Wednesday, September 1, 2010

పార్టీలో జగన్ ఉండకపోవచ్చు - కాంగ్రెస్‌లో ఉంటేనే అతనికి మంచి భవిష్యత్తు

4 నెలల కిందటే నాకు సమాచారం
కాంగ్రెస్‌లో ఉంటేనే అతనికి మంచి భవిష్యత్తు
ప్రస్తుత పోరులో అధిష్ఠానమే గెలుస్తుంది
రాయలసీమ సింహం రాష్ట్రాన్ని తినేస్తుంది
అప్పటి పాలకులు వ్యూహాత్మక ఊబిలో దించేశారు
వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
వైఎస్ ఉన్నా పథకాల అమలు అసాధ్యం
అప్పుడు మాట్లాడకపోవడం తప్పే
నేదురుమల్లి, కోట్లలకు అన్యాయం చేశా   -   డీఎల్ రవీంద్రారెడ్డి
[కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ అనుంగు సహచరుడు డి.ఎల్. రవీంద్రారెడ్డి.]

మీరూ, వైఎస్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఉన్నతస్థాయికి చేరినా మీరెందుకు రాలేకపోయారు?
నేను అంత అగ్రెసివ్ పాలిటీషియన్‌ను కాదు. అధిష్ఠానంతో సంబంధాలు పెట్టుకుని త్వరగా ఎదిగిపోవాలన్న ఆలోచన లేదు. ఎప్పుడూ మంత్రి పదవి కూడా కోరలేదు.

నేదురుమల్లి సీఎం కావడానికి సహకరించారు. ఆయన దిగిపోవడానికీ కారకులయ్యారన్న అభిప్రాయం ఉంది.
అప్పట్లో జనార్దనరెడ్డి కూడా నా తర్వాత నువ్వే. ఎందుకు అసంతృప్తికి గురవుతావు. ప్రజల్లోకి వెళ్లు అన్నా రు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. అయితే, నాకు రాజశేఖరరెడ్డి స్నేహితుడు.

జనార్దనరెడ్డి, కోట్ల మంత్రివర్గాల్లో మీకు అవకాశం వచ్చినా.. మీ స్నేహితుడి కేబినెట్‌లో రాలేదు?
బహుశా నా విద్యుక్త ధర్మాన్ని నిర్వహించలేనని ఆయన అనుకున్నారేమో! సాధారణంగా ఏ సీఎంనూ నాకు పదవి కావాలని అడగను. 2004లో నా నియోజకవర్గ ప్రజలు చెబితే ఢిల్లీ వెళ్లాను. రామచంద్రరావుగారితో మాట్లాడా. మంత్రి పదవి కోసం నువ్వు కూడా ఇంత దూరం రావాలా? అన్నారు. అంతే. మళ్లీ ఎన్నడూ అడగలేదు.

నేదురుమల్లిని పదవి నుంచి తొలగించడానికి సహకరించడమే మీకు ప్రతిబంధకం కావచ్చు కదా!
అనుకోవచ్చు కూడా. కానీ మంచి స్నేహితుడి కోసం చేశా. జనార్దనరెడ్డిని రాజీనామా చేయమని చెప్పిన తర్వాత అందరం ఢిల్లీ వెళ్లాం. ద్రోణంరాజు సత్యనారాయణగారు పీవీగారి దగ్గర ఉండే పీవీఆర్‌కే ప్రసాద్‌తో కలిసి వెళ్లాం. రాజశేఖరరెడ్డి కోసం వచ్చాం అని చెప్పాం. సారీ, మేమేం చేయలేము. మరో ఇద్దరు రెడ్డిల మద్దతైనా తీసుకురండి అన్నారు. అంటే, జనార్దనరెడ్డి కానీ విజయభాస్కరరెడ్డి కానీ ఎవరో ఒకరితో చెప్పించుకోమని అన్నారు. ఇద్దరూ చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు వైఎస్ ఎంపీ. ఆయనకు అవకాశం లేదు. మనమెందుకు రవీంద్రను సీఎంగా ప్రపోజ్ చేయకూడదని ద్రోణంరాజు వైఎస్‌ను అడిగారు. వైఎస్ ఏం మాట్లాడలేదని ఆయన చెప్పారు.

పదవి దగ్గరకు వచ్చేసరికి మీ స్నేహాన్ని ఆయన గుర్తించలేదని అర్థమవుతోంది. మీరు మాత్రం.. మీకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు సీఎంలకూ అన్యాయం చేసినట్లే కదా!
ఆ బాధ నాకు ఉంది. నేను తప్పు చేశాను. జనార్దనరెడ్డి, కోట్లలను మోసం చేశానన్న భావన ఉంది. వైఎస్ నన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి ఇది కారణం అనుకోలేదు. తన తర్వాత తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నాడేమో అనుకున్నా.

ఇద్దరు సీఎంల విషయంలో పశ్చాత్తాపపడ్డారు. మీ స్నేహాన్ని వైఎస్ గుర్తించలేదని ఫీలయ్యారా? ఆయన పట్ల మీ దృక్పథం మారిందా?
మారలేదు. చనిపోయే వరకూ ఆయనతోనే ఉన్నాను.

ఆయన ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. దీనికి ప్రేరణ ఏమిటి?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ నిర్ణయాలు.. వీటి కారణంగా భవిష్యత్తులో రాబోయే భయంకర పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా, ఆయన చెబితే ప్రజా వ్యతిరేకం అని తెలిసినా ఈపీసీ కాంట్రాక్టు సిస్టమ్‌ను అసెంబ్లీలో సమర్థించాను. ప్రతి సందర్భంలోనూ వైఎస్ కోసం మీ క్రెడిబులిటీని ప ణంగా పెట్టారు. ప్రజలకు మీరు అన్యాయం చేసినట్లే కదా!

కొంతమేరకు అన్యాయం చేసినట్లే! ఇప్పుడు ఎందుకు వచ్చానంటే.. ఫ్రీ ఫర్ అల్ అయిపోయింది. 1978 నుంచి చూస్తే రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోయాయని ఓ వ్యక్తి ఇటీవల అంటే ఆరోజు నాకు నిద్ర పట్టలేదు. ఆయన నోటి నుంచి ఆ మాట రావడమా? అని! ఎవరాయన?
ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తే!

జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
కాంగ్రెస్‌లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. జనంలోకి పోవడం, చురుకుతనం, ఆర్థికంగా ఆయనకు ఎక్కడలేని వనరులు ఉన్నాయి.

ఎక్కడి నుంచి వచ్చాయి?
అధికారంలో ఉంటే వచ్చాయి.

బయటికి వెళితే భవిష్యత్తు లేనట్టేనా!
బయటికి వెళ్లే అవకాశం లేదని ఆయన అనుయాయులంతా చెబుతున్నారు. కానీ.. ఆయన పార్టీలో ఉండడు అని నాలుగు నెలల కిందటే నాకు ఉన్నత స్థాయిలో సమాచారం అందింది. తన తండ్రి కుర్చీని తనకు ఇవ్వలేదు. కనక కాంగ్రెస్ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదు కాబట్టి.. సొంత కుంపటిని పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు అని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉంటాడని నేను అనుకోవడం లేదు.

అధికారంలో ఉన్నాడు కనక డబ్బులు సంపాదించారు అని చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయనకు అర్హత ఎలా వస్తుంది?
రాజకీయాల్లో నైతిక విలువలు పోయాయని ఆయన అనడమే అనైతికం. దానిని విశ్లేషించి లోతుల్లోకి వెళితే అసహ్యంగా ఉంటుంది. అయితే, ఐదేళ్లో.. పదేళ్లో.. 15 ఏళ్లకో ఆయన లక్ష్యం చేరవచ్చు.

దానివల్ల మీరు సమాజానికి ఏం చెబుతున్నట్టు. ఐదేళ్లు దుమ్ము దుమ్ముగా దంచి.. తర్వాత ఐదేళ్లు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ రావచ్చనే కదా!
మన ప్రజాస్వామ్యం, వ్యవస్థలోనే లోటుపాట్లున్నా యి. పూర్తి నిజాయితీ కలిగిన సీఎం కూడా ప్రస్తుత వ్యవస్థ నుంచి ఎంతో కొంత సొమ్ము చేసుకోవచ్చు. ఇప్పు డు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఏపీఐఐసీ.. గనులు.. జలయజ్ఞం.. ఏదైనా మనం ఏమైనా చేయొచ్చ నే భావన వచ్చే పరిస్థితి కల్పించాం. దీనిపై అప్పట్లోనే మీడియాతో గొంతు కలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2004లో వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని మీడియా పిలుపు ఇచ్చినప్పుడు స్పందించకపోవడం నిజంగా నా తప్పే. అదే నా జీవిత కాలంలో అతి పెద్ద తప్పు. అప్పుడు నియంత్రించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఇప్పటికైనా మీ పార్టీ అధిష్ఠానం దీనిని గుర్తించిందా?
గుర్తించింది.

ఏం చేయబోతున్నారు?
వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడానికి కారకులైన వ్యక్తులపై విచారణ ఉంటుందని నమ్ముతున్నాను.

మీరు, జేసీ రాయలసీమ సింహాలు కాదు.. రాయలసీమ నక్కలు అని అంబటి రాంబాబు తదితరులు విమర్శించారు...?
రాయలసీమ సింహం రాష్ట్రం మొత్తాన్ని తినేసింది. ఆ చెప్పిన వ్యక్తి ఈ సింహానికి కాపలా కుక్క. ప్రస్తుతం వాళ్ల రాజకీయ ఉన్నత శిఖరాలకు మేం అడ్డుపడుతున్నామేమోనని ఆ విశ్వాసం గల కుక్కలు అనుకుంటున్నాయి.

జగన్ విషయంలో మీ అంచనా?
చెప్పలేం. ఆయన అదృష్టం ఎలా ఉందో. జగన్‌పై సానుభూతి కొంతకాలం ఉన్నా తర్వాత ఉండదు. వైఎస్ ఉన్నా ఆయన పథకాలను ఆయనే అమలు చేయడం అసాధ్యం.

ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అధిష్ఠానం గెలుస్తుందా? జగన్ గెలుస్తాడా?
ఎప్పుడూ అధిష్ఠానమే గెలుస్తుంది.

No comments:

Post a Comment