Saturday, August 21, 2010

పదవుల కోసం రాజీవ్ ఆరాటపడలేదు : సీఎం * ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు : డీఎస్ * ఘనంగా రాజీవ్‌గాంధీ 66వ జయంతి ఉత్సవాలు * వర్ధంతిలోగా వాడవాడలా రాజీవ్ విగ్రహాలు నెలకొల్పాలని వీహెచ్ పిలుపు


మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 66వ జయంతి ఉత్సవాలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహం వద్ద ఆరంభమైన ఈ సందడి సాయంత్రం వరకు కొనసాగింది. గాంధీభవన్, పీపుల్స్ ప్లాజా, జయా గార్డెన్స్‌లలో కూడా ఈ వేడుకలు జరిగాయి. నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ కాంగ్రెస్ తోరణాలు, రాజీవ్ చిత్రపటాలతో నిండిపోయాయి. రాజీవ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పలువురు నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన దార్శికతను కొనియాడారు. రాజీవ్ జీవిత విశేషాలు, రాష్ట్రంతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేసే చిత్రప్రదర్శనను గాంధీభవన్‌లో ఏర్పాటు చేశారు. దీనిని ముఖ్యమంత్రి కె.రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆరంభించారు. అంతకు ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. రాజీవ్ వర్ధంతి (మే 21)లోగా రాష్ట్రంలో విస్తారంగా ఆయన విగ్రహాలను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయాలని, రాజీవ్ ఆలోచనలు, ఆశయాలను ప్రజలకు తెలియజేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో సోమాజిగూడ కూడలిలో, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి దానం నాగేందర్, మరో మంత్రి ముఖేష్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో ఈ జయంతి ఉత్సవాలు జరిగాయి.

పీపుల్స్‌ప్లాజాలో భారీ వైద్య, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దాదాపు 220 మంది కార్యకర్తలు రక్తదానం చేయగా, పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో రాజీవ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. యువ నేతలంతా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహాన్ని చేరుకున్నారు. ఈ ర్యాలీని సీఎం, డీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలన్నింటిలో సీఎం, డీఎస్‌లతో పాటు సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పాల్గొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి కె.బి.కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి యాదవ్, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్యవర్గ, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

పీపుల్స్ ఫ్లాజాలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ఆనం రామనారాయణరెడ్డి, ముఖేష్‌గౌడ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, అహ్మదుల్లా, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ బండ కార్తీకరెడ్డి, కార్పొరేటర్లు, కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల నేతలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు సీఎం కె.రోశయ్య, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెక్కును అందజేశారు. వైద్య శిబిరానికి సహకరించి వైద్యులను సత్కరించారు.

సోమాజీగూడ సభను అన్నీ తానై వీహెచ్ సభను నిర్వహించగా, గాంధీభవన్ కార్యక్రమానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి రాపోలు ఆనంద భాస్కర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. పీపుల్స్‌ప్లాజాలోని సభను మంత్రి దానం నిర్వహించగా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని వందన సమర్పణ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జయా గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రాధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అధ్యక్షత వహించారు. వీహెచ్ ఆధ్వర్యంలో నగరంలోని నాలుగు ప్రదేశాల నుంచి ప్రారంభమైన సద్భావన పరుగులు సోమాజిగూడ చేరుకున్నాయి. క్రీడాకాలకు సీఎం చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా వేదికల నుంచి సీఎం, డీఎస్‌ల ప్రసంగాలు యథాతథంగా..

పదవుల కోసం ఆరాటపడలేదు : సీఎం కె.రోశయ్య

అధికారం తిష్టవేసిన కుటుంబంలో రాజీవ్‌గాంధీ జన్మించారు. కానీ దానికి ఆయన ఆకర్షితుడు కాలేదు. పదవులను కోరుకోలేదు. ఆరాటపడలేదు. పైలట్‌గా స్థిరపడాలనుకున్నారు. పదవులే ఆయన చుట్టూ తిరిగాయి. వారసత్వ వంశం కాదు. వారి రక్తంలోనే త్యాగం, పేదల పట్ల అభిమానం ప్రవహిస్తూ వచ్చాయి. గొప్పింట్లో పుట్టినా కూడా రాజాలతో స్నేహం చేయలేదు. అట్టడుగు స్థాయి ప్రజల అభ్యున్నతి కోసం తపనపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ఒత్తిడి మేరకు విముఖంగానే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రధానిగా పనిచేసినా అధికార దర్పం వారి దరి చేరలేదు. కొద్దికాలమే ప్రధానిగా ఉన్నా చెరగని స్థిరమైన ముద్ర వేశారు. 73,74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలతో బలోపేతంచేసి నిధులు, విధులు ఇచ్చారు. మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత ఆధునిక సమాజం రావాలని తపించిన గొప్ప అభ్యుదయ వాది. రాజీవ్ సేవలు మరువలేం. ఆయన బాటలోనే నడవాలి. ఇందిర, రాజీవ్ దూరమైనా వారి ఆశయాలను దూరం చేసుకోకూడదు. వారి ప్రతిరూపమే సోనియా. సమర్థ పాలన అందిస్తున్న మహా నేత. ప్రధాని పదవినే త్యజించారు. దేశం సమైక్యంగా, సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని తలంచి మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేశారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకుందాం. పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కృషిచేశారు. అదేబాటలో సోనియా నడుస్తూ, నిరుపేదలకు అనేకహక్కుల కల్పించారు. ఉపాధి హామీ పథకం, నిర్బంధ ఉచిత విద్యా హక్కులిచ్చారు. త్వరలోనే ఆహార, ఆరోగ్య భద్రతా హక్కులు కూడా రాబోతున్నాయి. వీటిద్వారా ఎవరినీ అభ్యర్థించే అవసరం లేకుండా, డిమాండ్ చేసి నెరవేర్చుకునే హక్కు వచ్చింది. రాహుల్ గాంధీ చుట్టూ అధికారం పరిభ్రమిస్తున్నా సున్నితంగా తిరస్కరించారు. పేదల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం విస్తృతంగా, సాధారణ వ్యక్తిలా రిజర్వేషన్ లేకుండానే ప్రయాణిస్తున్నారు. అరుదైన వ్యక్తిత్వం ఆ కుటుంబ లక్షణం. భవిష్యత్తులో రాహుల్ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలి.

ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు : డి.శ్రీనివాస్

ఓపిక.. ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతారు. ఎంత నిరాడంబరంగా ఉంటే అంత పైకొస్తారు. ప్రతి దానికీ రాజకీయ లబ్ధి ఆశిస్తూ, ప్రతి ఒక్కరూ తమవద్దకు రావాలనుకోవడం తప్పు. అంతా మేము చెప్పిందే సాగాలనే నేతలున్నారు. ఇప్పటి యువకులు కాళ్లా వేళ్లా పడి ఎమ్మెల్యే టిక్కెట్ సాధిస్తారు. వెంటనే సీఎంను కలిసి మంత్రి పదవి, ఆ తర్వాత క్యాబినెట్ ర్యాంక్, ఆపై ఇక సీఎం కావాలని చూస్తారు. గాంధీభవన్ గడప తొక్కగానే పీసీసీ ప్రధాన కార్యదర్శి కావాలంటారు. ఏళ్ళ తరబడి పనిచేసినా కూడా కొందరికి గుర్తింపులేదు. రెండుసార్లు ఎంపీ అయినా రాహుల్ గాంధీ మంత్రి పదవిపై ఆసక్తి చూపకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నారు. దానిని యువకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజీవ్ జయంతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని అవగాహన చేసుకోవాలి. కాంగ్రెస్ మన మతం, మన జాతి. సోనియానే మన నేత. దేవతగా ఆమె నాయకత్వాన్ని బలపరచాలి. దేశం కోసం పుట్టిన కుటుంబం నెహ్రూ, ఇందిరలది. దశ-దిశ లేక పార్టీ ఏమైపోతుందో అనే దశలో సోనియా తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంక కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే త్యాగాల కుటుంబం వారిది. ఇందిర మాదిరి సోనియాకు కూడా రాష్ట్ర ప్రజలు అండగా నిలవాలి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ప్రతిన చేయాలి. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నా రోశయ్య చక్కని నాయకత్వం అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా బలంగా ఉంటే అదే మన బలం. సంకల్పం పూని.. నిబద్ధతతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యం మన వద్ద అవసరం కంటే ఎక్కువ. ఎన్నెన్నో పార్టీలు పుట్టుకొచ్చి దేశాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.

No comments:

Post a Comment