Tuesday, July 12, 2011

మన్మోహన్‌ మంత్రివర్గానికి ... ‘' కొత్త '’ కళ

PM--Prez---Ministers
మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గానికి ‘కొత్త’ కళ వచ్చింది. మంగళ వారం జరిపిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఎనిమిది మంది కొత్తగా మంత్రులయ్యారు. వారిలో కళాకారులు, కళలపట్ల అభిరుచి ఉన్నవారు ఉన్నా రు. వీణ వాయించడం నుంచి విమానం నడపడం వరకు విభిన్న అభిరుచులు వారివి. కొత్త మంత్రుల్లో వి. కిశోర్‌చంద్రదేవ్‌ వంటి వయోధికులూ ఉన్నారు. మిలింద్‌ దేవర వంటి పిన్నవయస్కులూ ఉన్నారు. మరో విశేషమేమంటే కొత్త మంత్రులందరూ పట్టభద్రులే. వారందరిలోకీ అత్యున్నత విద్యావంతుడు సహాయమంత్రిగా నియమితులైన చరణ్‌దాస్‌ మహంత్‌. ఆయనకు ఎంఎస్‌సి, ఎంఏ, ఎల్‌ఎల్‌బి, పిహెచ్‌డి డిగ్రీలున్నాయి.

అభిరుచికల మంత్రులు
తాజాగా మంత్రులైనవారిలో కళాకారులున్నారు. మహంత్‌కు సంగీతం, చర్చలు, విహారయాత్రలు, కుటుంబంతో గడపడం అంటే ఇష్టం. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు జయంతి నటరాజన్‌కు కేబినెట్‌లో స్థానం లభించింది. ఆమె వైణికురాలు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా రు. మన్మోహన్‌సింగ్‌కు ఆమె అభిరుచి తెలుసో తెలీదో కానీ జయంతి నటరాజ న్‌కు పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చారు. పర్యావరణం అంటే ప్రాణమిచ్చే జయంతి నటరాజన్‌కు తత్వశాస్త్రం, కవిత్వం, హాస్యానికి సంబంధించిన పుస్త కాలు చదవవడం హాబీ. పుస్తకాలను ఆమె ప్రేమిస్తారు. ఔత్సాహికుల నాటకాలన్నా ఇష్టమే.

అందరూ సంగీత ప్రేమికులే
కొత్త మంత్రుల్లో దాదాపు అందరూ సంగీత ప్రేమికులే. ఇప్పటి మంత్రుల్లో యువకుడైన మిలింద్‌ దేవరకు పాశ్చాత్య సంగీతమంటే అభినివేశముంది. ఆయన జాజ్‌ గిటార్‌ వాయిస్తారు. ఇకపై పార్లమెంటు సభ్యులు ఆయన జాజ్‌ను వినవచ్చు. భారతీయ శాస్ర్తీయ సంగీతం నుంచి ప్రారంభిస్తే ఆయన అభిరుచు లు అనంతం. ఆత్మకథల్ని చదవడం ఆయనకు ఇష్టం. సరే! వీరి సంగతి ఇలా ఉంటే, తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ తీరే వేరు. ఆయన పార్లమెంటునే కళావేదికగా మార్చగలరు. 1998లో విశ్వకవి రవీంద్ర నాథ్‌ ఠాగోర్‌ జయంతి సందర్భంగా బందోపాధ్యాయ రవీంద్ర సంగీతాన్ని మృదుమధురంగా ఆలపించారు.

mILIND-dEWARA 

ఇక 64 ఏళ్ల కిశోర్‌చంద్ర దేవ్‌ విషయానికి వస్తే ఆయన పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. వంటచేయడం, జ్యోతి శ్శాస్త్రం దగ్గర్నుంచి సంగీతం వరకూ ఆయన అందె వేసిన చెయి. కొత్త అష్ట దిగ్గజాల్లో ఆయ నొక్కరే రచయిత. ఆయనకు ఈత, రైఫిల్‌ షూ టింగ్‌, బిలియర్డ్స్‌, చదరంగం, టెన్సిస్‌, క్రికెట్‌ కూడా వచ్చు. దేవ్‌కు 31 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి కేంద్రమంత్రివర్గంలో స్థానం లభించింది. మొదటిసారి ఆయన 1979లో కేంద్రంలో మంత్రి అయ్యారు. 40 ఏళ్ల జితేం ద్రసింగ్‌ గురితప్పకుండా కాల్చడంలో దిట్ట. క్రీడల్లో ఆయనకు జాతీయస్థాయి పతకం కూడా లభించింది. బీకాం పట్టభద్రుడైన జితేంద్రసింగ్‌కు మోటార్‌ మెకానిక్స్‌, విమానాలు నడపడం, ఫోటోగ్రఫీ, హిమాలయాల ఆరోహణ అంటే ఇష్టం. కోల్‌కతాలో గంగానది ప్రక్షాళన, పునరుద్ధరణ గురించి తను ఆలోచిస్తున్నానని 59 ఏళ్ల బందోపాధ్యాయ చెప్పారు.

ఆయన తన తీరిక సమయాన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు చదవడం లోను, పెంపుడు పక్షులతోనూ గడుపుతారు.మహంత్‌కు కబీర్‌ కవిత్వం అంటే ఎనలేని మక్కువ. కవిసమ్మేళనాలు నిర్వహించారు. పెయింటింగ్‌, చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజనుల అభి వృద్ధికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేశారు. జానపద కళలు, నాటకం, గీతాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు. 61 ఏళ్ల పవన్‌సింగ్‌ ఘటోవార్‌ విద్య, సంస్కృతి, సాంఘిక సంక్షేమ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. లా గ్రాడ్యుయేట్‌ రాజీవ్‌ శుక్లా (52) జర్నలిజం నుంచి వచ్చారు.

తెలుగువాడు ఒక్కడే...
సుదీర్ఘ కసరత్తు తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌ను విస్తరించారు. మన రాష్ట్రానికి ఈసారీ దక్కింది నామమాత్రమే. కిషోర్‌కు చోటు ఇచ్చి సాయిప్రతాప్‌ను సాగనంపడంతో కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగుతున్నది. కాకపోతే కిషోర్‌కు కేబినెట్‌ హోదా ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రభావం కేబినెట్‌ కూర్పుపై ప్రస్ఫుటంగా కనిపించింది.

kishore-chandra-deo 
ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు తగినంత ప్రాధాన్యం లభించలేదు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి కిశోర్‌ చంద్రదేవ్‌కు కేబినెట్‌ హోదా లభించడం తప్ప రాష్ట్రం మరే ప్రయోజనాన్ని పొందలేకపోయింది. కిశోర్‌చంద్రదేవ్‌ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని వ్యక్తి కనుకనే ఆయనకు ‘కేబినెట్‌’ దక్కిందని భావిస్తున్నారు. కిశోర్‌చంద్రదేవ్‌కు గిరిజన వ్యవహా రాలు, పంచాయతీరాజ్‌ శాఖలను కేటాయించారు. సహాయ మంత్రిగా ఉన్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాడు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన చాలామంది నాయకులు రాజీనామా చేయడం, దాంతో సంక్షోభం నెలకొనడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు మంత్రి వర్గ విస్తరణలో తగిన ప్రాధాన్యం లభించలేదని భావిస్తున్నారు. పైగా ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి ఎ సాయి ప్రతాప్‌ను తొలగించారు కూడా.

మార్పులు చేర్పులు
మంగళవారం జరిగిన యూపీఏ-2 మంత్రివర్గ పునర్‌వ్య వస్థీకరణలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అనేకమం ది మంత్రులకు ఇప్పటి మాదిరిగానే కొన్ని కీలక శాఖల అద నపు బాధ్యతలు తప్పలేదు. మంత్రుల ప్రమాణస్వీకారం అనం తరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌- వచ్చే లోక్‌సభ ఎన్నికలవరకు ఇక పునర్‌వ్యవస్థీకరణ ఉండదని, ఆరోపణలకు గురై రాజీనామాలు చేసిన ఇద్దరు డిఎంకె మంత్రుల శాఖలు ఖాళీగానే ఉంటాయని ‚స్పష్టం చేశారు. నాలుగు ప్రధాన కీలక శాఖలైన ఆర్థిక, రక్షణ, విదేశీ, హోంశాఖల జోలికి ప్రధాని వెళ్ల లేదు. ప్రస్తుతమున్న మంత్రులే ఇకపై కూడా ఆ శాఖల్ని నిర్వహిస్తారు. టెలికాం, పౌరవిమానయానశాఖల్ని ఈసారి కూడా ‘అదనపు బాధ్యతగా’నే ఉంచారు.

జైరాంకు పదోన్నతి
తన వ్యాఖ్యలతో వివాదాస్పదుడుగా ముద్ర పడిన జైరాం రమేష్‌ను పర్యావరణం నుంచి తప్పించి, గ్రామీణాభివృద్ధి శాఖ నిచ్చి కేబినెట్‌ హోదా కల్పించారు. ఈ శాఖనింతవరకు విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ నిర్వహించారు. న్యాయశాఖామంత్రి వీరప్ప మొయిలీని ఆ శాఖ నుంచి మార్చడం కూడా ఎన్నదగిన మా ర్పే. సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం ఇటీవల అనేక సందర్భా ల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంది. సల్మాన్‌ ఖుర్షీ ద్‌కు న్యాయశాఖను ఇచ్చారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయ కుడు దినేష్‌ త్రివేదికి పదోన్నతి లభించింది. ఆయనకు కేబినెట్‌ హోదాతో రైల్వేశాఖనిచ్చారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి కాకముందు మమతాబెనర్జీ ఆ శాఖను నిర్వహించారు. ఆ శాఖ తమ పార్టీ నుంచి జారిపోకుండా సాధించు కోవడంలో మమత కృతకృత్యులయ్యారు. ఇంతవరకు స్వతంత్రంగా ఉక్కు మంత్రిత్వశాఖను నిర్వహించిన బేనీ ప్రసాద్‌ వర్మకు కేబినెట్‌ హోదా లభించింది.

ప్రమాణస్వీకారం
కొత్తగా మంత్రివర్గంలో నియమితులైన ఎనిమిది మంది, కేబినెట్‌ హోదాకు పదోన్నతి పొందిన ముగ్గురు సహాయ మం త్రుల చేత రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌ రాష్టప్రతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టప్రతి హమీ ద్‌ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్స న్‌ సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హాజరయ్యారు.

ఇప్పుడు 68 మంది

మంత్రివర్గంలో కొత్తగా మొత్తం ఎనిమిది మంది చేరడంతో మంత్రుల సంఖ్య 68కి చేరింది. వివిధ కారణాలవల్ల అంతకు ముందు ఏడుగురు రాజీనామా చేశారు.

కొత్త మంత్రులు

కొత్తగా చేరిన ఆరుగురిలో జయంతి నటరాజన్‌, పర్బన్‌ సింగ్‌ ఘటోవార్‌, సుదీప్‌ బందోపాధ్యాయ, జితేంద్రసింగ్‌, మిలింద్‌ దేవర, రాజీవ్‌ శుక్లా ఉన్నారు. తమను ఇండిపెం డెంట్‌ ఛార్జితో సహాయ మంత్రులుగా చేయడంపట్ల శ్రీకాం త్‌ జెనా, గురుదాస్‌ కామత్‌ అసంతృప్తి చెందారు. 11 మం ది మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత రాష్టప్రతి భవన్‌లో మాట్లాడుతూ మన్మో హన్‌సింగ్‌- వివిధ రాష్ట్రాలమధ్య సమ తుల్యత, సామర్థ్యం, కొనసాగింపు అంశాలను దృష్టిలో ఉంచుకొని పునర్‌వ్యవస్థీకరణ జరిగిందన్నారు.

అసంతృప్తి సహజమే: ప్రధాని
‘2014 లోక్‌సభ ఎన్నికల ముందు జరిపే చివరి విస్తరణ అని నేను భావిస్తున్నాను. మొత్తానికి ఇది సమగ్రమైన విస్తరణ’ అన్నారు. ‘కొందరికి అసంతృప్తి కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయని మీకు ముందే తెలుసా?’ అని అడగ్గా- ‘శాఖ లు మార్చినప్పుడు సమస్యలు సహజమే. దేశ ప్రయోజనాల్నే ముఖ్యంగా పరిగణనలోకి తీసుకున్నా’ మని ప్రధాని చెప్పారు.

కామత్‌ రాజీనామా
ప్రమాణస్వీకారానికి గురుదాస్‌ కామత్‌, శ్రీకాంత్‌ జెనా గైర్హాజరయ్యారు. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అసం తృప్తి వ్యక్తం చేశారు. ముంబయిలో ఉన్న కామత్‌ రాజీనామా లేఖ పంపగా రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ ఆమోదించారు.

వీరికి ఉద్వాసన
మార్పులు, చేర్పుల్లో కొందరికి ఉద్వాసన పలికారు. వారిలో ఎంఎస్‌ గిల్‌, బికె హాందిక్‌, కాంతీలాల్‌ భూరియా, మురళీ దేవర, దయానిధి మారన్‌ ఉన్నారు. సహాయమంత్రులు సాయి ప్రతాప్‌, అరుణ్‌యాదవ్‌లను కూడా తొలగించారు. దయానిధి మారన్‌ రాజీనామా చేయగా, మురళీదేవర రాజీ నామాకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

డిఎంకె స్థానాలు పదిలం
రాజీనామాలు చేసిన ఇద్దరు డిఎంకె మంత్రుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయని, సంకీర్ణ ధర్మం ప్రకారం ఎవరినీ నియ మించలేదని, ఆ పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ప్రధాని అన్నారు. ‘ప్రభుత్వం ప్రస్తుత సమ స్యల్ని అధిగమించగలుగుతుందా?’ అని అడగ్గా ‘తప్పకుండా. అందులో సందేహం లేదు’ అన్నారు. జైరాంశాఖ మార్పు గురిం చి చెబుతూ మరింత బాధ్యతాయుతమైన శాఖనిచ్చా మని, ఆయన అనుభవం ఆ శాఖకు ఉపయోగపడుతుందన్నారు.

రాహుల్‌ మాటేమిటి?

కేంద్ర మంత్రిమండలిలో ఇంతవరకు రాహుల్‌గాంధీని చేర్చుకోకపోవడంపై విలేకరులు అడగ్గా- ‘మంత్రివర్గంలో చేర మని నేను చాలాసార్లు కోరాను. కానీ తనకు పార్టీపరమైన బాధ్యతలున్నాయని ఆయన చెప్పారు’ అని ప్రధాని అన్నారు.

అదనపు శాఖలు
జౌళి, జలవనరుల శాఖల్ని ఆనంద్‌శర్మ, పికె బన్సాల్‌కు ఇచ్చామని ప్రధాని తెలిపారు. శర్మకు ఇప్పుడున్న వాణిజ్యం, పరిశ్రమలు, బన్సాల్‌కు పార్లమెంటరీ వ్యవహారాలు అలాగే కొనసాగుతాయి.కపిల్‌ సిబల్‌కు అదనంగా ఉన్న టెలికాం, భారతీయ వ్యవహారాల మంత్రి వయలార్‌ రవి అదనంగా నిర్వహిస్తున్న పౌర విమానయానం వారివద్దే ఉంటాయన్నారు.

శాఖలపట్ల అసంతృప్తి
2009లో సహాయమంత్రిగా నియమితులైనప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న శ్రీకాంత్‌ జెనాకు మంగళవారం జరిగిన పునర్‌వ్యవస్థీకరణలో గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖల ఇండిపెండెంట్‌ ఛార్జి ఇచ్చి పదోన్నతి కల్పించారు. ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. ఎరువులు, రసాయనాల శాఖ కేబినెట్‌ మంత్రిగా డిఎంకెకు చెందిన ఎంకె అళగిరి కొన సాగుతారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఒకే ఒక ఎంపీ చరణ్‌దాస్‌ మ హంత్‌ తొలిసారి మంత్రి అయ్యారు. ఆయనకు వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల సహాయమంత్రి పదవి లభించింది.

గురుదాస్‌ కామత్‌ను హోం, కమ్యూనికేషన్‌ల నుంచి రక్షిత మంచినీరు, శానిటేషన్‌కు ఇండిపెండెంట్‌ ఛార్జి ఇచ్చి మార్చా రు. కానీ, ఆ శాఖపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కామత్‌ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. విదేశీ వ్యవహారాల సహా య మంత్రి ఇ అహ్మద్‌కు మానవ వనరుల అభివృద్ధి శాఖను కూడా కేటాయించారు. సహాయమంత్రులు వి నారాయణ స్వామి, అశ్వనీకుమార్‌లను పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన రాజీవ్‌ శుక్లాకు, హరీష్‌ రావత్‌కు ఆ పదవిని కేటాయించారు. నౌకాయానం, రైల్వేల సహాయమంత్రిగా ఉన్న ముకుల్‌ రాయ్‌కి కేబినెట్‌ హోదా ఇచ్చి రైల్వేశాఖను కేటాయించారు.

వారి పాపాలు మావి కావు
తనను న్యాయమంత్రిత్వశాఖ నుంచి తప్పించి కార్పొరేట్‌ వ్యవహారాలకు మార్చడంపై ఒకింత ఆగ్రహం చెందిన వీరప్ప మొయిలీ పాలనా మంత్రిత్వశాఖల పాపాలకు తమ మంత్రిత్వ శాఖను నిందించకూడదని, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఆక్షేపణలకు పరిపాలనామంత్రిత్వశాఖ బాధ్యత వహించాలని అన్నారు.
చిరంజీవికి నిరాశే !
chiruf 
అనుభవమయితే గానీ తత్వం బోధపడదన్న వాస్తవాన్ని మెగాస్టార్‌ చిరంజీవికి కాంగ్రెస్‌తో కలసిన తర్వాత గానీ అర్ధం కాలేదు. కాంగ్రెస్‌ ధృతరాష్ట్ర కౌగిలి మొ దట ఊహల్లో తేల్చేదిగానే ఉంటుంది. ఆ తర్వాత సదరు బాధితుడి కష్టం కక్కలేక మింగలేక అన్నట్లుగా మారు తుంది. నిజంగా ఆ సినిమా కష్టం ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవికి సొంతమయింది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన చిరంజీవికి తానెంత పొరపాటు చేశానో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. కేంద్రమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపిన కాంగ్రెస్‌ చివరకు చిరంజీవికి శూన్య ‘హస్తం’ అందించింది.

satst 

కాంగ్రెస్‌లో విలీనానికి ముందు పార్టీ నాయ కత్వం చిరంజీవికి ఎనలేని గౌరవం ఇచ్చింది. జగన్‌ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయన లేఖ రాసిన నెలరోజుల తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన సోనియాగాంధీ.. చిరంజీవికి వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. అటు ప్రధానితో సైతం రెండుసార్లు భేటీ అయ్యారు. ఒక్క ఎంపీ లేకపోయినా చిరంజీవి కేంద్రంలో మహా పలుకుబడి సంపాదిస్తున్నారని పాపం పీఆర్పీ నేతలు అప్పట్లో సంబరపడిపోయారు. తీరా చిరంజీవికి ఇప్పుడు ఆ అనుభూతే మిగిలినట్లు స్పష్టమయింది. తాజాగా జరిగిన కేంద్రమంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో చిరంజీవికి బెర్తు లభిస్తుందని ఆయన సన్నిహితులు, పీఆర్పీ నేతలు ఆశించారు. అయితే, ఆయన పేరు ఎక్కడా లేకపోవడంతో నిరాశపడ్డారు.

HANUMANTHARAO 

దానితోపాటు 2014 ఎన్నికల వరకూ చిరంజీవికి మంత్రి పదవి రాదన్న విషయం కూడా స్పష్టం కావడంతో జీర్ణిం చుకోలేకపోతున్నారు. 2014 వరకూ మంత్రివర్గ విస్తరణ ఉండదని ప్రధాని విస్పష్టంగా పేర్కొనడమే దానికి కారణం.దీనితో కాంగ్రెస్‌ తమను నమ్మించి మోసం చేసిందన్న విషయాన్ని పీఆర్పీ నేతలు గ్రహించారు. పార్టీలో చిరంజీవికి చాలాకాలం నుంచి సలహాలిస్తున్న ఒక సీనియర్‌ నాయకుడి మాటలు విని కాంగ్రెస్‌లో విలీనమయ్యామని, లేకపోతే తమకు ఇప్పటికీ గౌరవం ఉండేదని మండిపడుతున్నారు. సదరు నేత తన స్వార్థం కోసమే కాంగ్రెస్‌తో దోస్తీకి ప్రయత్నించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో తాము విలీనం కాకుండా బయటనుంచి మద్దతునిస్తే బాగుండేదని, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

Satyanaraya 

2014 వరకూ చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి రాకపోతే ఇక తాము విలీనమయి ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీని ప్రకారం చిరంజీవి స్థాయి రాష్టమ్రే తప్ప, కేంద్ర స్థాయి కాదని కాంగ్రెస్‌ చెప్పకనే చెప్పిందని మండిపడుతున్నారు. చిరంజీవి కూడా రాష్ట్రంలో ఏదో ఒక మంత్రిపదవి తీసుకుని సర్దుకుపొమ్మన్నట్లే కాంగ్రెస్‌ ధోరణి ఉందని విరుచుకుపడుతున్నారు.అయితే, ఇప్పుడు ఎంత పశ్చాత్తాపం చెందినా ప్రయోజనం లేదంటున్నారు. విలీన ప్రక్రియ మొత్తం పూర్తయినందున ఇప్పుడు చేసే ది కూడా ఏమీ లేదని వాపోతున్నారు. విలీన ప్రక్రియపై చిరంజీవిని తొందరపెట్టి, తప్పు దోవపట్టించిన సదరు సీనియర్‌ నాయకుడే తమ నాయకుడికి జరిగిన అవమానానికి బాధ్య త వహించాలంటున్నారు. ‘చిరంజీవిని అడుపెట్టుకున్న ఆయనకు అధిష్ఠానం వద్ద పలు కుబడి పెరిగింది. కానీ చిరంజీవికి మాత్రం అవ మానమే మిగిలింద’ని ఓ సీనియర్‌ నేత ఆవేదన వ్యక్తం చేశారు. 
అధిష్ఠానం వేటు మిత్రుడికి కత్తెర
SAI-PRATAP
కేంద్ర మంత్రివర్గం నుంచి సాయిప్రతాప్‌కు ఉద్వాసన చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌ వైఎస్‌ కుటుంబానికి చెక్‌ పెట్టినట్లయింది. మైనింగ్‌ వ్యవహారాల లావాదేవీలతో వేళ్లూనుకుపోయిన వైఎస్‌ కుటుంబం ప్రత్యేకించి కడప పార్లమెంటు సభ్యుడు, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి చెక్‌ పెట్టింది. తన తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉండగా కర్నాటకకు చెందిన గాలి జనార్ధన్‌రెడ్డికి పెద్ద ఎత్తున మైనింగ్‌ లీజులు లభించాయి. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పట్టుబట్టి తన మిత్రుడు రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అంతేగాకుండా మైనింగ్‌ వ్యవహారాలను తనకు అనుకూలమైన రీతిలో చక్కబెట్టుకోవచ్చునన్న అభిప్రాయంతోనే సాయిప్రతాప్‌కు భూగర్భ, మైనింగ్‌ శాఖను కేటాయింపజేసుకోగలిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

సాయిప్రతాప్‌ సహాయ సహకారాలతోనే గాలి జనార్ధన్‌రెడ్డికి అవసరమైనన్ని మైనింగ్‌ లీజులను కూడా కట్టబెట్టించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కుటుంబం గత మూడు దశాబ్దాల కాలంగా మైనింగ్‌ వ్యవహారాలద్వారా వచ్చిన సొమ్ముతోనే రాజకీయంగా నిలదొక్కుకుంటూ వచ్చింది.
మైనింగ్‌ వ్యాపారంలో గుట్టు, మట్టు తెలిసిన ఈ కుటుంబం వైఎస్‌ ముఖ్యమంత్రి కాగానే కేంద్ర స్థాయిలో తన మిత్రుడైన సాయిప్రతాప్‌కు అదే శాఖను కట్టబెట్టించి మైనింగ్‌ వ్యవహారాలు గనుల లీజులలో తనకు ఎదురు లేకుండా చేసుకోగలిగిందంటున్నారు.

మంత్రిగా ఉన్న సాయిప్రతాప్‌ ఇటీవల జరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారన్న అనుమానాలకు కూడా ధృవపడినట్లు సమాచారం. తన మిత్రుడు దివంగత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తనయుడికి లబ్ధి చేకూరే విధంగా సహాయపడ్డారన్న సమాచారం కూడా పార్టీ అధీష్టానానికి చేరినట్లు తెలుస్తోంది. కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా జగన్‌పై పోటీ చేసిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి కూడా సాయిప్రతాప్‌ తగిన రీతిలో సహాయ సహకారాలందించలేదు. కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం గానీ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించడంలోగానీ సాయిప్రతాప్‌ పెద్దగా ఆసక్తి కనబరచలేదంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ పార్టీ హై కమాండ్‌ సాయిప్రతాప్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించి తద్వారా జగన్‌కు పరోక్ష హెచ్చరికలు చేసినట్లు భావిస్తున్నారు.

ఇవేం మార్పులు? - ఎ.కృష్ణారావు

కేంద్రంలో యుపిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా దాటింది. కాంగ్రెస్‌కు గత ప్రభుత్వంలో కంటే ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రెండేళ్లుగా ఊగిసలాటలోనే గడుపుతూ వస్తున్నది. ఇందుకు బహిర్గత కారణాల కంటే అంతర్గత కారణాలే ఎక్కువ ఉన్నాయి. మన్మోహన్ సింగ్ రెండవ సారి ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఆయనకు బలంగా మద్దతు ఇచ్చిన పార్టీలోని అంతర్గతశక్తులే ఇప్పుడు ఆయన మానాన ఆయనను వదిలివేశాయి.

అయిదేళ్ల పూర్తికాలం ప్రధాని పదవిని నిర్వహించిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్‌కు తన బాధ్యతల్ని స్వతంత్రంగా నిర్వహించగలిగిన శక్తి లేదు. నిజానికి తమ మంత్రిత్వ శాఖల్లో మంత్రులు ఏ పనులు చేస్తున్నారన్న విషయంలో ఆయనకు పట్టులేదు. ఒకవేళ సమాచారం ఉన్నా ఆయన ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో, కమ్యూనికేషన్ల మంత్రులుగా ఉన్న దయానిధి మారన్, ఎ. రాజా చేసిన అక్రమ వ్యవహారాల గురించి ప్ర«ధానమంత్రికి సమాచారం ఉన్నదనడానికి పలు ఆధారాలున్నాయి.

రాజా విషయంలోనైతే ప్రధానమంత్రి కార్యాలయానికి పలువురు ప్రతిపక్ష నేతలు ఉత్త్తరాలే రాశారు. ఇక దయానిధి మారన్ కమ్యూనికేషన్ల మంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్‌సెల్ కంపెనీ అధినేత తన వాటాల్ని మలేషియాకు చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మాల్సిందిగా బలవంతపెట్టారని, ఈ కంపెనీ నుంచి దయానిధి మారన్ తన టీవీ ఛానల్‌కు ప్రయోజనం పొందారని సిబిఐ ఆరోపించింది.

నిజానికి మాక్సిస్ నుంచి మారన్ రూ.700కోట్ల ముడుపులు పొందారని ఢిల్లీకి చెందిన ఒక పత్రిక ఎప్పుడో వెల్లడించింది. టాటా-రూపర్ట్ మర్డోక్‌కు చెందిన టాటాస్కైను తన సన్ నెట్‌వర్క్‌లో 33.3 శాతం వాటాలు కొనుగోలు చేయాల్సిందిగా దయానిధి మారన్ ఒత్తిడి చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఇంత స్పష్టంగా తన మంత్రులు కార్పొరేట్ కంపెనీలకు వేలాది కోట్ల ప్రయోజనం చేకూరుస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూస్తూ ఉండిపోయారు.

తాజాగా సిబిఐ దయానిధి మారన్‌పై ఆరోపణలు చేయడంతో ఆయన తన శాఖకు రాజీనామా చేశారు. బహుశా రాజా, కనిమొ ళి దారిలో ఆయన కూడా జైలు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడ్డ రాజకీయ నేతలు, అధికారులను ఉంచేందుకు తీహార్ జైలు సరిపోదని, ఒక ప్రత్యేక జైలు ఏర్పాటు చేయవలిసి వస్తుందేమోనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిజానికి కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే మన్మోహన్‌సింగ్ మంత్రివర్గం పెట్టి పుట్టిందేమోనని అంటున్నారు.

గత జనవరి వరకు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉ న్న ఎన్‌సిపికి చెందిన ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ విమానయాన సంస్థలకు కోట్లాది ప్రయోజనాలు చేకూర్చారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీయే పేర్కొంది. మిత్రపక్షాలు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే శక్తి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానికి లేకపోవచ్చు. కానీ దయానిధి మారన్, రాజాల గురించి కనీసం ప్రధాని జోక్యం చేసుకున్న సందర్భాలు కూడా లేవు. సిఏజి నివేదిక బయటపడిన తర్వాతనే వారు తమ పదవులు వదులుకోవాల్సి వచ్చింది.

మిత్రపక్షాలకు చెందిన మంత్రులే కాదు స్వపక్షానికి చెందిన మంత్రుల విషయంలో కూడా ప్రధాని తన కళ్లకు గంతలు కట్టినట్లే వ్యవహరించారు. లేకపోతే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఉన్న మురళీ దేవర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ రేపోమాపో జరుగుతుందనగా ఎందుకు రాజీనామా చేసి ఉంటారు? రిలయన్స్ కంపెనీ కెజి బేసిన్‌లో అభివృద్ది వ్యయాల్ని 117 శాతం పెంచేందుకు వీలుగా పెట్రోలియం మంత్రిగా ఆయన నిబంధనలు సడలించారని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ చమురు కంపెనీలు కొల్లగొట్టేందుకు వీలు కల్పించారని సిఏజి నివేదిక సమర్పించడంతో ఎందుకైనా మంచిదని మురళీ దేవర తప్పుకున్నారు.

మారన్, మురళీ దేవరలు మంత్రివర్గ మార్పులకు ముందే రాజీనామా చేయడం గురించి అభివర్ణిస్తూ ఒక ప్రతిపక్షనేత యుపిఏ ప్రభుత్వ పరిస్థితి ఓడ మునిగే ముందు ఎలుకలు ఖాళీ చేసినట్లుగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితికి ఈ వ్యాఖ్యానం స్పష్టంగా అద్దం పడుతున్నది.

అసలు కేంద్ర మంత్రుల్లో ఎవరు నిజాయితీపరులని చెప్పగలం? సాక్షాత్తు రాజాయే తాను అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం సలహా ప్రకారం నిర్ణయాలు తీసుకున్నానని ప్రధానికి లేఖ రాశారు. ఈ కుంభకోణం జరిగినప్పుడు చిదంబరం ఆర్థిక మంత్రిగా లైసెన్సుల మంజూరీలో కీలక పాత్ర పోషించారని, 2008లో 2001 ధరలకు స్పెక్ట్రమ్ లైసెన్సులు మంజూరు చేయమని చిదంబరమే రాజాకు సలహాలు ఇచ్చి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజా, కనిమొళి జైలు పాలైనప్పుడు మాత్రం చిదంబరంను మాత్రం ఎందుకు స్వేచ్చగా వదిలి వేయాలని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి కార్పొరేట్ కంపెనీలకు ఎంత పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చగలమో చిదంబరం కంటే బాగా తెలిసిన వారెవరూ లేరు. ఎందుకంటే ఆయన మంత్రికాక ముందు పలు కార్పొరేట్ కంపెనీల తరఫున లక్షల రూపాయల ఫీజు తీసుకుని వాదించి వారి ప్రయోజనాలను కాపాడారు. కనుక ఆయన సలహాలను రాజా లాంటి వారు తీసుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. మీడియాలో వార్తలు వస్తే ఎలా స్పందించాలో కూడా చిదంబరం రాజాకు సలహాలు ఇచ్చినట్లు ఇటీవల ఒక లేఖ ద్వారా వెల్లడైంది. అలాంటి వ్యక్తిని మన్మోహన్ సింగ్ యుపిఏ తొలివిడత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నియమించారు.

ఆ తర్వాత ఆయనకు మరింత కీలకమైన హోంమంత్రి పదవిని అప్పగించారు. హోంమంత్రిగా ఆయన బుద్దిగా ఉన్నారని ఎవరైనా భావిస్తే అది అమాయకత్వ మే అవుతుంది. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఏరివేతకు గిరిజనులకు ఆయుధాలిచ్చి సల్వాజుడుం ఏర్పాటు చేయడం వెనుక వేల కోట్ల కుంభకోణం ఉన్నదని, కేంద్ర హోంశాఖనుంచి ఆ రాష్ట్రానికి కేటాయించే నిధుల్లో ముడుపులు ఆ హోంశాఖను నిర్వహిస్తున్న పెద్దమనిషికి చేరతాయని ఇటీవల ఒక సీనియర్ రాజకీయ నాయకుడు వెల్లడించారు. అంటే ప్రజల ప్రాణాల కన్నా తమ జేబులు నింపుకోవడమే రాజకీయ నేతలకు పరమావ«ధి అన్నమాట..

అందువల్ల కేంద్ర మంత్రివర్గంలో కొత్త ముఖాల్ని చేర్చి, ఏవో మార్పులు చేసి ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచేందుకు మన్మోహన్ సింగ్ ప్రయత్నిస్తున్నారని ఎవరైనా చెబితే నవ్వుకోవడం మినహా ఏమీ చేయలేం. కేంద్రంలో నాలుగు కీలక శాఖల్ని మారుస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్నది. కాని గత జనవరిలోనైనా, ఇప్పుడైనా ప్రధాని ఆ శాఖల్ని ముట్టుకోకుండానే మార్పుల్ని చేశారు. పర్యావరణ శాఖనుంచి జైరాం రమేశ్‌ను మార్చి ఆ శాఖలో చిదంబరంకు సన్నిహితురాలైన జయంతి నటరాజన్‌ను ఎందుకు నియమించారో ప్రధాని చెప్పగలరా?

ఒకప్పుడు జయంతి చిదంబరంతో పాటు మూపనార్ నేతృత్వంలోని తమిళమనీలా కాంగ్రెస్‌లో ఉన్నారని చాలా మందికి తెలుసు. రాజాకే సలహాలు ఇచ్చిన చిదంబరం పోస్కో, వేదాంత వంటి కంపెనీల విషయంలో జయంతికి మరింత సులభంగా సలహాలు ఇవ్వగ లరనడంలో ఆశ్చర్యం లేదు. గ్రామీణ ఉపాధి పథకం పేరు మీద రాష్ట్రాల్లో వేలకోట్ల మేరకు జరుగుతున్న అవినీతిని జైరాం రమేశ్ అరికట్టగలగడం అంత సులభంకాదు. ఒకే రోడ్డుకు రెండు పథకాల క్రింద నిధులు లాగగలిగిన ఘనులున్న వ్యవస్థలో జైరాం లాంటివారు ఆర్భాటమే కాని, ఆచరణలో చేయగలిగింది తక్కువఅని వాదించే వారు ఉన్నారు.

ఈ రీత్యా మంగళవారం మన్మోహన్ సింగ్ చేసిన పునర్వ్యవస్థీకరణ యుపిఏ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేందుకు పెద్దగా దోహదం చేయడం కష్టం. తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టి మళ్లీ రైల్వేశాఖను తీసుకుంది. తన అధినేత్రి మమతా బెనర్జీ చెప్పినట్లు నడుచుకుంటానని ఆ శాఖ మంత్రి దినేశ్ త్రివేదీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించారు. మరి మన్మోహన్ ఎందుకున్నట్లు?

ఈ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ రాష్ట్రానికి అన్యాయమే జరిగింది. కిషోర్ చంద్రదేవ్‌కు స్థానం కల్పించారు కాని సాయిప్రతాప్‌ను ఎందుకు తీసుకున్నారో, ఎందుకు ఉద్వాసన చెప్పారో ఊహించడం కష్టం కాదు. 33 మంది ఎంపీలున్నా, రాష్ట్రానికి కేంద్రంలో ప్రాతినిధ్యం అంతగా లేకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం కావచ్చు. ప్రాంతీయ పోరాటాల్లో పడి జాతీయస్థాయిలో మన హక్కుల్ని విస్మరించడం బాధాకరమే.