Saturday, November 27, 2010

షో ‘కాసు’ లే కారణం ! అమీతుమీకి రెఢీ ..

  


కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై వేటు ఖాయమయిపోయింది. అందులో భాగంగా ముందు రెండు రోజుల్లో షోకాజ్‌ నోటీ సు ఇచ్చేందుకు రంగం సిద్ధమయింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపాదించి ఆర్థికంగా బలోపేతుడయిన జగన్‌ను.. ఇప్పుడు ఉపేక్షిస్తే చివరకు ఆ సంపదతో పార్టీనే శాసించి, పార్టీని నిర్వీర్యం చేసేందుకు సాహిస్తారన్న ఆందోళన నాయకత్వాన్ని పట్టిపీడిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌పై చర్య తీసుకోవాలన్న ఆలోచనకు అసలు కారణం ఆయన సంపదేనంటున్నారు.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పవర్‌ ప్రాజెక్టులతో పాటు, ఇబ్బడిముబ్బడిగా పలు వ్యాపారాల స్థాపన ద్వారా జగన్‌ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న సమాచారం తెప్పించుకున్న అధిష్ఠానం ఈ దశలో ఆయనను నియంత్రిచకపోతే తన సంపాదనతో మరింత ఎత్తుకు ఎదిగి, చివరకు తననే శాసించే ప్రమాదం ఉందని నాయకత్వం భయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ముందస్తు ఆదాయపన్ను 86 కోట్లు రూపాయలు చెల్లించిన జగన్‌, దేశంలోని మిగిలిన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని 500 కోట్ల పన్ను చెల్లించినట్లు అధిష్ఠానం దృష్టికి వచ్చిందని పార్టీ వర్గాలు వివరించాయి.


sonia-see
ఈ నేపథ్యంలో తన సంపద ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పార్టీని శాసించే స్థాయికి ఎదిగి, పార్టీ నియమించిన ముఖ్యమంత్రులను ఇబ్బందిపెడుతున్నారని నాయకత్వం గ్రహించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగన్‌ పార్టీని శాసిస్తుంటే, ఇక సంపద పెరిగితే జగన్‌ హవా ఇతర రాష్ట్రాలకూ పాకే ప్రమాదం ఉందని నాయకత్వం అంచనా వే స్తున్నట్లుతెలుస్తోంది. కేవలం ధన బలంతోనే జగన్‌ తనను సవాలు చేసే స్థాయికి ఎదిగారన్న తీర్మానానికి వచ్చింది.

జగన్‌ను విడిచిపెడితే.. ఆయన చివరకు మరో ఆంధ్రా శరద్‌పవార్‌లా మారి చివరకు పార్టీ ఉనికికే ప్రమాదంగా పరిణ మిస్తారన్న భయాందోళన కూడా నాయకత్వానికి లేకపోలేదంటున్నారు. మహా రాష్ట్ర కేంద్రంగా మొదట కాంగ్రెస్‌లో ఉంటూ, పార్టీ నాయకత్వంపై తిరుగు బాటు బావుటా ఎగురవేసిన శరద్‌పవార్‌ స్థాపించిన నేషలిస్టు కాంగ్రెస్‌తో అక్కడ కాంగ్రెస్‌ దారుణంగా దెబ్బతింది. చివరకు అదే పవార్‌ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన దుస్థితికి చేరింది.

చక్కెర లాబీ ద్వారా వేల కోట్లు సంపాదించిన పవార్‌, చివరకు ఆ సంపాదనతో పార్టీ స్థాపించి, కాంగ్రెస్‌ను శాసించే స్థాయికి ఎదిగిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంది. జగన్‌ వ్యవహారం ఆవిధంగా కాకూడద న్న పట్టుదలతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దీనికితోడు.. జగన్‌ పార్టీని శాసిస్తూ, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్నప్పటికీ ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం వల్ల.. సోనియాగాంధీ ఒక సాధారణ ఎంపీ అయిన జగన్‌కు భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లడంపైనా నాయకత్వం అప్రమత్తమవుతోంది. ఈ సంకేతాల వల్ల.. దేశవ్యాప్తంగా అగ్రనేతలను అణచివేసిన సోనియాగాంధీ చివరకు జగన్‌కు భయపడుతోంద న్న భావన బలపడుతుందేమోనన్న భయం కూడా జగన్‌కు షోకాజ్‌ ఇచ్చేందుకు ఒక కారణమవుతోంది.

అమీతుమీకి రెఢీ
జగన్ వర్గం అధిష్ఠానం మాటల యుద్ధం
మోహరించిన ఇరుపక్షాలు
కత్తులు దూయడం ఖాయం
ఎప్పుడన్న దానిపైనే సందిగ్ఢం
ఉపేక్షించలేమంటున్న హైకమాండ్


వివేకా, జైపాల్ ద్వారా సంకేతాలు
బలం చూసిన తర్వాతే చర్యలు
వేరుకుంపటి బాటలో కడప ఎంపీ
వివేకాకు పదవి ఇస్తే ఫైటింగే
40 మంది వెంట వస్తారని ధీమా
సిఎం కిరణ్ మధ్యేమార్గం?
అప్పుడే చర్యలకు విముఖం
ఈ గొడవతో మంత్రివర్గం జూప్యం

"అధిష్ఠానం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా నన్ను చులకన చేసింది. ఇప్పుడు మా కుటుంబ సభ్యుల మధ్య కలతలు సృష్టించి, చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మా బాబాయ్ వివేకానంద రెడ్డిని ఢిల్లీకి రప్పించింది. ఇప్పుడు సాక్షిలో పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి షోకాజ్‌లకు భయపడేది లేదు. కొత్త పార్టీ పెట్టి మన సత్తా చాటుదాం ''
- సన్నిహితులతో జగన్
అడుగులు పడుతున్నాయి! అటు అధిష్ఠానం... ఇటు జగన్ వర్గం! ఇరు శిబిరాలు మోహరించాయి! చర్యలు తక్షణం తీసుకుందామా, వద్దా అనే 'వ్యూహాత్మక' అనిశ్చితిలో అధిష్ఠానం... చర్యలు తీసుకుంటే సత్తా చూపించేందుకు సిద్ధమైన జగన్ వర్గం! సమరం జరగడం ఖాయం! ఎప్పుడన్నదే సందిగ్ధం! కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అధిష్ఠానం వేసిన కీలక అడుగు. అలాగే... జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డికి పదవి ఇస్తున్నట్లు సంకేతాలు పంపడం మరో అడుగు! ఎప్పుడూ నోరు తెరిచి వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు చేయని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి తొలిసారి జగన్‌పై స్పందించడం ఇంకో అడుగు! ఇవన్నీ చర్యల దిశగా అధిష్ఠానం వేస్తున్న అడుగులు. జగన్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. తన వర్గీయులతో విస్తృతస్థాయిలో మంతనాలు జరుపుతున్నారు.

షోకాజ్ నోటీసు ఇచ్చినా, తన బాబాయ్‌కి మంత్రి పదవి ఇచ్చినా... అదే అదనుగా ఒకే ఒక్క భారీ అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. సొంత పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే మాటల యుద్ధం మొదలుపెట్టారు. జగన్ 'గొంతుక'గా భావించే అంబటి రాంబాబు అధిష్ఠానంపై మాటల తూటాలు వదిలారు. 'సై అంటే సై' అన్నట్లుగా సవాల్ విసిరారు. ఒక్కటిమాత్రం సుస్పష్టం! ఇరువర్గాలు కత్తులు పట్టుకుని నిల్చున్నాయి. ఎవరు ముందు కత్తి దూసినా... సమరం ప్రారంభమైనట్లే! జగన్‌పై చర్యల విషయంలో, ఇటు మంత్రివర్గ కూర్పు వ్యవహారంలో అధిష్ఠానం దాగుడు మూతలు ఆడుతోంది. జగన్ విషయంలో కొంచెం వేచి చూడాలని, ఆయన యాక్షన్ బట్టే రియాక్షన్ ఇవ్వాలని భావిస్తోంది. షోకాజ్ నోటీసు జారీ చేసి తాడోపేడో తేల్చుకోవడమా? ఆయన వర్గీయులకు కేబినెట్‌లో కోత పెట్టడమా? వివేకానంద రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని మరింత రెచ్చగొట్టడమా? అనే విషయాన్ని తేల్చుకోలేకపోతోంది. దీంతో మంత్రివర్గ జాబితాను ఖరారు చేయలేకపోయింది. శనివారం సాయంత్రం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నివాసంలో దాదాపు మూడు గంటలకు పైగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ, జగన్ వర్గంపై నిర్ణయం తీసుకోలేకపోయారు.

వివేకానంద రెడ్డికి పదవి ఇస్తే సమస్య జటిలమవుతుందని, ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించాలని కిరణ్ భావిస్తున్నప్పటికీ... జగన్ విషయంలో ఇక ఉపేక్షించరాదని, ఆయన బలం ఏమిటో బయటపడేలా చూడాలని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసే విషయం పెండింగ్‌లో పడిందని, పార్లమెంట్ సమావేశాల తర్వాత మరో నాలుగు రోజుల్లో ఈ విషయంపై దృష్టిసారించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి జరిగిన క్రమశిక్షణా సంఘం సమావేశంలో జగన్‌పై వేటు వేయడంపై తర్జన భర్జనలు జరిగాయి. జగన్ చానల్‌లో రాహుల్ గాంధీపైనా వ్యతిరేక కథనం రావడంతో ఇక ఉపేక్షించరాదని పార్టీ నేతలు భావించారు. జైపాల్ రెడ్డి ద్వారా ఈ మేరకు సంకేతాలు పంపించారు. బుధవారానికి పార్లమెంట్ సమావేశాలు పూర్తవుతాయని, రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణం అదే రోజు జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈలోపు జగన్, ఆయన వర్గీయులపై తీసుకోవాల్సిన చర్యలపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి వస్తుందని చెబుతున్నారు.

జగన్ వర్గం హెచ్చరిక స్వరం

జగన్‌పై చర్యలు తీసుకోవడంపై అధిష్ఠానం వ్యూహం ఇలా ఉండగా... 'మమ్మల్ని టచ్ చేస్తే ఇబ్బందులు తప్పవు' అంటూ జగన్ వర్గం శనివారం సాయంత్రానికే అటు కొత్త సీఎం కిరణ్‌కు, ఇటు అధిష్ఠానానికి హెచ్చరికలు పంపింది. షోకాజ్ నోటీసు జారీ చేసినా, వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా, తమ వర్గీయులకు చెక్ పెట్టినా... ప్రత్యక్ష యుద్ధానికి దిగాలని జగన్ వర్గీయులు భావిస్తున్నట్లు అధిష్ఠానానికి సమాచారం అందింది. జగన్‌కు సంబంధించి ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా ఐదుగురు ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు అంచనా వేసి, అందుకు తగిన విధంగా మంత్రివర్గ మార్పుల ద్వారా చెక్ పెట్టాలని, జగన్ బలం పెద్దగా లేదని తేలిన తర్వాతే ఆయనపై చర్యకు పూనుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందనే భయంతో అవే పాత ముఖాలతో, కళంకితులతో కేబినెట్‌ను నింపేస్తే కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎంగా నియమించిన ఉద్దేశం నెరవేరదని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా సరే, ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే... జగన్‌పై తాడోపేడో తేల్చుకోవాలని, అదను చూసి కొరడా ఝళిపించాలని నిర్ణయించారు. అయితే, కొంత రాజీబాటలో వెళ్లాలని, ఇప్పుడే జగన్‌పై యుద్ధం ప్రకటించరాదని కిరణ్ మెతక వైఖరి ప్రదర్శిస్తుండడం పార్టీ నేతలను ఆశ్చర్యపరుస్తోంది. అందువల్ల మంత్రివర్గ జాబితా అధిష్ఠానం అనుకున్న ప్రకారం రూపొందుతుందా... కిరణ్ సూచించినట్లు మ««ధ్యే మార్గం అనుసరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. కిరణ్ కేవీపీ రామచంద్రరావు సూచించిన జాబితాను ప్రతిపాదిస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జగన్‌తో లింక్‌?..
Jagan-stand
రోశయ్య స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించింది. అయితే ఆదిలోనే హంసపాదులు అన్నట్లుగా మంత్రివర్గం కూర్పులోనే జగన్‌వర్గం అధిష్ఠానానికి గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది. ఇతరత్రా ప్రాంత, కుల సమీకరణాల విషయంలో అంతగా ఇబ్బందులు లేకపోయినా జగన్‌ వర్గీయుల విషయం వచ్చేసరికి సందిగ్ధం తప్పలేదు. జగన్‌ వర్గీయులను మంత్రివర్గంలో తీసుకుంటే ఒక చిక్కు, తీసుకోకుంటే మరో చిక్కు ఈ సమస్యకు ఏది పరిష్కారం అన్నది అధిష్ఠానానికి సైతం పాలుపోకుండా ఉన్నట్లు సమాచారం.

మంత్రివర్గ జాబితా రూపకల్పనకు ఇదికూడా ఓ కారణంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. మంత్రివర్గ కూర్పు రూపకల్పన నేపథ్యంలో యువనేత హైదరాబాద్‌లో మకాంవేసి తన వర్గీయులతో రహస్య మంతనాలు పార్టీ అధిష్ఠానానికి కలవరానికి గురిచేస్తోంది.ఏ వర్గానికి చెక్‌పెట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావించిందో ఆ యువనేత వర్గం నూతన మంత్రివర్గంలో తమకు చోటు కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ దిశగా కొండా సురేఖ, వై.ఎస్‌.వివేకానందరెడ్డి, అమరనాథ్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, మల్లాది విష్ణు, జోగి రమేష్‌ తదితరులు ఇప్పటికే సిఎంను కలసి మంత్రి పదవుల కోసం అభ్యర్థనలుచేశారు.

అయితే వీరిని కేబినేట్‌లో చేర్చుకోవడం ద్వారా జగన్‌కు చెక్‌ పెట్టాలన్న ఆలోచనతో కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉంది. సహజంగా కేబినేట్‌లోని మంత్రివర్గ సభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరం చేయవచ్చు అని పార్టీ నాయకత్వం ఆలోచన. అదే సందర్భంలో వారిని జగన్‌ నుంచి దూరం చేయోచ్చని కూడా హైకమాండ్‌ ఆలోచిస్తోంది. కానీ మరోవైపు వారిని చేర్చుకుంటే వచ్చే నష్టాలపై కూడా అంచనావేస్తోంది. ఈ మంత్రిపదవులు అడిగే వారు యువనేత వద్ద తమ విధేయతను అదే తీరులో కొనసాగిస్తున్నారు.ఈ అంశమే పార్టీ హైకమాండ్‌కు కొంత కలవరానికి గురిచేస్తోంది. కేవలం జగన్‌ ప్రాబల్యంను కేబినేట్‌లో తమ ప్రాతినిధ్యం ద్వారా కొనసాగించే కుట్ర జరుగుతోందా అన్న కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. మంత్రి పదవుల కోసం ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి ఎంత దగ్గరగా ఈ నేతలు వ్యవహరిస్తున్నారో జగన్‌తోనూ అంతే సాన్నిహిత్యాన్ని వారు కొనసాగిస్తున్నారు.

పార్టీపై తన పట్టును కోల్పోకుండ ఉండేందుకు జగన్‌ స్వయంగా ఈ పైరవీలకు ప్రోత్సహిస్తున్నారా అన్న కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మరోవైపు వీరిని పక్కన పెట్టి మంత్రివర్గ కూర్పును రూపొందిస్తే యువనేత వర్గీయుల అసమ్మతి తప్పదని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తమ వర్గానికి చెక్‌ పెట్టేందుకే సిఎంను మార్చారు అన్న సంగతి యువనేత శిభిరంగా నిశితంగా పరిశీలిస్తుంది. అందుకు యువనేత సిఎం మార్పు ప్రకటన వెలువడగానే హుటాహుటీనా బెంగుళూరునుంచి హైదరాబాద్‌కు చేరుకొన్నారు.

అంతేకాకుండా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యేంతవరకు రాజధానిలోనే ఉండాలన్న జగన్‌ నిర్ణయం వెనక ఆయన వ్యూహం దాగిఉన్నదని కూడా పార్టీ నాయకత్వం భావిస్తోంది. మంత్రివర్గ ఏర్పాటు తరువాత తన వ్యూహాన్ని పదును పెట్టాలని జగన్‌ ఆలోచనగా ఉందని పార్టీ హైకమాండ్‌ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనూ పూర్తిగా కేబినేట్‌ ఏర్పాటులో జగన్‌ వర్గానికి పీఠం వేసినా, వేయక పోయినా చిక్కులు తప్పవని కాంగ్రెస్‌ అధిష్ఠానం తలపట్టుకొంటోంది. ఒక వేళ వారికి మంత్రి పదవులు ఇస్తే ఇప్పటికే రూపొందించిన జాబితాలు కొంత మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.

ఈ మార్పులు చేర్పులలో కులం, ప్రాంతం వంటి అన్ని కోణాలో మళ్లీ జాబితాను ప్రక్షళన చేసి రూపొందించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలోనే ఇప్పటికే జగన్‌ వర్గానికి దూరం పెట్టి రూపొందించిన జాబితా ఉన్నప్పటికీ వాటిని ఇప్పిటికిప్పుడు వాటిని ప్రకటించే సాహసం కాంగ్రెస్‌ నాయకత్వం చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్‌ వర్గానికి ప్రవేశం ఇవ్వాలా వద్ద అన్న కోణంలో ఆలోచించి నిర్ణయంతీసుకొనున్న నేపథ్యంలో బుధవారమే మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త పార్టీ వైపు జగన్ చూపు రాజీనామాలు చేయాలని సన్నిహితులకు ఆదేశం
అధిష్ఠానం షోకాజ్ ఇస్తే చెత్తబుట్టలో పారేయాలని నిర్ణయం
ధిక్కారమే ఆయుధం
బాబాయ్‌ను మచ్చిక చేసుకుని కుటుంబంలో చిచ్చు
పార్టీ నేతలకు జగన్ సూచన

రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి అంకురార్పణ జరుగుతోంది. కొత్త పార్టీని పెట్టాలన్న యోచనకు కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్ఠానం తనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తే దానినే మాత్రం పట్టించుకోకుండా చెత్తబుట్టకు పరిమితం చేయాలని .. ఇదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని తన వర్గ నేతలకు ఆదేశించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తన వెంట శాసనసభ్యులూ, ఎమ్మెల్సీలూ, ఎంపీలు ఎవరు వచ్చినా రాకున్నా .. తాను మాత్రం తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేస్తున్న పథకాల కారణంగానే రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జగన్ స్పష్టం చేస్తున్నారు. వైఎస్ తనయుడిగా ప్రజాదరణ తనకే ఉందని సన్ని హితుల వద్ద స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో వేగంగా కదులుతున్న రాజకీయ పరిణామాలు జగన్‌ను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ముఖ్యమంత్రి పదవి కోసం 153 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను సేకరించినా అధిష్ఠానం ఏమాత్రం పట్టించుకోలేదు. దీని తర్వాత అధిష్ఠానం వద్దంటున్నా బేఖాతరు చేస్తూ ఓదార్పు యాత్ర ద్వారా తన బలాన్ని నిరూపించుకునే యత్నం చేస్తున్నారు. అయితే.. దీనిని ధిక్కారంగానే పరిగణించడం మినహా .. జగన్ బలంగా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవడం లేదు.

దీనికి తోడు .. ముఖ్యమంత్రి బాధ్యతలను రోశయ్య నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించడంతో జగన్ వర్గం షాక్‌కు గురైంది. ఇక ముఖ్యమంత్రి కుర్చీ ఇప్పట్లో దొరికే అవకాశాల్లేవన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇక అధిష్ఠానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్ర అనంతరం రెండు రోజులు చెన్నైలో వైద్యం చేయించుకుని తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకున్న అనంతరం .. రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చిన జగన్ .. భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొణిజేటి రోశయ్య అప్పట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో నివాసం ఉంటున్న వైఎస్ సతీమణి విజయమ్మను, వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు.

ఇదే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తనను కలవాల్సిందే తప్ప తాను ఆయనను కలవడం ఏమిటన్న ఆలోచన జగన్‌లో స్పష్టంగా కన్పించిందని ఆయన వర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కమలమ్మ, శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథరెడ్డి, లబ్బి వెంకటస్వామి, జయసుధ, వై.వెంకటేశ్వరరెడ్డి, శివప్రసాదరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆళ్ల నాని, రామచంద్రారెడ్డి, కొండా మురళి, జూపూడి ప్రభాకర్‌రావు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిలతో జరిగిన భేటీలో కొత్త పార్టీ అంశాన్ని జగన్ చర్చకు తీసుకువచ్చారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ' అధిష్ఠానం కక్ష పూరిత ధోరిణతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ నన్ను చులకన చేయడమే కాకుండా .. మా కుటుంబ సభ్యుల మధ్య కలతలు సృష్టించి చిచ్చురేపేందుకు యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మా బాబాయ్ వివేకానందరెడ్డిని ఢిల్లీకి రప్పించింది. నాతో సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పిస్తానని వివేకానందరెడ్డి చెప్పడం వంటి విధానాలకు పాల్పడుతోంది. ఇప్పుడు సాక్షిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. కొత్త పార్టీని పెట్టి మన సత్తా చాటుదాం' అని జగన్ పేర్కొన్నారు.

రాజకీయంగా జగన్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని బాలినేని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు స్పష్టం చేశారు. అయితే.. పలువురు శాసనసభ్యులు పార్టీ ఏర్పాటు పట్ల పునరాలోచన చేయాలని సూచించారు. అయితే.. తన వెంట ఎవరు వచ్చినా రాకున్నా .. పార్టీ పెట్టాలన్న యోచనలో ఎలాంటి మార్పు లేదని జగన్ స్పష్టం చేశారు. కాగా.. జగన్ సొంత పార్టీ పెడితే .. శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేస్తారా అని జగన్‌వర్గ నేతలు పలువురిని ప్రశ్నిస్తే ..'అధిష్ఠానం షోకాజ్ నోటీసు ఇవ్వదు .. తమకు రాజీనామా చేసే అవకాశం రాదు ' అని చెప్పేవారి సంఖ్యే అధికంగా ఉంటోంది. కాగా.. జగన్‌వర్గ ఎమ్మెల్యేలు పలువురు శనివారం అందుబాటులోకి రాలేదు. కాగా.. ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ .. జగన్‌కు షోకాజ్ నోటీసు రావడం, కొత్త పార్టీ పెట్టడం వంటి అంశాలపై తాను అవసరాన్ని బట్టి మాట్లాడతానని అన్నారు. ఇప్పటి వరకూ జగన్‌వర్గ నేతగా ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం తాను రాజీనామాకు సిద్ధంగా లేనని అన్నారు.

ఇప్పుడు పార్టీ పెట్టడం మంచిది కాదని తాను స్పష్టం చేశానని ఆన్‌లైన్‌తో అన్నారు. శుక్రవారం నాడు తాను జగన్ వద్దకు వెళ్లలేదని.. కాని కొందరు నేతల వద్ద పార్టీ ప్రస్తావన వచ్చినట్లు సమాచారం అందిందని అన్నారు. తమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రం జగన్‌తో ఉంటానని స్పష్టం చేశారని.. తాను మాత్రం ఇప్పటి నుంచే ఎమ్మెల్యే సీటు కోల్పోయేందుకు సిద్ధంగా లేనని అన్నారు. ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన వాడినన్న ముద్ర పడడంతో రాజోలు బ్రిడ్జి పనులకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య నిధులు మంజూరు చేయలేదని అన్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి కూడా ముఖ్యమేనని ఆయన చెప్పారు. మొత్తానికి .. జగన్ వేరు కుంపటి వైపే జగన్ అడుగులు వేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

బాబాయ్‌ X అబ్బాయ్‌
vevenkanth
వైఎస్‌ కుటుంబంలో రోజురోజుకూ చిచ్చు రాజు కుంటోంది. మంత్రి పదవి కావాలని ఢిల్లీకి వెళ్లిన జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు జగన్‌ శిబిరంలో ఆగ్రహం రగిల్చాయి. జగన్‌ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నారని, సాక్షి ద్వారా పార్టీపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారంటూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది సేపటి తర్వాతే వివేకానం దరెడ్డి ఆయనను కలవడం చర్చనీయాంశ మయింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వివేకా.. జగన్‌తో క్షమాపణ చెప్పిస్తానని, ఆ వార్తలపై విచారం వ్యక్తం చేయిస్తానని, జగన్‌ను సోనియా వద్దకు తీసుకువెళతానన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. వివేకా నంద వ్యాఖ్యలను జగన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించడంతోపాటు.. వివేకా దుష్టశక్తుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారంటూ జగన్‌కు అనుకూలంగా ధ్వజమెత్తారు. కాగా, వైఎస్‌ కుటుంబంలో చిచ్చు మొదలయిందంటూ శనివారం  వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలు దీనిని నిజం చేస్తుండటం గమనార్హం.

వివేకానందరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో జగన్‌ తప్పుచేశారన్న విషయాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేయడమే కాకుండా, జగన్‌తో క్షమాపణ, విచారం వ్యక్తం చేయిస్తానంటూ వ్యాఖ్యానించడంపై స్వయంగా జగన్‌ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవైపు తనను అణచివేసేందుకే కిరణ్‌కుమార్‌ను ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన నాయకత్వంతో తాను తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు బాబాయ్‌ స్వయంగా తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు పంపించడం జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒకవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతుంటే, తన బాబాయ్‌ మాత్రం తాను కచ్చితంగా తప్పు చేశానని చెప్పడమే కాకుండా, చేసిన తప్పును మన్నించమంటూ సోనియాగాంధీ వద్దకు వెళతామన్న బాబాయ్‌ వ్యాఖ్యలపైనా జగన్‌ తన అనుచరుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

దానితో ఆయన తన అధికార ప్రతినిధిగా వ్యవహరించే అంబటి రాంబాబు ద్వారా వివేకా వ్యాఖ్యలను ఖండింపచేశారు. వివేకానందరెడ్డి దాదాపు అధిష్ఠానానికి లొంగిపోయారన్నట్లు అంబటి మాట్లాడటం అందరినీ ఆకర్షిం చాయి. జగన్‌ ఎలాంటి తప్పు చేయలేదని, అందువల్ల విచారంగానీ, క్షమాపణ గానీ చెప్పాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా స్పష్టం చేశారు. ఒకవేళ జగన్‌ ఆదేశం లేకపోతే.. కుటుంబ వ్యవహారంలో, అందునా వైఎస్‌ సోదరుడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేంత ధైర్యం అంబటి చేయరన్నది నిర్వివాదం. దానితోపాటు.. వైఎస్‌ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతుందని చెప్పడం చూస్తే.. అది అంబటి వైఖరి కాకుండా జగన్‌ గళం మాదిరిగానే అర్థం చేసుకోవలసి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్‌ కుటుంబం నిలువునా చీలిపోయిందని స్పష్టమవుతోంది.

ఇక వైఎస్‌ కుటుంబంలో వివేకానందరెడ్డి వేరయినట్టేనని పార్టీ శ్రేణుల్లో స్పష్టమైన సంకేతం వెళ్లినట్టయింది. దీనితో ఇప్పటిదాకా కడప జిల్లాలో తిరుగులేకుండా పెత్తనం సాగించిన వైఎస్‌ కుటుంబం కూడా చీలిపోయింది. వివేకాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కడపలో జగన్‌ హవాకు తెరదించాలన్న నాయకత్వ ఎత్తుగడతో కడప జిల్లా రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయి.ఇదిలాఉండగా, తమ ప్రత్యర్థి డిఎల్‌ రవీంద్రారెడ్డికి జిల్లా నుంచి మంత్రి పదవి రాకూడదన్న వ్యూహంతోనే వివేకానందరెడ్డి హటాత్తుగా రంగప్రవేశం చేసి, మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దానిని జగన్‌ వర్గం మరోలా అర్థం చేసుకోవడం దురదృష్టకరమంటున్నారు.

వైఎస్ కుటుంబాన్ని చీల్చే కుట్ర
కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు ధ్వజం

* దుష్టశక్తుల చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి పావు కావద్దు
* ఇదంతా ఢిల్లీలోని కొందరు పెద్దల కుట్రనిపిస్తోంది
* వివేకాను ఢిల్లీ పిలిచి నాటకమాడిస్తున్నారు
* వైఎస్ కుటుంబాన్ని చీల్చి జగన్‌ను ఇరుకున పెట్టాలనుకుంటున్నారు
* ఆయనను ఏకాకిని చేయాలన్న ప్రయత్నమే ఇది
* ‘సాక్షి’లో కథనాలకు, జగన్‌కు సంబంధం లేదు
* ఆయన ఏనాడూ సోనియా, రాహుల్‌లను విమర్శించలేదు
* అలాంటప్పుడు వివరణ ఎందుకు ఇవ్వాల్సివస్తుంది?



‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, యువ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకాకిని చేసి బలహీనపర్చాలన్న కుట్ర జరుగుతోంది. వైఎస్ జ్ఞాపకాలను సైతం చెరిపేయాలని, జగన్‌ను బలహీనపరచాలని ఢిల్లీలోని కొందరు పెద్దలు పన్నుతున్న మహాకుట్రలో వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని పావుగా వాడుకుంటున్నారన్న అనుమానం కలుగుతోంది’’ అని కాంగ్రెస్ నేత, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు ఆరోపించారు. వైఎస్ కుటుంబ గౌరవాన్ని అభాసుపాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగం కావద్దని వివేకానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. సాక్షి చానెల్‌లో వచ్చిన కథనాలు తప్పని, జగన్‌మోహన్‌రెడ్డితో సోనియాగాంధీకి వివరణ ఇప్పిస్తానని ఢిల్లీలో వివేకానందరెడ్డి పేర్కొనడంపై రాంబాబు అభ్యంతరం వ్యక్తంచేశారు. సాక్షిలో వచ్చిన కథనాలకు జగన్‌కు ఎలాంటి సంబంధమూ లేదని, జగన్ ఏ తప్పూ చేయలేదని వివరించారు.

‘‘జగన్ పార్టీ క్రమశిక్షణను ఏనాడూ ఉల్లంఘించలేదు. ఇప్పటివరకు ఏనాడూ సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని విమర్శించలేదు. పావురాలగుట్టలో ఇచ్చిన మాటమేరకు ఓదార్పు యాత్ర చేస్తున్నారే తప్ప మరెన్నడూ పార్టీ గీత దాటలేదు. అలాంటప్పుడు ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరణ ఎందుకు ఇవ్వాలి?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు, రాష్ట్ర ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని దుయ్యబట్టారు. జగన్‌ను బయటకు పంపే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

అంబటి మాటల్లోనిముఖ్యాంశాలు ఇవీ...
‘‘సాక్షిలో వచ్చిన కథనాల మీద జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకొని ఢిల్లీ వెళ్తానని, సోనియాగాంధీకి వివరణ ఇప్పిస్తానని వివేకానంద అనడం బాధ కలిగించింది. సాక్షిలో వచ్చిన కథనాలు తప్పు, వాటిని నివారించడానికి ప్రయత్నిస్తానని చెప్పడం చాలా అభ్యంతరకరం. సాక్షి అనేది స్వతంత్రంగా, వాస్తవాలను ప్రతిబింబించేదిగా ఉంటుందని, ఏ పార్టీకీ సంబంధంలేదని ముందునుంచి జగన్ చెబుతున్నారు. అక్కడి సంపాదకవర్గానికి ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందులో వచ్చిన కథనంపై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లి సోనియాగాంధీకి వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్‌కు లేదు. జగన్ ఏతప్పూ చేయలేదు. మీడియాలో వచ్చిన కథనాలు కూడా తప్పుకాదు. అవి విశ్లేషణాత్మక కథనాలు. వాటికి, జగన్ అభిప్రాయాలకు సంబంధంలేదు. మీడియాలో వచ్చిన కథనాలకు, జగన్‌కు ఎంతవరకు సంబంధం ? ఎంతమందికి మీడియాలు లేవు? ఆ పేపర్లలో వచ్చిన ప్రతి కథనం ఆయా యాజమాన్యాలు చేస్తున్నవేనా? ఆ మాత్రం విచక్షణతో చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి లేదా?

వివేకాను పావుగా వాడుకుంటున్నారని అనుమానం
వివేకానంద మంత్రివర్గంలో స్థానం కోసం వెళ్లినట్లుగా అనిపించడం లేదు. ఆయన్నెవరో పిలిచి ఢిల్లీలో నాటకమాడిస్తున్నారన్న భావన కలుగుతోంది. కేవలం జగన్‌పై బురద చల్లాలన్న ఉద్దేశంతో ఏకాకిని చేయాలన్న కుట్రలో భాగంగానే వివేకాను పావుగా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎప్పట్నుంచో వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రానికి చెందిన కొందరు ఢిల్లీ పెద్దలు కుట్రపన్ని ఇలా చేస్తుండవచ్చు. ఇది అన్యాయం. వైఎస్ కుటుంబంలోని వ్యక్తిని చీల్చి జగన్‌ను బలహీనపర్చాలని, ఇరుకున పెట్టాలని ప్రయత్నం చేయడం హేయం. ఎవరిచేతిలోనో పావుగా ఉండవ.ద్దని వివేకాకు విజ్ఞప్తి చేస్తున్నా.

వైఎస్‌కు, ఆయన కుటుంబానికి రాష్ట్రంలో అపార ప్రజాదరణ, గౌరవం ఉంది. దాన్ని అభాసుపాలుచేసేలా కాంగ్రెస్ దుష్టశక్తుల చేతిలో కీలుబొమ్మగా మారవద్దని కోరుతున్నా. వివేకానంద ఎమ్మెల్సీ. వైఎస్‌కు సోదరుడిగా, జగన్‌కు బాబాయిగా మంత్రివర్గంలోస్థానం కోసం ప్రయత్నం చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ నిన్న మాట్లాడిన దానికి, ఈరోజు మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. జగన్‌తోకానీ విజయమ్మతో కానీ సంప్రదించలేదని నిన్న చెప్పారు. ఈరోజు వేరుగా మాట్లాడారు. జగన్ కుటుంబంలోని వారినే పావులా ఉపయోగించి జగన్‌ను అభాసుపాలు చేయాలన్న దుష్టశక్తుల కుట్రలో భాగంగానే వివేకానంద ఇలా వ్యవహరిస్తున్నారేమోనన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అధిష్టానానికి, జగన్‌కు మధ్య ఏర్పడిన అగాధాన్ని వివేకా పూడ్చితే మంచిదే. ఆ పనికోసం మంత్రివర్గ విస్తరణ సమయంలో, మంత్రి పదవికోసం వెళ్లాల్సిన పనిలేదు. అగాధం ఏర్పడినప్పటినుంచే ఈ ప్రయత్నం చేసి ఉండాల్సింది. వైఎస్ కుటుంబం ఐక్యంగా ఉంది. ఇప్పుడు అందులో చీలిక తేవాలని, జగన్‌ను బలహీనపర్చాలని కుట్రచేస్తున్నవారు సక్సెస్ కాలేరన్న విశ్వాసం నాకుంది.

జగన్ క్రమశిక్షణ ఉల్లంఘించలేదు
ఓదార్పు యాత్రకు వెళ్లడం ఎలా తప్పవుతుంది? యాత్ర రెండు జిల్లాల్లో జరిగినప్పుడు ఎవరూ తప్పు పట్టలేదు. కానీ తరువాత కొందరు పెద్దలు, ముఖ్యమంత్రి జోక్యంచేసుకొని దాన్నొక బహిష్కరించాల్సిన యాత్రగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. జగన్ ఏనాడూ కాంగ్రెస్ క్రమశిక్షణకు భిన్నంగా పనిచేయలేదు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల మీద ఏనాడూ విమర్శలు చేయలేదు. మీడియాలో వస్తున్న విమర్శలను ఆయన విమర్శలుగా చూపించి బురదచల్లాలని చూస్తున్నారు. చివరకు వివేకానందరెడ్డి కూడా అలా మాట్లాడ్డం ధర్మంకాదు. ఓదార్పుయాత్రకు వెళ్లవద్దంటూ, వెళ్తే మంత్రి పదవులనుంచి తొలగిస్తామని చెప్పి తప్పు చేసిన వారు తప్పును ఒప్పుకొని వివరణ ఇవ్వాలే తప్ప జగన్ కాదు. తప్పు జరిగిందల్లా అటువైపునుంచే, దాన్ని సరిచేసుకోవలసిందీ వారే.’’

విలేకర్ల ప్రశ్నలకు అంబటి జవాబులు

జగన్ తరఫున మీరెందుకు మాట్లాడుతున్నారు?
వైఎస్ మరణించిన తర్వాత తండ్రిలేని కుమారున్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రాత్రనక, పగలనక ఇంటింటికీ గడప గడపకు తిరుగుతున్న 36 ఏళ్ల యువకుడిని ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందా? అందువల్లనే ఆయనకు అండగా నిలబడాలని కోరుకుంటున్నా. వైఎస్ అనుచరుడిగా, ఆయనతో పాదయాత్ర చేసిన వ్యక్తిగా, జగన్ అభిమానిగా మాట్లాడే హక్కు నాకు ఉందనే భావిస్తున్నా. అందుకే మాట్లాడుతున్నా.

వివేకానంద కుట్రలో ఇరుక్కునేంత అమాయకుడా?
కుట్రలో ఇరుక్కోవడానికి అమాయకుడు కావలసిన పనిలేదు. ఎవరైనా ఇరుక్కుంటారు. కుట్రలో పావుగా మారుతున్నారన్న అనుమానం కలుగుతోందన్నది నా భావన. ఇంకా ఏమైనా ఉంటే ఆ తరువాత తేలుతాయి.

జగన్‌కు షోకాజ్ నోటీసిస్తున్నారన్న ప్రచారం నిజమేనా?
జగన్‌కు షోకాజ్ నోటీసు ఇస్తారని ఇప్పటికి 23 సార్లు రాశారు, ప్రసారం చేశారు. ఎప్పుడైనా షోకాజ్ నోటీసు ఇచ్చారా? ఇంతవరకు ఇవ్వలేదంటే జగన్ తప్పు చేయలేదనేకదా దాని అర్థం. జగన్‌పై చర్యతీసుకొనే అవకాశం లేదని మొయిలీకూడా చెప్పారు. షోకాజ్ ఇవ్వలేదంటే... తప్పుచేశాడంటూ వందసార్లంటున్న వారి నోళ్లు మూయించినట్లే కదా?


Monday, November 22, 2010

దాగుడుమూతలు బంద్ : వైయస్ జగన్ ఔట్‌.. ! * చిరంజీవి ఇన్‌ !


Sonia-jagan-war

కాంగ్రెస్‌లో జగన్‌ అంకం ఇక ముగిసినట్టేనా? జగన్‌పై ఎదురుదాడి చేయటంతో పాటు, తాడోపేడో తేల్చుకునేందుకు రోశయ్య సిద్ధమవుతున్నారా? ఢిల్లీ యాత్ర లక్ష్యం అదేనా? ఆయన స్థానాన్ని మెగాస్టార్‌, పీఆర్పీ అధినేత చిరంజీవి ఆక్రమించబోతున్నారా? చిరుతో జనాకర్షణ లోటును కాంగ్రెస్‌ అధినేత్రి భర్తీ చేయనున్నారా? అందుకే అటు ముఖ్యమంత్రి రోశయ్య, ఇటు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఇద్దరూ ఒకేరోజు ఢిల్లీకి వెళుతున్నారా?.. జగన్‌ను సాగనంపడానికి నిర్ణయించుకున్న తర్వాతే జనపథ్‌ నుంచి చిరుకు సంకేతాలు అందాయా? ఆ ప్రకారంగా చిరంజీవిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందా?.. తాజా పరిణామాలుఇలాంటి చర్చలకే దారితీస్తున్నాయి.

చలికి గజగజ వణుకుతున్న ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు ఈ చర్చతో వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రోశయ్య, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఇద్దరూ మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, ఇతర పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రోశయ్య, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించనున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా జగన్‌కు చెందిన సాక్షి చానెల్‌ వచ్చిన వార్తా కథనానికి సంబంధించిన క్లిప్పింగులతో పాటు.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొద్దికాలం నుంచి సాక్షి పత్రికలో వస్తున్న వార్తా కథనాల సెట్లను కూడా తీసుకువెళుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి తనకు వ్యతిరేకంగా సాక్షి చానెల్‌లో వచ్చిన కథనాల క్లిప్పింగును కూడా అధినేత్రి సోనియా, రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌, రాష్ట్ర ఇన్చార్జి వీరప్పమొయిలీకి అందచేయనున్నారు.

జగన్‌పై తక్షణం చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమశిక్షణారాహిత్యం ముదిరిపోతుందని, పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకునేందుకు నాయకత్వం భయపడుతోందన్న సంకేతాలు ఇప్పటికే విస్తృతంగా వెళుతున్నాయని, దానిపై పత్రికల్లో సైతం కథనాలు వస్తున్నాయని వివరించనున్నారు.అదే సమయంలో జగన్‌పై చర్య తీసుకుంటే ఆయన వెంట ఒక్క ఎంపీ కూడా వెళ్లే అవకాశం లేదని, వైఎస్‌ వల్ల ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో లబ్థి పొందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లవచ్చని స్పష్టం చేయనున్నారు. జగన్‌ పార్టీలో కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని, వ్యక్తిగతంగా తనను, సంస్థాగతంగా పార్టీని నష్టపరిచే ఏకసూత్ర కార్యక్రమంలో ఉన్నారని ఫిర్యదు చేయనున్నారు. జగన్‌ను పార్టీని నుంచి బహిష్కరించడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీలేదని కూడా వివరించనున్నారు.

కాగా, జగన్‌ కన్నా ఎక్కువ ప్రజాదరణ, గ్లామర్‌ ఉన్న పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి పార్టీకి ఆదుకునేందుకు తనంతట తాను ముందుకు వస్తున్నందున.. చిరంజీవి సేవలను వినియోగించుకోవడం ద్వారా, కోస్తాలో బలమైన కాపు వర్గాన్ని కూడా ఆకర్షించవచ్చని రోశయ్య పార్టీ అధినేత్రికి సూచించనున్నారు. చిరుకు ఇప్పటికీ గ్లామర్‌, ప్రజాదరణ ఉందని చెప్పనున్నారు. చిరంజీవి పార్టీకి మద్దతు ప్రకటిస్తే.. జగన్‌ ఒకవేళ కాంగ్రెస్‌ను చీల్చినా పీఆర్పీ బలంతో ఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని స్పష్టం చేయనున్నారు.

ఇదిలాఉండగా.. చిరంజీవికి పోలవరం అంశంపై ప్రధానితో అపాయింట్‌మెంట్‌ గతంలోనే ఖరారయినప్పటికీ.. వారి అజెండా మాత్రం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌ వల్ల పార్టీకి నష్టం కలిగితే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను దానిని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలు ఇంత త్వరగా ఎన్నికలు కోరుకోవడం లేదని చిరంజీవి ప్రధానికి స్పష్టం చేసే అవకాశాలున్నాయి. జగన్‌ సంపాదనపై ప్రజల్లో కూడా అనుమానాలున్నాయని, దేశంలో ఇంత త్వరగా లక్ష కోట్ల ఆస్తి సంపాదించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరన్న అభిప్రాయం జనంలో ఉందని చిర ంజీవి తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రధానికి అందచేయనున్నారు.

అదే సమయంలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌నూ కలిసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఆయనతో భేటీ ఖరారు కానున్నా మంగళవారం ఏ క్షణంలోయినా పటేల్‌ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా, చిరంజీవి భేటీలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీకి చెందిన వారికి కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ చేసి, జగన్‌కు చెక్‌ చెప్పడంతో పాటు.. తన పార్టీకి మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చిన పీఆర్పీని మంత్రివర్గంలో తీసుకునే విషయంలో కాంగ్రెస్‌ నాయకత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు.

రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడడానికి చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంతో ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే సాకుతో ఆయన మరోమారు కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిసి ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. చిరంజీవి మాటలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సోనియాపై సాక్షి మీడియా వార్తాకథనాన్ని చిరంజీవి వ్యతిరేకించారు. వ్యూస్ ను న్యూస్ గా చూపించడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేసి కొంత మంది మనోభావాలను దెబ్బ తీయడం మంచిది కాదని ఆయన అన్నారు. అంతలోనే సర్దుకుని, అది కాంగ్రెసు పార్టీ అంతర్గత విషయమని, తాము ఆ పరిణామాలపై మాట్లాడడం అప్రస్తుతం, అనవసరమని ఆయన అన్నారు.

వైయస్ జగన్ సాక్షి మీడియా వార్తాకథనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా చెప్పారు. రెండు, మూడు రోజుల్లో విషయంపై నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. పూర్తి వివరాలతో, సాక్ష్యాలతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వైయస్ జగన్ వ్యవహారంపై రెండో నివేదికను కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం వైయస్ జగన్ వివరణను కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి వైయస్ జగన్ వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ పార్టీని చీల్చడానికి గానీ సొంత పార్టీ పెట్టదలుచుకున్నా ప్రభుత్వానికి నష్టం జరగకుండా చిరంజీవితో మంగళవారం చర్చల్లో కాంగ్రెసు అధిష్టానం నిర్దిష్టమైన ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Saturday, November 20, 2010

నీతి శిఖరం కూలింది

డాక్టర్ మన్మోహన్‌సింగ్... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తురుపు ముక్కగా ఉపయోగపడిన వ్యక్తి. 'ప్రధానమంత్రి పదవికి మా అభ్యర్థి మన్మోహన్ సింగ్ - ఆయనకు సాటి వచ్చే వ్యక్తి మీ తరఫున ఎవరు?' ఇదీ 2009 ఎన్నికలలో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ విసిరిన లాజవాబ్ సవాల్! కానీ ఇప్పుడు అదే మన్మోహన్ దేశ ప్రజల ముందు దోషిగా తలదించుకోవలసిన దుస్థితి! స్వతంత్ర భారతావనిలో సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన, అత్యున్నత న్యాయస్థానం లో అఫిడవిట్ దాఖలు చేయబోతున్న తొలి ప్రధాని మన్మోహన్!

బ్యూరోక్రాట్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన ఇంతకాలంగా సంపాదించుకున్న 'మిస్టర్ క్లీన్' ముద్ర 2జి స్పెక్ట్రం కుంభకోణంతో మసకబారింది. మన్మోహన్ నిస్సందేహంగా, వ్యక్తిగతంగా నూటికి నూరుశాతం నిజాయితీపరుడే కావచ్చు. కానీ భారతదేశ ప్రధానమంగ్రా అధికారిక బాధ్యతల నిర్వహణలో మాత్రం ఆయన పూర్తి నిజాయతీతో లేరని ఈ ఉదంతం స్పష్టం చేసింది.

తన మంత్రివర్గ సహచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉంటే ఉపేక్షించడాన్ని ప్రధానిగా మన్మోహన్ ఎలా సమర్థించుకోగలరు? తెలిసి తెలిసీ అవినీతికి అనుమతించడమంటే, అవినీతిని ప్రోత్సహించడమే అవుతుంది. ఈ కారణంగానే, 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దేశప్రజల ముందు దోషిగా నిలబడిన రాజాపై సకాలంలో చర్య తీసుకోనందు కు, ప్రధాని తలదించుకోవలసి వస్తున్నది. నిజానికి మన్మోహన్ దేశ ప్రధాని పదవిలో ఆరు సంవత్సరాలకుపైగా ఉంటున్నప్పటికీ, ఆయ న పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కావడానికి ప్రయత్నించలేదు.

కాంగ్రెస్ పార్టీ కూడా మన్మోహన్‌ను ఒక సి.ఇ.ఒ.గానే పరిగణిస్తూ, ఆయన ఇమేజ్‌ను ఉపయోగించుకుంటూ వచ్చింది. పరిస్థితులు సజావుగా సాగినంతకాలం ఈ ఏర్పాట్లు బాగానే కనిపించాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణం బయటకు రావడంతోనే, అంతర్గత ఏర్పాట్లు వేరు, రాజ్యాంగపరమైన బాధ్యతలు వేరు అని అటు మన్మోహన్‌కు ఇటు కాంగ్రెస్ పెద్దలకు తెలిసివచ్చింది.

రాజాను రక్షించడానికి మన్మోహన్ సింగ్ స్వయంగా సిద్ధపడ్డార ని చెప్పడానికి వీలు లేదు. 2009 ఎన్నికలకు ముందే ఈ కుంభకోణంపై వివిధ ప్రభుత్వ విభాగాలు దర్యాప్తు ప్రారంభించినందున, ఆ ఎన్నికలలో గెలిచిన తర్వాత రాజాను తిరిగి మంత్రిమండలిలోకి తీసుకోవడానికి మన్మోహన్ నిరాకరించారు. ఫలితంగా మంత్రివర్గ విస్తరణే కొన్ని రోజులు వాయిదాపడింది కూడా! ఈ దశలోనే రాజా ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ, అనేక శక్తులు రంగ ప్రవేశం చేశాయి.

జాతీయ సమాచార సాధనాలలో పనిచేస్తు న్న ఉన్నతస్థాయి పాత్రికేయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో కొందరికి కూడా ఇందులో పాత్ర ఉంది. అసభ్యకరమైన ప్రలోభాలు కూడా పనిచేసినట్టు చెబుతున్నారు. వీటికి తోడు సంకీర్ణ రాజకీయాలలో ఉండే బలహీనతలు ఎలాగూ ఉన్నాయి. ఫలితంగా డి.ఎం.కె. ఒత్తిళ్లకు తలొగ్గి రాజాను కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా తీసుకోవడానికి యు.పి.ఎ. చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ అంగీకరించవలసి వచ్చింది.

అయితే రాజా నిందితుడని తెలిసి కూడా మంత్రిమండలిలోకి తీసుకోవడం మన్మోహన్ సింగ్ చేసిన తొలినేరం. ఇక్కడ ఆయన నిస్సహాయుడని చెప్పడానికి లేదు. దేశ ప్రధానిగా 2జి స్పెక్ట్రం కుంభకోణంలో ఏమి జరిగిందో ఆయనకు తెలుసు కనుక, ఈ దేశం పట్ల తన నిబద్ధతను నిరూపించుకోవడానికి, ప్రధాని పదవిని త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడి ఉండవచ్చు. పవర్ పాలిటిక్స్‌లో ఇది సాధ్యమా? అంటే అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు.

మన్మోహన్ సింగ్‌ను సాధారణ రాజకీయ నాయకుడుగా చూడలేం కనుకే ఆయన నుంచి విలక్షణ వ్యక్తిత్వాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటారు. ఆ రోజు అలా జరగలేదు కనుకే ఇవ్వాళ ప్రధాని తలదించుకోవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నది, రాజాను మంత్రి మండలిలో చేర్చుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే అయినప్పటికీ, ప్రభుత్వానికి సార «థ్యం వహిస్తున్నది మన్మోహన్ సింగ్ కనుక పాపపుణ్యాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది.

అందువల్లే వ్యక్తిగత నీతి-నిజాయితీలకు మారుపేరుగా ఉంటూ, గొప్ప ఆర్థిక సంస్కరణవాదిగా పేరుగడించిన మన్మోహన్‌సింగ్, ఒక్కసారిగా తన ఔన్నత్యాన్ని కోల్పోయి దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడ్డారు.

2జి స్పెక్ట్రం కుంభకోణం వ్యవహారం ముదురు పాకాన పడిన తర్వాత మాత్రమే ఎ.రాజాను మంత్రిమండలి నుంచి తప్పించడానికి కారణం ఏమిటి? అక్రమాల సంగతి ముందే తెలిసినప్పుడు, 2009 ఎన్నికల తర్వాతే సోనియా ఈ పని చేసి ఉండవచ్చు కదా? డీఎంకే ఒత్తిడికి తలొగ్గడం కేవలం అధికారం కోసం రాజీ పడడంలో భాగ మా? లేక ఇంకేమైనా ఉందా? తన కుటుంబ సభ్యుల్లో కొందరికి సన్నిహితుడు కనుక రాజా విషయంలో కరుణానిధి పట్టుబట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ ఎందుకు ఉపేక్షించినట్టు? కేవలం సంకీర్ణ రాజకీయాల పరిమితులే ఇందుకు కారణమా?

లేక లక్షా 75 వేల కోట్ల రూపాయల స్కాం సొమ్ములో కాంగ్రెస్‌కు కూడా ఏమైనా వాటా ముట్టిందా? దాన్ని 2009 ఎన్నికల్లో ఉపయోగించారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. స్పెక్ట్రం కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జె.పి.సి.) దర్యాప్తు జరిపించడాని కి కూడా కాంగ్రెస్ పార్టీ మీన మేషాలు లెక్కిస్తున్నదంటే, ఈ పాపంలో ఆ పార్టీకి కచ్చితంగా భాగస్వామ్యం ఉండి ఉండా లి.

ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రె స్- భారతీయ జనతా పార్టీలు అధికారా న్ని వదులుకోవడానికి సిద్ధపడకపోవడం వల్ల, పీఠాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారిపోవడం వల్ల దేశ రాజకీయాలలో పలు పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో తమను బెదిరిస్తున్న డి.ఎం.కె.ను దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ అధినాయకత్వం అన్నా డి.ఎం.కె.తో మంతనాలు ప్రారంభించింది.

దీంతో పరిస్థితిని గమనించిన డి.ఎం.కె. పెద్దలు దిగివచ్చి, రాజాను ప్రాసిక్యూట్ చేసినా తమకు అభ్యంతరం లేదని, తాము మద్దతు కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ అన్నాడీఎంకేతో కలిస్తే, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమపార్టీ కథ ముగుస్తుందన్నది దాని భయం. రాజానా? రాజ్యాధికారమా? అన్నది తేల్చుకోవాల్సి వచ్చినపుడు డి.ఎం.కె. అయినా, మరో పార్టీ అయినా రాజ్యాధికారంవైపే మొగ్గుచూపడం సహజమే కదా!

బహు కుటుంబీకుడైన కరుణానిధి కుటుంబంలోని విభేదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాస్తవానికి 2009కి ముందు, లేదా ఆ ఏడాది ప్రజా తీర్పు తర్వాత (వెంటనే) ఎన్నికలకు వెళ్లడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేనందున, అన్నా డి.ఎం.కె. కాకపోతే మరొక పార్టీ అయినా యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉండేది. అందువల్ల ఈ తెంపరితనాన్ని గతంలోనే, అంటే 2జి స్పెక్ట్రం కుంభకోణానికి బీజం పడినప్పుడే ప్రదర్శించి ఉంటే, దేశానికి లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండేది కాదు కదా!

అయినా కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడంతో, మొత్తం ఉదంతంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలిపై కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. నెహ్రూ కుటుంబంపై గతంలో ఎన్నడూ రాని ఆరోపణలు, ఇప్పుడు సోనియా గాంధీ విషయంలో వినిపిస్తున్నాయి. పార్టీ నిధి పేరిట విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారన్నది ఇందులో ప్రధానమైన ది. గతంలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే నిధులు స్వీకరించే వాళ్లు.

ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఢిల్లీ నుంచి తెలుస్తున్న సమాచారం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రమం తప్పకుండా కప్పం కడుతున్నారని, కేంద్ర మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ ఫండ్ ఇవ్వవలసి వస్తోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాను కలవాల్సిందిగా కొందరు మంత్రులకు సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించిన ఉదంతాలు ఉన్నాయి.

స్పెక్ట్రం కుంభకోణంలో నిందితుడైన రాజా కూడా, కొంత మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పినట్టు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అగ్రనేతలు సోనియాను, ప్రధానిని కూడా శంకిస్తున్నారు. సోనియా నిధుల సమీకరణ గురించి, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇటీవల తన సన్నిహితుడైన ఒకరి దగ్గర వాపోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి సి.పి.ఐ. అగ్రనేత చెవిన వేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కమ్యూనిస్టు నేతలు ఈ వ్యవహారంపై ఆరా తీయడం ఆరంభించారు.

కారణాలు ఏవైనా అవినీతి విషయంలో గత ఆరు సంవత్సరాలు గా ఉపేక్షిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇటీవల తన పార్టీకి చెందిన కొందరు అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మన రాష్ట్రం విషయానికే వస్తే, 2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్‌లో లెక్కలేనన్ని కుంభకోణాలు చోటుచేసుకున్నా సోనియాగాంధీ ఏనాడూ పెదవి విప్పిన పాపాన పోలేదు. ఫలితంగానే అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమ మార్గాలలో సంపాదించిన సొమ్ము ఉందన్న ధీమాతో, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, కడప ఎం.పి. జగన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులా మారారు.

అవినీతిని అనుమతించడం వల్ల అసలుకే మోసం వస్తుందన్న వాస్తవాన్ని ఇలాంటి ఉదంతాలతో కాంగ్రెస్ నాయకత్వం గుర్తించి ఉండవచ్చు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా తలెత్తకుండా చేయడానికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో రాజీనామా చేయించారు. నిజానికి తన బంధువులకు రెండు, మూడు ఫ్లాట్లు కేటాయించుకున్నందుకు చవాన్‌తో రాజీనామా చేయించడం, మన రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.

ఎందుకంటే వందల, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ నాయకత్వం గతంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు అలాం టి అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద అవినీతి పరులపై చర్య లు తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం ఉపక్రమించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే తోటకూర దొంగిలించిన నాడే మందలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సామెతలా, పై నుంచి క్రింది వరకు అవినీతిని పెంచి పోషించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని చర్యలు తీసుకున్నా, వారి చిత్తశుద్ధిని శంకించక తప్పదు.

రాజకీయ ప్రయోజనాల కోసం పాలకపక్ష ప్రత్యర్థులపై చర్యలు తీసుకోనంత కాలం అవినీతి నిర్మూలన విషయంలో వారి చిత్తశుద్ధిని విశ్వసించలేం. అది సోనియా అయినా... మన్మోహన్ అయినా! ఎందుకంటే 2జి స్పెక్ట్రం కుంభకోణం గురించి తెలిసిన తర్వాత, రాజాను మంత్రివర్గంలో తీసుకోవడం తప్పకపోతే, కనీసం ఆయన శాఖనైనా మన్మోహన్ మార్చి ఉండాల్సింది. అది జరగలేదు. స్పెక్ట్రం విషయంలో తన అభ్యంతరాలను, అభిప్రాయాలను చెప్పి సరిపెట్టిన మన్మోహన్, రాజా వాటిని బుట్టదాఖలు చేసినా పట్టించుకోలేదు.

ఇన్ని వేల కోట్ల వ్యవహారాన్ని కనీసం కేబినెట్‌లో అయినా పూర్తిస్థాయి చర్చకు పెట్టారా అంటే అదీ లేదు. దేశానికి రాజకీయంగా బలమైన ప్రధాని లేకపోతే ఏం జరుగుతుందో అదే ఇప్పుడు జరిగింది! మన్మోహన్ క్లీన్ ఇమేజ్‌ను రాజకీయంగా ఉపయోగించుకున్న కాంగ్రెస్, తన సహజ లక్షణమైన రాజకీయ అవినీతిని ఆయనకు అంటించింది. పరిస్థితి ఇలా దిగజారినప్పుడు మన్మోహన్ మాత్రం ఏమి చేయగలరని సరిపెట్టుకోవడం మాత్రమే మనం చేయగలిగింది!

రాజా అవినీతికి నైతికంగా సోనియాది బాధ్యత అయితే, సాంకేతికంగా మన్మోహన్‌ది బాధ్యత. ఈ దేశానికి లక్షా 76 వేల కోట్ల రూపాయల మేర నష్టం కలిగించే అధికారం తమకు లేదన్న వాస్తవాన్ని వారు గుర్తించాలి. రాజాను మంత్రిమండలి నుంచి తొలగించ డం కాదు - జరిగిన నష్టాన్ని రికవరీ చేయడం ముఖ్యం. ఈ దిశగా మన్మోహన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అక్రమార్కు ల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2008 సంవత్సరం వరకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయ లు ఈ దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలి వెళ్లిపోయినట్టు అంతర్జాతీయ సర్వే ఒకటి తేల్చింది. అవినీతి, అక్రమాల వల్ల వ్యవస్థ లు భ్రష్టు పట్టిపోవడమే కాదు; మన అభివృద్ధికి ఉపయోగపడవలసి న నిధులు అక్రమంగా విదేశాలకు తరలించబడి ఆ దేశాలకు ఉపయోగపడుతున్నాయి. అడ్డగోలుగా సంపాదించిన డబ్బును బాహాటంగా అనుభవించలేని స్థితి ఉంటున్నప్పటికీ, ధనదాహానికి అంతం లేకుండా పోవడం ఆశ్చర్యంగానే ఉంటున్నది.

ఈ దేశానికి నాయక త్వం వహిస్తున్నామని చెప్పుకొంటున్న నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరచి పరిస్థితి తీవ్రతను గుర్తించకపోతే భావి తరాలకు తీరని అపకా రం చేసినవారు అవుతారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఘర్షణ పడే వైఖరులకు స్వస్తి చెప్పి దేశ విశాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా కృషి చేయవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ దేశంలో చట్టాలను గౌరవించే పరిస్థితి తీసుకురావలసిన బాధ్యత రాజకీయ నాయకులపై, ముఖ్యంగా మన్మోహన్‌సింగ్ వంటివారిపై ఉంది.

ఇప్పుడు మన్మోహన్ ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే రెండు. ఒకటి- తన మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవడం. రెండవది- తాను కూడా సాధారణ రాజకీయ నాయకుడినేనని, అధికారానికి అంటిపెట్టుకుని ఉండాలన్న బలహీనతకు అతీతుడిని కానని అంగీకరించడం! ఈ రెండింటిలో దేనికి అంగీకరించినా ఈ దేశ ప్రధానిగా తన బాధ్యతలను ఆయన విస్మరించకూడదు. కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి పొందడానికైనా మన్మోహన్ సింగ్ ఇకపై చొరవ తీసుకుని ధీరోదాత్తుడుగా వ్యవహరించాలి. మరి ఆయన అందుకు సిద్ధపడతారా? లేక మకిలి రాజకీయాల నుంచి పారిపోతారా? 

- ఆదిత్య

Monday, November 15, 2010

వృద్ధాప్యంలోనూ... ఉడుంపట్టు

వృద్ధాప్యంలోనూ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలనపై ఉడుంపట్టు బిగిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా.. దేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రు లను మార్చేందుకు నాయకత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. అధినేత్రి అంతరంగాన్ని గమ నించిన రోశయ్య నాయకత్వం మదిలో ఎలాంటి ‘కొత్త ఆలోచనకు అవకాశం కలిగించకుండా’ వేగంగా పనిచేయడం ప్రారంభించారు. తన పని తీరు ద్వారా అటు మంత్రులనూ పరిగెత్తిస్తూ ఆంధ్ర్ర పదేశ్‌లో మార్పులకు అవకాశం ఉం దన్న వార్తలు, జోస్యాలను కొట్టిపారేసే కార్యాచరణలో నిమగ్న మయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఖాయ మన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య తన పాత వైఖరి మార్చుకుని, ధృడంగా వ్యవహరిస్తుండటం, చర్చనీయాంశమయింది.

‘ఢిల్లీ వాతావరణాన్ని’ గమనిస్తున్న ఆయన, ఆ మేరకు పాలనపై ఉడుంపట్టు బిగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తానో దారినపోయే దానయ్యనని, అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తానని, తనకె లాంటి కోరికలు లేవని, అధిష్ఠానం ఉండమన్నంత వరకూ ఉంటానని, తనకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చినా చేస్తానంటూ తామరాకుపై నీటిబొట్టు చందంగా వ్యవహరించిన రోశయ్య.. ఈమధ్య కాలంలో చురుకుగా, స్వతంత్రంగా ‘తన ప్రభు త్వం తప్పనిసరిగా పూర్తికాలం కొన సాగుతుందన్న’ సంకేతాలిచ్చేలా వ్యవహరిస్తున్నారు. అందులో భాగం గా ఆయన తన వయసును కూడా లెక్కచేయకుండా జిల్లా పర్యటనలు చేస్తున్నారు.
cm-speech
రోశయ్య సగటున వారా నికి మూడు పర్యటనలు, 18-20 సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుంచి 24 వరకూ వరసగా పర్య టనలు ఉన్న విషయం తెలి సిందే. రోశయ్య మార్పు ఖాయమని, తెలం గాణకు చెందిన నాయకుడికి పగ్గాలు అందిస్తారన్న ఊహా గానా లతో మంత్రులు సైతం చాలాకాలం నుంచి ఎవరికీ పట్టనట్లు వ్యవ హరించారు. చివరకు తనపై ప్రతిపక్షాలు విమ ర్శలు చేసినా ఎదురుదాడి చేయ కుండా మౌనంగా ఉంటున్న వైనంపై రోశయ్య కొరడా ఝళిపించడంతో, గత కొద్దిరోజుల నుంచి మంత్రులు పోటీలు పడి మరీ ప్రధాన ప్రతిపక్ష మైన టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మె ల్యేలు కూడా మంత్రులను అనుసరిస్తున్నారు.

ఇటీవల ఏడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు మంత్రులను అప్రమత్తం చేయగలి గారు. ఇదే రోశయ్య సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన భారీ వరదల సమయంలో మంత్రులు నిర్లిప్తంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇవన్నీ రోశయ్య తన పాల నను మరింత పటిష్ఠం చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్న సంకేతాలను స్పష్టం చేస్తున్నాయి. ఇక తాజాగా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఆరె స్సెస్‌ మాజీ అధినేత సుదర్శన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

అయితే.. అందరి కంటే భిన్నంగా ముఖ్యమంత్రి రోశ య్య మాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్వ హించిన ధర్నాలో స్వయంగా పాల్గొ ని సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్య మంత్రీ కూడా ఈవిధంగా రోడ్డుపె ైకొచ్చి పార్టీ అధినేత్రికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న దాఖ లాలు లేవు. ఇది జాతీయ స్థాయి లోనూ చర్చ నీయాంశంగా మారి రోశయ్య అందరి దృష్టినీ ఆకర్షించ గలిగారు. రోశయ్య ధైర్యంగా తీసు కున్న ఈ నిర్ణయం పార్టీ అధ్యక్షు రాలికి ఆయనను మరింత చేరువ చేసింది.

రోశయ్య.. పార్టీ ఎమ్మెల్యేల ప్రయోజనాలు పరిరక్షిస్తున్నానన్న సంకేతాలివ్వడం కూడా ప్రారంభించారు.నామినేటెడ్‌ పదవుల విష యంలో జిల్లా మంత్రులు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తప్పని సరిగా తీసుకోవాలని, వారి నియోజక వర్గాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల సందర్భంగా తనకు వ్యతి రేకంగా చేసిన వ్యాఖ్యలపై రోశయ్య విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఎదురు దాడి తీరు.. తాను బలహీన ముఖ్యమంత్రిని కాదన్న సంకేతాలి చ్చాయి. అప్పటి వరకూ తాను ప్రతి పక్షం జోలికి పోకుండా, లౌక్య పరమైన రాజకీయాలు చేస్తున్నాననే విమర్శలకు తెరదింపగలిగారు.

ధర్నా విషయం చూడటానికి సాధార ణంగా కనిపించినప్పటికీ.. తాను పార్టీ కోసం దేనికయినా సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలతో పాటు.. పార్టీ అధినేత్రి దృష్టిలో విశ్వస నీయత, విధేయత గల ఏకైక ముఖ్యమంత్రి అన్న భావన కల్పిం చడంలో రోశయ్య విజయం సాధిం చగలిగారు. తాజాగా సోని యాకు మద్దతుగా చేసిన ధర్నా, ప్రతి పక్షంపై ఎదురుదాడి పరిణామాలతో రాష్ట్రం లో నాయ త్వ మార్పు చేయవలసిన అవసరం లేదన్న సంకేతాలను రోశయ్య అధిష్ఠానానికి స్పష్టంగా పంపగలిగారు.

Tuesday, November 2, 2010

సంపన్న భారత్, నిరుపేద భారత్... ఈ రెండు భారత్‌లనూ ఏకంచేసే శక్తి కాంగ్రెస్‌


‘రెండు భారత్‌ల’ను ఏకంచేయాలి
ఆ శక్తి కాంగ్రెస్‌కే ఉంది


"రెండు హిందూస్థాన్‌లు ఉన్నాయి.
ఒకటి పేదల హిందూస్థాన్..
మరొకటి ధనికుల
హిందూస్థాన్..
ఒకటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
మరొకటి
సంక్షోభంలో కూరుకుపోయి ఉంది.
ఈ రెంటిని ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా ఒక్క
కాంగ్రెస్‌కే ఉంది''
..... రాహుల్ గాంధీ


అందుకు ప్రధాని మన్మోహన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: రాహుల్

సంపన్న భారత్, నిరుపేద భారత్... ఈ రెండు భారత్‌లనూ ఏకంచేసే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని పార్టీ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఏర్పాటైన ఏఐసీసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బలహీన వర్గాలే దేశాన్ని ముందుకు తీసుకుపోగలవని అన్నారు. బలహీన వర్గాల కోసం పనిచేయాలని ఆయన పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ భేటీలో వేదికపై వెనుక వరుసలో కూర్చున్న రాహుల్, సభ్యుల డిమాండు మేరకు ప్రసంగించారు. తన ప్రసంగం ఎజెండాలో లేకున్నా, చివరి క్షణంలో సభ్యుల ఒత్తిడి మేరకు ప్రసంగిస్తున్నానని ఆయన అన్నారు.

రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. దేశంలోని నిరుపేదలను ముందుకు తీసుకుపోవాలంటే, పార్టీ సభ్యులంతా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డ ప్రధాని మన్మోహన్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. దేశంలోని పలుప్రాంతాల్లో నిరుపేదలను, దళితులను తాను కలుసుకున్నప్పటి అనుభవాలను వివరించారు. సంపన్న భారత్ త్వరగా వృద్ధి చెందుతోందని, నిరుపేదల భారత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ఈ రెండింటినీ అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు భారత్‌లను ఏకం చేయగల శక్తి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, మిగిలిన పార్టీలన్నీ కుల, మత, ప్రాంతీయ తత్వాలతో పనిచేస్తున్నందున వాటికి అది సాధ్యం కాదని అన్నారు.

రాహుల్‌పై కాంగ్రెస్ అగ్రనేతల ప్రశంసల జల్లు

రాహుల్ నేతృత్వంలోని యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలు పార్టీని యువతరానికి చేరువ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశంసలు కురిపించారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాహుల్ కొత్తతరం రాజకీయాలకు తెరలేపారని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రశంసించారు. ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా కొత్తతరం యువకులను యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలు ముందుకు తేవడంపై సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు.

రాహుల్‌ను కలిసిన రోశయ్య

యువనేత రాహుల్‌గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం 10 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉదయం పదింటికి ఏఐసీసీ సభ్యుల భేటీకి వచ్చిన ఆయన పార్టీ పతాకావిష్కరణ సందర్భంలో అక్కడికొచ్చిన రాహుల్‌ను కలిశారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో, రాష్ట్రంలో సూక్ష్మ రుణ బాధితుల ఆత్మహత్యలు, సంస్థల వేధింపులు తదితరాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, రాహుల్‌తో మామూలుగానే మాట్లాడా తప్ప చర్చలంటూ ఏమీ లేవని రోశయ్య చెప్పారు. ‘‘రాష్ట్రంలో వర్షాలకు పంటలు బాగా దెబ్బతినడంపై కేంద్ర మంత్రులెవరితోనూ నేను మాట్లాడలేదు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రస్తుతం కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది’’ అని పేర్కొన్నారు.

అధినేతల పరస్పర ప్రశంసలు
ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రశంసిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా, పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు. ఏఐసీసీ సమావేశంలో ప్రసంగించిన అధినాయకులిద్దరూ ఇలా పరస్పరం ప్రశంసించుకున్నారు. ‘‘ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా యూపీఏ ప్రభుత్వ సారథ్యంలో భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును చవిచూసింది.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సమర్థవంతమైన నాయకత్వం కారణంగానే ఇది సాధ్యమైంది’’ అని సోనియా పేర్కొన్నారు. ‘‘మన పార్టీ చరిత్రలో సోనియా కొనసాగినంత సుదీర్ఘకాలం ఎవరూ అధ్యక్ష పదవిలో కొనసాగలేదు. గత 12 ఏళ్లలో కాంగ్రెస్‌కు సోనియా ఒక కొత్త దిశను ఇచ్చారు. ఆమె మార్గదర్శకత్వం ఫలితంగానే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది’’ అని మన్మోహన్ కొనియాడారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ నూతన శిఖరాలను చేరుకుంటుందని మన్మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం సోనియా నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

Monday, November 1, 2010

భారత రాజకీయాల్లో ... భారత జాతీయ కాంగ్రెస్ .. మార్క్సిజం

'మార్క్సిస్టులెవర్నీ తీసుకోలేదు నేను'

" నేను వదిలేసిన భావనలలో మార్క్సిజం ముఖ్యమైనది. 1920లోనే మాస్కోలో నివసిస్తున్న కొందరు భారతీయ రాడికల్స్- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ)ని ప్రారంభించారు. 1925 నుంచి గాని అది మన దేశంలో పనిచేయటం ప్రారంభించలేదు. అప్పటి నుంచి భారత రాజకీయాల్లో మార్క్సిజం ఏదో ఒక రూపంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూనే ఉంది. ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో - భారత జాతీయ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించిన వారిలో కమ్యూనిస్టులు ముఖ్యులు.

1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా వీరు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ స్వాతంత్య్రం ఇద్దరు బూర్జువాల మధ్య జరిగిన అధికార మార్పిడి అని.. భారత్‌లో అధికారం తెల్ల బూర్జువా నుంచి నల్ల బూర్జువాకు మారిందని ఎద్దేవా చేశారు. 1948లో అప్పుడే పుట్టిన భారత రాజ్యంపై సీపీఐ ఒక సాయుధ తిరుగుబాటు కూడా చేసింది. దీనిని కట్టడిచేయటానికి మూడేళ్లు పట్టింది. చివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల.. సోవియట్ నియంత స్టాలిన్ ప్రభావితం చేయటం వల్ల-(ఆ సమయంలో పాశ్చాత్య దేశాల పాలనలో ఉండి స్వాతంత్య్రం పొందిన దేశాలను స్నేహం చేసుకోవటానికి సోవియట్ యూనియన్ ప్రయత్నించేది)- విప్లవకారులు అండర్‌గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటించారు.

1950లలో సీపీఐ ఎన్నికల్లో పోరాడింది. అప్పుడప్పుడు గెలుస్తూ వచ్చింది కూడా. ఆ తర్వాత 1960లలో ఆ పార్టీ - సీపీఐ, సీపీఎంగా చీలిపోయింది. సీపీఐ కేవలం రష్యా పట్ల అభిమానం చూపించేది. సీపీఎం మాత్రం రష్యా, చైనా- రెండింటి పట్ల అభిమానం చూపించేది. 1970లలో సీపీఎం మళ్లీ రెండుగా చీలిపోయింది. చీలిపోయిన భాగం- సాయుధ విప్లవం ద్వారా భారత రాజ్యాన్ని కూలదోయటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంది. మావోయిస్ట్ చైనా ఈ చీలిక భాగానికి మార్గదర్శి. "చైనా ఛైర్మనే మా ఛైర్మన్'' అనే వారి స్లోగన్ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది...

లేకపోవటానికి కారణమిదే..
భారతీయ మార్క్సిస్టులను నా పుస్తకంలో చేర్చకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. వారి భావజాలం మరొక దగ్గర నుంచి అందిపుచ్చుకున్నది. "భారతీయ మార్క్సిస్టులు దేశాన్ని మార్క్స్ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చేయాలనుకుంటారు తప్ప దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్క్స్ సిద్ధాంతాన్ని మార్చుకోవటానికి ససేమిరా అంటారు'' అని ఆంథొనీ పేరెల్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.

రష్యా, చైనా అనుభవాల ఆధారంగా భారత ఉపఖండంలో వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది వారి ఉద్దేశం. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావోల ఆలోచనలను కొత్త కోణంలో అందించిన భారతీయ మార్క్సిస్టు మేధావులు ఎవరూ లేరు. అందుకే మార్క్సిస్టులు కాని మార్క్సిజం కాని ఈ పుస్తకంలో నేరుగా లేకపోయినా- అంతర్లీనంగా వారి ప్రస్తావన వస్తూనే ఉంటుంది.

బోస్, పటేల్ లేరు..
భారత జాతీయోద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన మరో ఇద్దరు మహోన్నత నేతలను కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. వీరు సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్. 1930లలోను, 1940లలోను బోస్ అనేక మంది యువతీయువకులను ప్రభావితం చేశాడు. బ్రిటిష్ వారిపై పోరాడటానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఇక పటేల్ విషయానికి వస్తే- 1947 ముందు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. స్వాతంత్య్రం తర్వాత సంస్థానాలు భారతదేశంలో విలీనం కావటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అయినా వీరిద్దరిని వదిలివేయటానికి కూడా ఒక ప్రధాన కారణం- వారికి సంబంధించి, ప్రచురితమైన పబ్లికేషన్స్‌లో- తమకు మాత్రమే సొంతమైన భావనలు (ఒరిజినల్ థాట్) లేకపోవటమే.

వారిద్దరు కార్యాచరణ వీరులు. వీరిద్దరి మాదిరిగానే ఇందిరా గాంధీ కూడా తన చర్యల ద్వారానే ప్రసిద్ధి చెందింది. 1966-77, 1980-84ల మధ్య భారత ప్రధానిగా వ్యవహరించినప్పుడు ఇందిర దేశ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. యుద్ధ సమయంలో నేతగా, పేదల పాలిటి పెన్నిధిగా ఆమె ప్రదర్శించిన లక్షణాల గురించి కొందరు ఆమెను పొగిడితే- మరి కొందరు ఆమెను నియంతగా విమర్శించారు. ఇందిర పేరు మీద వచ్చిన రచనలన్నీ ఆమె సిబ్బంది రాసినవే. ఈ విషయంలో ఇందిరకు, ఆమె తండ్రి జవహర్‌లాల్ నెహ్రూకు పోలిక లేదు.

ఇంకొందరు..
తమ రచనల ద్వారా పేరు పొందిన మరో ఇద్దరిని కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. వీరిలో ఒకరు విప్లవమార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిన అరబిందో ఘోష్, మరొకరు తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్. హిందుమతాన్ని ఆధునిక సమాజానికి తగినట్లు అన్వయించటానికి రాధాకృష్ణన్ ప్రయత్నించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా సాహిత్యాన్ని, రాజకీయాలను మార్చటానికి అరబిందో ప్రయత్నించారు. వీరిద్దరికి ఇంగ్లీషు మాట్లాడే భారతీయులలో మంచి పేరు, ఆదరణ ఉండేది. అయితే వీరి ప్రభావం కేవలం మధ్యతరగతి ప్రజలపైనే ఉండేది. పైగా మరణించిన తర్వాత వారి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి.

వీరితో పాటుగా స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి ఆధ్యాత్మికవేత్తలను కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. పాశ్చాత్య సంస్కృతి విరిసే సవాలును ఎదుర్కొని.. కులాల గోడలను కూల్చి.. సమాజాన్ని ఒకటిగా చేయాలని వీరిద్దరూ ప్రయత్నించారు. వీరిద్దరికి మంచి ఆదరణ కూడా ఉండేది. కాని రాధాకృష్ణన్, అరబిందోల మాదిరిగా కూడా త్వరగానే వీరి ప్రభావం తొలగిపోయింది. అంతే కాకుండా- స్వామి వివేకానంద, దయానంద సరస్వతిలను దాటి గాంధీ తన సిద్ధాంతాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశాడని చెప్పవచ్చు. వివేకానంద, గాంధీలు కుల వ్యవస్థను సంస్కరించటం ద్వారా మార్పును తీసుకురావటానికి ప్రయత్నిస్తే- మరి కొందరు సంస్కరణ వాదులు కుల వ్యవస్థపైనే సవాలు విసిరారు.

ఇలాంటి వారిలో ప్రముఖుడు బి.ఆర్. అంబేద్కర్. ఈయన గురించి పుస్తకంలో ఉంది. అయితే బడుగుల కోసం పోరాడిన మరో ఇద్దరు అద్భుత వ్యక్తులైన తమిళ పోరాటయోధుడు అయోతి దాస్, కేరళలో కులవ్యవస్థపై పోరాటం చేసిన నారాయణ గురుల గురించి పుస్తకంలో లేదు. నాకు అత్యంత ఇష్టమైన నేతలలో ఒకరైన దాదాబాయ్ నౌరోజీ గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు. దీనికి నాకు చాలా బాధగా ఉంది...''