Saturday, August 21, 2010

సందట్లో సీఎంలు

cms
రాష్ట్ర కాంగ్రెస్‌లో శరవేగంగా మారుతున్న రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు కొందరు సీనియర్‌ నాయకులు ఎవరి మార్గాల్లో వారు కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మద్దతుదారులుగానే ఉంటూనే.. మరోవైపు సొంత వ్యూహాలకు తెరలేపి, రోశయ్య పీఠానికే ఎసరు తీసుకువస్తున్న వైచిత్రి కాంగ్రెస్‌లో చర్చనీయాంశ మయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు, ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు ఖాయమన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్‌ సీని యర్లు ఆ మేరకు ఇప్పటినుంచే తమ భవితవ్యాన్ని తీర్చిదిద్దుకు నేందుకు రంగంలోకి దిగారు. ఢిల్లీ వేదికగా పావులు కదుపుతు న్నారు. నాయకత్వానికి దగ్గరయేందుకు పోటీలు పడుతున్నారు. నివేదికల పేరిట హడావుడి చేస్తున్నారు. జగన్‌ జెండా పీకితే.. రాజకీయ స్థిరత్వం కోసం నాయకత్వం చేసే మార్పుల సమయంలో తామే ప్రత్యామ్నాయంగా కనిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులో మునిగిపోయారు. చిత్రంగా.. వీరంతా రోశయ్యతో నిరంతరం మాట్లాడుతూనే ఆయన పీఠానికే ఎసరు తెచ్చే ప్రయత్నాలు చేయడమే విశేషం.

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, పురంధేశ్వరి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి జానారెడ్డి వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ఆ మేరకు పరోక్ష రాజకీయాలకు తెరలేపారు. వీరంతా కడప ఎంపి జగన్‌ పార్టీ నుంచి వైదొలగే ముహుర్తం కోసమే ఆశగా ఎదురుచూస్తున్నట్లు వారి వ్యవహారశైలి, ఎత్తుగడ స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ ను పార్టీ నుంచి బయటకు పంపితే తప్ప, తమ కలలు సాకారం కావన్న స్థితప్రజ్ఞతతో ఆ మేరకు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు.

సందట్లో సడేమియాల మాదిరిగా, రాష్ట్ర కాంగ్రెస్‌లో ‘సందట్లో సీఎం’ల కోసం పోటీ కనిపిస్తోంది. ఈ వరసలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు సాయంతో వేసిన ఎత్తుగడ ఒకరోజు వరకూ ఫలించినా, ఆ తర్వాత మాత్రం అందరి విమర్శలకు గురయింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను సొంత ఖర్చుతో ఢిల్లీకి తీసుకువెళ్లి, జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. అదే సమయంలో ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వెళ్లినప్పటి నుంచి, బయటకు వచ్చే వరకూ జరిగిన అన్ని వ్యవహారాలనూ మీడియాకు లీక్‌ చేసిన వైనం ఆయన తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలకే ఆగ్రహం తెప్పించింది.
రాష్ట్ర నాయకత్వంలో మార్పులు సంభవిస్తే ఎన్టీఆర్‌ కుటుంబ కార్డును అడ్డుపెట్టుకుని పురంధేశ్వరిని సీఎంను చేయాలన్నది దగ్గుబాటి అసలు వ్యూహమంటున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి సీఎంను చేస్తే టీడీపీ కూడా దెబ్బతింటుందన్న లెక్కలతో దగ్గుబాటి ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. కేంద్రమంత్రిగా ఆమె సంపాదించిన పేరు, ప్రధాని-సోనియా వద్ద ఉన్న గుర్తింపును ఇందుకోసం వినియోగించుకోవాలన్నది మరో ఎత్తుగడ. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇంతవరకూ ఎప్పుడూ పార్టీ కార్యకలాపాల్లో కనిపించని దగ్గుబాటి కుటుంబం, హటాత్తుగా జగన్‌ ఎపిసోడ్‌లోనే రంగ ప్రవేశం చేయడం దింపుడుకళ్లెం ఆశతోనేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అయితే, రాజకీయాల్లో కావలసిన గుండె ధైర్యం, సాహసం, మొండితనం, తెగువ, ఆర్థిక వనరులు, అనుచరులకు భరోసా ఇచ్చే అంశాల్లో దగ్గుబాటి కుటుంబం రాణించడం కష్టమని, గిరిగీసుకుని ఉన్నందుకే దగ్గుబాటి టీడీపీలో రాణించలే పోయారంటున్నారు. పైగా రాష్ట్ర స్థాయిలో ఆ కుటుంబానికి ఏ ప్రాంతం నుంచీ కనీస స్థాయిలో మద్దతులేదంటున్నారు.

పురంధేశ్వరికి సొంత సామాజిక వర్గానికి చెందిన మీడియా కల్పిస్తున్న ‘మేధావి ప్రచారాన్ని’ సీఎం పదవి కోసం సద్విని యోగం చేసుకోవాలన్నది దగ్గుబాటి ప్రధాన లక్ష్యమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దానికోసమే ఆమె తన జిల్లా పరిధిలోని అంశం కాకపోయినా జగన్‌ వ్యవహారంలో తలదూర్చి, తనకు తాను ప్రత్యామ్నాయ నేతగా అధినేత్రి దృష్టిలో పడే ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. దగ్గుబాటి కుటుంబానికి కమ్మ వర్గంలోనే తగిన మద్దతు లేదంటున్నారు.

ఇక రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే... ‘పొరపాటున కూడా’ తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతు పావులు కదుపుతున్న కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కూడా సీఎం పీఠంపై కన్నేశారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కోటాలో సీఎం పీఠం కోసం పావులు కదుపుతున్న ఆయన, పైకి మాత్రం తన శిష్యుడయిన జానారెడ్డిని వ్యూహాత్మ కంగా తెరపైకి తీసుకువస్తున్నారని చెబుతున్నారు.

వివాదరహితుడిగా ఉన్న పేరును వినియోగించుకుని, తెలంగాణపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. సీఎం పదవి ఆ ప్రాంతానికి ఇచ్చి సంతృప్తి పరిచే వైఖరి అవలంబిస్తే అప్పుడు తానే ప్రత్యామ్నాయంగా కనిపించాలన్నది జైపాల్‌రెడ్డి వ్యూహమంటున్నారు. నిజానికి, జైపాల్‌ నేరుగా తెరపైకి రాకపోయినా చాలాకాలం నుంచి తెలంగాణ అంశానికి సంబంధించి శర వేగంగా పావులు కదుపుతున్నారు. ఎంపీలు, సీనియర్‌ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. తెలంగాణలో వైఎస్‌ వర్గాన్ని అణచివేసేందుకు జరుగుతున్న వ్యూహంలో ఆయనే ప్రధాన సూత్రధారని వైఎస్‌ వర్గీయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
సీనియర్‌ నేత జానారెడ్డి కూడా తన స్ధాయిలో తెలంగాణ కోటా నుంచి సీఎం పీఠంపై ఆశలు పెంచుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీని పుట్టించి అందరికన్నా ముందే ఉద్యమానికి పెద్దరికం వహించి, ఆ తర్వాత కనుమరుగయిన జానారెడ్డి మళ్లీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో హడావుడి చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తెలంగాణ నుంచి నాయకత్వ పాత్ర పోషిస్తున్న జానారెడ్డి సీఎం పీఠంపై కన్నేశారు. ఇప్పటికే అనేక కీలకశాఖల్లో పనిచేసినందున అనుభవం ప్రాతిపదికన తానే ఆ పదవికి అర్హుడనన్న విశ్వాసంతో ఉన్నారు.

ఉత్తరాంధ్ర కోటా తో పాటు, తెలంగాణ వాదుల మద్దతుతో సీఎం పీఠంపై కన్నేసిన మంత్రి బొత్స సత్యనారాయణ సొంత ప్రయత్నాలు చేసుకుం టున్నారు. అందుకోసం ఆయన వ్యూహాత్మకంగా లౌక్య రాజకీయాలు అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక-సమైక్య వాద ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో అటు తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా సత్తిబాబు ఇప్పటి నుంచే లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌, తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అందుకే ఆయన సీమాంధ్ర మంత్రుల భేటీకి సైతం వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు.

ఇటు తెలంగాణ-అటు ఆంధ్ర నేతల మద్దతు కూడగట్టుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నేతను తానేనన్న సంకేతాలివ్వడమే బొత్స లక్ష్యమంటున్నారు. అయితే, ఆయనకు కోస్తాలోనే మద్దతు తగినంత లేదంటున్నారు. ఒకవైపు రోశయ్యకు గట్టి మద్దతుదారుగా ఉంటూనే, సమయం వస్తే సీఎం పీఠం ఎక్కేద్దామన్న ఆశలపల్లకీలో ఉన్నారు.

No comments:

Post a Comment