Friday, October 1, 2010

పవర్ గేమ్ .... మన్మోహన్ తీరుపై సోనియా అసంతృప్తి

ప్రధాని చర్యలతో రాహుల్ భవితవ్యానికి ఇబ్బందులేనని భావిస్తున్న మేడం
గవర్నర్‌ల నియామకంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు
విధాన నిర్ణయాల్లో యువరాజు ప్రభావం
మాట వినని మంత్రులు.. అసంతృప్తితో ప్రధాని
కేంద్ర కేబినెట్ విస్తరణ సోనియా కనుసన్నల్లోనే
అంగీకరించకుంటే మన్మోహన్‌కూ ఉద్వాసన?
ప్రత్యామ్నాయ రేసులో ఆంటోని, ప్రణబ్!

దెబ్బతింటున్న ఆమ్ ఆద్మీ నినాదం
ప్రధానిది కార్పొరేట్ విధానం
జాతీయ ఆహార భద్రత బిల్లు ఊసేది?
ఇవీ మేడం అభ్యంతరాలు

ఆహార భారం కష్టమంటున్న మన్మోహన్
తనది సుస్థిర సర్కారంటూ ప్రకటనలు
రిటైర్ అయ్యేది లేదంటూ వ్యాఖ్యలు
ప్రభుత్వంలో పార్టీ జోక్యంపై కినుక

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కూ మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయా? పార్టీ విధానాలకు, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం ఏర్పరచగల నేతగా మన్మోహన్ ఉపయోగపడడం లేదని సోనియా భావిస్తున్నారా? ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందా? వచ్చే ఎన్నికల లోపే ప్రత్యామ్నాయ నేతను సోనియా ఎంపిక చేసుకోవాల్సి వస్తుందా? గత కొంత కాలంగా హస్తినలో కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇది!

ప్రత్యామ్నాయ నేతలుగా ఏకే ఆంటోనీ, ప్రణబ్‌ముఖర్జీల పేర్లపైనా తర్జనభర్జనలు సాగుతున్నాయి. గత నెల పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ కార్యక్రమం, కాశ్మీర్, అయో« ద్య అంశాలు, బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక.. మొదలైన అనేక అంశాలపై పార్టీ కీలక సమావేశాల్లో ప్రధాని చురుకుగా వ్యవహరించారు.

అయినా.. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహారాల్లో అనేక అంశాలపై పార్టీ అధినేత్రికి, ప్రభుత్వాధినేతకు మధ్య పొసగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలో పార్టీ జోక్యాన్ని మన్మోహన్ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో పార్టీ సూచించిన అంశాలను మన్మోహన్ పెడచెవిన పెడుతున్నారంటూ సోనియా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనే క మంది మంత్రులు సోనియాగాంధీ సూచనలకు అనుగుణంగా పని చేస్తూ, తనను పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి మన్మోహన్‌లో ఉందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

యూపీఏ మలివిడత ప్రభుత్వంలోనే ఈ ధోరణి మరింత ఉందని తెలుస్తోంది. పార్టీ మేధావి, ఆపత్కాలంలో ఆదుకుంటాడని పేరున్న ప్రణబ్‌ముఖర్జీ గత ప్రభుత్వంలో మన్మోహన్‌కు పూర్తి తోడ్పాటు అందించారు. కానీ.. ఈ విడత పలు విషయాల్లో అంటీముట్టనట్లు కనిపిస్తున్నారన్న వాదన ఉంది. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడినప్పుడు, అది కూడా పార్టీ అధ్యక్షురాలు కోరినప్పుడే ప్రణబ్ రంగప్రవేశం చేసి.. ఒడ్డునపడేస్తున్నారు.

ఇటీవల కాశ్మీర్ తీవ్రంగా రగిలినప్పుడు కానీ, కామన్ వెల్త్ క్రీడల భవిష్యత్తు సంక్షోభంలో పడ్డప్పుడు ప్రణబ్ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. కామన్‌వెల్త్ క్రీడలకు ముందు తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రణబ్‌తో ప్రమేయం లేకుండా మంత్రుల బృందాన్ని ఏర్పరిచారు. ఈ బృందం బాధ్యతలు సరిగా నిర్వహించకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తపరిచినట్లు వార్తలు వచ్చాయి.

ఒక దశలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్వయంగా క్రీడల నిర్వహణను సమీక్షించి ప్రధానికి తగిన సూచనలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. కాశ్మీర్, కామన్‌వెల్త్ క్రీడలపై కాంగ్రెస్ జోక్యం చేసుకున్నాకే పరిస్థితులు చక్కబడ్డాయని పార్టీ వర్గాలంటున్నాయి.

అయోధ్య తీర్పు విషయంలో పార్టీ ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం, భద్రతా వ్యవహారాలను చక్కదిద్దాలని హోంమంత్రిని కోరడం జరిగిందని, లేకపోతే కామన్ వెల్త్ క్రీడల సమయంలో తీవ్ర సంక్షోభం తలెత్తేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వపరమైన సమస్యల పరిష్కారానికి పార్టీ రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ పార్టీ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు ప్రధాని చర్యలు తీసుకోలేదన్న అభిప్రాయం కొందరు కాంగ్రెస్ నేతల్లో ఉంది.

ఆమ్ ఆద్మీ ముద్ర ఏదీ?
నిజానికి మన్మోహన్ రెండవ విడత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆమ్ ఆద్మీ నినాదానికి గండి పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ సలహా మండలి చైర్మన్‌గా సోనియా ప్రతిపాదించిన జాతీయ ఆహార భద్రతపై ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయానికి రాలేదు. ఈ కార్యక్రమం అమలు చేయాలంటే కేంద్రానికి అదనంగా 34వేల కోట్లు అవసరం. వీటితో పాటు.. ఆరు కోట్ల టన్నులకుపైగా ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉంటుంది.

ఇంత భారాన్ని మోయడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఆహార ధాన్యాలు గోదాముల్లో కుళ్లిపోయే బదులు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న సుప్రీం సూచనల్నీ ప్రధాన మంత్రి ఇటీవల పత్రికా సంపాదకుల సమావేశంలో కొట్టిపారేశారు. ఒకవైపు సోనియా ఆహార భద్రత గురించి మాట్లాడుతుంటే ప్రధాని సుప్రీం ఆదేశాలనే విమర్శించడం పార్టీలో చర్చనీయాంశం అయింది.

అంతేకాక తనది నెహ్రూ, ఇందిర ప్రభుత్వాల కన్నా స్థిరమైన ప్రభుత్వమని ప్రధాని సమర్థించుకోవడం, తాను రిటైరయ్యే అవకాశం లేదని స్పష్టం చేయడంపై కూడా పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. పార్టీలో భావినాయకుడుగా భావిస్తున్న రాహుల్ గాంధీ కూడా కొన్ని నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న వాదన ఉంది. ఒరిస్సాలో నియామ్‌గిరి పర్వత శ్రేణుల్ని రాహుల్ సందర్శించిన తర్వాత వేదాంతకు ఇచ్చిన పర్యావరణ లైసెన్సును రద్దు చేయడం ప్రధానమంత్రి ప్రమేయం లేకుండా జరిగిందని చెబుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అనేక మైనింగ్ ప్రాజెక్టులకు అనుమతులను నిలిపివేశారు. అనేక బొగ్గు బ్లాకుల కేటాయింపులో కూడా పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ మోకాలడ్డడంతో పీఎంవో స్వయంగా జోక్యం చేసుకోవల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టానికి కేంద్రం తలపెట్టిన సవరణలను కూడా సోనియా స్వయంగా ప్రధానికి లేఖలు రాసి అడ్డుకున్నారు. అంతే కాక దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఉదారంగా సహాయం అందించాలని ప్రధానిని సోనియా కోరుతున్నారు.

ఇలా ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ కలుగ చేసుకోవడంపై ప్రధాని, ఆయన సలహాదారుల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ను యథాతథ పరిస్థితిని కోరే పార్టీగా, మార్పును అడ్డుకునే పార్టీగా ఆయన మీడియా సలహాదారు హరీశ్ ఖరే సైతం విమర్శించడం గమనార్హం. ఖరే వ్యాఖ్యలు కూడా పీఎంవోకూ, టెన్ జనపథ్‌కూ మధ్య విభేదాలను స్పష్టంగా సూచిస్తున్నాయి. కాగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, గవర్నర్ల నియమకంలోనూ ఈ రెండు అధికార కేంద్రాల మ«ధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎన్నికల కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన నవీన్ చావ్లా, గతంలో తన సలహాదారుగా ఉన్న పులోక్ చటర్జీలను గవర్నర్లుగా నియమించాలని సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. మరో వైపు ప్రధాని కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న టీకేఏ నాయర్, ప్రణాళికా సంఘం సభ్యుడు చతుర్వేదిలను గవర్నర్లుగా నియమించాలని ప్రధాని భావిస్తున్నారు. కాగా పార్టీ ప్రతిష్ఠ పెంచేందుకు, రాహుల్ గాంధీని ఆమ్ ఆద్మీ నేతగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న అనేక ప్రయత్నాలు మన్మోహన్ సింగ్ సర్కార్ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వైఖరిని సరిదిద్దడమా, లేక ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేసుకోవడమా? అన్న చర్చ కామన్‌వెల్త్ క్రీడల తర్వాత తీవ్రతరమవుతుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ సారి పూర్తిగా సోనియా స్వయంగా చేపడతారని, పలువురు మంత్రులకు ఉద్వాసన జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీటిని ప్రధాని అంగీకరించకపోతే ఆయన మార్పు కూడా జరగక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment