Tuesday, November 2, 2010

సంపన్న భారత్, నిరుపేద భారత్... ఈ రెండు భారత్‌లనూ ఏకంచేసే శక్తి కాంగ్రెస్‌


‘రెండు భారత్‌ల’ను ఏకంచేయాలి
ఆ శక్తి కాంగ్రెస్‌కే ఉంది


"రెండు హిందూస్థాన్‌లు ఉన్నాయి.
ఒకటి పేదల హిందూస్థాన్..
మరొకటి ధనికుల
హిందూస్థాన్..
ఒకటి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
మరొకటి
సంక్షోభంలో కూరుకుపోయి ఉంది.
ఈ రెంటిని ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా ఒక్క
కాంగ్రెస్‌కే ఉంది''
..... రాహుల్ గాంధీ


అందుకు ప్రధాని మన్మోహన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: రాహుల్

సంపన్న భారత్, నిరుపేద భారత్... ఈ రెండు భారత్‌లనూ ఏకంచేసే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని పార్టీ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఏర్పాటైన ఏఐసీసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. బలహీన వర్గాలే దేశాన్ని ముందుకు తీసుకుపోగలవని అన్నారు. బలహీన వర్గాల కోసం పనిచేయాలని ఆయన పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ భేటీలో వేదికపై వెనుక వరుసలో కూర్చున్న రాహుల్, సభ్యుల డిమాండు మేరకు ప్రసంగించారు. తన ప్రసంగం ఎజెండాలో లేకున్నా, చివరి క్షణంలో సభ్యుల ఒత్తిడి మేరకు ప్రసంగిస్తున్నానని ఆయన అన్నారు.

రాహుల్ తన ప్రసంగంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. దేశంలోని నిరుపేదలను ముందుకు తీసుకుపోవాలంటే, పార్టీ సభ్యులంతా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డ ప్రధాని మన్మోహన్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. దేశంలోని పలుప్రాంతాల్లో నిరుపేదలను, దళితులను తాను కలుసుకున్నప్పటి అనుభవాలను వివరించారు. సంపన్న భారత్ త్వరగా వృద్ధి చెందుతోందని, నిరుపేదల భారత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ఈ రెండింటినీ అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు భారత్‌లను ఏకం చేయగల శక్తి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, మిగిలిన పార్టీలన్నీ కుల, మత, ప్రాంతీయ తత్వాలతో పనిచేస్తున్నందున వాటికి అది సాధ్యం కాదని అన్నారు.

రాహుల్‌పై కాంగ్రెస్ అగ్రనేతల ప్రశంసల జల్లు

రాహుల్ నేతృత్వంలోని యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలు పార్టీని యువతరానికి చేరువ చేయడంపై కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశంసలు కురిపించారు. యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాహుల్ కొత్తతరం రాజకీయాలకు తెరలేపారని ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రశంసించారు. ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా కొత్తతరం యువకులను యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలు ముందుకు తేవడంపై సోనియాగాంధీ హర్షం వ్యక్తం చేశారు.

రాహుల్‌ను కలిసిన రోశయ్య

యువనేత రాహుల్‌గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం 10 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉదయం పదింటికి ఏఐసీసీ సభ్యుల భేటీకి వచ్చిన ఆయన పార్టీ పతాకావిష్కరణ సందర్భంలో అక్కడికొచ్చిన రాహుల్‌ను కలిశారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో, రాష్ట్రంలో సూక్ష్మ రుణ బాధితుల ఆత్మహత్యలు, సంస్థల వేధింపులు తదితరాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, రాహుల్‌తో మామూలుగానే మాట్లాడా తప్ప చర్చలంటూ ఏమీ లేవని రోశయ్య చెప్పారు. ‘‘రాష్ట్రంలో వర్షాలకు పంటలు బాగా దెబ్బతినడంపై కేంద్ర మంత్రులెవరితోనూ నేను మాట్లాడలేదు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రస్తుతం కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది’’ అని పేర్కొన్నారు.

అధినేతల పరస్పర ప్రశంసలు
ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించారని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రశంసిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా, పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని కొనియాడారు. ఏఐసీసీ సమావేశంలో ప్రసంగించిన అధినాయకులిద్దరూ ఇలా పరస్పరం ప్రశంసించుకున్నారు. ‘‘ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కూడా యూపీఏ ప్రభుత్వ సారథ్యంలో భారత్ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును చవిచూసింది.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సమర్థవంతమైన నాయకత్వం కారణంగానే ఇది సాధ్యమైంది’’ అని సోనియా పేర్కొన్నారు. ‘‘మన పార్టీ చరిత్రలో సోనియా కొనసాగినంత సుదీర్ఘకాలం ఎవరూ అధ్యక్ష పదవిలో కొనసాగలేదు. గత 12 ఏళ్లలో కాంగ్రెస్‌కు సోనియా ఒక కొత్త దిశను ఇచ్చారు. ఆమె మార్గదర్శకత్వం ఫలితంగానే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది’’ అని మన్మోహన్ కొనియాడారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ నూతన శిఖరాలను చేరుకుంటుందని మన్మోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం సోనియా నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment