Thursday, August 26, 2010

బయ్యారం గనుల అనుమతులు రద్దు

బయ్యారం రద్దు..
అనుమతులన్నీ బుట్టదాఖలు.. కేంద్రం సంచలన నిర్ణయం

రాష్ట్ర సర్కారు వైఖరిపై సీరియస్..
రిజర్వు చేసుకోడానికే అనుమతి
అలాంటప్పుడు మైనింగ్ ఎలా చేస్తారు?..
ఏపీఎండీసీకీ మైనింగ్ అనుమతి లేదు
రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం ఎలా కుదర్చుకుంటారు?..
ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు
జీవో 64ను ఉపసంహరించుకోండి..
రాష్ట్రానికి 17నే ఆదేశాలు

BAYYAR
బయ్యారం గనులపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), రక్షణ స్టీల్స్‌తో పాటు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ గనులకు సంబంధించి ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసి పారేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి క్లాస్ తీసుకోవడంతో పాటు, దాని వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. గనుల విషయంలో రక్షణ స్టీల్స్ (వైఎస్ అల్లుడు అనిల్‌కు చెందినదిగా ప్రచారంలో ఉన్న)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆదేశించింది.

రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ వ్యవహారంలో కేంద్రం దాదాపు పది రోజుల క్రితమే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బయ్యారం గనులపై అనుమతులను పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే, కేంద్రం మొత్తంగా రద్దు చేయడం గమనార్హం. కొత్త ప్రతిపాదనలు పంపాలని, వాటిని పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోని 1.40 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఇనుప ఖనిజం నిక్షేపాలను ఏపీఎండీసీకి రిజర్వు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ గనులపై ఏపీఎండీసీ రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని కేంద్రం తప్పుపట్టింది. ఏపీఎండీసీకి గనులను కేవలం రిజర్వు చేసుకోడానికే అనుమతి ఇస్తే అసలు మైనింగ్ ఎలా చేసుకుంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీఎండీసీ చేపట్టిన మైనింగే అక్రమమని, ఆ సంస్థకు కూడా మైనింగ్ చేయడానికి అనుమతి లేదని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చన అనుమతులను పూర్తిగా రద్దు చేస్తున్నామని.. మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపితే సర్వే చేసిన తర్వాత అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఖనిజ వనరుల శాఖ స్పష్టంగా చెప్పింది.

బయ్యారంలో మైనింగ్ చేసుకునేందుకు ఏపీఎండీసీకి అనుమతి ఇస్తూ జారీ చేసిన జీవో 64ను వెంటనే ఉపసంహరించాలని ఆదేశించింది. ఏపీఎండీసీ- రక్షణ స్టీల్స్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలని సూచించింది. ఈ విషయాలన్నీ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 17వ తేదీనే ఓ లేఖ రాసింది. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలనుకుంటే అందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, ఇప్పుడు జరుగుతున్న మైనింగ్ అక్రమమేనని కేంద్రం స్పష్టం చేసింది. రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినప్పుడు అక్కడ జనావాసాలు ఉన్నట్లు చెప్పకపోవడాన్ని కూడా కేంద్రం తప్పుపట్టింది.
BAYYARA
"ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో 56,695 హెక్టార్లలో ఖనిజాలను తవ్వుకునేలా రిజర్వు చేసుకునేందుకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చాము. అప్పుడు అక్కడ జనావాసాలు ఉన్నట్లు చెప్పలేదు.. పదేళ్ల పాటు రిజర్వు చేసుకోవడానికే అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ మైనింగ్ ఎలా చేపడతారు? మైనింగ్ చేసుకోవాలనుకుంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతి కోరనేలేదు...'' అని కేంద్ర ఖనిజవనరులశాఖ అధికారి ఒకరు 'ఆన్‌లైన్'కు తెలిపారు.

బయ్యారం గనుల ప్రాంతాల్లో 30% జనావాసాలు ఉన్నందువల్ల అక్కడ రీసర్వే చేయాలని, అంతవరకూ కేంద్రం గతంలో ఇచ్చిన అనుమతులను పెండింగ్‌లో పెట్టాలంటూ జూలై 23న ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి ఓ లేఖ రాశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు బయ్యారం గనులపై విరుచుకుపడడంతో ముఖ్యమంత్రి ఈ లేఖ రాశారు.

అయితే రీసర్వే చేయడానికి వీలుకాదని, అసలు మైనింగ్‌కు అనుమతి ఇవ్వకుండానే అక్కడ మైనింగ్ ఎలా చేపడుతున్నారని ప్రశ్నించిన కేంద్రం... మొత్తం అనుమతులన్నింటినీ రద్దుచేసింది. బయ్యారంలో ఖనిజాల వెలికితీతకు కొత్త ప్రతిపాదనలను పంపాలని కూడా కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఖనిజ నిల్వల అంచనా, పరిశోధనకు కూడా అనుమతిని రద్దు చేసింది.
BAYYARAM
రిజర్వేషన్ నిర్ణయాన్ని పెండింగులో పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. ఏకంగా రిజర్వేషన్‌నే రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. దీంతో ఇటు ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి.. ఇటు రక్షణ స్టీల్స్‌కు కూడా పెద్ద షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఖనిజ నిల్వలను రక్షణ స్టీల్స్‌కు సరఫరా చేసేందుకు ఏపీఎండీసీ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం ఖనిజాల వెనక 'అల్లుడి గిల్లుడు' ఉందనే విషయాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి తెచ్చింది.

అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ అంశం రాజకీయ దుమారం రేపుతూనే ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే ప్రధాన చర్చనీయాంశం అయింది. గత కొంత కాలంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీలూ బయ్యారం గనుల లీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని విపక్షాలన్నీ బయ్యారం గనుల అక్రమాలపై ఉద్యమాలకు సన్నద్ధం అవుతున్న సమయంలో కేంద్రం ఈ లీజుల రద్దు నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదంతో రాష్ట్ర గనుల శాఖ ఖమ్మం జిల్లాలోని 1.40 లక్షల ఎకరాల ప్రాంతాన్ని ఏపీఎండీసీకి రిజర్వ్ చేస్తూ ఈ ఏడాది జూన్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవే నిల్వలను రక్షణ స్టీల్స్ నెలకొల్పే యూనిట్‌కు సరఫరా చేసేలా ఏపీఎండీసీతో జాయింట్‌వెంచర్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ గనుల శాఖ గత ఏడాది ఫిబ్రవరి 24 జీవో 69 జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం రక్షణ స్టీల్స్‌కు షాక్ లాంటిదే. ఏపీఎండీసీతో కుదిరిన ఒప్పందం కూడా రద్దయ్యేలా ఉండటంతో.. రక్షణ స్టీల్స్‌కు ఇనుప ఖనిజం సరఫరా చేసే పరిస్థితి లేదు. గిరిజన ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలుంటే... ఈ ప్రాంతంపై హక్కులను తొలుత వారికే ఇవ్వాలి.

లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దరఖాస్తు చేస్తే వాటికి ఆ ప్రాంతాన్ని కేంద్రం రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏపీఎండీసీ ఖమ్మం జిల్లాలోని బయ్యారం, నేలకొండపల్లి, గార్ల మండలాల్లో ఎంతమేర విస్తీర్ణంలో ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్నాయో నిర్థారించుకుని.. తిరిగి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం ఒక వేళ మళ్లీ ఏపీఎండీసీకే ఈ నిక్షేపాలు కేటాయించినా... వీటిని రక్షణ స్టీల్స్‌కు సరఫరా చేయాల్సిన అవసరం ఉండదని గనులశాఖ వర్గాలు చెబుతున్నాయి.

సీపీఐ హర్షం
బయ్యారం ఇనుప గనుల లీజును రద్దుచూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇకముందు ప్రభుత్వం గనులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వరాదని ఆయన కోరారు.

అధిష్ఠానంతో దోబూచులాడుతోన్న కడప ఎంపీ జగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జగన్‌ బావ బ్రదర్‌ అనిల్‌కుమార్‌ బినామీ సంస్థగా భావిస్తోన్న రక్షణ స్టీల్స్‌ నిర్వహిస్తోన్న బయ్యారం గనుల అనుమతులను రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా హటాత్‌ పరిణామాలు అధిష్ఠానం జగన్‌కు ఝలక్‌ ఇవ్వడంగానే స్పష్టమవుతోంది. మరికొద్దిరోజుల్లో ఓదార్పు యాత్రకు బయలుదేరుతున్న జగన్‌కు తాజా పరిణామాలు శరాఘాతంగానే కనిపిస్తోంది. ఇప్పటికే జగన్‌కు చెందిన వ్యాపార సంస్థలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇన్‌కంటాక్స్‌ సంస్థలు నోటీసులు జారీ చేశాయని ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. ఆయన బావకు చెందినదిగా భావిస్తోన్న బయ్యారం గనుల లీజును కూడా రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేయడం జగన్‌కు దెబ్బమీద దెబ్బగానే పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బయ్యారం ఇనుప ఖనిజ నిల్వల కేటాయింపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. బయ్యారం ప్రాంతం లో ఖనిజ నిల్వల అంచనా పరిశోధన అనుమతులను రద్దు చేసింది. ఖనిజ నిల్వలు, అంచనా, పరిశోధన అనుమతులు పెండింగ్‌లో పెట్టాలని రాష్ట్రం రాసిన లేఖను కేంద్రం తోసిపుచ్చింది. రక్షణ స్టీల్స్‌ ఖనిజాభివృద్ధి సంస్థ మధ్య జరిగిన ఖనిజం సరఫరా ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలని రోశయ్య ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరయిన బయ్యారం గనుల లీజుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అయినా వైఎస్‌ వాటిని లెక్కచేయకుండా లీజులను కొనసాగించారు.

అయితే.. వైఎస్‌ మృతి చెందిన తర్వాత బయ్యారం గనుల లీజుపై ప్రధాన పక్షమైన టీడీపీ, వామపక్షాలు పోరాటం ప్రారంభించాయి. వారికి తోడుగా.. వైఎస్‌ జగన్‌ ప్రత్యర్థి వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వాటి రద్దు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందు బయ్యారం గనులకు సంబంధించి ఖనిజ నిల్వలు, అంచనా, పరిశోధన అనుమతులను పెండింగ్‌లో ఉంచాలని కేంద్రానికి లేఖ రాసి, గనుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న సంకేతాలు పంపించారు. ఆ తర్వాత మిగిలిన వ్యవహారాలను అధిష్ఠానం, జగన్‌ వ్యతిరేక వర్గమే చూసుకుంది. చివరకు గనుల లీజు రద్దు చేయడంతో రోశయ్య, ప్రతిపక్షాలు, జగన్‌ ప్రత్యర్థుల వ్యూహం ఫలించినట్టయింది.

No comments:

Post a Comment