ఫలితం తెలిసినా తుది యత్నం...
వైఎస్ జపం వెనుక పక్కా వ్యూహం
తమ తప్పు లేదని చెప్పడమే లక్ష్యం..
నిర్లక్ష్యం చేయలేదనే సంకేతాలు
రేపటి నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు..
తేల్చి చెప్పిన యువనేత వర్గం
వైఎస్ జపం వెనుక పక్కా వ్యూహం
తమ తప్పు లేదని చెప్పడమే లక్ష్యం..
నిర్లక్ష్యం చేయలేదనే సంకేతాలు
రేపటి నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు..
తేల్చి చెప్పిన యువనేత వర్గం

వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళుతున్న మొయిలీ ఓదార్పు యాత్ర విషయంపై జగన్‌కు చివరిసారి నచ్చజెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొయిలీని పంపడం ద్వారా జగన్‌కు చివరి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిణామాలు ఏ దిశగా సాగుతున్నాయో, ఎవరి వైఖరి ఏమిటో అధిష్ఠానానికీ, జగన్‌కూ... ఇరు వర్గాలకూ తెలుసు.
కానీ... రేపోమాపో జగన్‌పై చర్యలు తీసుకుంటే, దీనిపై ప్రజలకు చెప్పాల్సిన సమాధానాన్ని అధిష్ఠానం సిద్ధం చేసుకుంటోంది. తాము చివరి వరకూ అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, తనదారి తనదే అంటూ జగన్ సొంత నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాన్ని జనంలోకి పంపడమే అధిష్ఠానం ఉద్దేశం.
వైఎస్ వర్ధంతి మరో మూడు రోజులు ఉండగా పార్టీ తరఫున 'ఓదార్పు'ను ప్రకటించడం, ఒక్క రోజు ముందు జరిగిన మన్నవరం ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్‌పై ప్రధానితో సహా ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపించడం, పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున వైఎస్‌కు నివాళులు అర్పించడం, వర్ధంతి కార్యక్రమానికి కేంద్ర మంత్రిని పంపించడం... ఇవేవీ అంత తేలిగ్గా తీసుకునే విషయాలు కావు. వీటన్నింటికీ వైఎస్‌పై అధిష్ఠానానికి ఉన్న అపార అభిమానమే కారణం కావొచ్చు! కానీ, అంతకంటే ముఖ్యమైన లక్ష్యం ఒకటుంది.
వైఎస్‌ను ఏ దశలోనూ, ఏ కోశానా తాము నిర్ల క్ష్యం చేయలేదనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే అధిష్ఠానం ఉద్దేశం. ఆయన పట్ల తమకు అపారమైన అభిమానం ఉందని చాటి చెప్పడం, వైఎస్ పార్టీ సొత్తు అని తేల్చిచెప్పడం మరో లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో అధిష్ఠానానికి ఈ పరిణామాలన్నింటినీ ప్రజల ముందు ఏకరువు పెట్టే అవకాశం లభిస్తుంది.
అడుగు ముందుకే...: పార్టీ ఆలోచనలు, అభిప్రాయాలతో సంబంధం లేకుండా జగన్ శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర జరిపేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఇడుపులపాయలో తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని, సాయంత్రానికే ప్రకాశం జిల్లాకు ప్రయాణం కావాలని నిర్ణయించారు.
బుధవారం కడప జిల్లాలో పాల్గొన్న కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు పంపారు. పార్టీ నాయకుడిగాకంటే వ్యక్తిగతంగానే తన వెంట నడిచేవారు అధికంగా ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు ఒక నాయకుడు తెలిపారు. జగన్ వేరుకుంపటికి సిద్ధమైనట్టుగా ఈ చర్యలన్నీ చెప్పకనే చెబుతున్నాయని వివరించారు.
మరో రెండు రోజుల్లో అధిష్ఠానం కఠిన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయంగా బలాబలాలు తేలిపోవడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి ఓదార్పు యాత్ర జరగనున్నట్లు ఆ జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ప్రకటించారు. యాత్ర యథావిధిగా కొనసాగుతుందని, ఎలాంటి మార్పులూ లేవని బుధవారం ఆయన తెలిపారు.
వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే... పావురాలగుట్ట వద్ద జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్ ఓదార్పు చేపట్టారని బాలినేని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో 15 రోజులపాటు యాత్ర జరుగుతుందని, ఇందులో పాల్గొనాల్సిందిగా ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా అభిమానులు 700 వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేశారని, ఇందులో 300 విగ్రహాలను జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. సహాయం చేస్తామంటూ అధిష్ఠానం చేసిన ప్రకటన, 'వైఎస్ గొప్ప నాయకుడు' అని మన్మోహన్ చేసిన ప్రశంసలేవీ ఓదార్పు యాత్రపై ప్రభావం చూపవని జగన్ వర్గానికి చెందిన నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఓదార్పు సెంటిమెంట్‌తో కూడిన విషయమని తెలిపారు. మరోవైపు... బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని అధిష్ఠానం నిర్ణయించుకున్నందున జగన్ యాత్ర వాయిదా వేసుకోవడమే మంచిదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హితవు పలికారు.
ఎప్పుడో నిర్ణయించాం: ద్వివేదీ
జగన్‌పై క్రమశిక్షణ చర్య తీసుకుంటారా? అని అడిగినప్పుడు... "ఆ విషయం అంత సులభంగా చెబుతానా!' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ ఊరించారు. క్రమశిక్షణా సంఘం ప్రతి రెండు మూడు నెలలకోసారి సమావేశమై ఫిర్యాదులను పరిశీలిస్తుందని, గత వారం రక్షణ మంత్రి ఆంటోనీ, ప్రధాన కార్యదర్శి మోతీలాల్ వోరా రాజ్యసభలో ఉన్నందువల్ల సమావేశం వాయిదా పడిందని ద్వివేదీ చెప్పారు. వచ్చే సమావేశం ఎప్పుడుంటుందో చెప్పలేనన్నారు.
కొసమెరుపు: 'ఆఖరి అవకాశం' జగన్‌కే కాదు, మొయిలీకి కూడా అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ విషయంలో విఫలమైన మొయిలీని త్వరలోనే రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలుస్తోంది.
No comments:
Post a Comment