫొటో మాత్రమే ఉంచడం ద్వారా.. వైఎస్‌ సాధించిన పేరు ప్రతిష్ఠలకు, ఆయన ఇమేజికి తాను మాత్రమే వారసుడి నని, వాటితో కాంగ్రెస్‌ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని, వైఎస్‌ వల్ల పార్టీ లబ్థి పొందిందనే సంకేతాలు పంపించేందుకే ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ వేరు పార్టీ వేరని, ఆయనకు నిజమైన వారసుడెవరూ కాంగ్రెస్‌లో లేరని, వైఎస్‌ వల్ల సంక్రమిం చిన జనాకర్షణకు తానే ఏకైక ప్రతినిధినని చాటేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ వ్యవహారశైలి, వైఎస్‌ స్మృతి ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలో భాగమేనని కాంగ్రెస్‌ నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాతే పార్టీ పరంగా ఓదార్పు నిర్వ హించాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ వల్ల మాత్రమే వైఎస్‌ ఈ స్థాయికి ఎదిగారని, ఆయన ప్రారంభించిన పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత్రి సోనియాగాంధీ అనుమతి మేరకు అమలుచేస్తున్న వేనన్న ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రోశయ్య మొదలుకొని, వైఎస్‌ ప్రత్యర్థుల వరకూ ఇదే ప్రచారం కొనసాగిస్తున్నారు. వైఎస్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, ఆయన చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీవే తప్ప వైఎస్‌ సొంతవి కాదని స్పష్టం చేయడం ద్వారా.. పేద, మధ్య తరగతి వర్గాల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్‌ ముద్రను చెరిపి, పార్టీని ప్రతిష్ఠించే ప్రయత్నాలుగానే స్పష్టమవుతోంది.

అదే సమయంలో వైఎస్‌కు గత ఐదేళ్ల కాలంలో వచ్చిన ప్రతిష్ఠ, పలుకుబడి జగన్‌కు వెళ్లకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీపరంగా ఓదార్పు యాత్ర నిర్వహించడం ద్వారా వైఎస్‌ ముద్రను సొంతం చేసుకునే ఎత్తుగడకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. వైఎస్‌ ప్రతి ష్ఠను కాంగ్రెస్‌ మాత్రమే కాపాడుతుందని, కాంగ్రెస్‌- వైఎస్‌ వేరు కాదని, ఆయన స్మృతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాను నిర్వహించనున్న ఓదార్పులో పార్టీ నాయకులను ఉంచడం ద్వారా వైఎస్‌ బ్రాండ్‌ను పూర్తిగా సొంతం చేసు కోవాలన్నదే పార్టీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

అదే సమయంలో.. మృతులపై వస్తున్న లెక్కలని గతంలో అధిష్ఠానం అనుచరులు ఎద్దేవా చేసి, కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఆరోజు మృతి చెందిన వారందరినీ జగన్‌ వర్గీయులు వైఎస్‌ ఖాతాలో వేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు స్వయంగా నాయకత్వమే మృతుల కుటుంబాలను గుర్తిస్తోంది. అందులో భాగంగా.. జగన్‌ లెక్కలకు భిన్నంగా తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేయడం ద్వారా.. జగన్‌వి కాకిలెక్కలని, వైఎస్‌ కోసం ఎక్కువమంది మృతి చెందలేదని చెప్పి, జగన్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు లెక్కల ఎంపిక తీరు స్పష్టమవుతోంది.

అయితే.. వైఎస్‌ మృతి చెందిన సంవత్సరానికి పార్టీ నాయకత్వం కళ్లు తెరిచి ఓదార్పు నిర్వహించడాన్ని పార్టీ కార్యకర్తలు ఎత్తుగడగానే అనుమానిస్తారు తప్ప, అందులో చిత్తశుద్ధి ఉన్నట్లు భావించరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు జగన్‌ నాలుగు జిల్లాలు ఓదార్పు యాత్రను పూర్తి చేసి, మిగిలిన జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. నాయకత్వం ఆలస్యంగా స్పందించి, తాను కూడా లక్ష రూపాయలిస్తానని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని విశ్లేషిస్తున్నారు.

No comments:

Post a Comment