Saturday, September 11, 2010

అవిఘ్నమస్తు * రోశయ్యకు అభయం.. సీటు పదిలం


ఇప్పట్లో మార్పు ఉండదు..
స్పష్టం చేస్తున్న ఏఐసీసీ వర్గాలు
15 తర్వాత కేబినెట్ ప్రక్షాళన
కనీసం ఆరుగురికి ఉద్వాసన?..
పలువురి శాఖల్లోనూ మార్పులు
తీవ్ర ఉత్కంఠలో నేతలు.. లాబీయింగ్ కోసం ఢిల్లీకి పరుగులు
రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు ఎలాంటి ఢోకా లేదని, ఆయనను మార్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అనుభవజ్ఞుడైన ఆయన సేవలను సాధ్యమైనంత ఎక్కువకాలం ఉపయోగించుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభిప్రాయపడుతున్నట్లు అవి వెల్లడించాయి.

ఇటీవల తనను కలిసిన కొందరు రాష్ట్ర నేతలకు కూడా సోనియా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రోశయ్యను మార్చి, మరో ముఖ్యమంత్రిని నియమిస్తారని వస్తున్న ఊహాగానాలు నిరాధారమని పార్టీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదు సరికదా; త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని వారు చెప్పారు.

ఏఐసీసీ వర్గాలు కూడా దీన్ని ద్రువీకరించాయి. "సెప్టెంబర్ 15 తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఢిల్లీ రావచ్చు. ఆ తర్వాతి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది'' అని అవి వెల్లడించాయి. జగన్‌తో అంటకాగిన మంత్రులకు పునర్‌వ్యవస్థీకరణలో ఉద్వాసన పలుకుతారని, పలువురి శాఖలు మారతాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్ర మంత్రుల నేపథ్యం, వారిపై ఉన్న ఆరోపణలు, వారు రోశయ్యకు సహకరిస్తున్న తీరుతెన్నుల గురించి కాంగ్రెస్ అధ్యక్షురాలి వద్ద ఇప్పటికే పూర్తి సమాచారం ఉందని చెప్పాయి. మొత్తమ్మీద కనీసం ఆరుగురు మంత్రులు ఇంటిదోవ పట్టవచ్చని తెలుస్తోంది. కొత్త మంత్రుల నియామకం విషయంలో రోశయ్యకు స్వేచ్ఛ ఉంటుందని, ఆయన ప్రతిపాదనలను అధిష్ఠానం పూర్తిగా గౌరవిస్తుందని ఢిల్లీ వర్గాలు సంకేతాలిచ్చాయి.

రోశయ్య ఇటీవల అస్వస్థతకు గురవడం పట్ల అధిష్ఠానం కొంత ఆందోళన చెందినప్పటికీ, అది కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే నన్న సమాచారం అధినేత్రికి అందిందని, డాక్టర్ల నుంచి కూడా ఏఐసీసీ సమాచారం సేకరించిందని తెలిసింది. రోశయ్యకు ఆరోగ్యం అసలే బాగా లేదని, ఆయనకు పక్షవాతం వచ్చిందని, ఆయన పని చేయడం కష్టమని వచ్చిన వదంతులను పార్టీ సీనియర్ నేతలు కొట్టి పారేస్తున్నారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన కొందరు నేతలు ఈ వదంతుల వెనుక ఉన్నారని అధిష్ఠానం భావిస్తున్నది. వైరల్ ఫీవర్ వస్తే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా కొంత బలహీనపడడం సాధారణమేనని, దాన్ని గోరంతలు కొండంతలు చేయనవసరం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ గురించి కూడా తరచూ ఇలాంటి వార్తలు వస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రోశయ్య అనుభవం తమకు అవసరమని, పార్టీ వ్యవహారాల్లో ఆయన కలగజేసుకోకపోవడం, జగన్ విషయాన్ని తమకే వదిలి వేయడం సరైన దృక్పథమేనని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. "రోశయ్యను కాక మరెవరిని పెట్టినా కొత్త రకమైన ఇబ్బందులు వస్తాయి. అంతేకాక ఎన్నికలు జరిగేందుకు దాదాపు మూడున్నరేళ్లు ఉన్న దృష్ట్యా ఇప్పుడే ముఖ్యమంత్రిని మార్చడంలో అర్థం లేదు.

జగన్, తెలంగాణ మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రాధాన్య సమస్యలు. వాటిని ఏ విధమైన వ్యూహంతో ఎదుర్కోవాలన్న దాని గురించే అధిష్ఠానం ఆలోచిస్తున్నది'' అని ఆ వర్గాలు వివరించాయి. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న పార్టీ నేతలు, కార్యకర్తల గురించి కూడా అధిష్ఠానం వద్ద పూర్తి సమాచారం ఉంది.

ఈ నేపథ్యంలో, అన్నింటి కన్నా ముందుగా, పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు, పార్టీలో అన్ని స్థాయిల్లో విధేయుల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అగ్ర నేతలు భావిస్తున్నారు. ఈ ప్రక్షాళన కార్యక్రమం అక్టోబర్ మూడో వారానికి పూర్తి కావచ్చు. పరిస్థితులను పూర్తిగా చక్కదిద్దిన తర్వాతే ముఖ్యమంత్రి విషయంలో ఏమి చేయాలన్న దానిపై అధిష్ఠానం దృష్టి సారిస్తుందని, అది ఇప్పట్లో జరిగే అవకాశం లేనే లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ముఖ్యమంత్రి అంటే కాలికి బలపం కట్టుకుని, ఎప్పుడూ ఎడాపెడా తిరగడమేనన్న అభిప్రాయాన్ని చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి కలిగించారని, గతంలో ఏ ముఖ్యమంత్రీ చంద్రబాబు, వైఎస్‌లాగా తిరిగిన దాఖలాలు లేవని ఢిల్లీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి మధ్యాహ్న భోజనం తర్వాత ఇంటికి వెళ్లి, సాయంత్రం మళ్లీ కొద్దిసేపు సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రులు ఉన్నారని, అయినా వారు ప్రభుత్వ వ్యవహారాలను సమర్థంగానే నిర్వహించే వారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అందువల్ల చంద్రబాబు, వైఎస్‌ల మాదిరిగా రోశయ్య జనంలో ఎక్కువగా తిరగలేకపోయినా, ఆయన సమర్థతకు ఢోకా లేదని అధిష్ఠానం భావిస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్‌లో, కేబినెట్‌లో భారీ ప్రక్షాళన ఉంటుందన్న అధిష్ఠానం సంకేతాల నేపథ్యంలో పార్టీ నేతల్లో ఉత్కంఠ మొదలైంది. అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు, ఉన్న పదవులు కాపాడుకునేందుకు కొందరు, పదవులను దక్కించుకునేందుకు మరికొందరు ఎవరి ప్రయత్నాల్లో వారు పడ్డారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు రాష్ట్ర నేతలు ఢిల్లీకి పయనమవుతున్నారు.

నిన్న మొన్నటి వరకూ అధిష్ఠానం అంటే ఏమిటో తెలియదన్న నేతలు కూడా ఇప్పుడు ఢిల్లీ యాత్ర కోసం బ్యాగులు సర్దుకుంటున్నారు. వీరిలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు ఉన్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో లాబీయింగ్ చేయడం తెలియని నేతలు కూడా, ఇప్పుడు అధినేత్రిని కలసి హాజరు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్ర పరిస్థితులను ఆమెకు వివరించడంతో పాటు.. అధిష్ఠానం వైఖరి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు కూడా తమ పర్యటన దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీకి చేరిన పలువురు నేతలు సోనియాను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకుల కంటే ముందే, సోనియా వారితో రాష్ట్ర వ్యవహారాల గురించి ప్రస్తావిస్తున్నారు.

రాష్ట్ర వ్యవహారాల పట్ల ఆమె అసంతృప్తిగానే ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోకుండా, పూర్తిగా వైఎస్ రాజశేఖరరెడ్డిపైనే విశ్వాసం ఉంచి తప్పు చేశామేమోనన్న అభిప్రాయం అధిష్ఠానంలో కన్పిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

1985, 1999ల్లో రెండు దఫాలుగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారని, అయినా యువ నేతగా పార్టీని ముందుకు నడిపిస్తారన్న విశ్వాసంతో ఆయనను ప్రోత్సహించామని సోనియా తనను కలిసిన వారితో అన్నట్టు సమాచారం.

2004లో సంప్రదాయం ప్రకారం పీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించకుండా, వైఎస్‌ను సీఎం చేయడం, రెండోసారి కూడా (2009లో) అవకాశం ఇవ్వడంపై అధిష్ఠానంలో అంతర్మథనం మొదలైందని మేడమ్‌ను కలిసిన నేతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన సమయంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గురించి ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి సమాచారం అందించే వారని, కానీ వీరప్ప మొయిలీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అధిష్ఠానం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనలో, ముందుగా మొయిలీపైనే వేటు వేయాలన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉంది. బుధ, గురువారాల్లో తనను కలిసిన రాష్ట్ర నేతల ఎదుట సోనియా స్వయంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మెయిలీ ఒక పక్షానికి మాత్రమే దూతగా వ్యవహరిస్తూ వచ్చారని ఒక నేత ప్రస్తావించినప్పుడు, సోనియా కూడా ఏకీభవించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా నాలుగోసారి ఎన్నికైన తర్వాత, పార్టీ కమిటీలన్నీ ఆటోమేటిక్‌గా తక్షణమే రద్దయి పోతాయని, ప్రస్తుతం ఆమె స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా ఉంటారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మొయిలీ ఇకపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగే అవకాశమే లేదని తెలిపాయి.

No comments:

Post a Comment