
కాంగ్రెస్‌లో జగన్ అంకం ఇక ముగిసినట్టేనా? జగన్‌పై ఎదురుదాడి చేయటంతో పాటు, తాడోపేడో తేల్చుకునేందుకు రోశయ్య సిద్ధమవుతున్నారా? ఢిల్లీ యాత్ర లక్ష్యం అదేనా? ఆయన స్థానాన్ని మెగాస్టార్, పీఆర్పీ అధినేత చిరంజీవి ఆక్రమించబోతున్నారా? చిరుతో జనాకర్షణ లోటును కాంగ్రెస్ అధినేత్రి భర్తీ చేయనున్నారా? అందుకే అటు ముఖ్యమంత్రి రోశయ్య, ఇటు ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఇద్దరూ ఒకేరోజు ఢిల్లీకి వెళుతున్నారా?.. జగన్‌ను సాగనంపడానికి నిర్ణయించుకున్న తర్వాతే జనపథ్ నుంచి చిరుకు సంకేతాలు అందాయా? ఆ ప్రకారంగా చిరంజీవిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందా?.. తాజా పరిణామాలుఇలాంటి చర్చలకే దారితీస్తున్నాయి.
చలికి గజగజ వణుకుతున్న ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు ఈ చర్చతో వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి రోశయ్య, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి ఇద్దరూ మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీలతో పాటు, ఇతర పార్టీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రోశయ్య, కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందించనున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా జగన్‌కు చెందిన సాక్షి చానెల్ వచ్చిన వార్తా కథనానికి సంబంధించిన క్లిప్పింగులతో పాటు.. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత కొద్దికాలం నుంచి సాక్షి పత్రికలో వస్తున్న వార్తా కథనాల సెట్లను కూడా తీసుకువెళుతున్నారు. తాజాగా సోమవారం రాత్రి తనకు వ్యతిరేకంగా సాక్షి చానెల్‌లో వచ్చిన కథనాల క్లిప్పింగును కూడా అధినేత్రి సోనియా, రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, రాష్ట్ర ఇన్చార్జి వీరప్పమొయిలీకి అందచేయనున్నారు.
జగన్‌పై తక్షణం చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమశిక్షణారాహిత్యం ముదిరిపోతుందని, పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకునేందుకు నాయకత్వం భయపడుతోందన్న సంకేతాలు ఇప్పటికే విస్తృతంగా వెళుతున్నాయని, దానిపై పత్రికల్లో సైతం కథనాలు వస్తున్నాయని వివరించనున్నారు.అదే సమయంలో జగన్‌పై చర్య తీసుకుంటే ఆయన వెంట ఒక్క ఎంపీ కూడా వెళ్లే అవకాశం లేదని, వైఎస్ వల్ల ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో లబ్థి పొందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లవచ్చని స్పష్టం చేయనున్నారు. జగన్ పార్టీలో కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని, వ్యక్తిగతంగా తనను, సంస్థాగతంగా పార్టీని నష్టపరిచే ఏకసూత్ర కార్యక్రమంలో ఉన్నారని ఫిర్యదు చేయనున్నారు. జగన్‌ను పార్టీని నుంచి బహిష్కరించడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీలేదని కూడా వివరించనున్నారు.
కాగా, జగన్ కన్నా ఎక్కువ ప్రజాదరణ, గ్లామర్ ఉన్న పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి పార్టీకి ఆదుకునేందుకు తనంతట తాను ముందుకు వస్తున్నందున.. చిరంజీవి సేవలను వినియోగించుకోవడం ద్వారా, కోస్తాలో బలమైన కాపు వర్గాన్ని కూడా ఆకర్షించవచ్చని రోశయ్య పార్టీ అధినేత్రికి సూచించనున్నారు. చిరుకు ఇప్పటికీ గ్లామర్, ప్రజాదరణ ఉందని చెప్పనున్నారు. చిరంజీవి పార్టీకి మద్దతు ప్రకటిస్తే.. జగన్ ఒకవేళ కాంగ్రెస్‌ను చీల్చినా పీఆర్పీ బలంతో ఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని స్పష్టం చేయనున్నారు.
ఇదిలాఉండగా.. చిరంజీవికి పోలవరం అంశంపై ప్రధానితో అపాయింట్‌మెంట్ గతంలోనే ఖరారయినప్పటికీ.. వారి అజెండా మాత్రం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వల్ల పార్టీకి నష్టం కలిగితే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాను దానిని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలు ఇంత త్వరగా ఎన్నికలు కోరుకోవడం లేదని చిరంజీవి ప్రధానికి స్పష్టం చేసే అవకాశాలున్నాయి. జగన్ సంపాదనపై ప్రజల్లో కూడా అనుమానాలున్నాయని, దేశంలో ఇంత త్వరగా లక్ష కోట్ల ఆస్తి సంపాదించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరన్న అభిప్రాయం జనంలో ఉందని చిర ంజీవి తన వద్ద ఉన్న సమాచారాన్ని ప్రధానికి అందచేయనున్నారు.
అదే సమయంలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌నూ కలిసే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ ఆయనతో భేటీ ఖరారు కానున్నా మంగళవారం ఏ క్షణంలోయినా పటేల్‌ను కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా, చిరంజీవి భేటీలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీకి చెందిన వారికి కొన్ని మంత్రి పదవులు ఇచ్చే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో మంత్రివర్గ విస్తరణ చేసి, జగన్‌కు చెక్ చెప్పడంతో పాటు.. తన పార్టీకి మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చిన పీఆర్పీని మంత్రివర్గంలో తీసుకునే విషయంలో కాంగ్రెస్ నాయకత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు.
రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడడానికి చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంతో ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసే సాకుతో ఆయన మరోమారు కాంగ్రెసు అధిష్టానం పెద్దలను కలిసి ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది. చిరంజీవి మాటలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సోనియాపై సాక్షి మీడియా వార్తాకథనాన్ని చిరంజీవి వ్యతిరేకించారు. వ్యూస్ ను న్యూస్ గా చూపించడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలా చేసి కొంత మంది మనోభావాలను దెబ్బ తీయడం మంచిది కాదని ఆయన అన్నారు. అంతలోనే సర్దుకుని, అది కాంగ్రెసు పార్టీ అంతర్గత విషయమని, తాము ఆ పరిణామాలపై మాట్లాడడం అప్రస్తుతం, అనవసరమని ఆయన అన్నారు.
వైయస్ జగన్ సాక్షి మీడియా వార్తాకథనాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా చెప్పారు. రెండు, మూడు రోజుల్లో విషయంపై నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. పూర్తి వివరాలతో, సాక్ష్యాలతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వైయస్ జగన్ వ్యవహారంపై రెండో నివేదికను కూడా పంపినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం వైయస్ జగన్ వివరణను కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి వైయస్ జగన్ వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తూ పార్టీని చీల్చడానికి గానీ సొంత పార్టీ పెట్టదలుచుకున్నా ప్రభుత్వానికి నష్టం జరగకుండా చిరంజీవితో మంగళవారం చర్చల్లో కాంగ్రెసు అధిష్టానం నిర్దిష్టమైన ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment