
సోమవారం సాయంత్రం సోనియా తన నివాసంలో డిఎస్‌తో అరగంటకు పైగా భేటి అయ్యారు. డిఎస్‌ను కలువడానికి ముందే ఆమె రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్ ఎం.వీరప్ప మొయిలీని తన నివాసానికి రప్పించి ఆంధ్ర కాంగ్రెస్ వ్యవహరాలపై సమాచారాన్ని తెలుసుకున్నారు. సోనియాతో భేటి ముగిసిన తరువాత డీఎస్ నేరుగా వీరప్ప మొయిలీ ఇంటికి వెళ్ళి ఆయనతో కూడా ముప్పావు గంట సేపు సమావేశమయ్యారు.
ఈ ఇద్దరు నేతలతో డీఎస్ సమావేశమైనప్పుడు చెప్పింది ఒక్కటే, రాష్ట్రంలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే వెంటనే చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. అధినేత్రితో సమావేశంసందర్భంగా డీఎస్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జగన్ ఓదార్పు యాత్ర, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, తన రాజకీయ భవిష్యత్తు వంటి ఆంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై సోనియా ఆరా తీసినప్పుడు డీఎస్ అన్ని వ్యవహారాలను ఆమెకు పూసగుచ్చినట్లు వివరించారు.
జగన్ ఓదార్పు పై సోనియా అడిగినప్పుడు అతను చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, పార్టీ నేతలను, హైకమాండ్‌ను ఎవర్ని కూడా ఖాతరు చేయడం లేదనీ జగన్‌కు మద్దతుగా అతని శిబిరం నేతలు పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నదని, జగన్ వ్యవహరంలో సీరియస్‌గా వ్యవహరించక పోతే పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని సోనియాకు డీఎస్ వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కొంత వరకు జగన్‌కు జనాకర్షణ ఉండటంతో అతనిపై నేరుగా చర్యలు తీసుకుంటే పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని, అందుకే జగన్‌పై చర్యలు తీసుకోవడానికి ముందు అతనికి అత్యంత విధేయులుగా ఉంటూ, పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్న కొండా సురేఖ, అంబటి రాంబాబు లాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన మేడంకు విన్నవించినట్లు తెలిసింది. అంతే కాకుండా పీసీసీ స్క్రీనింగ్, విచారణ కమిటీ వీరిపై సమర్పించిన నివేదికను సైతం డీఎస్‌సోనియాకు అందజేసినట్లు సమాచారం.
అలాగే ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని మీరు పార్టీ నేతల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ కొందరు నాయకులు వాటిని ఖాతరు చేయడం లేదని, సీఎం చెప్పినా వినకుండా ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని చెప్పిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పటికే జగన్ యాత్రలో పాల్గొన్న మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మరి కొందరు ఎమ్మెల్యేల వైఖరిపై కూడా డీఎస్ అధినేత్రికి నివేదిక సమర్పించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
జగన్‌కు వీర విధేయులుగా ఉన్న నేతలపై తొలుత వేటు వేయడం ద్వారా ఓదార్పు విషయంలో జగన్ ఏ మేరకు నిలబడతాడో బయటికి వస్తుందని డీఎస్‌చెప్పినట్లు సమాచారం. అలా కాకుండా జగన్ వ్యవహరాన్ని చూసి చూడనట్లు ఉంటే అతని శిబిరం మరింత రెచ్చిపోయి పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉందని, మరో వైపు రాష్ట్రంలో రోశయ్య సర్కార్‌కు కూడా ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల వస్తాయని, ఆ పరిస్థితి రాక ముందే మనం పార్టీకి చికిత్స మొదలుపెడితే మంచిదని డీఎస్‌సోనియాకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
‘ఉప’ విశ్లేషణ
తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలపై కూడా సోనియాకు డీఎస్‌ఒక నివేదిక అందజేశారు. తెలంగాణలో బలంగా ఉన్న సెంటిమెంట్, ఉప ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణపై పార్టీ తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని డీఎస్ ఇక్కడి వాస్తవ పరిస్థితులను అధినేత్రికి విన్నవించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తెలంగాణ ఏర్పాటు దిశగా తొందరగా అడుగులు వేయక పోతే రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని, 2014 ఎన్నికల నాటికి ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని ఆయన సోనియాకు ఒక నివేదిక రూపంలో నివేదించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఉప ఎన్నికల్లో పార్టీ పరాజయానికి దారి తీసిన పరిస్థితులు, కొంత మంది పార్టీ నేతలు ఎన్నికల విషయంలో వ్యవహరించిన తీరును కూడా డీఎస్ మేడమ్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను పీసీసీ చీఫ్, సోనియాకు సవివరంగా వివరించినట్లు తెలిసింది.
ఏఐసీసీ పదవికి అభ్యర్ధన
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితితో పాటు తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా డీఎస్‌సోనియా వద్ద చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే రెండు మార్లు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తనకు ఇక జాతీయ రాజకీయాల్లో చోటు కల్పించాలని, పార్టీలో ఏదైనా కీలక పదవి అప్పగించి తనను పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని డిఎస్, సోనియాకు వేడుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
పార్టీ సంస్థాగత ఎన్నికలు, మరో రెండు నెలల్లో జరగనున్న పీసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలకు అర్హులైన నేతల విషయంలో, వచ్చే నెలలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికలు వంటి ఆంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు వెలుబడిన తరువాత గతంలో ఒక సారి డీఎస్ ఢిల్లీ వెళ్ళినప్పటికీ సోనియా అందుబాటులో లేని కారణంగా ఆయన ఆమెను కలువలేక పోయారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ తదితరులతో మాత్రమే ఆయన కలిసి వెనుతిరిగారు. తాజాగా అధినేత్రితో అపాయింట్‌మెంట్ లభించడంతో డీఎస్‌ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆమెకు నివేదిక అందజేశారు.
పార్టీ పరిస్థితులపై చర్చించాం : డీఎస్
రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై సోనియాతో చర్చించినట్లు పీసీసీ చీఫ్ డీఎస్‌వెల్లడించారు. సోమవారం సాయంత్రం మేడమ్‌తో భేటి అనంతరం బయటికి వచ్చిన డీఎస్‌మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అధినేత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. సంస్థాగత ఎన్నికల వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని ఆయన చెప్పారు. ఇంకా పార్టీ విషయాలు చాలా చర్చించుకున్నామని, అవన్ని మీడియాకు చెప్పడం భావ్యం కాదన్నారు. జగన్ ఓదార్పు యాత్ర పై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.
No comments:
Post a Comment