Thursday, September 23, 2010

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులు కూడా ధర్మానను అనుసరిస్తారా ...........

దారి చూపిన ధర్మాన !
Headమంత్రులు, ప్రజాప్రతినిధులంతా లాల్‌బహుదూర్‌శాస్ర్తి మాదిరిగా నిజా యితీగా, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి ప్రజలు కోరుకుంటారు. పారద ర్శకంగా, అవినీతికి దూరంగా ఉండాలని భావిస్తారు. అందుకు భిన్నంగా జరిగితే సహించరు. కానీ.. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని స్వయంగా మంత్రులే ముఖ్యమంత్రికి లేఖ రాస్తే దానిని ఆహ్వానిస్తారు. వారి చిత్తశు ద్ధిని మెచ్చుకుంటారు. మిగిలిన మంత్రులపై ఆరోపణలు వస్తున్నా వాటిని పట్టించుకోని వారిని శంకిస్తారు. వారు తమ అవినీతిని అంగీకరించినట్లుగానే జనం భావిస్తారు. కానీ ప్రభుత్వానికే ఆ విచారణ ఎలా జరిపించాలో తెలియడం లేదు.

పదవుల్లో ఉండగా విచారణ జరిపిస్తే ఆ సమయంలో పదవుల ప్రభావం చూపే అవ కాశం ఉంది. లేకపోతే మంత్రులను తొలగించాలి. ముఖ్యమంత్రి రోశయ్యకు ఇప్పుడు ఇదో సమస్య. సవాలు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వివిధ అవినీతి ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులే ఇప్పుడూ కొనసాగుతున్నారు. అప్పుడు కూడా అదే మంత్రులపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్పటికీ, వైఎస్‌-మంత్రులు వాటిని ఎదురుదాడి ద్వారా తప్పించుకున్నారు. కానీ, రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయింది.

ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం విమర్శల దాడి ఉధృతమయింది. వైఎస్‌ బంధువులు, ఆయన వర్గంగా ముద్రపడ్డ మంత్రుల అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్న ప్రాంతాలకు వెళ్లి మరీ ధర్నాలు చేపడుతోంది. మళ్లీ అక్కడి నుంచి వచ్చి సీఎంను ఎమ్మెల్యేలతో కలసి వాటిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తానికి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సర్కారులో భాగస్వాములైన మంత్రుల అవినీతిపై చర్యల కోసం సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ నేపథ్యంలో.. తమపై, తమ కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇటీవలి రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ఇలాంటి నైతిక విలువలు పాటించడం అరుదుగా చెప్పకతప్పదు. సొంత జిల్లా అయిన శ్రీకాకుళం లోని కన్యధారలో తన కుమారుడి కంపెనీకి అక్రమంగా గనుల లీజు కట్టబెట్టారని ప్రతిపక్షాలు, మీడియా ఆరోపించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపించాలని స్వయంగా ధర్మానే సీఎంకు లేఖ రాయడం ప్రజాస్వామ్యంలో శుభపరిణామమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంతకుముందు.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విధానం అనుసరించారు. తనపై సొంత పార్టీకి చెందిన ఎంపి రాయపాటి సాంబశివరావు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కన్నా స్పందించారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. కన్నాపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించిన రాయపాటి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేత్రికి ఆయన అవినీతికి సంబంధించిన వివరాలను అందచేసిన విషయం తెలిసింది. ఇప్పటికీ మంత్రివర్గంలోని అవినీతిపరులను త్వరలో తొలగించనున్నారని కన్నాను దృష్టిలో ఉంచుకుని రాయపాటి ప్రకటనలిస్తూనే ఉన్నారు.
తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాసిన నేపథ్యంలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులు కూడా ధర్మానను అనుసరిస్తారా అన్న ప్రశ్నలు తెరపైకి వ స్తున్నాయి. ఒకవేళ వారు ఆ విధంగా కాకుండా, మౌనంగా ఉండిపోతే తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిజమని అంగీకరించవలసి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు.

bothsa
ప్రస్తుత మంత్రివర్గంలో విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలారోజుల నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం మండలం గాజులరేగ గ్రామంలో 3.36 ఎకరాల చెరువును ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించారని, అదే పంచాయతీ లోని సర్వే నెంబరరు 35లో 1,2,3,5,6 లోని 11 ఎకరాల భూమిని బొత్స గురునాయుడు ఎడ్యుకేషన్‌ ట్రస్టు పేర, ఇనాందారు పేర భూమిని కొన్నారన్న ఆరోపణలు చేసింది. ఆ స్థలంలో నిర్మించిన సత్యా ఇంజనీరింగ్‌ కాలేజీ ఎదురుగా ఉన్న 3 కోట్ల విలువైన 3.36 ఎకరాల పొన్నకారి చెరువును కాలేజీ గ్రౌండ్ల కోసం చదును చేశారని టిడిపి ఆరోపించింది.

విజయనగరంలోని తోటపాలెంలో 4 కోట్ల విలువైన డీసీఎంఎస్‌ స్థలాన్ని కాలేజీ కోసం రాత్రికి రాత్రి కుటుంబసభ్యుల చేత టెండర్లు వేయించి, పోటీకి ఎవరూ రాకుండా చేయడంతో 4 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం కోటి రూపాయలకే దక్కించుకున్న వైనంపై ప్రతిపక్షాలన్నీ ధర్నా చేయగా, సర్కారు దిగివచ్చి ఆ టెండర్లను రద్దు చేసిన వైనం తెలిసిందే. 2009లో ఆయన సోదరుడు లక్ష్మణరావు కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న 3 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, కాళీమాత ఆలయానికి చెందిన 3 ఎకరాల 92 సెంట్లను ఆక్రమించారని, ప్రభుత్వ స్థలం 33 సంవత్సరాలకు ఏటా కేవలం 1100 అద్దెతో లీజు దక్కించుకున్నారని టీడీపీ ఆరోపణలు చేసి, దానిని మీడియాకు వెల్లడించింది.

మంత్రి రఘువీరారెడ్డి కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మేఘమథనం పేరుతో 130 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అగ్ని ఏవియేషన్‌ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడంలో నిబంధనలు ఉల్లంఘించారని, 5 జిల్లాలు వరదల్లో మునిగిపోతే వాటిని సైతం మేఘమథనంలో చూపారన్న ఆరోపణలపై టిడిపి ధ్వజమెత్తింది. మోటార్‌సైకిల్‌పై 9 టన్నుల బరువైన 360 బస్తాల వేరుశెనగ విత్తనాలు రవాణా చేసినట్లు చెప్పడం మంత్రికే చెల్లిందంటున్నారు.

మంత్రి వట్టి వసంతకుమార్‌ తాళ్లరేవు మండలం, చొల్లంగిలో 57 ఎకరాల 39 సెంట్ల భూమిని స్వాహా చేసి, 18 (2)భూసంస్కరణ చట్టానికి రాయితీ తెప్పించుకున్నారని, రాయితీ ఇచ్చిన మూడు రోజులకే ప్రభుత్వ ఉత్తర్వులు తెచ్చారని టీడీపీ ఆరోపించింది. చేపల చెరువుకు జడ్పీ ఉపాథి హామీ పథకం నిధుల నుంచి 37 లక్షలు వెచ్చించి రోడ్లు వేయించారని, పని మంజూరులో ఎండిఓ, డిఎఫ్‌ఓలు విరుద్ధ ప్రకటనలిచ్చారు.

SILAPA-MOHAN కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి దిన్నెదేవరప్పాడు, రుద్రవరం గ్రామాల్లో సర్వే నెంబర్లు 389,144,145,382,390, వెంకాయపల్లిలోని సర్వే నెంబర్‌ 161/ఏలో ఉన్న ప్రభుత్వ భూములను రిజిస్ట్రర్‌ చేయాలని జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి చేసి లేఖ రాసిన వైనాన్ని టిడిపి బయటపెట్టింది.

jupalliహైదరాబాద్‌ షేక్‌పేట మండలం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర సర్వేనెంబర్‌ 403లో 3534 చదరపు గజాల భూమిని జిఓనెం 1025 ద్వారా నలుగురి పేరుతో క్రమబద్ధీకరించుకున్న వైనం ఆందోళనకు దారితీసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఉప్పుడు బియ్యం ఎగుమతిలో భారీ స్థాయిలో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్న విషయం తెలిసిందే. బియ్యం సరఫరా కోటా తమకే ఇవ్వాలని కోరుతూ ఏపీ రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ గత ఏడాది డిసెంబర్‌ 7న సర్కారుకు లేఖ రాస్తే.. ఒక్కరోజు వ్యవధిలోనే లక్ష మెట్రిక్‌టన్నుల బియ్యం సరఫరా కోటాను వారికే అప్పగించిన వైనం ముడుపుల ఆరోపణలకు కారణమయింది.

మిగిలిన లక్ష టన్నుల బియ్యం కోటాను తమకు ఇవ్వాలని ఏపీ రైస్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ కోరగా, దానికి మాత్రం 50 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అనుమతించింది.పైగా ఏపీ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కంటే క్వింటాలుకు వందరూపాయల తక్కువ ధరకే ఉప్పుడు బియ్యం సరఫరా చేస్తామని ఏపీ రైస్‌ ఇండస్ట్రీస్‌ ముందుకు వచ్చినా మంత్రి పట్టించుకోకపోవడం వెనుక కోట్లాది రూపాయల అవినీతి ఉందని.. ఇందులో సీఎం, మంత్రి, కమిషనర్‌కు ముడుపులు ముట్టాయని అన్ని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఉప్పుడు బియ్యం ఎగుమతుల్లో దాదాపు 26 కోట్లు గోల్‌మాల్‌ జరిగిందని, ఒక్కో క్వింటాలుకు 130 రూపాయల చొప్పున ముడుపులు ఇవ్వాలని మంత్రి, కమిషనర్‌ తరఫున దళారులు డబ్బు వసూలు చేశారని, తమిళనాడుకు ఉప్పుడు బియ్యం ఎగుమతిలో టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

pilli-subhash-chadr
తూర్పు గోదావరి జిల్లాలో కోట్ల రూపాయల విలువచే సే క్రైస్తవ సేవా సంస్థల ఆస్తులను మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అనుచరులు కబ్జా చేయడంతో పాటు లేవుట్లు చేసి అమ్ముకునే ప్రయత్నాలపై దుమారం రేగింది. భూకబ్జా దారులకు అనుకూలంగా మునిసిపల్‌, అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీకి, మునిసిపల్‌ శాఖా మంత్రికి మంత్రి లేఖ రాయడంతో పాటు, వాటిని కన్వర్షన్‌ చేయమని సూచించడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.వీటిపై సభాసంఘం సిఫార్సులకు సైతం తిలోదకాలిచ్చారని ఆరోపించాయి.

Galla-aruna-kumari
మంత్రి గల్లా అరుణకు చెందిన అమర్‌రాజా బ్యాటరీస్‌కు విద్యుత్‌ సరఫరాపై అక్రమ పద్ధతుల్లో నిబంధనలను కాదని విద్యుత్‌ సరఫరా పొందుతోందని, దానివల్ల సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ 2005 జూన్‌ నుంచి 2007 నవంబర్‌ వరకూ 2 కోట్ల 97 లక్షల ఆదాయం కోల్పోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిని ఇంతవరకూ మంత్రి కంపెనీ నుంచి వసూలు చేయలేదని విరుచుకుపడ్డాయి.

laxminarayan
గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విశాఖ పరవాడ ఫార్మాసిటీలో తన కుమారుడు నాగరాజు డైరక్టర్‌గా ఉన్న కంపెనీకి 5 ఎకరాలు అక్రమంగా కేటాయించారని, ఢిల్లీలో 2 అపార్టుమెంట్లు, పరవాడ, తుర్కపాలెం వద్ద 4 ఎకరాల స్థలం కొన్నారని స్వయంగా కాంగ్రెస్‌ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి కన్నా ఇచ్చిన అఫిడవిట్‌ను ఆయన సోనియాకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించేంత సాహసం చేస్తారా? అసలు వీరంతా ధర్మాన, కన్నా మాదిరిగా తమపై విచారించాలని కోరేంత స్ధాయిలో నైతిక విలువలున్నాయా అన్నది మరో సందేహం.

Wednesday, September 15, 2010

రాష్ట్ర కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్సపై తికమక

Sonia-gandhఆమె పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌కు తిరుగులేకుండా పోయిందన్న కీర్తి. పార్టీని సక్రమ మార్గంలో నడిపిస్తూ, సత్వర నిర్ణయాలు తీసుకుంటున్నా రన్న అభినందల వెల్లువ. పార్టీని ఏకతాటిపై నడిపించడంతో పాటు.. తిరుగులేని నాయకురాలిగా ఆవిర్భరింపజేశారన్న కితాబు. పార్టీలో ఆమె కత్తికి ఎదురులేదన్న ధీమా. మునుపటి మాదిరిగా ఏ రాష్ట్రం నుంచీ తిరుగుబాటు చేసే సీనున్న నేతలేకుండా చేశారన్న ఆశ్చర్యం. అయినా సరే.. ఆమెకు ఓ రాష్ట్రం నుంచి తలనొప్పి. గందరగోళం. ఏ నిర్ణ యం తీసుకోవాలన్న తికమక. ప్రపంచంలో అన్ని వర్గా లనూ ప్రభావితం చేస్తున్న అతికొద్దిమందిలో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ నుంచి సమస్యలు ఎదుర్కో వడం జాతీయ స్థాయి నేతలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత ఇందిర, రాజీవ్‌ కన్నా శక్తివంతమైన నాయకురాలిగా ఆవిర్భవించారన్న కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. పార్టీకి సంబంధించిన సమస్యలను అలవోకగా పరిష్క రిస్తున్నారని పేరున్న సోనియా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుండటం పార్టీకి చెందిన జాతీయ నాయకులకు సైతం పజిల్‌గా మారింది. పార్టీ సారథ్యం అందుకున్న తర్వాత తొలిసారిగా మన రాష్ట్రం నుంచే సోని యాకు సమస్యల సవాలు ఎదురవడం అటు పార్టీ వర్గా ల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీ అధి నేత్రి సోనియగాంధీకి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు తల నొప్పిలా పరిణమించాయి. దీనితో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. నిజానికి.. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆమెకు సొంత పరిజ్ఞానం లేకపోయిన ప్పటికీ.. తాను ఎక్కువగా ఆధారపడే ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్‌ వంటి అనుభవ జ్ఞులకూ ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు అర్థం కాకపోవడమే సోనియాకు చిక్కులు రావడానికి అసలు కారణంగా కనిపిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పు, కొత్త ిపీసీసీ అధ్యక్షుడి నియామకం, సమర్థవంతంగా వ్యవహరించే రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, జగన్‌ వ్యవహారం, రాష్ట్ర విభజన అంశాలు సోనియాకు పెను సవాలుగా పరిణమించాయి. బహుశా ఆమె అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత ఏ రాష్ట్రం నుంచి ఇన్ని తీవ్రమైన సమస్యలు ఎదురయి ఉండవని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తు న్నాయి. ఇప్పుడు ఈ సమస్యలపై ఆమె ఎలాంటినిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.

ముఖ్యమంత్రి రోశయ్య అనారోగ్యం పార్టీ అధినేత్రిని కలవరపెడుతోందంటున్నారు. వివాదరహితుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడయినప్పటికీ అనారోగ్యం పరిపా లనకు, పార్టీ-ప్రభుత్వ సుస్థిరతకు అవరో దంగా పరిణమించాయని సోనియా ఈ పాటికే గ్రహించింది. మరోవైపు రోశయ్య కూడా తనకు ఆరోగ్యం సహకరించినంత కాలం ఈ పదవిలో కొనసాగాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించే అంశంపై దృష్టి సారించడం సోనియాకు అనివార్యంగా మారింది.

దక్షిణాదిలో అతిపెద్ద రాష్టమ్రయిన ఆంధ్రప్రదేశ్‌ను విస్మరిస్తే భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరుగుతుం దో ఆమెకు తెలియని కాదు. అందుకే ఆమె సీఎం మార్పుపై తర్జన భర్జనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, వి.హన్మంతరావు, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి పదవికి ప్రత్యా మ్నాయంగా కనిపిస్తున్నారు. వారిలో తనకు విధే యులు, రాష్ట్రంలో పార్టీని-ప్రభుత్వాన్ని సమన్వ యం చేసుకుని నడిపించగల సమర్థతో పాటు.. ఆర్థికంగా పార్టీ అవసరాలు కూడా తీర్చే వారిని ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇక పిసిసి అధ్యక్ష ఎంపి లో కూడా సోనియా అయోమయంలో ఉన్నారు. ఇది తెలంగాణ అంశంతో ముడిపడి ఉన్నందున ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆమెకు అర్ధం కాకుండా ఉందంటు న్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా? వద్దా? ఆ క్రెడిట్‌ కేసీఆర్‌కు పోతుందా? తన ఖాతాలో కలుస్తుందా అన్నదీ మరో అనుమానం. తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌ సంగతేమిటి? రాష్ట్ర విభజన చేస్తే కోస్తాలో పార్టీ మనుగడ ఏమిటి? ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న డి.శ్రీనివాస్‌ స్థానంలో ఎవరిని నియమించాలన్న అన్వేషణలో భాగంగా.. వి.హన్మంతరావు, సురేష్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మల్లు రవి, జానారెడ్డి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం కోస్తాకు చెందిన రోశయ్య సీఎంగా ఉన్నందున తెలంగాణ నేతకు పిసిసి ఇవ్వాల్సి ఉంది. అయితే, రోశయ్యను మార్చి తెలంగాణకు చెందిన నేతకు సీఎం పదవి అప్పగిస్తే, అప్పుడు కోస్తా నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా సీనియర్లయి న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కాసు కృష్ణారెడ్డి, పాలడుగు వెంకట్రావు వంటి నేతలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంచుకోవాలన్నది ప్రధాన సమస్య.అదే సమయంలో జగన్‌ సమస్య కూడా సోనియాకు చిక్కుముడిలా పరిణమించింది. జగన్‌ పార్టీలో ఉంటారా? బయటకు వెళతారా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలా? లేక జగన్‌ ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవాలా అన్నది సోనియాకు పెద్ద సమస్యలా పరిణమించింది.

తాను వద్దంటున్నా వినకుండా, తనను ప్రజల ముందు దోషిలా నిలబెడుతూ జగన్‌ చేసిన ప్రకటనతో సోనియా ఆగ్రహంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగన్‌ అక్రమ సంపాదనకు సంబంధించిన వార్తలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ జగన్‌పై ఇంతవరకూ చర్య తీసుకోకపోవడం, ఆయన కంపెనీలపై ఎలాంటి దాడులు జరగకపోవడం బట్టి అసలు కాంగ్రెస్‌ నాయకత్వమే జగన్‌తో ఇలాంటి కార్యక్రమం చేయిస్తోందా? పార్టీని పటిష్ఠం చేసుకునేందుకు జగన్‌ యాత్రను చూసీ చూడనట్లు పోతుందా? అదే నిజమయితే జగన్‌ యాత్రకు వెళ్లవద్దంటూ వస్తున్న లీకులన్నీ ఉత్తిదేనా? ఒక వేళ రాష్ట్రం విడిపోతే కోస్తాలో పార్టీ పటిష్ఠం కోసం టీడీపీని దెబ్బతీసేందుకే నాయకత్వమే జగన్‌ను జనంలోకి పంపుతోం దా? అన్న అనుమానాలు ఇప్పటికే సామాన్య జనంలో చర్చనీయాంశంగా మారాయి.

రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికలు తెప్పించుకుంటున్న సోనియాగాంధీ వీటిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుం టారా? అన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. శరద్‌ప వా ర్‌, కరుణానిధి, మమతాబెనర్జీ వంటి హేమాహేమీలే సోనియా గాంధీ శక్తికి భయపడి సర్దుకుపోతున్న నేపథ్యంలో.. జగన్‌ వంటి జూనియర్‌ ఎంపి తనను సవాల్‌ చేస్తుంటే సోనియాగాంధీ ఇప్పటివ రకూ మౌనంగా ఉన్నారంటే ఇదంతా నాయకత్వం ఆడుతున్న నాటకంలా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు కూడా సోనియాకు జగన్‌పై ఏదో ఒక చర్య తీసుకునేందుకు ఇరకాటంగా పరిణమించాయం టున్నారు.

మరోవైపు.. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్చార్జి నియామకంపైనా సోనియా గందరగోళంలో ఉన్నారు. ఇప్పటివవరకూ వచ్చిన ఇన్చార్జులు వైఎస్‌, ఆయన మిత్రుడయిన కేవీపీ రామచంద్రరావు ప్రభావంతో పనిచేసి, వారికి అనుకూల నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వారే. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారినందున.. వ్యక్తులకు అనుకూలంగా కాకుండా పార్టీకి అనుకూలంగా పనిచేసే ఇన్చార్జి కోసం అన్వేషించడం అనివార్యంగా మారింది. దిగ్విజయ్‌సింగ్‌ ఇన్చార్జిగా వస్తున్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన సైతం వైఎస్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉందని సీనియర్లు గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందుతున్నారు.

Monday, September 13, 2010

జగన్‌పై గురి.. * ఆర్థిక మూలాలపై అధిష్ఠానం అస్త్రం * జగన్‌కంపెనీల ఇన్వెస్టర్లకు ఐటీ నోటీసులు

'జగతి కిలాడీల'పై సీరియస్‌గా దర్యాప్తు..
చట్ట ఉల్లంఘనలపై దృష్టి
రంగంలోకి ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐబీ అధికారులు
కేవీపీ వియ్యంకుడి కంపెనీలకూ శ్రీముఖాలు!
ధిక్కారంపై తొలి దెబ్బ! అదను చూసి అధిష్ఠానం నుంచి 'ఆర్థిక అస్త్ర' ప్రయోగం. జగన్ లక్ష్యంగా.. ఐటీ శాఖ నుంచి శ్రీముఖాలు. ఆయన కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు నోటీసులు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐబీ అధికారులు రంగంలోకి. వెరసి ఏక కాలంలో ముప్పేట దాడి!! జగన్ కంపెనీల గుట్టును ఆంధ్రజ్యోతి ఎప్పుడో బయటపెట్టింది. ఇప్పుడు అవే అధిష్ఠానం చేతి అస్త్రాలయ్యాయి.

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : అదే పనిగా అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ, సమాంతర శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం 'ఆర్థిక' అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. జగన్‌కు సంబంధించిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీల డొంక కదిల్చే పని మొదలైంది.

ఆ లావాదేవీల వివరాల లోగుట్టును బయటపెట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు రంగంలోకి దిగారు. జగన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాల వివరాలను, ఆ నిధుల మూలాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ ఆయా ఇన్వెస్టర్లకు ఐటీ శాఖ నుంచి తాజాగా నోటీసులు జారీ అయినట్టు తెలిసింది. మొత్తం పది కంపెనీలకు ఇలా నోటీసు లు జారీ అయ్యాయన్నది విశ్వసనీయ సమాచారం.

జగన్ కంపెనీల ఇన్వెస్టర్లలో కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మరికొన్ని అనామక కంపెనీలూ ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఉన్న కొన్ని కంపెనీలు దమ్మిడీ రాబడి లేకున్నా జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేశాయి. ఈ కంపెనీల గుట్టు రట్టు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయంతో ఐటీ అధికారులు ఉన్నారు. ఈ కోల్‌కతా కంపెనీల్లో రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయినవి కూడా కావడంతో, వీటి వ్యవహారంపై ఆరా తీయాల్సిందిగా సెబీని కూడా సంబంధిత అధికారులు ఆదేశించినట్టు చెబుతున్నారు.

ఈ తాజా వ్యవహారం జగన్ శిబిరంలో కలకలం సృష్టిస్తున్నట్టు తెలిసింది. జగన్ కంపెనీల పుట్టుక-పెట్టుబడుల తీరుతెన్నులపై 'ఆంధ్రజ్యోతి' గతంలో వరుసగా పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. 'జగతి కిలాడీలు'.. 'విదేశీ సాక్షి', 'శూన్యంలోంచి సాక్షి భూతం' తదితర శీర్షికలతో వచ్చిన ఆ సంచలనాత్మక కథనాలే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలో అస్త్రాలుగా మారాయన్నది మరో కీలక సమాచారం. ఆ కథనాల్లో సమగ్రంగా ఉన్న వివరాల ఆధారంగానే ఇప్పుడు మొత్తం లోగుట్టును విప్పే పని ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనతో ఐటీ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించినప్పటికీ, నాడు శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న వైఎస్.. కేంద్ర ప్రభుత్వ అండదండలు, అధికార బలంతో ఐటీఅధికారులు ముందుకు పోకుండా నిలువరించారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అధిష్ఠానంతో జగన్ గ్రూప్‌కు పూర్తి స్థాయిలో సంబంధాలు చెడిపోయాయి. ఈ నేపథ్యంలో జగన్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అక్రమాలనే అస్త్రంగా మలిచి ఆయనపై ప్రయోగించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్టుగా చెబుతున్నారు.

ఇండ్ భారత్ గ్రూప్‌నకు కూడా..
వైఎస్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు, ఇండ్ భారత్ ఇన్‌ఫ్రా, ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఎనర్జీ కంపెనీల యజమాని రఘరామకృష్ణంరాజు(రఘు)కు, ఆయన కంపెనీలకు కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయినట్టుగా సమాచారం. ఒక చిన్న బయోమాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం నుంచి మొదలుపెట్టి అతి స్వల్ప కాలంలోనే రఘురాజు వందల కోట్ల రూపాయలతో తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించారు.

కొద్దికాలం క్రితం వెయ్యి కోట్ల రూపాయల భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు కూడా చేశారు. ఈ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటిలో అనేక అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలూ ఉన్నాయి. ఈ కంపెనీల లావాదేవీలకు సంబంధించి కూడా అక్రమ ని«ధుల చలామణి వంటి ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.

రెండు అంశాలు కీలకం..
జగన్ కంపెనీలకు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని ఐటీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి.. జగన్ కంపెనీల్లోకి వివిధ సంస్థలు, వ్యక్తుల ద్వారా ప్రవహించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి(మనీలాండరింగ్ ఆరోపణలు)? రెండు విదేశీ పెట్టుబడుల నిబంధనలను జగన్ కంపెనీలు ఉల్లంఘించాయా? స్థూలంగా ఈ ఆరోపణలు కంపెనీల చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం.. పరిధిలోకి వస్తాయి.

దివంగత నేత వైఎస్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన అధిష్ఠానం.. జగన్ అక్రమ ఆస్తులు, సంపాదన విషయాన్ని, చట్టాల ఉల్లంఘనను తమ చేతికి మట్టి అంటకుండా చట్ట సంస్థల ద్వారానే బయటకు వచ్చేట్టు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. వైఎస్ వారసుడిగా, దీన జన రక్షకుడిగా పాజిటివ్ ఇమేజ్‌తో జగన్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఆయన వర్గీయులకు ఇది ఊహించని దాడి. నేరుగా ఆర్థిక మూలాలపై దెబ్బ తగిలితే జగన్ తట్టుకోవడం కూడా కష్టమే!

సండూరు టు జగతి!
జగన్ కంపెనీలకు మూల విరాట్టుగా ఉన్న సండూరు పవర్‌లో ఇన్వెస్ట్ చేసిన రెండు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు 2ఐ క్యాపిటల్, ఫ్లూరి ఇన్వెస్ట్‌మెంట్‌కు నిధులు ఎక్కడి నుంచి అందాయనే అంశంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. సండూర్ పవర్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అంచలంచెలుగా కార్మెల్ ఆసియా అనే కంపెనీకి.. అందులోంచి జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చాయి.

భారతీయ చట్టాల ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ముందస్తు అనుమతి అనివార్యంగా తీసుకోవాలి. ఆటోమేటిక్ మార్గంలో మీడియాలో ఇన్వెస్ట్ చేయడానికి వీలులేదు. సండూర్ పవర్ నుంచి లోపాయకారీ పద్ధతుల్లో విదేశీ నిధులనే తమ పత్రికలోకి జగన్ మళ్లించారు. ఇది స్పష్టంగా చట్టాలను ఉల్లంఘించడమే అని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్లూరి ఎమర్జింగ్‌కు వ్యతిరేకంగా పలు ఆరోపణలూ ఉన్నాయి.

వీటిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిపినట్టుగా తెలిసింది. లండన్‌లోని యూబీఎస్ బ్యాంకు శాఖలోని ఖాతాల్లో జరిగిన గోల్‌మాల్‌లో కొన్ని వందల కోట్ల డాలర్లు బినామీ ఖాతాలు, కంపెనీల ద్వారా భారత మార్కెట్ చేరినట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల మళ్లింపులో ప్లూరి ఎమర్జింగ్ క్యాపిటల్ పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది.

నీవు నేర్పిన విద్యయే!
గతంలో జగన్ కంపెనీల అవినీతి బాగోతాన్ని 'ఆంధ్రజ్యోతి' సీరియల్‌గా ప్రచురించినప్పుడు.. కక్ష గట్టిన నాటి ప్రభుత్వ నేతలు అధికార యంత్రంగాన్ని రెచ్చగొట్టి కక్ష సాధింపు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో తమకున్న పలుకుబడి, రాష్ట్రంలో తమ అధికార బలంతో పీఎఫ్ అధికారులను, ఈఎస్ఐ అధికారులను 'ఆంధ్రజ్యోతి'పై దాడులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐటీ అధికారులతో నోటీసులు ఇప్పించారు.

బిల్డింగ్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన అంటూ మున్సిపల్ అధికారులను కూడా ఉసిగొల్పారు. అన్ని రకాల దాడులనూ 'ఆంధ్రజ్యోతి' నిబ్బరంగా ఎదుర్కొంది. ఇప్పుడు అదే అధికార యంత్రాంగాన్ని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం కూడా తన అస్త్రంగా మలచుకొని.. జగన్‌కు ఆయన అసలు స్థానమేమిటో తెలియజెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం!!

Saturday, September 11, 2010

రసకందాయంలో రాష్ట్ర రాజకీయం తెరపైకి జైపాల్‌

jaipal
రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకో నున్నాయా? ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుర్చీ కదులుతోందా? ఆయన స్థానంలో కేంద్రమంత్రి సూటిని జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రానున్నారా? ఆ మేరకు అధి ష్ఠానం సూచనలతో తనపై పార్టీలో ఉన్న వ్యతిరేకత స్థానం లో సానుకూలత సాధించే దిశగా జైపాల్‌ పావులు కదుపు తున్నారా?.. అందులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల ద్వారా మంత్రాంగం నెరపుతున్నారా?.. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఇలాంటి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... ముఖ్యమంత్రి రోశయ్యకు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండటంతో పాటు.. ఆయన పార్టీని-ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని నాయకత్వం గ్రహించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రతిపక్షాలను సమర్థ వంతంగా ఎదుర్కోలేకపోవడం, ప్రజల్లో పార్టీ- ప్రభుత్వం పై విశ్వాసం పెంపొందించడంలో రోశయ్య చొరవ తీసుకోలేకపోతున్నారని, తనకు కంటగింపుగా మారిన జగన్‌ వ్యవహారాన్ని సైతం రోశయ్య తన రాజకీయాను భవంతో పరిష్కరించకుండా భారమంతా తనపైనే వేయడంపై నాయకత్వం అసంతృప్తితో ఉంది. రోశయ్యపై సానుభూతి ఉన్నప్పటికీ, ఆయన వ్యవహారశైలి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారం లోకి రావడం కష్టమన్న అభిప్రాయంతో ఉన్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. ఉధృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో పార్టీ భవితవ్యానికి ప్రతిబంధకంగా మారడంతో నాయకత్వ మార్పుపై దృష్టి సారించడం అనివార్యంగా మారిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అందులో భాగంగా తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ మేరకు సీనియర్‌ నేత, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జైపాల్‌ నియామకం ద్వారా ఇటు తెలంగాణ వాద తీవ్రతను, అటు సీమాంధ్ర లో మెజారిటీ సంఖ్యలో ఉన్న రెడ్డి వర్గం ఎమ్మెల్యేల మనో భావాలనూ తృప్తి పరిచినట్లు ఉంటుందన్న వ్యూహంతోనే జైపాల్‌రెడ్డిని తెరపైకి తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి.. జైపాల్‌రెడ్డి కూడా చాలాకాలం నుంచి రాష్ట్రంపై కన్నేసినప్పటికీ గుంభనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్‌ జీవించి ఉన్నంతకాలం అలాంటి ఆలోచన చేయనప్పటికీ, వైఎస్‌ వ్యతిరేక వర్గమంతా జైపాల్‌తో నిరంతరం సమాలోచనలు చేసేదన్నది బహి రంగం. చివరకు తెలంగాణ అంశంలో సైతం జైపాల్‌రెడ్డి ఏనాడూ పెదవి విప్పలేదు. అయినప్పటికీ, తెరవెనుక పావులు కదుపుతూనే ఉన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా రావడం, ఆయనపై నాయకత్వానికి వ్యక్తిగతంగా సాను భూతి, గౌరవం ఉన్నప్పటికీ పార్టీని-ప్రభుత్వాన్ని సమర్థ వంతంగా సమన్వయం చేయలేకపోతున్నారన్న అధిష్ఠానం అసంతృప్తిని గమనించిన జైపాల్‌రెడ్డి, దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలో దిగారని చెబుతున్నారు. అందుకే ఏనాడూ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ఆసక్తి, నేతల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కాని జైపాల్‌ ఇటీవలి కాలంలో వాటిలో కనిపిస్తున్నారు.

ఆ క్రమంలో అధిష్ఠానానికి తన మనోభావాన్ని వ్యక్తీకరించడం, నాయకత్వం కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో జైపాల్‌ పని సులవవుతోందంటున్నారు. అయితే.. తనకు సీమాంధ్రలో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, తెలంగాణలోనే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని జైపాల్‌ అధిష్ఠానం వద్ద వాస్తవ పరిస్థితిని విశ్లేషించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. తెలంగాణకు చెందిన తనను నియమించడం ద్వారా.. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం కూడా జరగవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రకారం.. రెండు ప్రాంతాలకు చెందిన ప్రముఖుల ద్వారా వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోమని నాయకత్వం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఆ మేరకు రంగంలోకి దిగిన జైపాల్‌రెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించే తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు, సీనియర్లతో మంతనాలకు తెరలేపారు. ఈ విషయంలో జైపాల్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర వారి ద్వారానే తనకు సీఎం ఇవ్వాలని ప్రతిపాదించడం ద్వారా కష్టపడ కుండా లక్ష్యం నెరవేర్చుకోవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది.

తాజాగా శుక్రవారం సీమాంధ్రకు చెందిన మంత్రులు గాదె వెంకటరెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జానారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, భిక్షపతి యాదవ్‌, కవితతో గంటసేపు జైపాల్‌తో భేటీ అవటం ఈ అనుమానం, చర్చలకు మరింత బలం చేకూర్చింది. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రత్యేక-సమైక్య వాదాలు మొదలయి పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో.. సీమాంధ్రకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికలు, సమావేశాలకు సారథ్యం వహిస్తోన్న గాదె వెంకటరెడ్డి, బీసీ కార్డుతో సీఎం కావాలని ప్రయత్నిస్తోన్న బొత్స సత్యనారాయణ ఇద్దరూ జైపాల్‌తో భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

సీమాంధ్రలో వారిద్దరినీ తన పక్షాన సమన్వయకర్తలు గా నియమించుకుని, తన ముఖ్యమంత్రి పదవి కోసం వారి ద్వారా రెడ్డి, బీసీ ఎమ్మెల్యేల మద్దతు సంపాదించా లన్న వ్యూహంతో అడుగులేస్తున్నట్లు జైపాల్‌ వ్యూహం కనిపిస్తోంది. 58 మంది రెడ్డి ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి చెందని వ్యక్తి సీఎంగా ఉండటం జీర్ణించుకోలేని వాస్తవాన్ని గ్రహించిన జైపాల్‌ ఆ మేరకు వారిని సంతృప్తి పరిచేందుకు కులం కార్డును ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవు తోంది. అదే సమయంలో తెలంగాణలో తనకు శిష్యుడ యిన మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తెలంగాణలోని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమా చారం. అటు రెడ్డి, ఇటు తెలంగాణ కార్డును ఏకకాలంలో వినియోగించుకోవడం ద్వారా తన లక్ష్యం సాధించుకోవా లన్నది జైపాల్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

డిఎల్‌ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి వంటి సీమాంధ్ర రెడ్డి నేతలు సైతం జైపాల్‌రెడ్డికి మద్దతునిస్తు న్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, వారిద్దరి భేటీకి ప్రాధాన్యం లేదని, అది సాధారణ సమావేశమమేనని జైపాల్‌ సన్నిహితులు చెబుతున్నారు.ఇదిలాఉండగా.. జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతలు అప్రమత్తమవుతున్నారు.

గతంలో చెన్నారెడ్డి, ఆ తర్వాత చిన్నారెడ్డి వంటి రెడ్డి వర్గ నేతలు తమకు పదవులు రాగానే తెలంగాణ ఉద్యమాన్ని అటకెక్కించడమే కాకుండా, అసలు తెలంగాణ అసవరం లేదని ప్రకటించిన వైనాన్ని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎంగా రోశయ్య కొనసాగడమే మంచిదని, జైపాల్‌రెడ్డి సీఎం అయితే, గతంలో చెన్నారెడ్డి మాదిరిగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి, అటకెక్కిస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతానుభవాల దృష్ట్యా తెలంగాణ రెడ్డికి సీఎం ఇవ్వకూడదని బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని కూడా రెడ్డి వర్గమే నడిపిస్తోందని, ఇక రేపు జైపాల్‌రెడ్డి సీఎం అవుతే దాన్ని కూడా ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.

అవిఘ్నమస్తు * రోశయ్యకు అభయం.. సీటు పదిలం


ఇప్పట్లో మార్పు ఉండదు..
స్పష్టం చేస్తున్న ఏఐసీసీ వర్గాలు
15 తర్వాత కేబినెట్ ప్రక్షాళన
కనీసం ఆరుగురికి ఉద్వాసన?..
పలువురి శాఖల్లోనూ మార్పులు
తీవ్ర ఉత్కంఠలో నేతలు.. లాబీయింగ్ కోసం ఢిల్లీకి పరుగులు
రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు ఎలాంటి ఢోకా లేదని, ఆయనను మార్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అనుభవజ్ఞుడైన ఆయన సేవలను సాధ్యమైనంత ఎక్కువకాలం ఉపయోగించుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడుతున్నట్లు అవి వెల్లడించాయి.

ఇటీవల తనను కలిసిన కొందరు రాష్ట్ర నేతలకు కూడా సోనియా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రోశయ్యను మార్చి, మరో ముఖ్యమంత్రిని నియమిస్తారని వస్తున్న ఊహాగానాలు నిరాధారమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదు సరికదా; త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని వారు చెప్పారు.

ఏఐసీసీ వర్గాలు కూడా దీన్ని ద్రువీకరించాయి. "సెప్టెంబర్ 15 తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఢిల్లీ రావచ్చు. ఆ తర్వాతి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది'' అని అవి వెల్లడించాయి. జగన్‌తో అంటకాగిన మంత్రులకు పునర్‌వ్యవస్థీకరణలో ఉద్వాసన పలుకుతారని, పలువురి శాఖలు మారతాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర మంత్రుల నేపథ్యం, వారిపై ఉన్న ఆరోపణలు, వారు రోశయ్యకు సహకరిస్తున్న తీరుతెన్నుల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలి వద్ద ఇప్పటికే పూర్తి సమాచారం ఉందని చెప్పాయి. మొత్తమ్మీద కనీసం ఆరుగురు మంత్రులు ఇంటిదోవ పట్టవచ్చని తెలుస్తోంది. కొత్త మంత్రుల నియామకం విషయంలో రోశయ్యకు స్వేచ్ఛ ఉంటుందని, ఆయన ప్రతిపాదనలను అధిష్ఠానం పూర్తిగా గౌరవిస్తుందని ఢిల్లీ వర్గాలు సంకేతాలిచ్చాయి.

రోశయ్య ఇటీవల అస్వస్థతకు గురవడం పట్ల అధిష్ఠానం కొంత ఆందోళన చెందినప్పటికీ, అది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే నన్న సమాచారం అధినేత్రికి అందిందని, డాక్టర్ల నుంచి కూడా ఏఐసీసీ సమాచారం సేకరించిందని తెలిసింది. రోశయ్యకు ఆరోగ్యం అసలే బాగా లేదని, ఆయనకు పక్షవాతం వచ్చిందని, ఆయన పని చేయడం కష్టమని వచ్చిన వదంతులను పార్టీ సీనియర్ నేతలు కొట్టి పారేస్తున్నారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన కొందరు నేతలు ఈ వదంతుల వెనుక ఉన్నారని అధిష్ఠానం భావిస్తున్నది. వైరల్ ఫీవర్ వస్తే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా కొంత బలహీనపడడం సాధారణమేనని, దాన్ని గోరంతలు కొండంతలు చేయనవసరం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ గురించి కూడా తరచూ ఇలాంటి వార్తలు వస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రోశయ్య అనుభవం తమకు అవసరమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన కలగజేసుకోకపోవడం, జగన్ విషయాన్ని తమకే వదిలి వేయడం సరైన దృక్పథమేనని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. "రోశయ్యను కాక మరెవరిని పెట్టినా కొత్త రకమైన ఇబ్బందులు వస్తాయి. అంతేకాక ఎన్నికలు జరిగేందుకు దాదాపు మూడున్నరేళ్లు ఉన్న దృష్ట్యా ఇప్పుడే ముఖ్యమంత్రిని మార్చడంలో అర్థం లేదు.

జగన్, తెలంగాణ మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రాధాన్య సమస్యలు. వాటిని ఏ విధమైన వ్యూహంతో ఎదుర్కోవాలన్న దాని గురించే అధిష్ఠానం ఆలోచిస్తున్నది'' అని ఆ వర్గాలు వివరించాయి. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న పార్టీ నేతలు, కార్యకర్తల గురించి కూడా అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉంది.

ఈ నేపథ్యంలో, అన్నింటి కన్నా ముందుగా, పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు, పార్టీలో అన్ని స్థాయిల్లో విధేయుల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అగ్ర నేతలు భావిస్తున్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమం అక్టోబర్ మూడో వారానికి పూర్తి కావచ్చు. పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దిన తర్వాతే ముఖ్యమంత్రి విషయంలో ఏమి చేయాలన్న దానిపై అధిష్ఠానం దృష్టి సారిస్తుందని, అది ఇప్పట్లో జరిగే అవకాశం లేనే లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ముఖ్యమంత్రి అంటే కాలికి బలపం కట్టుకుని, ఎప్పుడూ ఎడాపెడా తిరగడమేనన్న అభిప్రాయాన్ని చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి కలిగించారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ చంద్రబాబు, వైఎస్‌లాగా తిరిగిన దాఖలాలు లేవని ఢిల్లీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి మధ్యాహ్న భోజనం తర్వాత ఇంటికి వెళ్లి, సాయంత్రం మళ్లీ కొద్దిసేపు సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారని, అయినా వారు ప్రభుత్వ వ్యవహారాలను సమర్థంగానే నిర్వహించే వారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అందువల్ల చంద్రబాబు, వైఎస్‌ల మాదిరిగా రోశయ్య జనంలో ఎక్కువగా తిరగలేకపోయినా, ఆయన సమర్థతకు ఢోకా లేదని అధిష్ఠానం భావిస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్‌లో, కేబినెట్‌లో భారీ ప్రక్షాళన ఉంటుందన్న అధిష్ఠానం సంకేతాల నేపథ్యంలో పార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు, ఉన్న పదవులు కాపాడుకునేందుకు కొందరు, పదవులను దక్కించుకునేందుకు మరికొందరు ఎవరి ప్రయత్నాల్లో వారు పడ్డారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు రాష్ట్ర నేతలు ఢిల్లీకి పయనమవుతున్నారు.

నిన్న మొన్నటి వరకూ అధిష్ఠానం అంటే ఏమిటో తెలియదన్న నేతలు కూడా ఇప్పుడు ఢిల్లీ యాత్ర కోసం బ్యాగులు సర్దుకుంటున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో లాబీయింగ్ చేయడం తెలియని నేతలు కూడా, ఇప్పుడు అధినేత్రిని కలసి హాజరు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర పరిస్థితులను ఆమెకు వివరించడంతో పాటు.. అధిష్ఠానం వైఖరి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు కూడా తమ పర్యటన దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీకి చేరిన పలువురు నేతలు సోనియాను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకుల కంటే ముందే, సోనియా వారితో రాష్ట్ర వ్యవహారాల గురించి ప్రస్తావిస్తున్నారు.

రాష్ట్ర వ్యవహారాల పట్ల ఆమె అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోకుండా, పూర్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డిపైనే విశ్వాసం ఉంచి తప్పు చేశామేమోనన్న అభిప్రాయం అధిష్ఠానంలో కన్పిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

1985, 1999ల్లో రెండు దఫాలుగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారని, అయినా యువ నేతగా పార్టీని ముందుకు నడిపిస్తారన్న విశ్వాసంతో ఆయనను ప్రోత్సహించామని సోనియా తనను కలిసిన వారితో అన్నట్టు సమాచారం.

2004లో సంప్రదాయం ప్రకారం పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించకుండా, వైఎస్‌ను సీఎం చేయడం, రెండోసారి కూడా (2009లో) అవకాశం ఇవ్వడంపై అధిష్ఠానంలో అంతర్మథనం మొదలైందని మేడమ్‌ను కలిసిన నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన సమయంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గురించి ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి సమాచారం అందించే వారని, కానీ వీరప్ప మొయిలీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అధిష్ఠానం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనలో, ముందుగా మొయిలీపైనే వేటు వేయాలన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. బుధ, గురువారాల్లో తనను కలిసిన రాష్ట్ర నేతల ఎదుట సోనియా స్వయంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మెయిలీ ఒక పక్షానికి మాత్రమే దూతగా వ్యవహరిస్తూ వచ్చారని ఒక నేత ప్రస్తావించినప్పుడు, సోనియా కూడా ఏకీభవించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా నాలుగోసారి ఎన్నికైన తర్వాత, పార్టీ కమిటీలన్నీ ఆటోమేటిక్‌గా తక్షణమే రద్దయి పోతాయని, ప్రస్తుతం ఆమె స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉంటారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మొయిలీ ఇకపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగే అవకాశమే లేదని తెలిపాయి.

Sunday, September 5, 2010

సోనియా నంబర్‌ వన్‌


SONIA-MaM
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారతదేశంలో మొదటి పార్టీ. దేశానికి ఎక్కువ మంది ప్రధానులను అందించింది. రాజకీయ చదరంగంలో అన్ని కళలు తెలిసిన నాయకులకు జన్మనిచ్చింది. బ్రిటిష్‌ చెరలో ఉన్న జాతి సంకెళ్లను తెంచింది. ఐఎన్‌సి ను స్థాపించింది విదేశీయుడైన ఏ. ఓ. హ్యుం. అయితే ఆయన ఏనాడు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టలేదు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు ఇప్పటివరకు ఐదుగురు మహిళలు అధ్యక్షులుగా పనిచేశారు. వారిలో విదేశీయులే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటివరకు ఉన్న అందరి నాయకుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షపీఠంపై ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు మాత్రం సోనియాగాంధిదే. అంతేకాదు ప్రధాని పదవిలో లేకుండా పార్టీ పగ్గాలను ఇంతకాలం చేపట్టిన వ్యక్తిగానూ ఆమె చరిత్రను సృష్టించింది.

ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పీఠాన్ని అధిరోహించిన వ్యక్తులు...
ఆచార్య జె.బి కృపలాని: ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు 1947నవంబర్‌లో మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైయారు. పార్టీలో ఏర్పడిన అంతర్గత వైషమ్యాలతో కలత చెంది 1951లో ఆయన కాంగ్రెస్‌ పార్టీని విడిచి క్రిషక్‌ మజ్ధూర్‌ ప్రజా పార్టీని స్థాపించారు. ఆనతి కాలంలోనే దీన్ని ప్రజా సోషలిస్ట్‌ పార్టీలో విలీనం చేశారు.

sonia-gandh
పురుషోత్తం దాస్‌ టాండన్‌:  అలహాబాద్‌లో 1882,ఆగష్టు1న జన్మించారు. 1899లో ఐఎన్‌సిలో విద్యార్థిగా చేరారు. 1950లో అధ్యక్షుడైయారు. మహాత్మాగాంధీ ఆయన్ని రాజర్షి అని ిపిలిచేవారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ: భారత తొలి ప్రధాని. ఆ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన ఘనత వహించారు. ప్రధానమంత్రిగా ఉంటూనే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన మొదటివ్యక్తిగా నెహ్రూ చరిత్రకెక్కారు. ఆ సంస్కృతికి బీజం వేసింది ఈయనే. చాచాజీ దేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కి అధ్యక్షుడిగా 1929లో పనిచేశారు.

యు.ఎన్‌. దేబర్‌:1941లో గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్న యు. ఎన్‌. దేబర్‌ 1955లో కాంగ్రెస్‌ అధ్యక్షపీఠానికి ఎన్నికైయారు. 1958 వరకు పదవిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని ప్రధాన నాయకులందరినీ ఓ చోట చేర్చి మొదటి సమావేశాన్ని నిర్వహించిన ఘనత ఇతనిదే.
ఇందిరాగాంధీ: దేశానికి తొలి మహిళా ప్రధాని. ఐరన్‌లేడీగా ఖ్యాతి. సంక్షేమపథకాల రూపశిల్పి. 1959లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైయ్యారు. రెండవ దఫా 1978 నుండి ఆమె మరణించేవరకు ఆ పదవిలో ఉన్నారు. నెహ్రూ తరవాత ప్రధానమంత్రిగా ఉంటూనే అధ్యక్షపీఠం ఉన్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.
కె. కామరాజ్‌: నెహ్రు మరణానంతరం 1969లో చీలిపోయిన కాంగ్రెస్‌ పార్టీని పటిష్టపరిచాడు. అక్టోబర్‌ 9, 1963లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైయారు. 1967వరకుపదవిలోన్నారు.1954లో మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

sonia
ఎస్‌ నిజలింగప్ప:  1968లో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటికి అధ్యక్షులుగా ఎన్నికైయారు. కర్ణాటక పితామహుడుగా పిలుచుకునే నిజలింగప్ప ముఖ్యమంత్రిగా కూడా చేశారు.
జగజ్జీవన్‌ రామ్‌: షెడ్యూల్‌ కులాల కోసం 1935లో ప్రత్యేక చట్టానికి ప్రవేశపెట్టిన బాబూ జగజ్జీవన్‌ రామ్‌ 1970లో అధ్యక్షపీఠానికి ఎన్నికైయారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు.
శంకర్‌ దయాళ్‌ శర్మ: 1972లో ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైయారు. మూడు సంవత్సరాల పాటూ ఆయన పదవిలో కొనసాగారు.

దేవ్‌ కాంత్‌ బారువా: 1974లో కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి ఎన్నికైయారు. 1977 వరకు ఉన్నారు. ఎమర్జెనీ సమయంలోనూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు.

రాజీవ్‌గాంధీ: ఇందిరా మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్‌గాంధీ 1985లో ఏఐసీసీకి అధ్యక్షుడిగా ఎన్నికైయారు. ప్రధాని పదవిలోనే ఉంటూ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన మూడోవ్యక్తి రాజీవ్‌.
సీతారాం కేసరి: 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుటు స్వాతంత్య్రం కోసం పోరాడిన సీతారాం కేసరి 1996 - 1997 ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

సోనియాగాంధీ:
ఇందిరాగాంధీ తరవాత మళ్లీ ఓ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షపీఠాన్ని అధిరోిహంచింది. అంతేకాదు విదేశీ సంతతికి చెందిన వ్యక్తిగా సోనియా 1998లో అధ్యక్షపదవిని చేపట్టింది. మొదట్లో రాజకీయాలకు చాలా దూరంగా ఉన్న సోనియా భర్త మరణం తరవాత కాంగ్రెస్‌ నాయకుల ఒత్తిడితో రాజకీయాల్లోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దేశంలో వరసగా రెండుసార్లు ఏర్పాటు చేయటంలో ఆమెదే కీలకపాత్ర.

తెలుగువెలుగులు

prmukulus
కాంగ్రెస్‌ పార్టీలో గాంధీజీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెలుగువాడు శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య.. 1948లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ్‌ టాండన్‌పై గెలిచి భారతీయ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగువాడుగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి 1960లో అధ్యక్షుడైయారు. 1929లో జాతిపిత ఆదేశం మేరకు స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న నీలం ఆనతికాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర వహించారు. 1960లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.

prmukulu
రాజ్యసభ్య సభ్యుడిగా లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి, ఇందిరా గాంధీ ప్రభుత్వంలో పనిచేశారు. 1957లో హిందూపురం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైన నీలం లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1977 - 82 వరకు దేశానికి 6వ రాష్టప్రతిగా కూడా పనిచేశారు. వీరీరూవురి తరవాత దేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రి (1991 - 96) అయిన పీ. వీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా 1992లో ప్రధానమంత్రి పదవీలో ఉండగా ఎన్నికైయ్యారు. పీ.వీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1971, 73లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగానూ (1984 - 95) పనిచేశారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన ప్రధానిగా ఆయన వినుతికెక్కారు.

Friday, September 3, 2010

ఒకే ఒక్క సోనియా


sonia-stand
ఒకప్పుడు... రాజకీయాల్లోకి రావడానికి బొత్తిగా ఇష్టపడని సోనియాగాంధీ ఇప్పుడు నాలుగోసారి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కాబోతున్నారు. పన్నెండేళ్లు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని నిర్వహించి రికార్డు సృష్టించిన ఏకైన నాయకురాలు ఆమె. ఇన్నేళ్లు పార్టీకి సారథ్యం వహించడంలోనే కాదు... వరసగా రెండుసార్లు యూపీఏ కూటమికి అధికా రాన్ని కట్టబెట్టిన ఘనత కూడా ఆమెదే. అదివరకు కొన్నేళ్లపాటు అధికారానికి దూరమై కొట్టుమిట్టాడిన కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ఆశాకిరణమయ్యారు. వెలుగుదివ్వెగా నిలిచి నడిపించి, గెలిపించారు.

సామాన్య కుటుంబం నుంచి...
ఇటలీలో టూరిన్‌ ప్రాంతంలో సంప్రదాయ రోమన్‌ కేథలిక్‌ కుటుంబంలో పుట్టిన సోనియా ఓ చిన్న బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌ కూతురు. ఇందిరా గాంధీ కోడలుగా భారతదేశంలోకి అడుగుపెట్టిన సోనియాగాంధీ తను కాంగ్రెస్‌ పార్టీకి సారథ్యం వహిస్తానని అనుకోలేదు. తను విదేశీయురా లిననే విమర్శను ఆమె చాలాసార్లు ఖండించారు. 1983లో తను భారత పౌరసత్వాన్ని తీసుకున్నా నని ఎన్నోసార్లు తెలిపారు.


sonia-meet
1946 డిసెంబర్‌ 9న జన్మించిన సోనియా బెల్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ లాంగ్వేజ్‌ స్కూల్‌లో చదివేందుకు 1964లో బ్రిటన్‌ లోని కేంబ్రిడ్జి వెళ్లారు. అక్కడే ఆమెకు రాజీవ్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది.సోనియాగాంధీ రాజీవ ్‌గాంధీ ని వరించి భారతదేశపు పెళ్లికూతుర య్యారు. ఇది 1968 నాటి మాట. రాజీవ్‌గాంధీ తో జీవితా న్ని పంచుకున్న సోనియాగాంధీని భర్త మరణం కలచివేసింది. కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టవలసిందని ఎవరెంతగా బలవంతం చేసినా కొన్నేళ్లు ఆమె రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత...తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు సారథ్యం వహించాల్సి వచ్చింది. ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి తప్ప ఇంతవరకు ఎప్పుడూ ఏకగ్రీవంగానే ఎన్నికవు తూ వచ్చారు.

నామినేషన్‌ దాఖలు
నాలుగోసారి పార్టీ అధ్యక్షపదవిని చేపట్టేం దుకు సోనియాగాంధీ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇంతవరకు మూడుసార్లు రాయ్‌ బరేలీ నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైన సోనియా 1998లో ...125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో సోనియా అయిదో వ్యక్తి. విదేశంలో జన్మించి, పార్టీ అధ్యక్షపదవిని అలంకరించిన వారిలో ఎనిమిదో వ్యక్తి.1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. అప్పుడు...పార్టీని నడిపించగల నాయకత్వం కావలసి రావడంతో ఆమె రాజకీయరంగ ప్రవేశం చేశారు. భర్త రాజీవ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు సోనియా దేశంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.

విమర్శలకు జవాబుగా...

2004 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించిన సోనియాగాంధీ ప్రధాని పదవిని చేపట్టేవారే. కానీ, ఆమె విదేశీయురాలు అని తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘ఒక విదేశీ వ్యక్తి దేశ ప్రధాని ఎలా అవుతారు?’ అని భారతీయ జనతాపార్టీ నిప్పులు చెరిగింది. దాంతో ఆమె ప్రధాని పదవిని త్యాగం చేసి అధికారానికి వెలుపలే ఉండిపోయారు. తను అధికారంలో లేకపోయినా, ప్రభుత్వాన్ని నడిపించడంలో ప్రధానికి అండగా ఉన్నారు.

అసలామె అధికారం ఏమిటి అనే విమర్శకులూ ఉన్నారు. కానీ, ప్రధాని పదవిని సైతం త్యాగం చేసిన మనిషిగా సోనియాగాంధీ దేశంలో కోట్లాదిమంది ప్రజలు అభిమానం సంపాదించారు.గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ పైనా, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పైనా ఎన్ని విమర్శలు చేసినా వాటిని ఎదురొడ్డి నిలిచి, ప్రచారం చేశారు. ప్రతిపక్షా లపై ఎదురు దాడి చేసి గెలిచారు. సోనియాగాంధీ క్రమంగా భారత రాజకీయాల్ని ప్రభావితం చేసి పాలక కూటమి యూపీఏకు లోక్‌సభలో ఛైర్‌పర్సన్‌ అయ్యారు. పాలకపక్షాన్ని నడిపించే సారథిగా సోనియాగాంధీ తన ప్రతిభాపాటవాల్ని ప్రదర్శించారు.

నలభైసార్లైన ఎన్నికవుతారు : కాంగ్రెస్‌
sonia-sanmanam 
సోనియాగాంధీని నాలుగోసారి పార్టీ అధ్యక్షపదవికి ఎన్నుకోవాలను కుంటున్న కాంగ్రెస్‌ను భారతీయ జనతాపార్టీ తప్పు పట్టింది. బీజేపీ అభ్యంతరంపై కాంగ్రెస్‌ విరుచుకు పడింది. ‘నాలుగుసార్లు కాదు, పార్టీ కోరితే ఆమె 40 సార్లు ఎన్నికవుతారు. తప్పేముంది? మనం మరో పార్టీకి సంబంధించిన నియమ నిబంధనల్ని గురించి మాట్లాడకూడదు’ అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేదీ విలేకరులకు చెప్పారు.వారికి ఆ అవకాశం రాలేదనే ఇలా అంటున్నారని ద్వివేదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రజాస్వామిక పార్టీ కనుక ఎన్నికపై విస్తృతంగా చర్చిస్తాం. ఇది మరో పార్టీలో కనిపించదు’ అన్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ మాట్లాడుతూ-‘పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలో రాజ్యాంగాన్ని అనుసరిస్తాం. పిసిసి అధ్యక్షులు రెండు సార్లకంటే మించి ఆ పదవిని చేపట్టకూడదు. కానీ, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఆ నిబంధన వర్తించదు’ అన్నారు.

sonia-writing 
పుట్టిన తేదీ డిసెంబర్‌ 9, 1946 ( 63 )
జన్మస్థలం టూరిన్‌, ఇటలీ
రాజకీయ పార్టీ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌
భర్త రాజీవ్‌గాంధీ
పిల్లలు ప్రియాంక, రాహుల్‌ గాంధీ
నివాసం 10 జనపథ్‌, న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకురాలు,
సామాజిక కార్యకర్త
  • 2004లో ఫోర్బ్స్‌ మేగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళల్లో 3వ స్థానం. 2007లో 6వ స్థానం.
  • 2007,2008లో టైమ్స్‌ విడుదల చేసిన ప్రపంచం లోని 100 మంది శక్తిమంతుల జాబితాలో స్థానం.
  • 1998లో మొదటిసారిగా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియామకం.
  • వరసగా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నిక.
  • ఎక్కువ కాలం పాటూ అధ్యక్షపీఠంపై ఉన్న నాయకురాలిగా అరుదైన రికార్డు.
  • 1999లో ప్రతిపక్ష నాయకురాలుగా 13వ లోక్‌సభకు ఎన్నిక.

Wednesday, September 1, 2010

'విడుపుల' పాయేనా..! లాస్ట్ చాన్స్ గురువారం ఇడుపులపాయకు మొయిలీ.. జగన్‌తో చివరిసారిగా రాయబారం

ఫలితం తెలిసినా తుది యత్నం...
వైఎస్ జపం వెనుక పక్కా వ్యూహం
తమ తప్పు లేదని చెప్పడమే లక్ష్యం..
నిర్లక్ష్యం చేయలేదనే సంకేతాలు
రేపటి నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు..
తేల్చి చెప్పిన యువనేత వర్గం
విషయం ఆఖరి అంకానికి చేరింది. దారులు వేరయ్యే సమయం సమీపించింది. 'అడుగు ముందుకే' అని కడప ఎంపీ వైఎస్ జగన్ స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు తెలిసినా... ఆఖరిసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. 'ఫలితం' ముందే తెలిసినప్పటికీ తుది రాయబారం చేస్తోంది. గురువారం ఇడుపులపాయలో జరిగే వైఎస్ తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అధిష్ఠానం స్వయంగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీని పంపిస్తోంది.

వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళుతున్న మొయిలీ ఓదార్పు యాత్ర విషయంపై జగన్‌కు చివరిసారి నచ్చజెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొయిలీని పంపడం ద్వారా జగన్‌కు చివరి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిణామాలు ఏ దిశగా సాగుతున్నాయో, ఎవరి వైఖరి ఏమిటో అధిష్ఠానానికీ, జగన్‌కూ... ఇరు వర్గాలకూ తెలుసు.

కానీ... రేపోమాపో జగన్‌పై చర్యలు తీసుకుంటే, దీనిపై ప్రజలకు చెప్పాల్సిన సమాధానాన్ని అధిష్ఠానం సిద్ధం చేసుకుంటోంది. తాము చివరి వరకూ అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, తనదారి తనదే అంటూ జగన్ సొంత నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాన్ని జనంలోకి పంపడమే అధిష్ఠానం ఉద్దేశం.

వైఎస్ వర్ధంతి మరో మూడు రోజులు ఉండగా పార్టీ తరఫున 'ఓదార్పు'ను ప్రకటించడం, ఒక్క రోజు ముందు జరిగిన మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్‌పై ప్రధానితో సహా ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపించడం, పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున వైఎస్‌కు నివాళులు అర్పించడం, వర్ధంతి కార్యక్రమానికి కేంద్ర మంత్రిని పంపించడం... ఇవేవీ అంత తేలిగ్గా తీసుకునే విషయాలు కావు. వీటన్నింటికీ వైఎస్‌పై అధిష్ఠానానికి ఉన్న అపార అభిమానమే కారణం కావొచ్చు! కానీ, అంతకంటే ముఖ్యమైన లక్ష్యం ఒకటుంది.

వైఎస్‌ను ఏ దశలోనూ, ఏ కోశానా తాము నిర్ల క్ష్యం చేయలేదనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే అధిష్ఠానం ఉద్దేశం. ఆయన పట్ల తమకు అపారమైన అభిమానం ఉందని చాటి చెప్పడం, వైఎస్ పార్టీ సొత్తు అని తేల్చిచెప్పడం మరో లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అధిష్ఠానానికి ఈ పరిణామాలన్నింటినీ ప్రజల ముందు ఏకరువు పెట్టే అవకాశం లభిస్తుంది.

అడుగు ముందుకే...: పార్టీ ఆలోచనలు, అభిప్రాయాలతో సంబంధం లేకుండా జగన్ శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర జరిపేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఇడుపులపాయలో తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని, సాయంత్రానికే ప్రకాశం జిల్లాకు ప్రయాణం కావాలని నిర్ణయించారు.

బుధవారం కడప జిల్లాలో పాల్గొన్న కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు పంపారు. పార్టీ నాయకుడిగాకంటే వ్యక్తిగతంగానే తన వెంట నడిచేవారు అధికంగా ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు ఒక నాయకుడు తెలిపారు. జగన్ వేరుకుంపటికి సిద్ధమైనట్టుగా ఈ చర్యలన్నీ చెప్పకనే చెబుతున్నాయని వివరించారు.

మరో రెండు రోజుల్లో అధిష్ఠానం కఠిన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయంగా బలాబలాలు తేలిపోవడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి ఓదార్పు యాత్ర జరగనున్నట్లు ఆ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ప్రకటించారు. యాత్ర యథావిధిగా కొనసాగుతుందని, ఎలాంటి మార్పులూ లేవని బుధవారం ఆయన తెలిపారు.

వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే... పావురాలగుట్ట వద్ద జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్ ఓదార్పు చేపట్టారని బాలినేని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో 15 రోజులపాటు యాత్ర జరుగుతుందని, ఇందులో పాల్గొనాల్సిందిగా ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా అభిమానులు 700 వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేశారని, ఇందులో 300 విగ్రహాలను జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. సహాయం చేస్తామంటూ అధిష్ఠానం చేసిన ప్రకటన, 'వైఎస్ గొప్ప నాయకుడు' అని మన్మోహన్ చేసిన ప్రశంసలేవీ ఓదార్పు యాత్రపై ప్రభావం చూపవని జగన్ వర్గానికి చెందిన నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఓదార్పు సెంటిమెంట్‌తో కూడిన విషయమని తెలిపారు. మరోవైపు... బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నందున జగన్ యాత్ర వాయిదా వేసుకోవడమే మంచిదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు.

ఎప్పుడో నిర్ణయించాం: ద్వివేదీ
జగన్‌పై క్రమశిక్షణ చర్య తీసుకుంటారా? అని అడిగినప్పుడు... "ఆ విషయం అంత సులభంగా చెబుతానా!' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ ఊరించారు. క్రమశిక్షణా సంఘం ప్రతి రెండు మూడు నెలలకోసారి సమావేశమై ఫిర్యాదులను పరిశీలిస్తుందని, గత వారం రక్షణ మంత్రి ఆంటోనీ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్ వోరా రాజ్యసభలో ఉన్నందువల్ల సమావేశం వాయిదా పడిందని ద్వివేదీ చెప్పారు. వచ్చే సమావేశం ఎప్పుడుంటుందో చెప్పలేనన్నారు.

కొసమెరుపు: 'ఆఖరి అవకాశం' జగన్‌కే కాదు, మొయిలీకి కూడా అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ విషయంలో విఫలమైన మొయిలీని త్వరలోనే రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలుస్తోంది.

పార్టీలో జగన్ ఉండకపోవచ్చు - కాంగ్రెస్‌లో ఉంటేనే అతనికి మంచి భవిష్యత్తు

4 నెలల కిందటే నాకు సమాచారం
కాంగ్రెస్‌లో ఉంటేనే అతనికి మంచి భవిష్యత్తు
ప్రస్తుత పోరులో అధిష్ఠానమే గెలుస్తుంది
రాయలసీమ సింహం రాష్ట్రాన్ని తినేస్తుంది
అప్పటి పాలకులు వ్యూహాత్మక ఊబిలో దించేశారు
వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
వైఎస్ ఉన్నా పథకాల అమలు అసాధ్యం
అప్పుడు మాట్లాడకపోవడం తప్పే
నేదురుమల్లి, కోట్లలకు అన్యాయం చేశా   -   డీఎల్ రవీంద్రారెడ్డి
[కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ అనుంగు సహచరుడు డి.ఎల్. రవీంద్రారెడ్డి.]

మీరూ, వైఎస్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఉన్నతస్థాయికి చేరినా మీరెందుకు రాలేకపోయారు?
నేను అంత అగ్రెసివ్ పాలిటీషియన్‌ను కాదు. అధిష్ఠానంతో సంబంధాలు పెట్టుకుని త్వరగా ఎదిగిపోవాలన్న ఆలోచన లేదు. ఎప్పుడూ మంత్రి పదవి కూడా కోరలేదు.

నేదురుమల్లి సీఎం కావడానికి సహకరించారు. ఆయన దిగిపోవడానికీ కారకులయ్యారన్న అభిప్రాయం ఉంది.
అప్పట్లో జనార్దనరెడ్డి కూడా నా తర్వాత నువ్వే. ఎందుకు అసంతృప్తికి గురవుతావు. ప్రజల్లోకి వెళ్లు అన్నా రు. కానీ నాకు ఆ ఆలోచన లేదు. అయితే, నాకు రాజశేఖరరెడ్డి స్నేహితుడు.

జనార్దనరెడ్డి, కోట్ల మంత్రివర్గాల్లో మీకు అవకాశం వచ్చినా.. మీ స్నేహితుడి కేబినెట్‌లో రాలేదు?
బహుశా నా విద్యుక్త ధర్మాన్ని నిర్వహించలేనని ఆయన అనుకున్నారేమో! సాధారణంగా ఏ సీఎంనూ నాకు పదవి కావాలని అడగను. 2004లో నా నియోజకవర్గ ప్రజలు చెబితే ఢిల్లీ వెళ్లాను. రామచంద్రరావుగారితో మాట్లాడా. మంత్రి పదవి కోసం నువ్వు కూడా ఇంత దూరం రావాలా? అన్నారు. అంతే. మళ్లీ ఎన్నడూ అడగలేదు.

నేదురుమల్లిని పదవి నుంచి తొలగించడానికి సహకరించడమే మీకు ప్రతిబంధకం కావచ్చు కదా!
అనుకోవచ్చు కూడా. కానీ మంచి స్నేహితుడి కోసం చేశా. జనార్దనరెడ్డిని రాజీనామా చేయమని చెప్పిన తర్వాత అందరం ఢిల్లీ వెళ్లాం. ద్రోణంరాజు సత్యనారాయణగారు పీవీగారి దగ్గర ఉండే పీవీఆర్‌కే ప్రసాద్‌తో కలిసి వెళ్లాం. రాజశేఖరరెడ్డి కోసం వచ్చాం అని చెప్పాం. సారీ, మేమేం చేయలేము. మరో ఇద్దరు రెడ్డిల మద్దతైనా తీసుకురండి అన్నారు. అంటే, జనార్దనరెడ్డి కానీ విజయభాస్కరరెడ్డి కానీ ఎవరో ఒకరితో చెప్పించుకోమని అన్నారు. ఇద్దరూ చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు వైఎస్ ఎంపీ. ఆయనకు అవకాశం లేదు. మనమెందుకు రవీంద్రను సీఎంగా ప్రపోజ్ చేయకూడదని ద్రోణంరాజు వైఎస్‌ను అడిగారు. వైఎస్ ఏం మాట్లాడలేదని ఆయన చెప్పారు.

పదవి దగ్గరకు వచ్చేసరికి మీ స్నేహాన్ని ఆయన గుర్తించలేదని అర్థమవుతోంది. మీరు మాత్రం.. మీకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు సీఎంలకూ అన్యాయం చేసినట్లే కదా!
ఆ బాధ నాకు ఉంది. నేను తప్పు చేశాను. జనార్దనరెడ్డి, కోట్లలను మోసం చేశానన్న భావన ఉంది. వైఎస్ నన్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి ఇది కారణం అనుకోలేదు. తన తర్వాత తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నాడేమో అనుకున్నా.

ఇద్దరు సీఎంల విషయంలో పశ్చాత్తాపపడ్డారు. మీ స్నేహాన్ని వైఎస్ గుర్తించలేదని ఫీలయ్యారా? ఆయన పట్ల మీ దృక్పథం మారిందా?
మారలేదు. చనిపోయే వరకూ ఆయనతోనే ఉన్నాను.

ఆయన ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నారు. దీనికి ప్రేరణ ఏమిటి?
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ నిర్ణయాలు.. వీటి కారణంగా భవిష్యత్తులో రాబోయే భయంకర పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు. అయినా, ఆయన చెబితే ప్రజా వ్యతిరేకం అని తెలిసినా ఈపీసీ కాంట్రాక్టు సిస్టమ్‌ను అసెంబ్లీలో సమర్థించాను. ప్రతి సందర్భంలోనూ వైఎస్ కోసం మీ క్రెడిబులిటీని ప ణంగా పెట్టారు. ప్రజలకు మీరు అన్యాయం చేసినట్లే కదా!

కొంతమేరకు అన్యాయం చేసినట్లే! ఇప్పుడు ఎందుకు వచ్చానంటే.. ఫ్రీ ఫర్ అల్ అయిపోయింది. 1978 నుంచి చూస్తే రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోయాయని ఓ వ్యక్తి ఇటీవల అంటే ఆరోజు నాకు నిద్ర పట్టలేదు. ఆయన నోటి నుంచి ఆ మాట రావడమా? అని! ఎవరాయన?
ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తే!

జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
కాంగ్రెస్‌లో ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. జనంలోకి పోవడం, చురుకుతనం, ఆర్థికంగా ఆయనకు ఎక్కడలేని వనరులు ఉన్నాయి.

ఎక్కడి నుంచి వచ్చాయి?
అధికారంలో ఉంటే వచ్చాయి.

బయటికి వెళితే భవిష్యత్తు లేనట్టేనా!
బయటికి వెళ్లే అవకాశం లేదని ఆయన అనుయాయులంతా చెబుతున్నారు. కానీ.. ఆయన పార్టీలో ఉండడు అని నాలుగు నెలల కిందటే నాకు ఉన్నత స్థాయిలో సమాచారం అందింది. తన తండ్రి కుర్చీని తనకు ఇవ్వలేదు. కనక కాంగ్రెస్ తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదు కాబట్టి.. సొంత కుంపటిని పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు అని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉంటాడని నేను అనుకోవడం లేదు.

అధికారంలో ఉన్నాడు కనక డబ్బులు సంపాదించారు అని చెప్పారు. కాంగ్రెస్‌లోనే ఉన్నా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయనకు అర్హత ఎలా వస్తుంది?
రాజకీయాల్లో నైతిక విలువలు పోయాయని ఆయన అనడమే అనైతికం. దానిని విశ్లేషించి లోతుల్లోకి వెళితే అసహ్యంగా ఉంటుంది. అయితే, ఐదేళ్లో.. పదేళ్లో.. 15 ఏళ్లకో ఆయన లక్ష్యం చేరవచ్చు.

దానివల్ల మీరు సమాజానికి ఏం చెబుతున్నట్టు. ఐదేళ్లు దుమ్ము దుమ్ముగా దంచి.. తర్వాత ఐదేళ్లు విశ్రాంతి తీసుకుని.. మళ్లీ రావచ్చనే కదా!
మన ప్రజాస్వామ్యం, వ్యవస్థలోనే లోటుపాట్లున్నా యి. పూర్తి నిజాయితీ కలిగిన సీఎం కూడా ప్రస్తుత వ్యవస్థ నుంచి ఎంతో కొంత సొమ్ము చేసుకోవచ్చు. ఇప్పు డు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఏపీఐఐసీ.. గనులు.. జలయజ్ఞం.. ఏదైనా మనం ఏమైనా చేయొచ్చ నే భావన వచ్చే పరిస్థితి కల్పించాం. దీనిపై అప్పట్లోనే మీడియాతో గొంతు కలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. 2004లో వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని మీడియా పిలుపు ఇచ్చినప్పుడు స్పందించకపోవడం నిజంగా నా తప్పే. అదే నా జీవిత కాలంలో అతి పెద్ద తప్పు. అప్పుడు నియంత్రించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

ఇప్పటికైనా మీ పార్టీ అధిష్ఠానం దీనిని గుర్తించిందా?
గుర్తించింది.

ఏం చేయబోతున్నారు?
వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడానికి కారకులైన వ్యక్తులపై విచారణ ఉంటుందని నమ్ముతున్నాను.

మీరు, జేసీ రాయలసీమ సింహాలు కాదు.. రాయలసీమ నక్కలు అని అంబటి రాంబాబు తదితరులు విమర్శించారు...?
రాయలసీమ సింహం రాష్ట్రం మొత్తాన్ని తినేసింది. ఆ చెప్పిన వ్యక్తి ఈ సింహానికి కాపలా కుక్క. ప్రస్తుతం వాళ్ల రాజకీయ ఉన్నత శిఖరాలకు మేం అడ్డుపడుతున్నామేమోనని ఆ విశ్వాసం గల కుక్కలు అనుకుంటున్నాయి.

జగన్ విషయంలో మీ అంచనా?
చెప్పలేం. ఆయన అదృష్టం ఎలా ఉందో. జగన్‌పై సానుభూతి కొంతకాలం ఉన్నా తర్వాత ఉండదు. వైఎస్ ఉన్నా ఆయన పథకాలను ఆయనే అమలు చేయడం అసాధ్యం.

ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అధిష్ఠానం గెలుస్తుందా? జగన్ గెలుస్తాడా?
ఎప్పుడూ అధిష్ఠానమే గెలుస్తుంది.