Monday, September 13, 2010

జగన్‌పై గురి.. * ఆర్థిక మూలాలపై అధిష్ఠానం అస్త్రం * జగన్‌కంపెనీల ఇన్వెస్టర్లకు ఐటీ నోటీసులు

'జగతి కిలాడీల'పై సీరియస్‌గా దర్యాప్తు..
చట్ట ఉల్లంఘనలపై దృష్టి
రంగంలోకి ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐబీ అధికారులు
కేవీపీ వియ్యంకుడి కంపెనీలకూ శ్రీముఖాలు!
ధిక్కారంపై తొలి దెబ్బ! అదను చూసి అధిష్ఠానం నుంచి 'ఆర్థిక అస్త్ర' ప్రయోగం. జగన్ లక్ష్యంగా.. ఐటీ శాఖ నుంచి శ్రీముఖాలు. ఆయన కంపెనీల్లో అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు నోటీసులు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐబీ అధికారులు రంగంలోకి. వెరసి ఏక కాలంలో ముప్పేట దాడి!! జగన్ కంపెనీల గుట్టును ఆంధ్రజ్యోతి ఎప్పుడో బయటపెట్టింది. ఇప్పుడు అవే అధిష్ఠానం చేతి అస్త్రాలయ్యాయి.

హైదరాబాద్, సెప్టెంబర్ 13 : అదే పనిగా అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ, సమాంతర శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం 'ఆర్థిక' అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. జగన్‌కు సంబంధించిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీల డొంక కదిల్చే పని మొదలైంది.

ఆ లావాదేవీల వివరాల లోగుట్టును బయటపెట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు రంగంలోకి దిగారు. జగన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాల వివరాలను, ఆ నిధుల మూలాన్ని తెలియజేయాలని ఆదేశిస్తూ ఆయా ఇన్వెస్టర్లకు ఐటీ శాఖ నుంచి తాజాగా నోటీసులు జారీ అయినట్టు తెలిసింది. మొత్తం పది కంపెనీలకు ఇలా నోటీసు లు జారీ అయ్యాయన్నది విశ్వసనీయ సమాచారం.

జగన్ కంపెనీల ఇన్వెస్టర్లలో కొందరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మరికొన్ని అనామక కంపెనీలూ ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఉన్న కొన్ని కంపెనీలు దమ్మిడీ రాబడి లేకున్నా జగన్ కంపెనీల్లో భారీ ప్రీమియంతో కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేశాయి. ఈ కంపెనీల గుట్టు రట్టు చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయంతో ఐటీ అధికారులు ఉన్నారు. ఈ కోల్‌కతా కంపెనీల్లో రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్టయినవి కూడా కావడంతో, వీటి వ్యవహారంపై ఆరా తీయాల్సిందిగా సెబీని కూడా సంబంధిత అధికారులు ఆదేశించినట్టు చెబుతున్నారు.

ఈ తాజా వ్యవహారం జగన్ శిబిరంలో కలకలం సృష్టిస్తున్నట్టు తెలిసింది. జగన్ కంపెనీల పుట్టుక-పెట్టుబడుల తీరుతెన్నులపై 'ఆంధ్రజ్యోతి' గతంలో వరుసగా పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. 'జగతి కిలాడీలు'.. 'విదేశీ సాక్షి', 'శూన్యంలోంచి సాక్షి భూతం' తదితర శీర్షికలతో వచ్చిన ఆ సంచలనాత్మక కథనాలే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలో అస్త్రాలుగా మారాయన్నది మరో కీలక సమాచారం. ఆ కథనాల్లో సమగ్రంగా ఉన్న వివరాల ఆధారంగానే ఇప్పుడు మొత్తం లోగుట్టును విప్పే పని ప్రారంభమైనట్లు చెబుతున్నారు.

వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాల ఆందోళనతో ఐటీ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించినప్పటికీ, నాడు శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న వైఎస్.. కేంద్ర ప్రభుత్వ అండదండలు, అధికార బలంతో ఐటీఅధికారులు ముందుకు పోకుండా నిలువరించారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అధిష్ఠానంతో జగన్ గ్రూప్‌కు పూర్తి స్థాయిలో సంబంధాలు చెడిపోయాయి. ఈ నేపథ్యంలో జగన్ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అక్రమాలనే అస్త్రంగా మలిచి ఆయనపై ప్రయోగించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్టుగా చెబుతున్నారు.

ఇండ్ భారత్ గ్రూప్‌నకు కూడా..
వైఎస్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు, ఇండ్ భారత్ ఇన్‌ఫ్రా, ఇండ్ భారత్ పవర్, ఇండ్ భారత్ ఎనర్జీ కంపెనీల యజమాని రఘరామకృష్ణంరాజు(రఘు)కు, ఆయన కంపెనీలకు కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయినట్టుగా సమాచారం. ఒక చిన్న బయోమాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం నుంచి మొదలుపెట్టి అతి స్వల్ప కాలంలోనే రఘురాజు వందల కోట్ల రూపాయలతో తన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని విస్తరించారు.

కొద్దికాలం క్రితం వెయ్యి కోట్ల రూపాయల భారీ పబ్లిక్ ఇష్యూకు సన్నాహాలు కూడా చేశారు. ఈ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వాటిలో అనేక అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలూ ఉన్నాయి. ఈ కంపెనీల లావాదేవీలకు సంబంధించి కూడా అక్రమ ని«ధుల చలామణి వంటి ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.

రెండు అంశాలు కీలకం..
జగన్ కంపెనీలకు సంబంధించి రెండు అంశాలను ప్రధానంగా చేసుకుని ఐటీ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును సాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకటి.. జగన్ కంపెనీల్లోకి వివిధ సంస్థలు, వ్యక్తుల ద్వారా ప్రవహించిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి(మనీలాండరింగ్ ఆరోపణలు)? రెండు విదేశీ పెట్టుబడుల నిబంధనలను జగన్ కంపెనీలు ఉల్లంఘించాయా? స్థూలంగా ఈ ఆరోపణలు కంపెనీల చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం.. పరిధిలోకి వస్తాయి.

దివంగత నేత వైఎస్ ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను గమనించిన అధిష్ఠానం.. జగన్ అక్రమ ఆస్తులు, సంపాదన విషయాన్ని, చట్టాల ఉల్లంఘనను తమ చేతికి మట్టి అంటకుండా చట్ట సంస్థల ద్వారానే బయటకు వచ్చేట్టు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. వైఎస్ వారసుడిగా, దీన జన రక్షకుడిగా పాజిటివ్ ఇమేజ్‌తో జగన్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ఆయన వర్గీయులకు ఇది ఊహించని దాడి. నేరుగా ఆర్థిక మూలాలపై దెబ్బ తగిలితే జగన్ తట్టుకోవడం కూడా కష్టమే!

సండూరు టు జగతి!
జగన్ కంపెనీలకు మూల విరాట్టుగా ఉన్న సండూరు పవర్‌లో ఇన్వెస్ట్ చేసిన రెండు విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు 2ఐ క్యాపిటల్, ఫ్లూరి ఇన్వెస్ట్‌మెంట్‌కు నిధులు ఎక్కడి నుంచి అందాయనే అంశంపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. సండూర్ పవర్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ అంచలంచెలుగా కార్మెల్ ఆసియా అనే కంపెనీకి.. అందులోంచి జగతి పబ్లికేషన్స్‌లోకి వచ్చాయి.

భారతీయ చట్టాల ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ముందస్తు అనుమతి అనివార్యంగా తీసుకోవాలి. ఆటోమేటిక్ మార్గంలో మీడియాలో ఇన్వెస్ట్ చేయడానికి వీలులేదు. సండూర్ పవర్ నుంచి లోపాయకారీ పద్ధతుల్లో విదేశీ నిధులనే తమ పత్రికలోకి జగన్ మళ్లించారు. ఇది స్పష్టంగా చట్టాలను ఉల్లంఘించడమే అని అధికారులు అంటున్నారు. మరోవైపు ప్లూరి ఎమర్జింగ్‌కు వ్యతిరేకంగా పలు ఆరోపణలూ ఉన్నాయి.

వీటిపై ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరిపినట్టుగా తెలిసింది. లండన్‌లోని యూబీఎస్ బ్యాంకు శాఖలోని ఖాతాల్లో జరిగిన గోల్‌మాల్‌లో కొన్ని వందల కోట్ల డాలర్లు బినామీ ఖాతాలు, కంపెనీల ద్వారా భారత మార్కెట్ చేరినట్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నిధుల మళ్లింపులో ప్లూరి ఎమర్జింగ్ క్యాపిటల్ పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది.

నీవు నేర్పిన విద్యయే!
గతంలో జగన్ కంపెనీల అవినీతి బాగోతాన్ని 'ఆంధ్రజ్యోతి' సీరియల్‌గా ప్రచురించినప్పుడు.. కక్ష గట్టిన నాటి ప్రభుత్వ నేతలు అధికార యంత్రంగాన్ని రెచ్చగొట్టి కక్ష సాధింపు ప్రయత్నాలు చేశారు. కేంద్రంలో తమకున్న పలుకుబడి, రాష్ట్రంలో తమ అధికార బలంతో పీఎఫ్ అధికారులను, ఈఎస్ఐ అధికారులను 'ఆంధ్రజ్యోతి'పై దాడులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఐటీ అధికారులతో నోటీసులు ఇప్పించారు.

బిల్డింగ్ నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన అంటూ మున్సిపల్ అధికారులను కూడా ఉసిగొల్పారు. అన్ని రకాల దాడులనూ 'ఆంధ్రజ్యోతి' నిబ్బరంగా ఎదుర్కొంది. ఇప్పుడు అదే అధికార యంత్రాంగాన్ని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం కూడా తన అస్త్రంగా మలచుకొని.. జగన్‌కు ఆయన అసలు స్థానమేమిటో తెలియజెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం!!

No comments:

Post a Comment