Saturday, November 20, 2010

నీతి శిఖరం కూలింది

డాక్టర్ మన్మోహన్‌సింగ్... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి తురుపు ముక్కగా ఉపయోగపడిన వ్యక్తి. 'ప్రధానమంత్రి పదవికి మా అభ్యర్థి మన్మోహన్ సింగ్ - ఆయనకు సాటి వచ్చే వ్యక్తి మీ తరఫున ఎవరు?' ఇదీ 2009 ఎన్నికలలో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ విసిరిన లాజవాబ్ సవాల్! కానీ ఇప్పుడు అదే మన్మోహన్ దేశ ప్రజల ముందు దోషిగా తలదించుకోవలసిన దుస్థితి! స్వతంత్ర భారతావనిలో సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన, అత్యున్నత న్యాయస్థానం లో అఫిడవిట్ దాఖలు చేయబోతున్న తొలి ప్రధాని మన్మోహన్!

బ్యూరోక్రాట్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన ఇంతకాలంగా సంపాదించుకున్న 'మిస్టర్ క్లీన్' ముద్ర 2జి స్పెక్ట్రం కుంభకోణంతో మసకబారింది. మన్మోహన్ నిస్సందేహంగా, వ్యక్తిగతంగా నూటికి నూరుశాతం నిజాయితీపరుడే కావచ్చు. కానీ భారతదేశ ప్రధానమంగ్రా అధికారిక బాధ్యతల నిర్వహణలో మాత్రం ఆయన పూర్తి నిజాయతీతో లేరని ఈ ఉదంతం స్పష్టం చేసింది.

తన మంత్రివర్గ సహచరులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉంటే ఉపేక్షించడాన్ని ప్రధానిగా మన్మోహన్ ఎలా సమర్థించుకోగలరు? తెలిసి తెలిసీ అవినీతికి అనుమతించడమంటే, అవినీతిని ప్రోత్సహించడమే అవుతుంది. ఈ కారణంగానే, 2జి స్పెక్ట్రం కుంభకోణంలో దేశప్రజల ముందు దోషిగా నిలబడిన రాజాపై సకాలంలో చర్య తీసుకోనందు కు, ప్రధాని తలదించుకోవలసి వస్తున్నది. నిజానికి మన్మోహన్ దేశ ప్రధాని పదవిలో ఆరు సంవత్సరాలకుపైగా ఉంటున్నప్పటికీ, ఆయ న పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కావడానికి ప్రయత్నించలేదు.

కాంగ్రెస్ పార్టీ కూడా మన్మోహన్‌ను ఒక సి.ఇ.ఒ.గానే పరిగణిస్తూ, ఆయన ఇమేజ్‌ను ఉపయోగించుకుంటూ వచ్చింది. పరిస్థితులు సజావుగా సాగినంతకాలం ఈ ఏర్పాట్లు బాగానే కనిపించాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణం బయటకు రావడంతోనే, అంతర్గత ఏర్పాట్లు వేరు, రాజ్యాంగపరమైన బాధ్యతలు వేరు అని అటు మన్మోహన్‌కు ఇటు కాంగ్రెస్ పెద్దలకు తెలిసివచ్చింది.

రాజాను రక్షించడానికి మన్మోహన్ సింగ్ స్వయంగా సిద్ధపడ్డార ని చెప్పడానికి వీలు లేదు. 2009 ఎన్నికలకు ముందే ఈ కుంభకోణంపై వివిధ ప్రభుత్వ విభాగాలు దర్యాప్తు ప్రారంభించినందున, ఆ ఎన్నికలలో గెలిచిన తర్వాత రాజాను తిరిగి మంత్రిమండలిలోకి తీసుకోవడానికి మన్మోహన్ నిరాకరించారు. ఫలితంగా మంత్రివర్గ విస్తరణే కొన్ని రోజులు వాయిదాపడింది కూడా! ఈ దశలోనే రాజా ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ, అనేక శక్తులు రంగ ప్రవేశం చేశాయి.

జాతీయ సమాచార సాధనాలలో పనిచేస్తు న్న ఉన్నతస్థాయి పాత్రికేయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో కొందరికి కూడా ఇందులో పాత్ర ఉంది. అసభ్యకరమైన ప్రలోభాలు కూడా పనిచేసినట్టు చెబుతున్నారు. వీటికి తోడు సంకీర్ణ రాజకీయాలలో ఉండే బలహీనతలు ఎలాగూ ఉన్నాయి. ఫలితంగా డి.ఎం.కె. ఒత్తిళ్లకు తలొగ్గి రాజాను కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా తీసుకోవడానికి యు.పి.ఎ. చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ అంగీకరించవలసి వచ్చింది.

అయితే రాజా నిందితుడని తెలిసి కూడా మంత్రిమండలిలోకి తీసుకోవడం మన్మోహన్ సింగ్ చేసిన తొలినేరం. ఇక్కడ ఆయన నిస్సహాయుడని చెప్పడానికి లేదు. దేశ ప్రధానిగా 2జి స్పెక్ట్రం కుంభకోణంలో ఏమి జరిగిందో ఆయనకు తెలుసు కనుక, ఈ దేశం పట్ల తన నిబద్ధతను నిరూపించుకోవడానికి, ప్రధాని పదవిని త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడి ఉండవచ్చు. పవర్ పాలిటిక్స్‌లో ఇది సాధ్యమా? అంటే అందరి విషయంలో సాధ్యం కాకపోవచ్చు.

మన్మోహన్ సింగ్‌ను సాధారణ రాజకీయ నాయకుడుగా చూడలేం కనుకే ఆయన నుంచి విలక్షణ వ్యక్తిత్వాన్ని ఈ దేశ ప్రజలు కోరుకుంటారు. ఆ రోజు అలా జరగలేదు కనుకే ఇవ్వాళ ప్రధాని తలదించుకోవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తున్నది, రాజాను మంత్రి మండలిలో చేర్చుకోవాలన్న నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే అయినప్పటికీ, ప్రభుత్వానికి సార «థ్యం వహిస్తున్నది మన్మోహన్ సింగ్ కనుక పాపపుణ్యాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది.

అందువల్లే వ్యక్తిగత నీతి-నిజాయితీలకు మారుపేరుగా ఉంటూ, గొప్ప ఆర్థిక సంస్కరణవాదిగా పేరుగడించిన మన్మోహన్‌సింగ్, ఒక్కసారిగా తన ఔన్నత్యాన్ని కోల్పోయి దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడ్డారు.

2జి స్పెక్ట్రం కుంభకోణం వ్యవహారం ముదురు పాకాన పడిన తర్వాత మాత్రమే ఎ.రాజాను మంత్రిమండలి నుంచి తప్పించడానికి కారణం ఏమిటి? అక్రమాల సంగతి ముందే తెలిసినప్పుడు, 2009 ఎన్నికల తర్వాతే సోనియా ఈ పని చేసి ఉండవచ్చు కదా? డీఎంకే ఒత్తిడికి తలొగ్గడం కేవలం అధికారం కోసం రాజీ పడడంలో భాగ మా? లేక ఇంకేమైనా ఉందా? తన కుటుంబ సభ్యుల్లో కొందరికి సన్నిహితుడు కనుక రాజా విషయంలో కరుణానిధి పట్టుబట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ, కాంగ్రెస్ ఎందుకు ఉపేక్షించినట్టు? కేవలం సంకీర్ణ రాజకీయాల పరిమితులే ఇందుకు కారణమా?

లేక లక్షా 75 వేల కోట్ల రూపాయల స్కాం సొమ్ములో కాంగ్రెస్‌కు కూడా ఏమైనా వాటా ముట్టిందా? దాన్ని 2009 ఎన్నికల్లో ఉపయోగించారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. స్పెక్ట్రం కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జె.పి.సి.) దర్యాప్తు జరిపించడాని కి కూడా కాంగ్రెస్ పార్టీ మీన మేషాలు లెక్కిస్తున్నదంటే, ఈ పాపంలో ఆ పార్టీకి కచ్చితంగా భాగస్వామ్యం ఉండి ఉండా లి.

ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రె స్- భారతీయ జనతా పార్టీలు అధికారా న్ని వదులుకోవడానికి సిద్ధపడకపోవడం వల్ల, పీఠాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారిపోవడం వల్ల దేశ రాజకీయాలలో పలు పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. 2జి స్పెక్ట్రం కుంభకోణం విషయంలో తమను బెదిరిస్తున్న డి.ఎం.కె.ను దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ అధినాయకత్వం అన్నా డి.ఎం.కె.తో మంతనాలు ప్రారంభించింది.

దీంతో పరిస్థితిని గమనించిన డి.ఎం.కె. పెద్దలు దిగివచ్చి, రాజాను ప్రాసిక్యూట్ చేసినా తమకు అభ్యంతరం లేదని, తాము మద్దతు కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ అన్నాడీఎంకేతో కలిస్తే, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమపార్టీ కథ ముగుస్తుందన్నది దాని భయం. రాజానా? రాజ్యాధికారమా? అన్నది తేల్చుకోవాల్సి వచ్చినపుడు డి.ఎం.కె. అయినా, మరో పార్టీ అయినా రాజ్యాధికారంవైపే మొగ్గుచూపడం సహజమే కదా!

బహు కుటుంబీకుడైన కరుణానిధి కుటుంబంలోని విభేదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాస్తవానికి 2009కి ముందు, లేదా ఆ ఏడాది ప్రజా తీర్పు తర్వాత (వెంటనే) ఎన్నికలకు వెళ్లడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా లేనందున, అన్నా డి.ఎం.కె. కాకపోతే మరొక పార్టీ అయినా యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఉండేది. అందువల్ల ఈ తెంపరితనాన్ని గతంలోనే, అంటే 2జి స్పెక్ట్రం కుంభకోణానికి బీజం పడినప్పుడే ప్రదర్శించి ఉంటే, దేశానికి లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండేది కాదు కదా!

అయినా కాంగ్రెస్ అలా వ్యవహరించకపోవడంతో, మొత్తం ఉదంతంలో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలిపై కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. నెహ్రూ కుటుంబంపై గతంలో ఎన్నడూ రాని ఆరోపణలు, ఇప్పుడు సోనియా గాంధీ విషయంలో వినిపిస్తున్నాయి. పార్టీ నిధి పేరిట విపరీతంగా డబ్బు వసూలు చేస్తున్నారన్నది ఇందులో ప్రధానమైన ది. గతంలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఎన్నికల సమయంలో మాత్రమే నిధులు స్వీకరించే వాళ్లు.

ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఢిల్లీ నుంచి తెలుస్తున్న సమాచారం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రమం తప్పకుండా కప్పం కడుతున్నారని, కేంద్ర మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు పార్టీ ఫండ్ ఇవ్వవలసి వస్తోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాను కలవాల్సిందిగా కొందరు మంత్రులకు సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించిన ఉదంతాలు ఉన్నాయి.

స్పెక్ట్రం కుంభకోణంలో నిందితుడైన రాజా కూడా, కొంత మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ముట్టజెప్పినట్టు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అగ్రనేతలు సోనియాను, ప్రధానిని కూడా శంకిస్తున్నారు. సోనియా నిధుల సమీకరణ గురించి, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇటీవల తన సన్నిహితుడైన ఒకరి దగ్గర వాపోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి సి.పి.ఐ. అగ్రనేత చెవిన వేశారు. దీంతో ఆశ్చర్యపోయిన కమ్యూనిస్టు నేతలు ఈ వ్యవహారంపై ఆరా తీయడం ఆరంభించారు.

కారణాలు ఏవైనా అవినీతి విషయంలో గత ఆరు సంవత్సరాలు గా ఉపేక్షిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇటీవల తన పార్టీకి చెందిన కొందరు అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. మన రాష్ట్రం విషయానికే వస్తే, 2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్‌లో లెక్కలేనన్ని కుంభకోణాలు చోటుచేసుకున్నా సోనియాగాంధీ ఏనాడూ పెదవి విప్పిన పాపాన పోలేదు. ఫలితంగానే అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమ మార్గాలలో సంపాదించిన సొమ్ము ఉందన్న ధీమాతో, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, కడప ఎం.పి. జగన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంట్లో నలుసులా మారారు.

అవినీతిని అనుమతించడం వల్ల అసలుకే మోసం వస్తుందన్న వాస్తవాన్ని ఇలాంటి ఉదంతాలతో కాంగ్రెస్ నాయకత్వం గుర్తించి ఉండవచ్చు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా తలెత్తకుండా చేయడానికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌తో రాజీనామా చేయించారు. నిజానికి తన బంధువులకు రెండు, మూడు ఫ్లాట్లు కేటాయించుకున్నందుకు చవాన్‌తో రాజీనామా చేయించడం, మన రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.

ఎందుకంటే వందల, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ నాయకత్వం గతంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు అలాం టి అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద అవినీతి పరులపై చర్య లు తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం ఉపక్రమించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే తోటకూర దొంగిలించిన నాడే మందలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న సామెతలా, పై నుంచి క్రింది వరకు అవినీతిని పెంచి పోషించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని చర్యలు తీసుకున్నా, వారి చిత్తశుద్ధిని శంకించక తప్పదు.

రాజకీయ ప్రయోజనాల కోసం పాలకపక్ష ప్రత్యర్థులపై చర్యలు తీసుకోనంత కాలం అవినీతి నిర్మూలన విషయంలో వారి చిత్తశుద్ధిని విశ్వసించలేం. అది సోనియా అయినా... మన్మోహన్ అయినా! ఎందుకంటే 2జి స్పెక్ట్రం కుంభకోణం గురించి తెలిసిన తర్వాత, రాజాను మంత్రివర్గంలో తీసుకోవడం తప్పకపోతే, కనీసం ఆయన శాఖనైనా మన్మోహన్ మార్చి ఉండాల్సింది. అది జరగలేదు. స్పెక్ట్రం విషయంలో తన అభ్యంతరాలను, అభిప్రాయాలను చెప్పి సరిపెట్టిన మన్మోహన్, రాజా వాటిని బుట్టదాఖలు చేసినా పట్టించుకోలేదు.

ఇన్ని వేల కోట్ల వ్యవహారాన్ని కనీసం కేబినెట్‌లో అయినా పూర్తిస్థాయి చర్చకు పెట్టారా అంటే అదీ లేదు. దేశానికి రాజకీయంగా బలమైన ప్రధాని లేకపోతే ఏం జరుగుతుందో అదే ఇప్పుడు జరిగింది! మన్మోహన్ క్లీన్ ఇమేజ్‌ను రాజకీయంగా ఉపయోగించుకున్న కాంగ్రెస్, తన సహజ లక్షణమైన రాజకీయ అవినీతిని ఆయనకు అంటించింది. పరిస్థితి ఇలా దిగజారినప్పుడు మన్మోహన్ మాత్రం ఏమి చేయగలరని సరిపెట్టుకోవడం మాత్రమే మనం చేయగలిగింది!

రాజా అవినీతికి నైతికంగా సోనియాది బాధ్యత అయితే, సాంకేతికంగా మన్మోహన్‌ది బాధ్యత. ఈ దేశానికి లక్షా 76 వేల కోట్ల రూపాయల మేర నష్టం కలిగించే అధికారం తమకు లేదన్న వాస్తవాన్ని వారు గుర్తించాలి. రాజాను మంత్రిమండలి నుంచి తొలగించ డం కాదు - జరిగిన నష్టాన్ని రికవరీ చేయడం ముఖ్యం. ఈ దిశగా మన్మోహన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అక్రమార్కు ల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2008 సంవత్సరం వరకు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయ లు ఈ దేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలి వెళ్లిపోయినట్టు అంతర్జాతీయ సర్వే ఒకటి తేల్చింది. అవినీతి, అక్రమాల వల్ల వ్యవస్థ లు భ్రష్టు పట్టిపోవడమే కాదు; మన అభివృద్ధికి ఉపయోగపడవలసి న నిధులు అక్రమంగా విదేశాలకు తరలించబడి ఆ దేశాలకు ఉపయోగపడుతున్నాయి. అడ్డగోలుగా సంపాదించిన డబ్బును బాహాటంగా అనుభవించలేని స్థితి ఉంటున్నప్పటికీ, ధనదాహానికి అంతం లేకుండా పోవడం ఆశ్చర్యంగానే ఉంటున్నది.

ఈ దేశానికి నాయక త్వం వహిస్తున్నామని చెప్పుకొంటున్న నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరచి పరిస్థితి తీవ్రతను గుర్తించకపోతే భావి తరాలకు తీరని అపకా రం చేసినవారు అవుతారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఘర్షణ పడే వైఖరులకు స్వస్తి చెప్పి దేశ విశాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా కృషి చేయవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ దేశంలో చట్టాలను గౌరవించే పరిస్థితి తీసుకురావలసిన బాధ్యత రాజకీయ నాయకులపై, ముఖ్యంగా మన్మోహన్‌సింగ్ వంటివారిపై ఉంది.

ఇప్పుడు మన్మోహన్ ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే రెండు. ఒకటి- తన మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవడం. రెండవది- తాను కూడా సాధారణ రాజకీయ నాయకుడినేనని, అధికారానికి అంటిపెట్టుకుని ఉండాలన్న బలహీనతకు అతీతుడిని కానని అంగీకరించడం! ఈ రెండింటిలో దేనికి అంగీకరించినా ఈ దేశ ప్రధానిగా తన బాధ్యతలను ఆయన విస్మరించకూడదు. కోల్పోయిన ఇమేజ్‌ని తిరిగి పొందడానికైనా మన్మోహన్ సింగ్ ఇకపై చొరవ తీసుకుని ధీరోదాత్తుడుగా వ్యవహరించాలి. మరి ఆయన అందుకు సిద్ధపడతారా? లేక మకిలి రాజకీయాల నుంచి పారిపోతారా? 

- ఆదిత్య

1 comment:

  1. Great insight.....Have to agree to a point that Dr. MMS has never been a good boss, but a good subordinate. Its been proven time and again since Harshad Mehta's scam. He never prevented the scams from happening, but acted late after they happened.
    It doesn't matter how clean he is, when the whole country is getting sold by his subordinates. He has to have the courage. He will become another PV in the hands of Congress, because they don't allow party to be blamed, but don't mind loosing a leader or two.

    ReplyDelete