Monday, November 1, 2010

భారత రాజకీయాల్లో ... భారత జాతీయ కాంగ్రెస్ .. మార్క్సిజం

'మార్క్సిస్టులెవర్నీ తీసుకోలేదు నేను'

" నేను వదిలేసిన భావనలలో మార్క్సిజం ముఖ్యమైనది. 1920లోనే మాస్కోలో నివసిస్తున్న కొందరు భారతీయ రాడికల్స్- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సిపిఐ)ని ప్రారంభించారు. 1925 నుంచి గాని అది మన దేశంలో పనిచేయటం ప్రారంభించలేదు. అప్పటి నుంచి భారత రాజకీయాల్లో మార్క్సిజం ఏదో ఒక రూపంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూనే ఉంది. ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో - భారత జాతీయ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించిన వారిలో కమ్యూనిస్టులు ముఖ్యులు.

1947లో మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా వీరు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ స్వాతంత్య్రం ఇద్దరు బూర్జువాల మధ్య జరిగిన అధికార మార్పిడి అని.. భారత్‌లో అధికారం తెల్ల బూర్జువా నుంచి నల్ల బూర్జువాకు మారిందని ఎద్దేవా చేశారు. 1948లో అప్పుడే పుట్టిన భారత రాజ్యంపై సీపీఐ ఒక సాయుధ తిరుగుబాటు కూడా చేసింది. దీనిని కట్టడిచేయటానికి మూడేళ్లు పట్టింది. చివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల.. సోవియట్ నియంత స్టాలిన్ ప్రభావితం చేయటం వల్ల-(ఆ సమయంలో పాశ్చాత్య దేశాల పాలనలో ఉండి స్వాతంత్య్రం పొందిన దేశాలను స్నేహం చేసుకోవటానికి సోవియట్ యూనియన్ ప్రయత్నించేది)- విప్లవకారులు అండర్‌గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటించారు.

1950లలో సీపీఐ ఎన్నికల్లో పోరాడింది. అప్పుడప్పుడు గెలుస్తూ వచ్చింది కూడా. ఆ తర్వాత 1960లలో ఆ పార్టీ - సీపీఐ, సీపీఎంగా చీలిపోయింది. సీపీఐ కేవలం రష్యా పట్ల అభిమానం చూపించేది. సీపీఎం మాత్రం రష్యా, చైనా- రెండింటి పట్ల అభిమానం చూపించేది. 1970లలో సీపీఎం మళ్లీ రెండుగా చీలిపోయింది. చీలిపోయిన భాగం- సాయుధ విప్లవం ద్వారా భారత రాజ్యాన్ని కూలదోయటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంది. మావోయిస్ట్ చైనా ఈ చీలిక భాగానికి మార్గదర్శి. "చైనా ఛైర్మనే మా ఛైర్మన్'' అనే వారి స్లోగన్ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది...

లేకపోవటానికి కారణమిదే..
భారతీయ మార్క్సిస్టులను నా పుస్తకంలో చేర్చకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. వారి భావజాలం మరొక దగ్గర నుంచి అందిపుచ్చుకున్నది. "భారతీయ మార్క్సిస్టులు దేశాన్ని మార్క్స్ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చేయాలనుకుంటారు తప్ప దేశ పరిస్థితులకు అనుగుణంగా మార్క్స్ సిద్ధాంతాన్ని మార్చుకోవటానికి ససేమిరా అంటారు'' అని ఆంథొనీ పేరెల్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.

రష్యా, చైనా అనుభవాల ఆధారంగా భారత ఉపఖండంలో వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది వారి ఉద్దేశం. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, మావోల ఆలోచనలను కొత్త కోణంలో అందించిన భారతీయ మార్క్సిస్టు మేధావులు ఎవరూ లేరు. అందుకే మార్క్సిస్టులు కాని మార్క్సిజం కాని ఈ పుస్తకంలో నేరుగా లేకపోయినా- అంతర్లీనంగా వారి ప్రస్తావన వస్తూనే ఉంటుంది.

బోస్, పటేల్ లేరు..
భారత జాతీయోద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన మరో ఇద్దరు మహోన్నత నేతలను కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. వీరు సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్. 1930లలోను, 1940లలోను బోస్ అనేక మంది యువతీయువకులను ప్రభావితం చేశాడు. బ్రిటిష్ వారిపై పోరాడటానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఇక పటేల్ విషయానికి వస్తే- 1947 ముందు కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు. స్వాతంత్య్రం తర్వాత సంస్థానాలు భారతదేశంలో విలీనం కావటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అయినా వీరిద్దరిని వదిలివేయటానికి కూడా ఒక ప్రధాన కారణం- వారికి సంబంధించి, ప్రచురితమైన పబ్లికేషన్స్‌లో- తమకు మాత్రమే సొంతమైన భావనలు (ఒరిజినల్ థాట్) లేకపోవటమే.

వారిద్దరు కార్యాచరణ వీరులు. వీరిద్దరి మాదిరిగానే ఇందిరా గాంధీ కూడా తన చర్యల ద్వారానే ప్రసిద్ధి చెందింది. 1966-77, 1980-84ల మధ్య భారత ప్రధానిగా వ్యవహరించినప్పుడు ఇందిర దేశ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. యుద్ధ సమయంలో నేతగా, పేదల పాలిటి పెన్నిధిగా ఆమె ప్రదర్శించిన లక్షణాల గురించి కొందరు ఆమెను పొగిడితే- మరి కొందరు ఆమెను నియంతగా విమర్శించారు. ఇందిర పేరు మీద వచ్చిన రచనలన్నీ ఆమె సిబ్బంది రాసినవే. ఈ విషయంలో ఇందిరకు, ఆమె తండ్రి జవహర్‌లాల్ నెహ్రూకు పోలిక లేదు.

ఇంకొందరు..
తమ రచనల ద్వారా పేరు పొందిన మరో ఇద్దరిని కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. వీరిలో ఒకరు విప్లవమార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లిన అరబిందో ఘోష్, మరొకరు తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్. హిందుమతాన్ని ఆధునిక సమాజానికి తగినట్లు అన్వయించటానికి రాధాకృష్ణన్ ప్రయత్నించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా సాహిత్యాన్ని, రాజకీయాలను మార్చటానికి అరబిందో ప్రయత్నించారు. వీరిద్దరికి ఇంగ్లీషు మాట్లాడే భారతీయులలో మంచి పేరు, ఆదరణ ఉండేది. అయితే వీరి ప్రభావం కేవలం మధ్యతరగతి ప్రజలపైనే ఉండేది. పైగా మరణించిన తర్వాత వారి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి.

వీరితో పాటుగా స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి ఆధ్యాత్మికవేత్తలను కూడా ఈ పుస్తకంలో చేర్చలేదు. పాశ్చాత్య సంస్కృతి విరిసే సవాలును ఎదుర్కొని.. కులాల గోడలను కూల్చి.. సమాజాన్ని ఒకటిగా చేయాలని వీరిద్దరూ ప్రయత్నించారు. వీరిద్దరికి మంచి ఆదరణ కూడా ఉండేది. కాని రాధాకృష్ణన్, అరబిందోల మాదిరిగా కూడా త్వరగానే వీరి ప్రభావం తొలగిపోయింది. అంతే కాకుండా- స్వామి వివేకానంద, దయానంద సరస్వతిలను దాటి గాంధీ తన సిద్ధాంతాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశాడని చెప్పవచ్చు. వివేకానంద, గాంధీలు కుల వ్యవస్థను సంస్కరించటం ద్వారా మార్పును తీసుకురావటానికి ప్రయత్నిస్తే- మరి కొందరు సంస్కరణ వాదులు కుల వ్యవస్థపైనే సవాలు విసిరారు.

ఇలాంటి వారిలో ప్రముఖుడు బి.ఆర్. అంబేద్కర్. ఈయన గురించి పుస్తకంలో ఉంది. అయితే బడుగుల కోసం పోరాడిన మరో ఇద్దరు అద్భుత వ్యక్తులైన తమిళ పోరాటయోధుడు అయోతి దాస్, కేరళలో కులవ్యవస్థపై పోరాటం చేసిన నారాయణ గురుల గురించి పుస్తకంలో లేదు. నాకు అత్యంత ఇష్టమైన నేతలలో ఒకరైన దాదాబాయ్ నౌరోజీ గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించలేదు. దీనికి నాకు చాలా బాధగా ఉంది...''

No comments:

Post a Comment