Wednesday, October 27, 2010

రాజకీయ కారణాలే ..... ఆహార భద్రత సంకల్పం * పేదలకు దగ్గరయేందుకు ఆహారభద్రత హక్కు చట్టం

ఆహార తంత్రం
4c-cartoon
దేశంలో త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా? యూపీఏ సర్కారు తాజాగా ప్రకటించిన దేశంలోని 80 కోట్ల మందికి ఆహారభద్రత హక్కు నేపథ్యం అదేనా? యువరాజు రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై ప్రతిష్ఠించే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త చట్టానికి తెరలేపారా? ముసలితరాన్ని పక్కకుపెట్టి యువతరాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు కొత్త రక్తం ఎక్కించే పనిలో ఉన్నారా? ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాం గ్రెస్‌ అధినేత్రి విసిగి పోయారా? ఆయన సర్కారు పేదలకు వ్యతిరేకంగా, ధనికులకు దగ్గరవుతోందన్న భయాందోళనతో అధినేత్రి ఉన్నారా? అందుకే పేదలకు దగ్గరయేందుకు ఆహారభద్రత హక్కు చట్టం తీసుకు వచ్చారా? అది రానున్న మధ్యంతర ఎన్నికల్లో రాహుల్‌ చేతికి బ్రహ్మా స్త్రంగా కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోందా?.. ఇటీవలి కాలంలో జరుగు తున్న రాజకీయ పరిణామాలు. యూపీఏ సర్కారు పనితీరుపై సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యం, కాంగ్రెస్‌ నాయకత్వం ఆత్మపరిశీలన తీరు గమనిస్తే ఇలాంటి అనుమా నాలు తెరపైకి రాక తప్పవు.

హఠాత్తుగా తెరపైకి...
దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పం, దరిమిలా తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా జరిగిపోయాయి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే దీనికి ప్రతిపాదన లు ఉన్నా, ఇంతకాలం గుర్తుకు రాని ఈ అస్త్రం కాంగ్రెస్‌ మదిలోకి హఠా త్తుగా వచ్చింది. ప్రస్తుతం బీహార్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అక్కడ పాగా వేయటానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తును ముందుగానేఊహించి తీసుకున్న నిర్ణయం అని పార్టీ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. రాహుల్‌ గాంధీని భవిష్యత్తు ప్రధానిగా చూడాలని ఉందంటూ పార్టీలోని ప్రముఖ నేతలు పలువురు ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రకటించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారు రాహుల్‌ నామ స్మరణ చేస్తున్నారు.

జనంలో రాహుల్‌ మమేకం అవుతున్న తీరు, ఇటీవల ఆదివాసీలు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కు వగా ఉండే ప్రాంతాలలో రాహుల్‌ పర్యటన, ఆయనను వారు ఆదరించిన తీరు లాంటి అంశాలను మరో ఐదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో కొనసాగేందుకు బ్రహ్మాస్త్రాలుగా కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. రాహుల్‌ సైతం పలు సందర్భాలలో ఈ సామాజిక వర్గాల వారి అభ్యున్నతిపై ఎక్కువగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తు న్నదంతా వారే అని ప్రశంసించారు. ఈ నేపథ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసి, వామపక్షాలు, ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకపోయినా, ఒంటరిగానైనా రంగంలోకి దిగి మరో ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్‌ అధినాయకత్వం మదిలో మెదలుతున్నట్టు కనిపిస్తున్నది.

మన్మోహన్‌ బ్యురోక్రసీతో సతమతం?

ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియాకు కానీ, ఇతర పార్టీ నాయకులకు కానీ చెప్పుకోదగినంత వ్యతిరేక భావన లేకపోయినా, ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి, పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా పార్టీకి చేటు చేస్తాయన్న ఆలోచనతో అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. స్వతహాగా ఆర్థిక వేత్త, బ్యురోక్రాట్‌ మాత్రమే అయిన మన్మోహన్‌, వరుసగా రెండవ సారి ప్రధాని కావటానికి సోనియా ఆశీస్సులే కారణం.

అయితే ఆయన ఎంత సేపూ ఆర్థిక వేత్తగానే తప్ప పార్టీని రాజకీయంగా బలోపేతం చేయగలిగిన నేతగా కనిపించటం లేదన్న అసంతృప్తి సోనియా తదితరుల్లో కనిపిస్తు న్నది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సమాజంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఉపకరిస్తున్నాయని, పార్టీని అనాదిగా అంటి పెట్టుకున్న బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం కేంద్రం నిర్ణయాలతో ఇబ్బందులు పడటం మరింత పెరిగితే పార్టీ రాజకీయంగా పతనం కాక తప్పదన్న ఆందోళన సోనియాలో కలుగుతున్నట్టు సమాచారం.

ఎడా పెడా పెరుగుతున్న పెట్రో, దాని సంబంధిత ఉత్పత్తుల ధరలు, ఆకాశంలోకి దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వాటిని నియంత్రించలేని అసమర్థ పరిస్థితి, ఈ లోపాలను ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీలు విమర్శలకు ఉపయోగించుకుంటున్న తీరు కాంగ్రెస్‌లో కంగారుకు కారణమైంది.ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా ఆహార భద్రత హక్కును తెరపైకి తీసుకు వచ్చి పేదల పట్ల తమకే శ్రద్ధ ఉందన్న భావన కలిగించే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతి తక్కువ వ్యవధిలోనే మన్మోహన్‌ను గౌరవ ప్రదంగా పక్కకు తప్పించాలని, అది జరగాలంటే మధ్యంతర ఎన్నికలే మార్గం అన్న ఆలోచనతో సోనియా ఉన్నట్టు కనిపిస్తున్నది.

రాహుల్‌కు మేలు చేసేందుకే...
రాహుల్‌ గాంధీని భావి ప్రధానిగా పార్టీలో అందరూ అంగీకరిస్తున్న తరుణంలో, సాధ్యమైనంత త్వరగా తన కుమారుడిని ఆ స్థానంలో చూసు కోవాలన్న ఆపేక్ష సోనియాకు ఉండటం అత్యంత సహజం. అందుకే బీహార్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో రాహుల్‌కు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం కల్పించారు. రాహుల్‌ సైతం బీజేపీ, ఇతర విపక్షాలను దుమ్మెత్తి పోస్తూ తనలో పరిణతి కలిగిన రాజకీయ వేత్త లక్షణాలు క్రమంగా పుంజుకుంటున్నాయన్న భావన కలిగించారు. పూర్తిగా మన్మోహన్‌ నాయ కత్వంలోనే ఐదేళ్ళూ ప్రభుత్వం కొనసాగితే 2014లో జరిగే ఎన్నికల సమ యానికి బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయని, మరి కొన్ని పార్టీలు సైతం కాంగ్రెస్‌ వైఫల్యాలనే ఎన్నికల ఆయుధాలుగా ఉపయోగించుకునే సూచనలు ఉండటంతో, ఆ అవకాశాన్ని విపక్షాలకు దక్కరాదన్న ఉద్దేశంతోనే మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమయ్యే ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.

ముదుర్లను వదిలించుకునే యత్నం?
అదీగాక యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ, ప్రభుత్వంలో కొనసాగుతూనే అనేక సందర్భాల్లో పార్టీని ఇరకాటంలో పడవేస్తున్న ఇతర పక్షాలను వదిలించుకోవాలన్నా మధ్యంతర ఎన్నికలే మార్గం అన్నది సోనియా ఆలోచనగా చెబుతున్నారు. ప్రధానంగా రైల్వే మంత్రి మమతా బెనర్జీ లాంటి వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే వ్యతిరేకిస్తూ పంటి కింద రాయిలా తయారయ్యారు. అలాంటి వారిని భాగస్వామ్య పక్షాలుగా తిరస్కరిస్తే ప్రభుత్వ మనుగడ ఇక్కట్లలో పడుతుంది.

అలా అని కొనసాగించలేని స్థితి. ఈ ఇరకాటం నుంచి బయట పడాలన్నా మధ్యంతర ఎన్నికలే మంచి మార్గం అనే ఆలోచన సోనియాకు కలిగినట్టు చెబుతున్నారు. బీహార్‌లో ఆశావహమైన ఫలితాలు వచ్చినా, ఇటు కర్నాటకలో పరిస్థితి తారుమారై బీజేపీ అధికారం నుంచి తొలగి పోవలసి వస్తే, అక్కడ సైతం మధ్యంతర ఎన్నికల అనివార్య స్థితి ఎదురైతే రాహుల్‌ గాంధీని భావి ప్రధానిగా చూపిస్తేనే ఓట్లు రాలుతాయన్న ఆలో చన, వ్యూహంతో కాంగ్రెస్‌ నాయకత్వంకనిపిస్తున్నది.

ముందస్తు ప్రణాళిక...
దేశంలో అత్యధిక శాతం మందికి ఆహార భద్రత కల్పిస్తూ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రతిపాదనలు చేసినా, ఇంతకాలం పట్టించుకోకుండా హఠా త్తుగా దానిపై నిర్ణయం తీసుకోవటం వెనుక రాజకీయ కారణాలే తప్ప మరేవీ లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ప్రస్తు తం ఉన్న బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకత్వం కనిపిస్తున్నది.రాహుల్‌ ని భావి ప్రధానిగా చూసుకోవాలన్న సోనియా కల సాకారం కావాలన్నా, మరోసారి ఐదేళ్ళ పాటు కేంద్రంలో అధికారం చెలాయించాలన్నా పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశీర్వాదం లేకపోతే సాధ్యం కాదన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ నాయకత్వం వచ్చిందని చెబుతున్నారు. ఈ రెండు బలమైన కారణాలే ఆహార భద్రత హక్కును హఠాత్తుగా ముందుకు తీసుకురావటానికి ప్రాతిపదికలు అని కాంగ్రెస్‌లో మెజారిటీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

No comments:

Post a Comment