Tuesday, August 31, 2010

డబ్బులివ్వడమే ఓదార్పు కాదు! ఇంటికెళ్లి కన్నీళ్లు తుడవాలి

అదే మన సంప్రదాయం
పలకరించడం నా ధర్మం
ఎంపీలు, ఎమ్మెల్యేలూ వస్తే పరిపూర్ణత
అదే వైఎస్‌కు నిజమైన నివాళి
గుండెపోటుతో చనిపోయిన వారికీ వర్తింపజేయాలి
అధిష్ఠానం సాయంపై జగన్ పత్రికా ప్రకటన
సోనియాకు ధన్యవాదాలు
'పార్టీ ఓదార్పు'పై కడప ఎంపీ జగన్ తనదైన శైలిలో స్పందించారు. తన సొంత యాత్రపై పాత వైఖరినే ప్రదర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ధ న్యవాదాలు చెబుతూనే... ఓదా ర్పు అంటే ఆర్థిక సహాయం చేయ డం మాత్రమే కాదన్నారు. ఓదార్పులో అది ఒక భాగం మాత్రమే అని గుర్తు చేశారు. పైగా... కషా ్టల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి, కన్నీళ్లు తుడవడం మన సంప్రదాయమని పునరుద్ఘాటించారు.

అధిష్ఠానం ఆర్థిక సహాయాన్ని ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు మాత్రమే పరిమితం చేయకుండా... షాక్‌తో, గుండెపోటుకు గురై మరణించిన వారి కుటుంబాలకూ అందించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఆర్థిక సహాయానికి, తాను చేస్తున్న ఓదార్పు యాత్రకూ సంబంధం లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు... తన యాత్రలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొంటే పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపినట్లవుతుందని తెలిపారు.

మొత్తానికి... తాను బెట్టు వీడేది లేదని, అధిష్ఠానమే మరో మెట్టు దిగాలనే భావాన్ని వ్యక్తం చేశారు. ఏదిఏమైనా... పార్టీ అధినాయకత్వమే బాధిత కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయించుకోవడంవల్ల ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించినట్లయిందని జగన్ అభివర్ణించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలలో పర్యటిస్తున్న జగన్ మంగళవారం అక్కడి నుంచే ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీని పూర్తి పాఠమిది...

"దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను కుటుంబంతో పర్యటనలో ఉన్నందువల్ల పత్రికల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఏఐసీసీ నాయకత్వం నుంచి వెలువడిన ఈ ప్రకటన రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకూ, వైఎస్ అభిమానులకూ ఎంతో ఊరటనిచ్చింది.

సరిగ్గా ఏడాది కిందట దురదృష్టకర సంఘటనలో మహానేత వైఎస్ చనిపోవడం రాష్ట్ర ప్రజలను తీరని వేదనకు గురిచేసింది. ఆ వార్తను తట్టుకోలేక వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెందరో టీవీల్లో వార్తలు చూస్తూ షాక్‌తో, వేదనతో గుండెపోటుకు గురై అసువులు బాశారు. వీళ్లందరూ కాంగ్రెస్ అభిమానులే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన వారే. ఏఐసీసీ ప్రకటించిన సాయం వీరందరికీ వర్తింప చేసి ఉంటే మరింత బాగుండేది.

నా తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన ఆత్మ బంధువుల కుటుంబాలను వారింటికి వెళ్లి పలకరించడం, ఆదుకోవడం మహానేత కుమారునిగా నా కనీస ధర్మంగా భావించాను. గత ఏడాది సెప్టెంబర్ 25న నల్లకాల్వ వద్ద జరిగిన వైఎస్ సంస్మరణ సభలో ఇదే విషయాన్ని ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే.

నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఓదార్పు అంటే కేవలం బాధిత కుటుంబాల వారికి ఆర్థిక సాయం చేయడం ఒక్కటే కాదు. ఆర్థిక సాయం ఓదార్పులో ఒక అంశం మాత్రమే. కష్టాల్లో ఉన్నవారి ఇంటికి వెళ్లి వారిని పలకరించడం, కన్నీళ్లు తుడవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం, వారికి ఓ భరోసా ఇవ్వడం ముఖ్యం. అదే మన సంప్రదాయం కూడా. ఈ సంప్రదాయాన్ని అనుసరించే నేను ఓదార్పు యాత్రను ప్రారంభించాను.

మధ్యలో కొందరు ఈ పవిత్ర కార్యక్రమాన్ని అవహేళన చేయడమే కాదు, ఈ మరణాలన్నీ అవాస్తవమని వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధినాయకత్వం బాధిత కుటుంబాలకు సాయం అందించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించినట్లయింది.

పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా పాలుపంచుకుంటే .. బాధితుల దగ్గరికి నాతో పాటు వచ్చి బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరచుకుంటే, వారి సమస్యలు తెలుసుకుంటే, ఆ కుటుంబాలకు ఇంకా మంచి చేయగలుగుతాం. అందువల్ల ఈ మొత్తం కార్యక్రమానికి పరిపూర్ణత చేకూరుతుంది. దివంగత నేతకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది. తద్వారా పార్టీ శ్రేణులలో నూతనోత్తేజం నింపినట్లవుతుంది'.

No comments:

Post a Comment