Tuesday, August 31, 2010

ఏఐసీసీ ఓదార్పు జగన్నాటకంలో ఓ బ్రహ్మాస్త్రం

soniya-laugh
తనను ధిక్కరించి, వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్రకు సిద్ధమవుతోన్న కడప ఎంపి జగన్‌కు బ్రహ్మాస్త్రంగా ఉన్న వైఎస్‌ కార్డును దూరం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం బ్రహ్మాండమైన ఎత్తుగడకు తెర లేపింది. అందులో భాగంగానే పార్టీపరంగా ఓదార్పు యాత్ర నిర్వహించి, కాంగ్రెస్‌ ద్వారా వైఎస్‌ పొందిన పేరు ప్రఖ్యాతలను జగన్‌ ఖాతాకు వెళ్లకుండా పార్టీపరంగా తానే సొంతం చేసుకునే వ్యూహం రచించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

తాను చెప్పినట్లు బాధిత కుటుంబాలందరినీ ఒకచోట చేర్చి పార్టీ పక్షాన సాయం చేయాలన్న ఆదేశాన్ని లెక్కచే యకుండా.. ప్రకాశం జిల్లా యాత్రకు సిద్ధమవుతున్న జగన్‌కు ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కార్డును దక్క కుండా చేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీపై పట్టు బిగించి, దానిని ప్రాంతీయ పార్టీ స్థాయికి మార్చి, అంతా తానయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సామాన్య, మధ్య తరగతి ప్రజానీకంలో సంపాదించిన పేరు ప్రతిష్ఠలనే పెట్టుబడిగా చేసుకుని జగన్‌ తన రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించు కుంటున్న విషయం తెలిసిందే.

అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా కనీసం పార్టీ పేరు గానీ, సోనియా, రోశయ్య పేరు గానీ ప్రస్తావించకుండా.. పేద, బడుగు బలహీన, మైనారిటీ వర్గాలకు తన తండ్రి వైఎస్‌ చేసిన మేలును వ్యూహాత్మకంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికీ ఏదో ఒక మేలు చేసిన తన తండ్రి చనిపోయిన తర్వాత తాను ఒంటరిననుకున్నానని, కానీ ఇన్ని లక్షల మంది తనతో ఉన్నందున తాను ఒంటరిని కాదని తెలుసుకున్నానంటూ జగన్‌ పదే పదే భావోద్వే గంతో ప్రస్తావించడం వ్యూహాత్మకమేనంటున్నారు.

అదే సమయంలో ప్రజల సంక్షేమం కోసం పాటు పడిన తన తండ్రి వైఎస్‌ మృతి చెందిన తర్వాత సొంత పార్టీలోని కొందరు నేతలే కాకుల్లా పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా ‘రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తక్కువ చేసి, ఆయన కుమా రుడైన జగన్‌ను అవమానిస్తోందన్న’ సానుభూతి సంపా దించుకునే వ్యూహానికి తెరలేపారు. అదే సమయంలో బాధిత కుటుంబాలకు లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం ద్వారా.. వైఎస్‌ వల్ల రెండుసార్లు అధికారం పొందిన కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ కోసం మృతి చెందిన బాధిత కుటుంబాలను మర్చిపోయి నప్పటికీ తాను మాత్రం ఆయన వారసుడిగా వారిని ఆదుకుంటున్నానన్న సంకేతాలివ్వడంలో జగన్‌ విజయం సాధించారు.

ఆయన తన పర్యటనలో కేవలం రాజశేఖరరెడ్డి, తన ఫొటో మాత్రమే ఉంచడం ద్వారా.. వైఎస్‌ సాధించిన పేరు ప్రతిష్ఠలకు, ఆయన ఇమేజికి తాను మాత్రమే వారసుడి నని, వాటితో కాంగ్రెస్‌ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని, వైఎస్‌ వల్ల పార్టీ లబ్థి పొందిందనే సంకేతాలు పంపించేందుకే ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ వేరు పార్టీ వేరని, ఆయనకు నిజమైన వారసుడెవరూ కాంగ్రెస్‌లో లేరని, వైఎస్‌ వల్ల సంక్రమిం చిన జనాకర్షణకు తానే ఏకైక ప్రతినిధినని చాటేందుకే ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ వ్యవహారశైలి, వైఎస్‌ స్మృతి ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడలో భాగమేనని కాంగ్రెస్‌ నాయకత్వం గ్రహించింది. ఆ తర్వాతే పార్టీ పరంగా ఓదార్పు నిర్వ హించాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ వల్ల మాత్రమే వైఎస్‌ ఈ స్థాయికి ఎదిగారని, ఆయన ప్రారంభించిన పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ అధి నేత్రి సోనియాగాంధీ అనుమతి మేరకు అమలుచేస్తున్న వేనన్న ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రోశయ్య మొదలుకొని, వైఎస్‌ ప్రత్యర్థుల వరకూ ఇదే ప్రచారం కొనసాగిస్తున్నారు. వైఎస్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, ఆయన చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌ పార్టీవే తప్ప వైఎస్‌ సొంతవి కాదని స్పష్టం చేయడం ద్వారా.. పేద, మధ్య తరగతి వర్గాల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్‌ ముద్రను చెరిపి, పార్టీని ప్రతిష్ఠించే ప్రయత్నాలుగానే స్పష్టమవుతోంది.

అదే సమయంలో వైఎస్‌కు గత ఐదేళ్ల కాలంలో వచ్చిన ప్రతిష్ఠ, పలుకుబడి జగన్‌కు వెళ్లకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీపరంగా ఓదార్పు యాత్ర నిర్వహించడం ద్వారా వైఎస్‌ ముద్రను సొంతం చేసుకునే ఎత్తుగడకు తెరలేపినట్లు స్పష్టమవుతోంది. వైఎస్‌ ప్రతి ష్ఠను కాంగ్రెస్‌ మాత్రమే కాపాడుతుందని, కాంగ్రెస్‌- వైఎస్‌ వేరు కాదని, ఆయన స్మృతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాను నిర్వహించనున్న ఓదార్పులో పార్టీ నాయకులను ఉంచడం ద్వారా వైఎస్‌ బ్రాండ్‌ను పూర్తిగా సొంతం చేసు కోవాలన్నదే పార్టీ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

అదే సమయంలో.. మృతులపై వస్తున్న లెక్కలని గతంలో అధిష్ఠానం అనుచరులు ఎద్దేవా చేసి, కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఆరోజు మృతి చెందిన వారందరినీ జగన్‌ వర్గీయులు వైఎస్‌ ఖాతాలో వేశారని ఆరోపించారు. అయితే ఇప్పుడు స్వయంగా నాయకత్వమే మృతుల కుటుంబాలను గుర్తిస్తోంది. అందులో భాగంగా.. జగన్‌ లెక్కలకు భిన్నంగా తక్కువ మందిని మాత్రమే ఎంపిక చేయడం ద్వారా.. జగన్‌వి కాకిలెక్కలని, వైఎస్‌ కోసం ఎక్కువమంది మృతి చెందలేదని చెప్పి, జగన్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు లెక్కల ఎంపిక తీరు స్పష్టమవుతోంది.

అయితే.. వైఎస్‌ మృతి చెందిన సంవత్సరానికి పార్టీ నాయకత్వం కళ్లు తెరిచి ఓదార్పు నిర్వహించడాన్ని పార్టీ కార్యకర్తలు ఎత్తుగడగానే అనుమానిస్తారు తప్ప, అందులో చిత్తశుద్ధి ఉన్నట్లు భావించరని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవైపు జగన్‌ నాలుగు జిల్లాలు ఓదార్పు యాత్రను పూర్తి చేసి, మిగిలిన జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. నాయకత్వం ఆలస్యంగా స్పందించి, తాను కూడా లక్ష రూపాయలిస్తానని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని విశ్లేషిస్తున్నారు.

అయిననూ.. పోయిరావలె... !

YS-Jagan
స్వయంగా అధిష్ఠానమే బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. జగన్‌ మాత్రం తన వైఖరిని సడలించుకునేందుకు ఇష్టప డటం లేదు. బాధిత కుటుంబాలకు లక్ష రూపా యల చొప్పున ఇవ్వడంతో పాటు.. ఆ గుర్తింపు ప్రక్రియను కూడా పార్టీ నాయకత్వమే చేపట్టడం ఆసక్తికలిగిస్తోంది. జగన్‌ లెక్కలు తప్పుడువన్న సంకేతాలు పంపేందుకే నాయకత్వం ఈ ఎత్తుగడ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నా యకత్వం బాధితులను తానే ఓదార్చాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జగన్‌ తన యాత్రను విర మించుకునే యోచనకు బదులు.. మరింత పకడ్బందీగా ఓదార్పును యధాతథంగా కొనసా గించాలని నిర్ణయించుకున్నారు.

వీరప్ప మొయిలీ ప్రకటనపై వెనుకడుగు వేయని జగన్‌ తన ప్రకాశం జిల్లా యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వెనుకడుగు వేస్తే అప్రతిష్ట పాలవుతామని, నాయకత్వానికి పూర్తిగా లొంగిపోయారన్న సంకేతాలు వెళతా యన్న భావన ఆయనలో స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా, పార్టీ నాయకత్వమే బాధిత కుటుంబా లను ఓదార్చాలన్న నిర్ణయాన్ని అభినందిస్తూ జగన్‌ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశమయింది. అందులో ఒకవైపు పార్టీ నాయకత్వాన్ని అభినందిస్తూనే, మరోవైపు పరోక్షం గా అనేక రకాల ఎత్తిపొడుపులకు తెరలేపారు.

ఆ లేఖలో జగన్‌ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఇన్నాళ్లూ వైఎస్‌ మృతి వార్తతో ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలను అపహాస్యం చేసి, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన వారివి తప్పుడు మాటలేనని అధిష్ఠానం ఇన్నాళ్లకయినా గుర్తించిందంటూ పరోక్షంగా ఎత్తిపొడిచారు. పార్టీ పక్షాన ఓదార్పు యాత్ర నిర్వ హించేందుకు వచ్చే వారు తనతో రావాలని, ఆ విధంగానే వస్తేనే పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి పరిపూర్ణత చేకూరుతుందని స్పష్టం చేశారు.

బాధితులకు డబ్బు ఇవ్వడం ఒక్కటే ముఖ్యం కాదని, వారి ఇళ్లకు వెళ్లి పలకరించి, పరామర్శిం చడం మన సంప్రదాయమని స్పష్టం చేశారు. అంటే... తాను చేస్తున్నది మాత్రమే సంప్రదా య మని, పార్టీ చేస్తున్నది సంప్ర దాయం ఎంత మాత్రం కాదని స్పష్టం చేసినట్ట యింది. అదేవి దంగా వైఎస్‌ మరణవార్త విని, టీవీల్లో చూసి మృతి చెందిన పార్టీ కార్యకర్త లకూ ఏఐసిసి ప్రకటించిన సాయం వర్తిం పచేసి ఉంటే బాగుండేదని వ్యా ఖ్యానించడం ద్వారా.. బా దితుల గుర్తింపులో ఏఐ సిసి నిర్వహించే ప్రక్రి య లోపాలను జగన్‌ పరో క్షంగా ఎత్తిచూపినట్ట యిం ది. తాను ఆవిధంగా సా యం చేస్తున్నందున పార్టీ కూడా అదే పద్ధతిలో సా యం చేయాలని జగన్‌ చెప్పకనే చెప్పారు.

డబ్బులివ్వడమే ఓదార్పు కాదు! ఇంటికెళ్లి కన్నీళ్లు తుడవాలి

అదే మన సంప్రదాయం
పలకరించడం నా ధర్మం
ఎంపీలు, ఎమ్మెల్యేలూ వస్తే పరిపూర్ణత
అదే వైఎస్‌కు నిజమైన నివాళి
గుండెపోటుతో చనిపోయిన వారికీ వర్తింపజేయాలి
అధిష్ఠానం సాయంపై జగన్ పత్రికా ప్రకటన
సోనియాకు ధన్యవాదాలు
'పార్టీ ఓదార్పు'పై కడప ఎంపీ జగన్ తనదైన శైలిలో స్పందించారు. తన సొంత యాత్రపై పాత వైఖరినే ప్రదర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ధ న్యవాదాలు చెబుతూనే... ఓదా ర్పు అంటే ఆర్థిక సహాయం చేయ డం మాత్రమే కాదన్నారు. ఓదార్పులో అది ఒక భాగం మాత్రమే అని గుర్తు చేశారు. పైగా... కషా ్టల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి, కన్నీళ్లు తుడవడం మన సంప్రదాయమని పునరుద్ఘాటించారు.

అధిష్ఠానం ఆర్థిక సహాయాన్ని ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయకుండా... షాక్‌తో, గుండెపోటుకు గురై మరణించిన వారి కుటుంబాలకూ అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సహాయానికి, తాను చేస్తున్న ఓదార్పు యాత్రకూ సంబంధం లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు... తన యాత్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్లవుతుందని తెలిపారు.

మొత్తానికి... తాను బెట్టు వీడేది లేదని, అధిష్ఠానమే మరో మెట్టు దిగాలనే భావాన్ని వ్యక్తం చేశారు. ఏదిఏమైనా... పార్టీ అధినాయకత్వమే బాధిత కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించుకోవడంవల్ల ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించినట్లయిందని జగన్ అభివర్ణించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో పర్యటిస్తున్న జగన్ మంగళవారం అక్కడి నుంచే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీని పూర్తి పాఠమిది...

"దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను కుటుంబంతో పర్యటనలో ఉన్నందువల్ల పత్రికల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఏఐసీసీ నాయకత్వం నుంచి వెలువడిన ఈ ప్రకటన రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకూ, వైఎస్ అభిమానులకూ ఎంతో ఊరటనిచ్చింది.

సరిగ్గా ఏడాది కిందట దురదృష్టకర సంఘటనలో మహానేత వైఎస్ చనిపోవడం రాష్ట్ర ప్రజలను తీరని వేదనకు గురిచేసింది. ఆ వార్తను తట్టుకోలేక వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెందరో టీవీల్లో వార్తలు చూస్తూ షాక్‌తో, వేదనతో గుండెపోటుకు గురై అసువులు బాశారు. వీళ్లందరూ కాంగ్రెస్ అభిమానులే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారే. ఏఐసీసీ ప్రకటించిన సాయం వీరందరికీ వర్తింప చేసి ఉంటే మరింత బాగుండేది.

నా తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన ఆత్మ బంధువుల కుటుంబాలను వారింటికి వెళ్లి పలకరించడం, ఆదుకోవడం మహానేత కుమారునిగా నా కనీస ధర్మంగా భావించాను. గత ఏడాది సెప్టెంబర్ 25న నల్లకాల్వ వద్ద జరిగిన వైఎస్ సంస్మరణ సభలో ఇదే విషయాన్ని ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే.

నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఓదార్పు అంటే కేవలం బాధిత కుటుంబాల వారికి ఆర్థిక సాయం చేయడం ఒక్కటే కాదు. ఆర్థిక సాయం ఓదార్పులో ఒక అంశం మాత్రమే. కష్టాల్లో ఉన్నవారి ఇంటికి వెళ్లి వారిని పలకరించడం, కన్నీళ్లు తుడవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం, వారికి ఓ భరోసా ఇవ్వడం ముఖ్యం. అదే మన సంప్రదాయం కూడా. ఈ సంప్రదాయాన్ని అనుసరించే నేను ఓదార్పు యాత్రను ప్రారంభించాను.

మధ్యలో కొందరు ఈ పవిత్ర కార్యక్రమాన్ని అవహేళన చేయడమే కాదు, ఈ మరణాలన్నీ అవాస్తవమని వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధినాయకత్వం బాధిత కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించినట్లయింది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా పాలుపంచుకుంటే .. బాధితుల దగ్గరికి నాతో పాటు వచ్చి బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరచుకుంటే, వారి సమస్యలు తెలుసుకుంటే, ఆ కుటుంబాలకు ఇంకా మంచి చేయగలుగుతాం. అందువల్ల ఈ మొత్తం కార్యక్రమానికి పరిపూర్ణత చేకూరుతుంది. దివంగత నేతకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. తద్వారా పార్టీ శ్రేణులలో నూతనోత్తేజం నింపినట్లవుతుంది'.

మారని రూటు.. తప్పని వేటు! జగన్‌పై చర్యలకు లైన్‌క్లియర్ ఆఖరి అవకాశమూ మిస్

ఓదార్పుపై పాత వైఖరినే మళ్లీ చెప్పిన కడప ఎంపీ
అధిష్ఠానానికి సుద్దులు
పార్టీయే తన వెంట నడవాలని సలహా
మారాల్సింది తాను కాదనే సంకేతాలు
యువనేత ప్రకటనతో విస్తుపోయిన నేతలు
యాత్రకు వెళితే చర్యలు తథ్యం
స్పష్టమైన అవగాహనతో అధిష్ఠానం
'నా దారి రహదారి. నేను చేసిందే ఓదార్పు' ఇదీ కడప ఎంపీ వైఎస్ జగన్ వైఖరి! పార్టీయే తన బాటలో నడవాలన్నది ఆయన ఆకాంక్ష. 'అధిష్ఠానం ఓదార్పు'పై జగన్ ప్రతిస్పందనలోని అంతరార్థం ఇదే! దీంతో ఆయనపై చర్యలకు 'లైన్ క్లియర్' అయినట్లే! 'సెప్టెంబర్ 3'న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభంతో ఇతర రాజకీయ పరిణామాలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ తరఫున ఓదార్చి, ఆర్థిక సహాయం అందించాలని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఒకరకంగా జగన్‌కు 'ఆఖరి అవకాశం' అని అధిష్ఠానం నేతలు పేర్కొంటున్నారు. జగన్ ఇకనైనా తన సొంత యాత్రను మానుకొంటారని, పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని కొందరు ఆకాంక్షించారు. అయితే... వీరిది మరీ అత్యాశ అని జగన్ స్పందనతో తేలిపోయింది.

జగన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో 'సోనియా గాంధీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు' అనే ఒక్క వ్యాక్యాన్ని మినహాయిస్తే... మిగిలినదంతా సూచనలు, సలహాలకే సరిపోయింది. తాను చేస్తున్నదే అసలైన ఓదార్పు అని, అధిష్ఠానం కూడా అదే బాటలో ప్రయాణించాలని జగన్ తన ప్రకటన ద్వారా తేటతెల్లం చేసినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ప్రకటనలోని అంశాలు చూసి వారు విస్తుపోయారు. 'ఓదార్పు అంటే కేవలం డబ్బులివ్వడం కాదు.

కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి పలకరించి, కన్నీళ్లు తుడవడం ముఖ్యం'' అంటూ జగన్ తన పాత వైఖరినే పునరుద్ఘాటించారు. మరోమారు 'మన సంప్రదాయాన్ని' గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు వెళ్లేముందు బహిరంగ లేఖ ద్వారా ప్రకటించిన వైఖరినే... ఇప్పుడూ పునరుద్ఘాటించారు. అంతటితో ఊరుకోకుండా... పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు తనతోపాటు వచ్చి బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరుచుకుంటే బాగుంటుందని అధిష్ఠానానికి సూచించారు. వెరసి... పార్టీ యంత్రాంగం సమస్తం తన వెంటే నడవాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఓదార్పు విషయంలో తాను చాలా 'క్లారిటీ'తో ఉన్నానని .. మారాల్సింది అధిష్ఠానమేనని జగన్ మరోమారు వెల్లడించారని చెబుతున్నారు. ఓదార్పుపై జగన్, అధిష్ఠానం బాటలు వేరని... అవి కలిసే అవకాశం ఎంతమాత్రం లేదని తాజా పరిణామాలతో స్పష్టమైంది. యాత్రపై వెనక్కి తగ్గేదిలేదని జగన్ స్పష్టం చేయడంతో ఆయనపై చర్యలకు మార్గం సుగమం అయినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. "జగన్ దిగివచ్చేందుకు ఆఖరు అవకాశం కల్పించాం. దురదృష్టవశాత్తు ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నట్లు లేదు'' అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తనను కలిసిన కొందరు నేతలకు చెప్పినట్లు తెలిసింది.

"గత వారం జగన్ నన్ను కలిసినప్పుడు తగిన సలహా ఇచ్చాను. ఆయన వినేలా కనిపించలేదు. 3న జగన్ ఓదార్పు యాత్రకు బయలు దేరితే ఏం చే యాలనే దానిపై అధిష్ఠానానికి స్పష్టమైన అవగాహన ఉంది'' అని మొయిలీ పేర్కొనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ విప్‌లు శైలజానాథ్, భట్టి విక్రమార్క, కొండ్రు మురళితో పాటు కొందరు ఎంపీలు మొయిలీని మంగళవారం కలుసుకున్నారు.

వైఎస్ మృతి వార్త విని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సహాయం చేయాలని తీసుకున్న నిర్ణయంపై వీరంతా హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక పార్టీలోని అత్యధికులు జగన్ వాదనతో ఏకీభవించే అవకాశాలు లేవని వారు చెప్పినట్లు సమాచారం. 2వ తేదీన ఇడుపులపాయలో జరిగే వైఎస్ వర్ధంతికి మొయిలీ హాజరవుతారు. పార్టీ తరఫున వైఎస్‌కు నివాళులర్పిస్తారు.

ముందే సంకేతాలు..
అధిష్ఠానం ఓదార్పు పట్ల జగన్ సంతృప్తి చెందే అవకాశంలేదని ముందే సంకేతాలు వెలువడ్డాయి. ఆత్మహత్య చేసుకున్న వారినే కాదు, దిగ్భ్రాంతి చెంది అసువులు బాసిన వారిని కూడా ఓదార్చి సహాయం చేయాలని, వారి వద్దకే స్వయంగా వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు ఆయనకు సన్నిహితుడైన ఎంపీ సబ్బం హరి మంగళవారం మధ్యాహ్నమే ఎంపీల వద్ద వాదించారు. ఏఐసీసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని లోపాలను ఎత్తి చూపారు.

అక్షరాల వెనుక అంతరంగం...
అధిష్ఠానం ప్రకటనకు స్పందనగా జగన్ విడుదల చేసిన లేఖను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈ యాత్రలో తనతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్లవుతుందని చెప్పడం ద్వారా... ప్రస్తుతం పార్టీ నిర్జీవంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నారు.

పార్టీ తన వెంట నడవాలనడం ద్వారా... అధిష్ఠానానికి జగన్ నడిపిస్తున్నారో, జగన్‌ను అధిష్ఠానం ఆదేశిస్తోందో తెలియని పరిస్థితి నెలకొందని కొందరు నేతలు అంటున్నారు. "ఏది ఏమైనా ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. జగన్ విషయంలో అధిష్ఠానం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. ఇదే సమయంలో జగన్ కూడా తన భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఇంకా స్పష్టంగా ఉన్నారు. వీరి వైఖరులు మరి రెండు మూడు రోజుల్లో బహిర్గతమవుతాయి. మా దారి తేల్చుకోవడం సులభమవుతుంది'' అని పలువురు నేతలు, ఎంపీలు అంటున్నారు.

Thursday, August 26, 2010

బయ్యారం గనుల అనుమతులు రద్దు

బయ్యారం రద్దు..
అనుమతులన్నీ బుట్టదాఖలు.. కేంద్రం సంచలన నిర్ణయం

రాష్ట్ర సర్కారు వైఖరిపై సీరియస్..
రిజర్వు చేసుకోడానికే అనుమతి
అలాంటప్పుడు మైనింగ్ ఎలా చేస్తారు?..
ఏపీఎండీసీకీ మైనింగ్ అనుమతి లేదు
రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం ఎలా కుదర్చుకుంటారు?..
ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు
జీవో 64ను ఉపసంహరించుకోండి..
రాష్ట్రానికి 17నే ఆదేశాలు

BAYYAR
బయ్యారం గనులపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), రక్షణ స్టీల్స్‌తో పాటు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ గనులకు సంబంధించి ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసి పారేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి క్లాస్ తీసుకోవడంతో పాటు, దాని వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. గనుల విషయంలో రక్షణ స్టీల్స్ (వైఎస్ అల్లుడు అనిల్‌కు చెందినదిగా ప్రచారంలో ఉన్న)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆదేశించింది.

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ వ్యవహారంలో కేంద్రం దాదాపు పది రోజుల క్రితమే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బయ్యారం గనులపై అనుమతులను పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే, కేంద్రం మొత్తంగా రద్దు చేయడం గమనార్హం. కొత్త ప్రతిపాదనలు పంపాలని, వాటిని పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోని 1.40 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఇనుప ఖనిజం నిక్షేపాలను ఏపీఎండీసీకి రిజర్వు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ గనులపై ఏపీఎండీసీ రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ఏపీఎండీసీకి గనులను కేవలం రిజర్వు చేసుకోడానికే అనుమతి ఇస్తే అసలు మైనింగ్ ఎలా చేసుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీఎండీసీ చేపట్టిన మైనింగే అక్రమమని, ఆ సంస్థకు కూడా మైనింగ్ చేయడానికి అనుమతి లేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చన అనుమతులను పూర్తిగా రద్దు చేస్తున్నామని.. మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపితే సర్వే చేసిన తర్వాత అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఖనిజ వనరుల శాఖ స్పష్టంగా చెప్పింది.

బయ్యారంలో మైనింగ్ చేసుకునేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవో 64ను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. ఏపీఎండీసీ- రక్షణ స్టీల్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాలన్నీ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 17వ తేదీనే ఓ లేఖ రాసింది. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటే అందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ అక్రమమేనని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినప్పుడు అక్కడ జనావాసాలు ఉన్నట్లు చెప్పకపోవడాన్ని కూడా కేంద్రం తప్పుపట్టింది.
BAYYARA
"ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో 56,695 హెక్టార్లలో ఖనిజాలను తవ్వుకునేలా రిజర్వు చేసుకునేందుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చాము. అప్పుడు అక్కడ జనావాసాలు ఉన్నట్లు చెప్పలేదు.. పదేళ్ల పాటు రిజర్వు చేసుకోవడానికే అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ మైనింగ్ ఎలా చేపడతారు? మైనింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతి కోరనేలేదు...'' అని కేంద్ర ఖనిజవనరులశాఖ అధికారి ఒకరు 'ఆన్‌లైన్'కు తెలిపారు.

బయ్యారం గనుల ప్రాంతాల్లో 30% జనావాసాలు ఉన్నందువల్ల అక్కడ రీసర్వే చేయాలని, అంతవరకూ కేంద్రం గతంలో ఇచ్చిన అనుమతులను పెండింగ్‌లో పెట్టాలంటూ జూలై 23న ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి ఓ లేఖ రాశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు బయ్యారం గనులపై విరుచుకుపడడంతో ముఖ్యమంత్రి ఈ లేఖ రాశారు.

అయితే రీసర్వే చేయడానికి వీలుకాదని, అసలు మైనింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే అక్కడ మైనింగ్ ఎలా చేపడుతున్నారని ప్రశ్నించిన కేంద్రం... మొత్తం అనుమతులన్నింటినీ రద్దుచేసింది. బయ్యారంలో ఖనిజాల వెలికితీతకు కొత్త ప్రతిపాదనలను పంపాలని కూడా కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఖనిజ నిల్వల అంచనా, పరిశోధనకు కూడా అనుమతిని రద్దు చేసింది.
BAYYARAM
రిజర్వేషన్ నిర్ణయాన్ని పెండింగులో పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. ఏకంగా రిజర్వేషన్‌నే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో ఇటు ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి.. ఇటు రక్షణ స్టీల్స్‌కు కూడా పెద్ద షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఖనిజ నిల్వలను రక్షణ స్టీల్స్‌కు సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం ఖనిజాల వెనక 'అల్లుడి గిల్లుడు' ఉందనే విషయాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి తెచ్చింది.

అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతూనే ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే ప్రధాన చర్చనీయాంశం అయింది. గత కొంత కాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలూ బయ్యారం గనుల లీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని విపక్షాలన్నీ బయ్యారం గనుల అక్రమాలపై ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్న సమయంలో కేంద్రం ఈ లీజుల రద్దు నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదంతో రాష్ట్ర గనుల శాఖ ఖమ్మం జిల్లాలోని 1.40 లక్షల ఎకరాల ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వ్ చేస్తూ ఈ ఏడాది జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవే నిల్వలను రక్షణ స్టీల్స్ నెలకొల్పే యూనిట్‌కు సరఫరా చేసేలా ఏపీఎండీసీతో జాయింట్‌వెంచర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ గనుల శాఖ గత ఏడాది ఫిబ్రవరి 24 జీవో 69 జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం రక్షణ స్టీల్స్‌కు షాక్ లాంటిదే. ఏపీఎండీసీతో కుదిరిన ఒప్పందం కూడా రద్దయ్యేలా ఉండటంతో.. రక్షణ స్టీల్స్‌కు ఇనుప ఖనిజం సరఫరా చేసే పరిస్థితి లేదు. గిరిజన ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలుంటే... ఈ ప్రాంతంపై హక్కులను తొలుత వారికే ఇవ్వాలి.

లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దరఖాస్తు చేస్తే వాటికి ఆ ప్రాంతాన్ని కేంద్రం రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏపీఎండీసీ ఖమ్మం జిల్లాలోని బయ్యారం, నేలకొండపల్లి, గార్ల మండలాల్లో ఎంతమేర విస్తీర్ణంలో ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయో నిర్థారించుకుని.. తిరిగి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం ఒక వేళ మళ్లీ ఏపీఎండీసీకే ఈ నిక్షేపాలు కేటాయించినా... వీటిని రక్షణ స్టీల్స్‌కు సరఫరా చేయాల్సిన అవసరం ఉండదని గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.

సీపీఐ హర్షం
బయ్యారం ఇనుప గనుల లీజును రద్దుచూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇకముందు ప్రభుత్వం గనులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వరాదని ఆయన కోరారు.

అధిష్ఠానంతో దోబూచులాడుతోన్న కడప ఎంపీ జగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ బావ బ్రదర్‌ అనిల్‌కుమార్‌ బినామీ సంస్థగా భావిస్తోన్న రక్షణ స్టీల్స్‌ నిర్వహిస్తోన్న బయ్యారం గనుల అనుమతులను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా హటాత్‌ పరిణామాలు అధిష్ఠానం జగన్‌కు ఝలక్‌ ఇవ్వడంగానే స్పష్టమవుతోంది. మరికొద్దిరోజుల్లో ఓదార్పు యాత్రకు బయలుదేరుతున్న జగన్‌కు తాజా పరిణామాలు శరాఘాతంగానే కనిపిస్తోంది. ఇప్పటికే జగన్‌కు చెందిన వ్యాపార సంస్థలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇన్‌కంటాక్స్‌ సంస్థలు నోటీసులు జారీ చేశాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. ఆయన బావకు చెందినదిగా భావిస్తోన్న బయ్యారం గనుల లీజును కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేయడం జగన్‌కు దెబ్బమీద దెబ్బగానే పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బయ్యారం ఇనుప ఖనిజ నిల్వల కేటాయింపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. బయ్యారం ప్రాంతం లో ఖనిజ నిల్వల అంచనా పరిశోధన అనుమతులను రద్దు చేసింది. ఖనిజ నిల్వలు, అంచనా, పరిశోధన అనుమతులు పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్రం రాసిన లేఖను కేంద్రం తోసిపుచ్చింది. రక్షణ స్టీల్స్‌ ఖనిజాభివృద్ధి సంస్థ మధ్య జరిగిన ఖనిజం సరఫరా ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని రోశయ్య ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరయిన బయ్యారం గనుల లీజుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా వైఎస్‌ వాటిని లెక్కచేయకుండా లీజులను కొనసాగించారు.

అయితే.. వైఎస్‌ మృతి చెందిన తర్వాత బయ్యారం గనుల లీజుపై ప్రధాన పక్షమైన టీడీపీ, వామపక్షాలు పోరాటం ప్రారంభించాయి. వారికి తోడుగా.. వైఎస్‌ జగన్‌ ప్రత్యర్థి వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వాటి రద్దు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందు బయ్యారం గనులకు సంబంధించి ఖనిజ నిల్వలు, అంచనా, పరిశోధన అనుమతులను పెండింగ్‌లో ఉంచాలని కేంద్రానికి లేఖ రాసి, గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న సంకేతాలు పంపించారు. ఆ తర్వాత మిగిలిన వ్యవహారాలను అధిష్ఠానం, జగన్‌ వ్యతిరేక వర్గమే చూసుకుంది. చివరకు గనుల లీజు రద్దు చేయడంతో రోశయ్య, ప్రతిపక్షాలు, జగన్‌ ప్రత్యర్థుల వ్యూహం ఫలించినట్టయింది.

Wednesday, August 25, 2010

పీసీసీ రేసులో కేవీపీ ?

Head-kvp

 ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి రేసులో సమీకరణలు ఆశ్చర్యకరమైన రీతిలో శరవేగంగా మారుతున్నాయి. ఆ పదవి కోసం సీనియర్‌ నేతలు వి.హన్మంతరావు, జానారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లు రవి, నందిఎల్లయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, హటాత్తుగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువయిన రాజ్యసభ ఎంపి డాక్టర్‌ కెవిపి రామచంద్రరావు పేరు తెరపైకి రావడంతో సీను ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుతానని కేవీపీ మంగళవారం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ను ఢిల్లీలో కలసి అభ్యర్ధనా పూర్వకంగా హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్‌ పరిణామాల వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌ అస్తవ్యస్థంగా మారిందని, దానివల్ల ప్రతిపక్షానికి లాభంగా మారుతోందని కేవీపీ చెప్పినట్లు తెలిసింది. అందువల్ల రాష్ట్రంలో పార్టీ పూర్తిగా దెబ్బతినకుండా ఉండాలంటే అటు పార్టీకి, ఇటు ముఖ్యమంత్రి రోశయ్య- జగన్‌కు అనుసంధానకర్తగా వ్యవహరించి పార్టీని కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. దీనిపై అహ్మద్‌పటేల్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై రోశయ్య, జగన్‌ కంటే.. ఇప్పటికీ రామచంద్రరావుకే పట్టు ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది.

kvp
ముగ్గురి మధ్య సమన్వయం కుదర్చడంతో పాటు.. పార్టీ ఆర్థిక అవసరాలు కూడా తీర్చడంలో కేవీపీ సేవలను వినియోగించుకోవాలన్న యోచనలో నాయకత్వం కూడా ఉన్నట్లు పార్టీ నేతలు చెబు తున్నారు. వైఎస్‌ ఉండగా, అలాంటి అవసరాలు తీర్చడం, నిధుల విషయంలో సమన్వయం కుదర్చడంలో విజయ వంతమైన పాత్ర పోషించిన కేవీపీ ముగ్గురికీ అనుకూల మైన వ్యక్తిగా అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషి స్తున్నాయి. నిజానికి.. కేవీపీ లక్ష్యం ‘మరొకటి’ అయినా దానికంటే ముందు పీసీసీ అధ్యక్ష పదవి తొలి మెట్టు అని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అందుకే ఆయన పీసీసీ పీఠంపై కన్నేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. రోశయ్య- జగన్‌కు అనుకూలంగా వ్యవహరించడం కూడా ‘తన సుదీర్ఘ లక్ష్యాన్ని’ సాధించుకు నేందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్ప టికే సీఎం రోశయ్య కోస్తా నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్నందున మళ్లీ అదే ప్రాంతానికి చెందిన కేవీపీని ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు పార్టీలోని మరో వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ‘అలాగయి తే, రోశయ్యను మార్చి ఆయ న స్థానంలో తెలంగాణకు చెందిన నేతకు సీఎం పదవి ఇవ్వాలి. అప్పుడే సరైన సమీ కరణలు సాధించినట్టు ఉంటుంద’ని తెలంగాణకు చెందిన ఓ ఎంపి వ్యాఖ్యా నించారు. ఒకవేళ కేవీపీని పీసీసీ అధ్యక్షు డిగా నియమిస్తే ప్రాంతాల సమీకరణలో భాగంగా.. ఇప్పటికే కోస్తా నుంచి సీఎంగా ఉన్న రోశయ్యను మార్చక తప్పదని పార్టీ సీనియర్లు సైతం స్పష్టం చేస్తున్నారు.

Tuesday, August 24, 2010

ఇక చికిత్సే

DSకాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీకి చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాం గ్రెస్‌ను చక్కదిద్దేందుకు పార్టీ అధిష్ఠానం స్వయంగా రంగంలోకి దూకింది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీల ద్వారా ఇటీ వల రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆరా తీసి వారి ద్వారా కొన్ని మార్గ దర్శకాలు జారీ చేసిన సోనియా, మరో వైపు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను హస్తినకు పిలిపించుకుని పార్టీ విషయాలను సమగ్రంగా తెలుసుకున్నారు.

సోమవారం సాయంత్రం సోనియా తన నివాసంలో డిఎస్‌తో అరగంటకు పైగా భేటి అయ్యారు. డిఎస్‌ను కలువడానికి ముందే ఆమె రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీని తన నివాసానికి రప్పించి ఆంధ్ర కాంగ్రెస్‌ వ్యవహరాలపై సమాచారాన్ని తెలుసుకున్నారు. సోనియాతో భేటి ముగిసిన తరువాత డీఎస్‌ నేరుగా వీరప్ప మొయిలీ ఇంటికి వెళ్ళి ఆయనతో కూడా ముప్పావు గంట సేపు సమావేశమయ్యారు.

ఈ ఇద్దరు నేతలతో డీఎస్‌ సమావేశమైనప్పుడు చెప్పింది ఒక్కటే, రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే వెంటనే చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధినేత్రితో సమావేశంసందర్భంగా డీఎస్‌ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జగన్‌ ఓదార్పు యాత్ర, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, తన రాజకీయ భవిష్యత్తు వంటి ఆంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిపై సోనియా ఆరా తీసినప్పుడు డీఎస్‌ అన్ని వ్యవహారాలను ఆమెకు పూసగుచ్చినట్లు వివరించారు.

జగన్‌ ఓదార్పు పై సోనియా అడిగినప్పుడు అతను చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ నేతలను, హైకమాండ్‌ను ఎవర్ని కూడా ఖాతరు చేయడం లేదనీ జగన్‌కు మద్దతుగా అతని శిబిరం నేతలు పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నదని, జగన్‌ వ్యవహరంలో సీరియస్‌గా వ్యవహరించక పోతే పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని సోనియాకు డీఎస్‌ వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

Sonia
కొంత వరకు జగన్‌కు జనాకర్షణ ఉండటంతో అతనిపై నేరుగా చర్యలు తీసుకుంటే పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని, అందుకే జగన్‌పై చర్యలు తీసుకోవడానికి ముందు అతనికి అత్యంత విధేయులుగా ఉంటూ, పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్న కొండా సురేఖ, అంబటి రాంబాబు లాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన మేడంకు విన్నవించినట్లు తెలిసింది. అంతే కాకుండా పీసీసీ స్క్రీనింగ్‌, విచారణ కమిటీ వీరిపై సమర్పించిన నివేదికను సైతం డీఎస్‌సోనియాకు అందజేసినట్లు సమాచారం.

అలాగే ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని మీరు పార్టీ నేతల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ కొందరు నాయకులు వాటిని ఖాతరు చేయడం లేదని, సీఎం చెప్పినా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని చెప్పిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే జగన్‌ యాత్రలో పాల్గొన్న మరో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మరి కొందరు ఎమ్మెల్యేల వైఖరిపై కూడా డీఎస్‌ అధినేత్రికి నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

జగన్‌కు వీర విధేయులుగా ఉన్న నేతలపై తొలుత వేటు వేయడం ద్వారా ఓదార్పు విషయంలో జగన్‌ ఏ మేరకు నిలబడతాడో బయటికి వస్తుందని డీఎస్‌చెప్పినట్లు సమాచారం. అలా కాకుండా జగన్‌ వ్యవహరాన్ని చూసి చూడనట్లు ఉంటే అతని శిబిరం మరింత రెచ్చిపోయి పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందని, మరో వైపు రాష్ట్రంలో రోశయ్య సర్కార్‌కు కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల వస్తాయని, ఆ పరిస్థితి రాక ముందే మనం పార్టీకి చికిత్స మొదలుపెడితే మంచిదని డీఎస్‌సోనియాకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.

‘ఉప’ విశ్లేషణ
తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై కూడా సోనియాకు డీఎస్‌ఒక నివేదిక అందజేశారు. తెలంగాణలో బలంగా ఉన్న సెంటిమెంట్‌, ఉప ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణపై పార్టీ తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని డీఎస్‌ ఇక్కడి వాస్తవ పరిస్థితులను అధినేత్రికి విన్నవించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

తెలంగాణ ఏర్పాటు దిశగా తొందరగా అడుగులు వేయక పోతే రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని, 2014 ఎన్నికల నాటికి ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని ఆయన సోనియాకు ఒక నివేదిక రూపంలో నివేదించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారి తీసిన పరిస్థితులు, కొంత మంది పార్టీ నేతలు ఎన్నికల విషయంలో వ్యవహరించిన తీరును కూడా డీఎస్‌ మేడమ్‌ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను పీసీసీ చీఫ్‌, సోనియాకు సవివరంగా వివరించినట్లు తెలిసింది.

ఏఐసీసీ పదవికి అభ్యర్ధన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితితో పాటు తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా డీఎస్‌సోనియా వద్ద చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే రెండు మార్లు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తనకు ఇక జాతీయ రాజకీయాల్లో చోటు కల్పించాలని, పార్టీలో ఏదైనా కీలక పదవి అప్పగించి తనను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని డిఎస్‌, సోనియాకు వేడుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీ సంస్థాగత ఎన్నికలు, మరో రెండు నెలల్లో జరగనున్న పీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలకు అర్హులైన నేతల విషయంలో, వచ్చే నెలలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలు వంటి ఆంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు వెలుబడిన తరువాత గతంలో ఒక సారి డీఎస్‌ ఢిల్లీ వెళ్ళినప్పటికీ సోనియా అందుబాటులో లేని కారణంగా ఆయన ఆమెను కలువలేక పోయారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ వీరప్ప మొయిలీ, ప్రణబ్‌ ముఖర్జీ తదితరులతో మాత్రమే ఆయన కలిసి వెనుతిరిగారు. తాజాగా అధినేత్రితో అపాయింట్‌మెంట్‌ లభించడంతో డీఎస్‌ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆమెకు నివేదిక అందజేశారు.

పార్టీ పరిస్థితులపై చర్చించాం : డీఎస్‌
రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై సోనియాతో చర్చించినట్లు పీసీసీ చీఫ్‌ డీఎస్‌వెల్లడించారు. సోమవారం సాయంత్రం మేడమ్‌తో భేటి అనంతరం బయటికి వచ్చిన డీఎస్‌మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అధినేత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. సంస్థాగత ఎన్నికల వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని ఆయన చెప్పారు. ఇంకా పార్టీ విషయాలు చాలా చర్చించుకున్నామని, అవన్ని మీడియాకు చెప్పడం భావ్యం కాదన్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర పై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

రాజీవ్ అసలు నాయకుడే కాదు!

కుష్వంత్‌సింగ్ ఎప్పట్లాగే మసాలాలతో దట్టించిన మరో కొత్త పుస్తకం తీసుకొచ్చారు. దాని పేరు 'ఆబ్సెల్యూట్ కుష్వంత్'. తిట్టినా, మెచ్చుకున్నా ఏ మాత్రం మొహమాటాలూ లేవు. 'నేను ఎవర్నీ సీరియస్‌గా తీసుకోలేదు నాతో సహా' అంటారొక చోట. 'అరవై ఏళ్లకు పైగా కలిసి ఉన్నా నేనూ, నా భార్యా సంతోషంగా కాపురం చేయలేదెప్పుడూ' అని కూడా చెప్పుకున్నారాయన. ఒంటరితనం, నిరంతర రచన.. ఈ రెండూ తనకిచ్చిన ఆనందం మరేదీ ఇవ్వలేదని చెప్పుకున్న 95 ఏళ్ల కుష్వంత్ సింగ్ పుస్తకంలోంచి కొన్ని భాగాలు...

అన్నింట్లోకి నాకు ఎక్కువ ఇష్టమైంది ఒంటరితనం. అది నాకు విరివిగా లభించడం నా అదృష్టం. ఒంటరితనం ఎన్నో రకాలుగా ప్రయోజనకరం. మెదడుకు బోలెడు విశ్రాంతి దొరుకుతుంది. ఒక రోజంతా మౌనంగా ఉంటే ఎంతో శక్తి చేకూరుతుంది. మెదడును కాసేపు ఖాళీగా ఉంచగలిగితే- ధ్యానం ఉద్దేశం అదే ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

శృంగారం వైపే నేను..
పురుషులు వృద్ధులవుతున్న కొద్దీ శృంగార వాంఛలు శరీరం కింది భాగాల నుంచి పైకి పాకి మెదడులోకి చేరతాయి. యుక్త వయస్సులో ఏం చేయాలనుకుని చేయలేకపోయారో- వాటిని ఊహించుకొని తృప్తిపడుతూ ఉంటారు. శృంగారం, రొమాన్స్‌లలో ఏది ముఖ్యం అని నన్ను అడిగితే- శృంగారమే అని చెబుతాను. రొమాన్స్ పైపూతలాంటిది. కొద్ది కాలం పోయిన తర్వాత తొలగిపోతుంది.

దానికి ఉండే ఆకర్షణ కూడా పోతుంది. రొమాన్స్ చేయటానికి అవసరమైన సమయం కానీ అభిరుచి కానీ నాకు ఎప్పుడూ లేవు. రొమాన్స్ చేయాలంటే చాలా సమయం కావాలి. అపారమైన శక్తియుక్తులను ఖర్చుపెట్టాలి. దాని వల్ల ఫలితం కూడా పెద్దగా ఉండదు. అందుకే శృంగారం వైపే నేను మొగ్గుచూపుతాను. పురుషులు మాత్రమే మహిళల వెనకపడి ఆకర్షించటానికి ప్రయత్నిస్తారనే ప్రచారం నిజం కాదు.

మహిళలే ఈ కళలో ఆరితేరిన వారని నా గట్టినమ్మకం. నా జీవితంలో- నేను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళల కన్నా- నన్ను ఆకర్షించటానికి ప్రయత్నించిన మహిళలే ఎక్కువ. నాకు ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలిగితే- ఆ విషయం వాళ్లకు చెప్పటానికి చాలా బెరుకుగా అనిపించేది. ఆత్మవిశ్వాసం చాలేది కాదు. కాని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు- సందర్భం కుదిరితే చెప్పేవాడిని. అప్పుడు వాళ్లు- "అరే.. ఆ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు?'' అనేవారు.

నెహ్రూ ముచ్చట్లు..
సరుకుల్ని రవాణా చేసే బృందాల నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను ప్రముఖ కవి అలం ఇక్బాల్ ఒకచోట ఇలా చెబుతాడు. "నిగాహ్ బులంద్, సుఖాః దిల్‌నవాజ్, జాన్ పర్ సోజ్- యహీ హై రక్త్ ఎ సఫర్ మీర్ ఎ కార్వాన్ కే లియే'' (విశాల దృక్పథం, అందరినీ ఆకట్టుకొనే మాటతీరు, ఆకర్షించే వ్యక్తిత్వం- కార్వాన్‌ను ముందుకు నడిపించే నేతకు ఉండాల్సిన లక్షణాలు ఇవే).

నెహ్రూకు ఈ మాటలు అతికినట్లు సరిపోతాయి..
నేను నెహ్రూను తొలిసారి లండన్‌లో కలుసుకున్నా. అప్పుడు నేను భారత ఎంబసీలో సమాచార శాఖ అధికారిగా ఉండేవాడిని. నెహ్రూను దగ్గరగా చూసిన తర్వాత ఆయనకు కోపం ముక్కుమీదే ఉంటుందని అర్థమయింది. ఒక్క కోపమే కాదు చాలా అమర్యాదగా కూడా ప్రవర్తిస్తాడని తర్వాత తెలిసింది. బ్రిటన్‌లో ఉన్న ముఖ్యమైన పత్రికల ఎడిటర్లు నెహ్రూను కలవాలనుకున్నారు.

దాంతో నేను ఒక విందు సమావేశం ఏర్పాటు చేశాను. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంతలో నెహ్రూ హఠాత్తుగా మౌనముద్ర దాల్చాడు. ఎడిటర్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పైకప్పు వైపు చూడటం మొదలుపెట్టాడు. అందరి భోజనాలూ పూర్తికాక ముందే సిగరెట్టు తీసి వెలిగించాడు. గోరుచుట్టుపై రోకలిపోటు అన్నట్లు - మరోపక్క కృష్ణమీనన్ నిద్రపోయాడు.

పబ్లిక్ రిలేషన్స్ ఇంతకన్నా పెద్ద ఉత్పాతం ఏముంటుంది చెప్పండి! మరోసారి నెహ్రూ లండన్‌లో దిగేసరికి అర్థరాత్రి అయింది. నేను ఆయనకు స్వాగతం చెప్పటానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. మర్యాదకు- "నన్ను కూడా మీతో పాటు హోటల్‌కు రమ్మంటారా?'' అని అడిగాను. "డోన్ట్ బీ సిల్లీ.. ఇంటికి వెళ్లి పడుకో'' అని నెహ్రూ కసురుకున్నాడు. ఆ మర్నాడు పేపర్లలో- నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి.

ఆ ఫోటోలో- కురచ దుస్తులు వేసుకొని ఉన్న లేడీ మౌంట్‌బాటెన్ తలుపుతీస్తోంది. నెహ్రూ తలుపు దగ్గర ఉన్నాడు. ఒక పత్రికలో ఆ ఫోటో పైన- "లేడీ మౌంట్‌బాటెన్ ఇంటికి అర్థరాత్రి అతిథి'' అనే శీర్షిక పెట్టారు. నెహ్రూకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. మరోసారి నెహ్రూ, లేడీ మౌంట్‌బాటెన్‌లు కలిసి ఒక గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ మర్నాడు కూడా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను పత్రికలు ప్రచురించాయి.

నెహ్రూ దగ్గరకు వెళ్లమని నన్ను నా పైఅ«ధికారులు ఆదేశించారు. నేను నెహ్రూ దగ్గరకు వెళ్లాను. ఆయన మూడ్ బావులేదు. "ఎవరు నువ్వు?'' అని నెహ్రూ నన్ను ప్రశ్నించాడు. "సర్.. నేను లండన్‌లో మీ పీఆర్ఓను..'' అని సమాధానమిచ్చాను. "పబ్లిసిటీ ఎలా ఇవ్వాలనే విషయంలో నీకు విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి'' అన్నాడు. అలాంటి సమయాల్లో మౌనమే మంచిదనుకున్నా. నేనేమీ మాట్లాడలేదు.

రాజీవ్ నేత కాదు..
రాజీవ్ గాంధీని కీర్తిస్తూ, అతనిని ఒక ఉన్నత శిఖరాలమీద నిలబెట్టటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ రాజీవ్ కూడా అనేక తప్పులు చేశాడు. వాటిలో కొన్ని తీవ్రమైన తప్పులు కూడా. రాజీవ్‌ను బలవంతంగా రాజకీయాల్లోకి దింపారు. వాటిని అతను సరిగ్గా నిర్వహించలేకపోయాడు. నిజానికి రాజీవ్ చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి. కొన్ని మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ అవి చరిత్రను మార్చేసేటంత గొప్పవైతే కావు.

అసలు అతను ఒక మంచి నాయకుడే కాదు. తన తల్లి అడుగుజాడల్లో నడిచి ఆమె చేసిన తప్పులే అతనూ చేశాడు. టెలికాం, కంప్యూటర్స్ వంటి ఆలోచనలు కూడా ఇందిరాగాంధీ సమయంలో మొదలుపెట్టినవే. శ్రీలంక వ్యవహారాన్ని పూర్తిగా చెడగొట్టాడు. ఒక బహిరంగ సమావేశంలో ఒక మంత్రిని పదవి నుంచి తొలగించాడు. బాబ్రీమసీదు, షాబానో కేసుల్లో అతని పాత్రను మనం తక్కువగా తీసేయలేం.

ఈ రెండు కేసులు మనకు దీర్ఘకాల హాని చేశాయి. ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ ప్రవర్తించిన తీరును చరిత్ర ఎన్నటికీ క్షమించదు. సిక్కులను ఢిల్లీలో సజీవంగా తగలబెట్టేస్తుంటే-"ఒక మహావృక్షం కుప్పకూలినప్పుడు.. చుట్టుపక్కల ఉన్న భూమి కూడా కంపిస్తుంది..'' అన్నాడు. ఆ హత్యలను అతను ఆపి ఉండాల్సింది. ఒక్కసారి బయటకు వెళ్లి- "ఈ హత్యాకాండ ఆపాలి.. రండి..'' అని సైన్యాన్ని పిలిచి ఉంటే సరిపోయేది. కానీ రాజీవ్ అలా చేయలేదు. అంతేకాకుండా తన వ్యాఖ్యల ద్వారా ఆ హత్యాకాండను సమర్థించాడు కూడా.

ఆ పరిస్థితుల్లో నెహ్రూ ఉంటే- ఆ విధంగా చేసి ఉండేవాడు కాదని నేను కచ్చితంగా చెప్పగలను. నెహ్రూకు ధైర్యం ఉంది. బయటకు వెళ్లి అల్లరిమూకలను చెదరగొట్టి ఉండేవాడు. దేశ విభజన సమయంలో నెహ్రూ ఆ విధంగా చేశాడు కూడా. ఒక నేతకు, ఔత్సాహికుడికి మధ్య ఉండే తేడా అదే. అయితే రాజీవ్ సోదరుడు సంజయ్‌గాంధీ చురుకైనవాడు. రాజీవ్ స్కౌట్‌లాంటివాడు.

రాహుల్ శభాష్!
నా దృష్టిలో రాజీవ్ కంటే రాహుల్ చాలా సమర్థుడు. అతనికి ఒక విశాల దృష్టి ఉంది. అది చాలా ముఖ్యమైన విషయం. అతను ప్రవర్తిస్తున్న తీరు కూడా చాలా బావుంది. సరైన దృక్పథమూ ఉంది. అతను చేస్తున్నది పెద్ద పెద్ద పనులు కాకపోయినా- ఆ పనుల వెనకున్న ఆలోచనలు మాత్రం మంచివే. రాహుల్ పరిణతి చెందిన నాయకుడుగా అభివృద్ధి చెందుతున్నాడు.

2014 ఎన్నికలలో- కాంగ్రెస్ గెలిస్తే- రాహుల్ ప్రధాని కావటానికి ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు కూడా. అయితే అతని ప్రాధమ్యాలు సరిగ్గానే ఉన్నాయి. అతను కుర్చీల గురించి, పదవుల గురించి పట్టించుకోవటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాడు. గత ఏడాది రాహుల్ నాకు ఫోన్ చేశాడు. ఒకసారి వచ్చి కలుస్తాన న్నాడు.

ముందుగా అనుకున్నటు ్ల సాయంత్రం పూట సరిగ్గా నాలుగు గంటలకు వచ్చాడు. ఒక గంటసేపు నాతో కూర్చుని కబుర్లు చెప్పాడు. మేము రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. కాని మా మధ్య జరిగిన మాటల్లో అతని నాయనమ్మ గురించి కానీ, ముత్తాత గురించి కానీ ఎటువంటి ప్రస్తావన రాలేదు.

Saturday, August 21, 2010

పదవుల కోసం రాజీవ్ ఆరాటపడలేదు : సీఎం * ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు : డీఎస్ * ఘనంగా రాజీవ్‌గాంధీ 66వ జయంతి ఉత్సవాలు * వర్ధంతిలోగా వాడవాడలా రాజీవ్ విగ్రహాలు నెలకొల్పాలని వీహెచ్ పిలుపు


మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 66వ జయంతి ఉత్సవాలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహం వద్ద ఆరంభమైన ఈ సందడి సాయంత్రం వరకు కొనసాగింది. గాంధీభవన్, పీపుల్స్ ప్లాజా, జయా గార్డెన్స్‌లలో కూడా ఈ వేడుకలు జరిగాయి. నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ కాంగ్రెస్ తోరణాలు, రాజీవ్ చిత్రపటాలతో నిండిపోయాయి. రాజీవ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పలువురు నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన దార్శికతను కొనియాడారు. రాజీవ్ జీవిత విశేషాలు, రాష్ట్రంతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేసే చిత్రప్రదర్శనను గాంధీభవన్‌లో ఏర్పాటు చేశారు. దీనిని ముఖ్యమంత్రి కె.రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరంభించారు. అంతకు ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. రాజీవ్ వర్ధంతి (మే 21)లోగా రాష్ట్రంలో విస్తారంగా ఆయన విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని, రాజీవ్ ఆలోచనలు, ఆశయాలను ప్రజలకు తెలియజేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో సోమాజిగూడ కూడలిలో, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్, మరో మంత్రి ముఖేష్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో ఈ జయంతి ఉత్సవాలు జరిగాయి.

పీపుల్స్‌ప్లాజాలో భారీ వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 220 మంది కార్యకర్తలు రక్తదానం చేయగా, పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో రాజీవ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యువ నేతలంతా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహాన్ని చేరుకున్నారు. ఈ ర్యాలీని సీఎం, డీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నింటిలో సీఎం, డీఎస్‌లతో పాటు సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పాల్గొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి కె.బి.కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి యాదవ్, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్యవర్గ, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫ్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ఆనం రామనారాయణరెడ్డి, ముఖేష్‌గౌడ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, అహ్మదుల్లా, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ బండ కార్తీకరెడ్డి, కార్పొరేటర్లు, కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల నేతలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు సీఎం కె.రోశయ్య, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెక్కును అందజేశారు. వైద్య శిబిరానికి సహకరించి వైద్యులను సత్కరించారు.

సోమాజీగూడ సభను అన్నీ తానై వీహెచ్ సభను నిర్వహించగా, గాంధీభవన్ కార్యక్రమానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి రాపోలు ఆనంద భాస్కర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. పీపుల్స్‌ప్లాజాలోని సభను మంత్రి దానం నిర్వహించగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని వందన సమర్పణ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రాధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అధ్యక్షత వహించారు. వీహెచ్ ఆధ్వర్యంలో నగరంలోని నాలుగు ప్రదేశాల నుంచి ప్రారంభమైన సద్భావన పరుగులు సోమాజిగూడ చేరుకున్నాయి. క్రీడాకాలకు సీఎం చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా వేదికల నుంచి సీఎం, డీఎస్‌ల ప్రసంగాలు యథాతథంగా..

పదవుల కోసం ఆరాటపడలేదు : సీఎం కె.రోశయ్య

అధికారం తిష్టవేసిన కుటుంబంలో రాజీవ్‌గాంధీ జన్మించారు. కానీ దానికి ఆయన ఆకర్షితుడు కాలేదు. పదవులను కోరుకోలేదు. ఆరాటపడలేదు. పైలట్‌గా స్థిరపడాలనుకున్నారు. పదవులే ఆయన చుట్టూ తిరిగాయి. వారసత్వ వంశం కాదు. వారి రక్తంలోనే త్యాగం, పేదల పట్ల అభిమానం ప్రవహిస్తూ వచ్చాయి. గొప్పింట్లో పుట్టినా కూడా రాజాలతో స్నేహం చేయలేదు. అట్టడుగు స్థాయి ప్రజల అభ్యున్నతి కోసం తపనపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ఒత్తిడి మేరకు విముఖంగానే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రధానిగా పనిచేసినా అధికార దర్పం వారి దరి చేరలేదు. కొద్దికాలమే ప్రధానిగా ఉన్నా చెరగని స్థిరమైన ముద్ర వేశారు. 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలతో బలోపేతంచేసి నిధులు, విధులు ఇచ్చారు. మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత ఆధునిక సమాజం రావాలని తపించిన గొప్ప అభ్యుదయ వాది. రాజీవ్ సేవలు మరువలేం. ఆయన బాటలోనే నడవాలి. ఇందిర, రాజీవ్ దూరమైనా వారి ఆశయాలను దూరం చేసుకోకూడదు. వారి ప్రతిరూపమే సోనియా. సమర్థ పాలన అందిస్తున్న మహా నేత. ప్రధాని పదవినే త్యజించారు. దేశం సమైక్యంగా, సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని తలంచి మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకుందాం. పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కృషిచేశారు. అదేబాటలో సోనియా నడుస్తూ, నిరుపేదలకు అనేకహక్కుల కల్పించారు. ఉపాధి హామీ పథకం, నిర్బంధ ఉచిత విద్యా హక్కులిచ్చారు. త్వరలోనే ఆహార, ఆరోగ్య భద్రతా హక్కులు కూడా రాబోతున్నాయి. వీటిద్వారా ఎవరినీ అభ్యర్థించే అవసరం లేకుండా, డిమాండ్ చేసి నెరవేర్చుకునే హక్కు వచ్చింది. రాహుల్ గాంధీ చుట్టూ అధికారం పరిభ్రమిస్తున్నా సున్నితంగా తిరస్కరించారు. పేదల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం విస్తృతంగా, సాధారణ వ్యక్తిలా రిజర్వేషన్ లేకుండానే ప్రయాణిస్తున్నారు. అరుదైన వ్యక్తిత్వం ఆ కుటుంబ లక్షణం. భవిష్యత్తులో రాహుల్ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి.

ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు : డి.శ్రీనివాస్

ఓపిక.. ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత పైకొస్తారు. ప్రతి దానికీ రాజకీయ లబ్ధి ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ తమవద్దకు రావాలనుకోవడం తప్పు. అంతా మేము చెప్పిందే సాగాలనే నేతలున్నారు. ఇప్పటి యువకులు కాళ్లా వేళ్లా పడి ఎమ్మెల్యే టిక్కెట్ సాధిస్తారు. వెంటనే సీఎంను కలిసి మంత్రి పదవి, ఆ తర్వాత క్యాబినెట్ ర్యాంక్, ఆపై ఇక సీఎం కావాలని చూస్తారు. గాంధీభవన్ గడప తొక్కగానే పీసీసీ ప్రధాన కార్యదర్శి కావాలంటారు. ఏళ్ళ తరబడి పనిచేసినా కూడా కొందరికి గుర్తింపులేదు. రెండుసార్లు ఎంపీ అయినా రాహుల్ గాంధీ మంత్రి పదవిపై ఆసక్తి చూపకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. దానిని యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజీవ్ జయంతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని అవగాహన చేసుకోవాలి. కాంగ్రెస్ మన మతం, మన జాతి. సోనియానే మన నేత. దేవతగా ఆమె నాయకత్వాన్ని బలపరచాలి. దేశం కోసం పుట్టిన కుటుంబం నెహ్రూ, ఇందిరలది. దశ-దిశ లేక పార్టీ ఏమైపోతుందో అనే దశలో సోనియా తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంక కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే త్యాగాల కుటుంబం వారిది. ఇందిర మాదిరి సోనియాకు కూడా రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ప్రతిన చేయాలి. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నా రోశయ్య చక్కని నాయకత్వం అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా బలంగా ఉంటే అదే మన బలం. సంకల్పం పూని.. నిబద్ధతతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యం మన వద్ద అవసరం కంటే ఎక్కువ. ఎన్నెన్నో పార్టీలు పుట్టుకొచ్చి దేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.

సందట్లో సీఎంలు

cms
రాష్ట్ర కాంగ్రెస్‌లో శరవేగంగా మారుతున్న రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు కొందరు సీనియర్‌ నాయకులు ఎవరి మార్గాల్లో వారు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మద్దతుదారులుగానే ఉంటూనే.. మరోవైపు సొంత వ్యూహాలకు తెరలేపి, రోశయ్య పీఠానికే ఎసరు తీసుకువస్తున్న వైచిత్రి కాంగ్రెస్‌లో చర్చనీయాంశ మయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్‌ సీని యర్లు ఆ మేరకు ఇప్పటినుంచే తమ భవితవ్యాన్ని తీర్చిదిద్దుకు నేందుకు రంగంలోకి దిగారు. ఢిల్లీ వేదికగా పావులు కదుపుతు న్నారు. నాయకత్వానికి దగ్గరయేందుకు పోటీలు పడుతున్నారు. నివేదికల పేరిట హడావుడి చేస్తున్నారు. జగన్‌ జెండా పీకితే.. రాజకీయ స్థిరత్వం కోసం నాయకత్వం చేసే మార్పుల సమయంలో తామే ప్రత్యామ్నాయంగా కనిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులో మునిగిపోయారు. చిత్రంగా.. వీరంతా రోశయ్యతో నిరంతరం మాట్లాడుతూనే ఆయన పీఠానికే ఎసరు తెచ్చే ప్రయత్నాలు చేయడమే విశేషం.

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, పురంధేశ్వరి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి జానారెడ్డి వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ఆ మేరకు పరోక్ష రాజకీయాలకు తెరలేపారు. వీరంతా కడప ఎంపి జగన్‌ పార్టీ నుంచి వైదొలగే ముహుర్తం కోసమే ఆశగా ఎదురుచూస్తున్నట్లు వారి వ్యవహారశైలి, ఎత్తుగడ స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ ను పార్టీ నుంచి బయటకు పంపితే తప్ప, తమ కలలు సాకారం కావన్న స్థితప్రజ్ఞతతో ఆ మేరకు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు.

సందట్లో సడేమియాల మాదిరిగా, రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘సందట్లో సీఎం’ల కోసం పోటీ కనిపిస్తోంది. ఈ వరసలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సాయంతో వేసిన ఎత్తుగడ ఒకరోజు వరకూ ఫలించినా, ఆ తర్వాత మాత్రం అందరి విమర్శలకు గురయింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను సొంత ఖర్చుతో ఢిల్లీకి తీసుకువెళ్లి, జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. అదే సమయంలో ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వెళ్లినప్పటి నుంచి, బయటకు వచ్చే వరకూ జరిగిన అన్ని వ్యవహారాలనూ మీడియాకు లీక్‌ చేసిన వైనం ఆయన తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలకే ఆగ్రహం తెప్పించింది.
రాష్ట్ర నాయకత్వంలో మార్పులు సంభవిస్తే ఎన్టీఆర్‌ కుటుంబ కార్డును అడ్డుపెట్టుకుని పురంధేశ్వరిని సీఎంను చేయాలన్నది దగ్గుబాటి అసలు వ్యూహమంటున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి సీఎంను చేస్తే టీడీపీ కూడా దెబ్బతింటుందన్న లెక్కలతో దగ్గుబాటి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. కేంద్రమంత్రిగా ఆమె సంపాదించిన పేరు, ప్రధాని-సోనియా వద్ద ఉన్న గుర్తింపును ఇందుకోసం వినియోగించుకోవాలన్నది మరో ఎత్తుగడ. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇంతవరకూ ఎప్పుడూ పార్టీ కార్యకలాపాల్లో కనిపించని దగ్గుబాటి కుటుంబం, హటాత్తుగా జగన్‌ ఎపిసోడ్‌లోనే రంగ ప్రవేశం చేయడం దింపుడుకళ్లెం ఆశతోనేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అయితే, రాజకీయాల్లో కావలసిన గుండె ధైర్యం, సాహసం, మొండితనం, తెగువ, ఆర్థిక వనరులు, అనుచరులకు భరోసా ఇచ్చే అంశాల్లో దగ్గుబాటి కుటుంబం రాణించడం కష్టమని, గిరిగీసుకుని ఉన్నందుకే దగ్గుబాటి టీడీపీలో రాణించలే పోయారంటున్నారు. పైగా రాష్ట్ర స్థాయిలో ఆ కుటుంబానికి ఏ ప్రాంతం నుంచీ కనీస స్థాయిలో మద్దతులేదంటున్నారు.

పురంధేశ్వరికి సొంత సామాజిక వర్గానికి చెందిన మీడియా కల్పిస్తున్న ‘మేధావి ప్రచారాన్ని’ సీఎం పదవి కోసం సద్విని యోగం చేసుకోవాలన్నది దగ్గుబాటి ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానికోసమే ఆమె తన జిల్లా పరిధిలోని అంశం కాకపోయినా జగన్‌ వ్యవహారంలో తలదూర్చి, తనకు తాను ప్రత్యామ్నాయ నేతగా అధినేత్రి దృష్టిలో పడే ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. దగ్గుబాటి కుటుంబానికి కమ్మ వర్గంలోనే తగిన మద్దతు లేదంటున్నారు.

ఇక రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే... ‘పొరపాటున కూడా’ తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతు పావులు కదుపుతున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కూడా సీఎం పీఠంపై కన్నేశారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కోటాలో సీఎం పీఠం కోసం పావులు కదుపుతున్న ఆయన, పైకి మాత్రం తన శిష్యుడయిన జానారెడ్డిని వ్యూహాత్మ కంగా తెరపైకి తీసుకువస్తున్నారని చెబుతున్నారు.

వివాదరహితుడిగా ఉన్న పేరును వినియోగించుకుని, తెలంగాణపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. సీఎం పదవి ఆ ప్రాంతానికి ఇచ్చి సంతృప్తి పరిచే వైఖరి అవలంబిస్తే అప్పుడు తానే ప్రత్యామ్నాయంగా కనిపించాలన్నది జైపాల్‌రెడ్డి వ్యూహమంటున్నారు. నిజానికి, జైపాల్‌ నేరుగా తెరపైకి రాకపోయినా చాలాకాలం నుంచి తెలంగాణ అంశానికి సంబంధించి శర వేగంగా పావులు కదుపుతున్నారు. ఎంపీలు, సీనియర్‌ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. తెలంగాణలో వైఎస్‌ వర్గాన్ని అణచివేసేందుకు జరుగుతున్న వ్యూహంలో ఆయనే ప్రధాన సూత్రధారని వైఎస్‌ వర్గీయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
సీనియర్‌ నేత జానారెడ్డి కూడా తన స్ధాయిలో తెలంగాణ కోటా నుంచి సీఎం పీఠంపై ఆశలు పెంచుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీని పుట్టించి అందరికన్నా ముందే ఉద్యమానికి పెద్దరికం వహించి, ఆ తర్వాత కనుమరుగయిన జానారెడ్డి మళ్లీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో హడావుడి చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ నుంచి నాయకత్వ పాత్ర పోషిస్తున్న జానారెడ్డి సీఎం పీఠంపై కన్నేశారు. ఇప్పటికే అనేక కీలకశాఖల్లో పనిచేసినందున అనుభవం ప్రాతిపదికన తానే ఆ పదవికి అర్హుడనన్న విశ్వాసంతో ఉన్నారు.

ఉత్తరాంధ్ర కోటా తో పాటు, తెలంగాణ వాదుల మద్దతుతో సీఎం పీఠంపై కన్నేసిన మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ప్రయత్నాలు చేసుకుం టున్నారు. అందుకోసం ఆయన వ్యూహాత్మకంగా లౌక్య రాజకీయాలు అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక-సమైక్య వాద ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా సత్తిబాబు ఇప్పటి నుంచే లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అందుకే ఆయన సీమాంధ్ర మంత్రుల భేటీకి సైతం వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు.

ఇటు తెలంగాణ-అటు ఆంధ్ర నేతల మద్దతు కూడగట్టుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నేతను తానేనన్న సంకేతాలివ్వడమే బొత్స లక్ష్యమంటున్నారు. అయితే, ఆయనకు కోస్తాలోనే మద్దతు తగినంత లేదంటున్నారు. ఒకవైపు రోశయ్యకు గట్టి మద్దతుదారుగా ఉంటూనే, సమయం వస్తే సీఎం పీఠం ఎక్కేద్దామన్న ఆశలపల్లకీలో ఉన్నారు.

రాజకీయ రణరంగం హోరా... హోరీ

రాష్ట్ర కాంగ్రెస్‌లో రెండు శిబిరాల మధ్య దాడి... ఎదురు దాడి జరుగుతోంది. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి నిర్వహి స్తున్న ఓదార్పు యాత్ర ఈ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావర ణానికి నాంది పలుకుతోంది. పార్టీ నేతలు జగన్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోరుు పోరు తీవ్రతరం చేశారు. పార్టీ అధిష్ఠానాన్నే లెక్క చేయని రీతిలో జగన్‌ వర్గం వ్యవహరిస్తుండగా, హైకమాండ్గ ఆదేశాలే మాకు శిరోధార్యమంటూ జగనే టార్గెట్‌గా వ్యతిరేక వర్గం ఎదురు దాడికి దిగు తున్నది. ఓదార్పు యాత్రే కాంగ్రెస్‌లో కల్లోలానికి దారి తీస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

jaganఓదార్పు యాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజ కీయం వేడెక్కింది. ఇంత వరకూ యాత్రపైనే దృష్టి పెట్టిన జగన్‌ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలపై దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారు. పార్టీలో తనను ఏకాకిని చేసేందుకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలపై జగన్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు జిల్లాల్లో ఓదార్పు యాత్ర పూర్తయిన తరుణంలో హైకమాండ్‌ ద్వారా ఎటూ అడుగు వేయలేని పరిస్థితి కల్పిస్తున్న నేతల పట్ల జగన్‌ భగ్గుమంటున్నారు. అధిష్ఠానాన్ని రంగంలో దించి తన యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే నేపంతో దగ్గుబాటి దంపతులపై జగన్‌, ఆయన వర్గం కారాలు, మిరియాలు నూరుతున్నది. వచ్చే నెల 3 నుంచి ప్రకాశం జిల్లాలో తన ఓదార్పు యాత్ర ప్రారంభం కానున్న తరుణంలో ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఢిల్లీ పిలిపించుకుని హైకమాండ్‌తో సమావేశాలు ఏర్పాటు చేసిన దగ్గుబాటి దంపతులు, చివరకు సోనియా, అహ్మాద్‌పటేల్‌లను రంగంలోకి దింపి ఓదార్పు అడ్డుకునేందుకు ప్రయత్నిం చారంటూ జగన్‌, అతని వర్గానికి చెందిన నేతలు మండిపడుతు న్నారు.

పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎవరు కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా, అహ్మద్‌ పటేల్‌ చెప్పారంటూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరో వైపు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు కూడా జగన్‌ ఓదార్పు యాత్ర విషయంలో కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో దగ్గుబాటి దంపతులు ఓదార్పు యాత్ర ఎపిసోడ్‌లో వ్యవహరించిన పాత్ర యువనేత జగన్‌కు అగ్రహాన్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరగణం కూడా దగ్గుబాటి దంపతులపై ఎదురు దాడికి దిగారు.

roshiahజగన్‌ ఒక మరో అడుగు ముందుకు వేసి ఏకంగా దగ్గుబాటి దంపతులపై ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించే నేతలు, ప్రత్యేకించి ఓదార్పు విషయంలో ఆటంకాలకు ప్రయత్నించే వారి పట్ల తగిన రీతిలోనే స్పందిస్తామంటూ జగన్‌ ఈ ఫిర్యాదు ద్వారా సంకేతాలు అందించారు. ప్రకా శం జిల్లా ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకొచ్చి తనకు నీతులు చెప్పించే ప్రయత్నాలు చేయడం, అధిష్ఠానంతో ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు వ్యూహాలు రచించారంటూ దగ్గుబాటి దంపతులపై జగన్‌ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ వీరప్ప మొయిలీ హస్తినాలో రాష్ట్ర ఎంపీలకు ఇచ్చిన విందులో కూడా జగన్‌ పట్టుపని పదినిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన ఆనకాపల్లి ఎంపి సబ్బం హరిని వెంటబెట్టుకుని కాంగ్రెస్‌లో కీలక నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇంటికి వెళ్ళి కొంత సేపు ఆయనతో సమావేశ మయ్యారు. ఈ భేటి సారాంశమేమిటో అధికారికంగా వెల్లడించనప్పటికీ దగ్గుబాటి దంపతులు, ఓదార్పు యాత్ర విషయంలోనే జగన్‌, ప్రణబ్‌తో చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్‌కు వచ్చే ముందు శుక్రవారం ఉదయం జగన్‌ మరో సారి ప్రణబ్‌తో భేటి అయ్యారు. ఆ తరువాత ఆయన సాయంత్రం వీరప్ప మొయిలీతో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు నేతల వద్ద కూడా దగ్గుబాటి దంపతుల వ్యవహార శైలీపై ఫిర్యాదు చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోనియాగాంధీ తనకు చెప్పారంటూ పురంధేశ్వరి ప్రకటన చేసిన కొంత సేపటికే జగన్‌, ప్రణబ్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.

ఇలా ఉండగా జగన్‌ వర్గం నేతలు కూడా దగ్గుబాటి దంపతుల నిప్పులు చెరుగుతున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఏదైనా చెప్పా ల్సి ఉంటే నేరుగా జగన్‌నే పిలిపించి చెప్పవచ్చు, అలా కాకుండా తమతో సోనియా, పటేల్‌ చెప్పారంటూ దగ్గుబాటి దంపతులు జగన్‌ ఓదార్పు యాత్ర ను అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అదే విధంగా జగన్‌ వర్గ నాయకు లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు, పార్టీ నేత గట్టురామచంద్ర రావు తది తరులు కూడా దగ్గుబాటి దంపతులపై చిందులు తొక్కారు.

ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు మండి పడ్డారు. మరో వైపు తిరుపతిలో ఉన్న జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి కూడా ఓదార్పు విషయంలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్‌రావు అతిగా స్పందించారంటూ ఢిల్లీలో వారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో దగ్గుబాటి దంపతులు కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవని, పదవులు కాపాడుకోవడానికే కొందరు జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి మంత్రి పదవులు తనకు శాశ్వతం కాదని, అధిష్ఠానం వద్దన్నా తాను ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని మరో సారి పునరుద్ఘాటించి జగన్‌కు విధేయతను ప్రకటించుకున్నారు.

ఎదురుదాడి....
ఇదిలా ఉండగా జగన్‌ వ్యతిరేక వర్గం అతనిపై ఎదురు దాడి ప్రారంభిం చింది. అధిష్ఠానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, పార్టీని శాసించే స్థా యిలో జగన్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం కన్నెర్ర చేస్తున్నది. రోజు వారిగా జగన్‌పై విమర్శలు సంధిస్తున్న నేతలతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంత రావు తదితరులు జగన్‌ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అతనిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ముగ్గురు నేతలు కూడా రాజీవ్‌ జయంతి వేడుకల కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని జగన్‌పై తమదైన శైలీలో మండిపడ్డారు. నిజమైన నాయకులు ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడరంటూ ముఖ్య మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన వేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

అదే విధంగా పీసీసీ చీఫ్‌ డిఎస్‌ కూడా యుననేత జగన్‌పై గురిపెట్టి కొందరు నేతలు పార్టీలో కాలుమోపగానే పదవు ల కోసం పోటీ పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రాహుల్‌ గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని హితవు పలికారు. మరో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్‌, జగన్‌ పేరు ప్రస్తావించకుండానే నాడు రాజీవ్‌ గాంధీ ఆశీస్సుల వల్లే వైఎస్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, రాజీవ్‌ లేక పోతే వైఎస్‌కు ఆ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ కాదు, గాంధీ కాదు, అంతా మా నాన్నేనని కొందరంటున్నారు, అది సరికాదు, పార్టీకి సేవచేయకుండా పదవులు ఎలా వస్తాయి? హైకమాండ్‌ను నమ్ముకుంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని అందరు గ్రహించాలని ఆయన జగన్‌కు చురకలంటించారు. మరో సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్‌రావు కూడా ఓదార్పు యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్‌ చుట్టు ఉన్న నేతలందరు నీళ్ళ తరహాలాంటి వారేనంటూ జగన్‌ వర్గంపై ధ్వజమెత్తారు.