Tuesday, August 31, 2010

మారని రూటు.. తప్పని వేటు! జగన్‌పై చర్యలకు లైన్‌క్లియర్ ఆఖరి అవకాశమూ మిస్

ఓదార్పుపై పాత వైఖరినే మళ్లీ చెప్పిన కడప ఎంపీ
అధిష్ఠానానికి సుద్దులు
పార్టీయే తన వెంట నడవాలని సలహా
మారాల్సింది తాను కాదనే సంకేతాలు
యువనేత ప్రకటనతో విస్తుపోయిన నేతలు
యాత్రకు వెళితే చర్యలు తథ్యం
స్పష్టమైన అవగాహనతో అధిష్ఠానం
'నా దారి రహదారి. నేను చేసిందే ఓదార్పు' ఇదీ కడప ఎంపీ వైఎస్ జగన్ వైఖరి! పార్టీయే తన బాటలో నడవాలన్నది ఆయన ఆకాంక్ష. 'అధిష్ఠానం ఓదార్పు'పై జగన్ ప్రతిస్పందనలోని అంతరార్థం ఇదే! దీంతో ఆయనపై చర్యలకు 'లైన్ క్లియర్' అయినట్లే! 'సెప్టెంబర్ 3'న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభంతో ఇతర రాజకీయ పరిణామాలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ తరఫున ఓదార్చి, ఆర్థిక సహాయం అందించాలని అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఒకరకంగా జగన్‌కు 'ఆఖరి అవకాశం' అని అధిష్ఠానం నేతలు పేర్కొంటున్నారు. జగన్ ఇకనైనా తన సొంత యాత్రను మానుకొంటారని, పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని కొందరు ఆకాంక్షించారు. అయితే... వీరిది మరీ అత్యాశ అని జగన్ స్పందనతో తేలిపోయింది.

జగన్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో 'సోనియా గాంధీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు' అనే ఒక్క వ్యాక్యాన్ని మినహాయిస్తే... మిగిలినదంతా సూచనలు, సలహాలకే సరిపోయింది. తాను చేస్తున్నదే అసలైన ఓదార్పు అని, అధిష్ఠానం కూడా అదే బాటలో ప్రయాణించాలని జగన్ తన ప్రకటన ద్వారా తేటతెల్లం చేసినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ప్రకటనలోని అంశాలు చూసి వారు విస్తుపోయారు. 'ఓదార్పు అంటే కేవలం డబ్బులివ్వడం కాదు.

కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి పలకరించి, కన్నీళ్లు తుడవడం ముఖ్యం'' అంటూ జగన్ తన పాత వైఖరినే పునరుద్ఘాటించారు. మరోమారు 'మన సంప్రదాయాన్ని' గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు వెళ్లేముందు బహిరంగ లేఖ ద్వారా ప్రకటించిన వైఖరినే... ఇప్పుడూ పునరుద్ఘాటించారు. అంతటితో ఊరుకోకుండా... పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు తనతోపాటు వచ్చి బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరుచుకుంటే బాగుంటుందని అధిష్ఠానానికి సూచించారు. వెరసి... పార్టీ యంత్రాంగం సమస్తం తన వెంటే నడవాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.

ఓదార్పు విషయంలో తాను చాలా 'క్లారిటీ'తో ఉన్నానని .. మారాల్సింది అధిష్ఠానమేనని జగన్ మరోమారు వెల్లడించారని చెబుతున్నారు. ఓదార్పుపై జగన్, అధిష్ఠానం బాటలు వేరని... అవి కలిసే అవకాశం ఎంతమాత్రం లేదని తాజా పరిణామాలతో స్పష్టమైంది. యాత్రపై వెనక్కి తగ్గేదిలేదని జగన్ స్పష్టం చేయడంతో ఆయనపై చర్యలకు మార్గం సుగమం అయినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. "జగన్ దిగివచ్చేందుకు ఆఖరు అవకాశం కల్పించాం. దురదృష్టవశాత్తు ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నట్లు లేదు'' అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ తనను కలిసిన కొందరు నేతలకు చెప్పినట్లు తెలిసింది.

"గత వారం జగన్ నన్ను కలిసినప్పుడు తగిన సలహా ఇచ్చాను. ఆయన వినేలా కనిపించలేదు. 3న జగన్ ఓదార్పు యాత్రకు బయలు దేరితే ఏం చే యాలనే దానిపై అధిష్ఠానానికి స్పష్టమైన అవగాహన ఉంది'' అని మొయిలీ పేర్కొనట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ విప్‌లు శైలజానాథ్, భట్టి విక్రమార్క, కొండ్రు మురళితో పాటు కొందరు ఎంపీలు మొయిలీని మంగళవారం కలుసుకున్నారు.

వైఎస్ మృతి వార్త విని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ. లక్ష చొప్పున సహాయం చేయాలని తీసుకున్న నిర్ణయంపై వీరంతా హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక పార్టీలోని అత్యధికులు జగన్ వాదనతో ఏకీభవించే అవకాశాలు లేవని వారు చెప్పినట్లు సమాచారం. 2వ తేదీన ఇడుపులపాయలో జరిగే వైఎస్ వర్ధంతికి మొయిలీ హాజరవుతారు. పార్టీ తరఫున వైఎస్‌కు నివాళులర్పిస్తారు.

ముందే సంకేతాలు..
అధిష్ఠానం ఓదార్పు పట్ల జగన్ సంతృప్తి చెందే అవకాశంలేదని ముందే సంకేతాలు వెలువడ్డాయి. ఆత్మహత్య చేసుకున్న వారినే కాదు, దిగ్భ్రాంతి చెంది అసువులు బాసిన వారిని కూడా ఓదార్చి సహాయం చేయాలని, వారి వద్దకే స్వయంగా వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు ఆయనకు సన్నిహితుడైన ఎంపీ సబ్బం హరి మంగళవారం మధ్యాహ్నమే ఎంపీల వద్ద వాదించారు. ఏఐసీసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని లోపాలను ఎత్తి చూపారు.

అక్షరాల వెనుక అంతరంగం...
అధిష్ఠానం ప్రకటనకు స్పందనగా జగన్ విడుదల చేసిన లేఖను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఈ యాత్రలో తనతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్లవుతుందని చెప్పడం ద్వారా... ప్రస్తుతం పార్టీ నిర్జీవంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పేర్కొంటున్నారు.

పార్టీ తన వెంట నడవాలనడం ద్వారా... అధిష్ఠానానికి జగన్ నడిపిస్తున్నారో, జగన్‌ను అధిష్ఠానం ఆదేశిస్తోందో తెలియని పరిస్థితి నెలకొందని కొందరు నేతలు అంటున్నారు. "ఏది ఏమైనా ఒక విషయం మాత్రం చాలా స్పష్టం. జగన్ విషయంలో అధిష్ఠానం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. ఇదే సమయంలో జగన్ కూడా తన భవిష్యత్ కార్యాచరణ విషయంలో ఇంకా స్పష్టంగా ఉన్నారు. వీరి వైఖరులు మరి రెండు మూడు రోజుల్లో బహిర్గతమవుతాయి. మా దారి తేల్చుకోవడం సులభమవుతుంది'' అని పలువురు నేతలు, ఎంపీలు అంటున్నారు.

No comments:

Post a Comment