Saturday, September 11, 2010

రసకందాయంలో రాష్ట్ర రాజకీయం తెరపైకి జైపాల్‌

jaipal
రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకో నున్నాయా? ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుర్చీ కదులుతోందా? ఆయన స్థానంలో కేంద్రమంత్రి సూటిని జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రానున్నారా? ఆ మేరకు అధి ష్ఠానం సూచనలతో తనపై పార్టీలో ఉన్న వ్యతిరేకత స్థానం లో సానుకూలత సాధించే దిశగా జైపాల్‌ పావులు కదుపు తున్నారా?.. అందులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల ద్వారా మంత్రాంగం నెరపుతున్నారా?.. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఇలాంటి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... ముఖ్యమంత్రి రోశయ్యకు రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండటంతో పాటు.. ఆయన పార్టీని-ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని నాయకత్వం గ్రహించింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రతిపక్షాలను సమర్థ వంతంగా ఎదుర్కోలేకపోవడం, ప్రజల్లో పార్టీ- ప్రభుత్వం పై విశ్వాసం పెంపొందించడంలో రోశయ్య చొరవ తీసుకోలేకపోతున్నారని, తనకు కంటగింపుగా మారిన జగన్‌ వ్యవహారాన్ని సైతం రోశయ్య తన రాజకీయాను భవంతో పరిష్కరించకుండా భారమంతా తనపైనే వేయడంపై నాయకత్వం అసంతృప్తితో ఉంది. రోశయ్యపై సానుభూతి ఉన్నప్పటికీ, ఆయన వ్యవహారశైలి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారం లోకి రావడం కష్టమన్న అభిప్రాయంతో ఉన్నట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. ఉధృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో పార్టీ భవితవ్యానికి ప్రతిబంధకంగా మారడంతో నాయకత్వ మార్పుపై దృష్టి సారించడం అనివార్యంగా మారిందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అందులో భాగంగా తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ మేరకు సీనియర్‌ నేత, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించనున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జైపాల్‌ నియామకం ద్వారా ఇటు తెలంగాణ వాద తీవ్రతను, అటు సీమాంధ్ర లో మెజారిటీ సంఖ్యలో ఉన్న రెడ్డి వర్గం ఎమ్మెల్యేల మనో భావాలనూ తృప్తి పరిచినట్లు ఉంటుందన్న వ్యూహంతోనే జైపాల్‌రెడ్డిని తెరపైకి తీసుకువస్తున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి.. జైపాల్‌రెడ్డి కూడా చాలాకాలం నుంచి రాష్ట్రంపై కన్నేసినప్పటికీ గుంభనంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వైఎస్‌ జీవించి ఉన్నంతకాలం అలాంటి ఆలోచన చేయనప్పటికీ, వైఎస్‌ వ్యతిరేక వర్గమంతా జైపాల్‌తో నిరంతరం సమాలోచనలు చేసేదన్నది బహి రంగం. చివరకు తెలంగాణ అంశంలో సైతం జైపాల్‌రెడ్డి ఏనాడూ పెదవి విప్పలేదు. అయినప్పటికీ, తెరవెనుక పావులు కదుపుతూనే ఉన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా రావడం, ఆయనపై నాయకత్వానికి వ్యక్తిగతంగా సాను భూతి, గౌరవం ఉన్నప్పటికీ పార్టీని-ప్రభుత్వాన్ని సమర్థ వంతంగా సమన్వయం చేయలేకపోతున్నారన్న అధిష్ఠానం అసంతృప్తిని గమనించిన జైపాల్‌రెడ్డి, దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలో దిగారని చెబుతున్నారు. అందుకే ఏనాడూ రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యక్ష ఆసక్తి, నేతల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కాని జైపాల్‌ ఇటీవలి కాలంలో వాటిలో కనిపిస్తున్నారు.

ఆ క్రమంలో అధిష్ఠానానికి తన మనోభావాన్ని వ్యక్తీకరించడం, నాయకత్వం కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో జైపాల్‌ పని సులవవుతోందంటున్నారు. అయితే.. తనకు సీమాంధ్రలో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, తెలంగాణలోనే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని జైపాల్‌ అధిష్ఠానం వద్ద వాస్తవ పరిస్థితిని విశ్లేషించినట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. తెలంగాణకు చెందిన తనను నియమించడం ద్వారా.. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం కూడా జరగవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆ ప్రకారం.. రెండు ప్రాంతాలకు చెందిన ప్రముఖుల ద్వారా వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోమని నాయకత్వం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఆ మేరకు రంగంలోకి దిగిన జైపాల్‌రెడ్డి తనకు అనుకూలంగా వ్యవహరించే తెలంగాణ, సీమాంధ్ర మంత్రులు, సీనియర్లతో మంతనాలకు తెరలేపారు. ఈ విషయంలో జైపాల్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర వారి ద్వారానే తనకు సీఎం ఇవ్వాలని ప్రతిపాదించడం ద్వారా కష్టపడ కుండా లక్ష్యం నెరవేర్చుకోవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది.

తాజాగా శుక్రవారం సీమాంధ్రకు చెందిన మంత్రులు గాదె వెంకటరెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జానారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, భిక్షపతి యాదవ్‌, కవితతో గంటసేపు జైపాల్‌తో భేటీ అవటం ఈ అనుమానం, చర్చలకు మరింత బలం చేకూర్చింది. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా రెడ్డి వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రత్యేక-సమైక్య వాదాలు మొదలయి పార్టీ రెండుగా చీలిన నేపథ్యంలో.. సీమాంధ్రకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికలు, సమావేశాలకు సారథ్యం వహిస్తోన్న గాదె వెంకటరెడ్డి, బీసీ కార్డుతో సీఎం కావాలని ప్రయత్నిస్తోన్న బొత్స సత్యనారాయణ ఇద్దరూ జైపాల్‌తో భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

సీమాంధ్రలో వారిద్దరినీ తన పక్షాన సమన్వయకర్తలు గా నియమించుకుని, తన ముఖ్యమంత్రి పదవి కోసం వారి ద్వారా రెడ్డి, బీసీ ఎమ్మెల్యేల మద్దతు సంపాదించా లన్న వ్యూహంతో అడుగులేస్తున్నట్లు జైపాల్‌ వ్యూహం కనిపిస్తోంది. 58 మంది రెడ్డి ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి చెందని వ్యక్తి సీఎంగా ఉండటం జీర్ణించుకోలేని వాస్తవాన్ని గ్రహించిన జైపాల్‌ ఆ మేరకు వారిని సంతృప్తి పరిచేందుకు కులం కార్డును ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవు తోంది. అదే సమయంలో తెలంగాణలో తనకు శిష్యుడ యిన మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తెలంగాణలోని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమా చారం. అటు రెడ్డి, ఇటు తెలంగాణ కార్డును ఏకకాలంలో వినియోగించుకోవడం ద్వారా తన లక్ష్యం సాధించుకోవా లన్నది జైపాల్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

డిఎల్‌ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి వంటి సీమాంధ్ర రెడ్డి నేతలు సైతం జైపాల్‌రెడ్డికి మద్దతునిస్తు న్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, వారిద్దరి భేటీకి ప్రాధాన్యం లేదని, అది సాధారణ సమావేశమమేనని జైపాల్‌ సన్నిహితులు చెబుతున్నారు.ఇదిలాఉండగా.. జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతలు అప్రమత్తమవుతున్నారు.

గతంలో చెన్నారెడ్డి, ఆ తర్వాత చిన్నారెడ్డి వంటి రెడ్డి వర్గ నేతలు తమకు పదవులు రాగానే తెలంగాణ ఉద్యమాన్ని అటకెక్కించడమే కాకుండా, అసలు తెలంగాణ అసవరం లేదని ప్రకటించిన వైనాన్ని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీఎంగా రోశయ్య కొనసాగడమే మంచిదని, జైపాల్‌రెడ్డి సీఎం అయితే, గతంలో చెన్నారెడ్డి మాదిరిగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసి, అటకెక్కిస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతానుభవాల దృష్ట్యా తెలంగాణ రెడ్డికి సీఎం ఇవ్వకూడదని బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యమాన్ని కూడా రెడ్డి వర్గమే నడిపిస్తోందని, ఇక రేపు జైపాల్‌రెడ్డి సీఎం అవుతే దాన్ని కూడా ప్రభావితం చేస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment