Tuesday, June 14, 2011

నా టార్గెట్ సీఎం పీఠం! * వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను * జగన్ మాకు సమస్యే కాదు

నా టార్గెట్ సీఎం పీఠం!
వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను
జగన్ మాకు సమస్యే కాదు

కొంత నష్టం ఉన్నా.. భర్తీ చేసుకుంటాం!
నేను ఫ్లెక్సిబుల్.. ఎవరికీ పోటీ కాదు
సీఎం, నేను కలిసి పని చేస్తాం
ఆయన పరిణితి చెందుతున్నారు
వెన్ను దన్నుగా ఉంటాను
వైఎస్ ఉండగానే పీఆర్పీ విలీన నిర్ణయం
'స్థానిక' విజయమే తక్షణ కర్తవ్యం
'ఏబీఎన్' బిగ్ డిబేట్‌లో మనసు విప్పిన బొత్స 

  మాటల్లో విరుపు, చేతల్లో చొరవ, 'లక్ష్యం'పై స్పష్టత! ఇవన్నీ కలిస్తే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ! 'నా లక్ష్యం ముఖ్యమంత్రి పీఠం' అని స్పష్టంగా ప్రకటిస్తూనే... ఆశ పడటంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వైఎస్ హయాంలోనే చెప్పానని ప్రకటించారు. మంగళవారం రాత్రి 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన 'బిగ్ డిబేట్'లో బొత్స పాల్గొన్నారు.

అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. జగన్ వల్ల కొంత నష్టముందని అంగీకరిస్తూనే... దీనిని మరో రూపంలో భర్తీ చేసుకుంటామని బొత్స స్పష్టం చేశారు. తాను ఎవరికీ పోటీ కాదని, ఎవరైనా తనను పోటీ అనుకుంటే ఏమీ చేయలేనని తెలిపారు. సీఎం కిరణ్, తాను కలిసి పని చేస్తామని చెప్పారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్‌తో తనకు విభేదాలు లేవన్నారు. పార్టీ పునరుత్తేజానికి 'ఫార్మాట్' సిద్ధంగా ఉందన్నారు. 'బిగ్ డిబేట్' విశేషాలివి...

1989లో కంటే దారుణంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరమ్మతులు చేయగలమని భావిస్తున్నారా?

కాంగ్రెస్ పార్టీలో కలుపుకుని పోయే వ్యక్తిలేరనే అభిప్రాయం ఉంది. ఈ ప్రభుత్వం మనది అనే నమ్మకం క్యాడర్‌లో లేకుండా పోతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. వైఎస్ మరణం తర్వాత... రోశయ్య బాధ్యతలు చేపట్టడం. తర్వాత మళ్లీ సీఎం మారడం. పీసీసీ బాధ్యతల నుంచి తప్పించాలని డీఎస్ అధిష్ఠానాన్ని కోరడం. ఓ వైపు తెలంగాణ, మరో వైపు సమైక్యాంధ్ర నినాదాలు. అయినా, నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తా!

సాధారణంగా సీఎం అభిప్రాయం తీసుకుని పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారు. కానీ, మీ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగినట్లు ఉంది?

సీఎం నిర్ణయానికి భిన్నంగా జరిగిందనే వాదనతో నేను ఏకీభవించను. కిరణ్ అభిప్రాయం తీసుకునే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

మీ ఇద్దరి మధ్య సయోధ్య ఎలా ఉంది?

కావాలని ఎవరు సంఘర్షణ కోరుకోరు. కేబినెట్‌లో శాఖలకు సంబంధించి నా అభిప్రాయాలను సీఎంకు స్పష్టంగా చెప్పా. పొరపాట్లను సవరిస్తానని హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా.

బొత్సకు స్పీడ్ ఎక్కువ అంటారు?

స్పీడ్ కాదు. అనుకున్నది చేయాలనే తపన ఉంది. రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయాలనుకుంటాను. విశ్వాసం కూడా ఎక్కువే. ఇలాగే గతంలో ఒకసారి వోక్స్‌వ్యాగన్ విషయంలో పొరపాటు చేశాను.

ముఖ్యమంత్రి స్లో అండ్ స్టడీ... మీరు స్పీడ్! ఇద్దరికీ ఎలా కుదురుతుంది?
ఆయన బాధ్యత వేరు. నా బాధ్యత వేరు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే నానా రకాలు ఆపాదిస్తారు. దురుద్దేశంతో చేశామని చెబుతారు. ఆచితూచి చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. పీసీసీ చీఫ్‌గా క్యాడర్‌లో ఆత్మ విశ్వాసం నింపాల్సిన బాధ్యత నాది.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా సీఎం చుట్టూనే తిరుగుతుంటుంది. పార్టీ కార్యాలయానికి అంత ప్రాధాన్యం ఉండదు కదా?

నా వరకు పార్టీ, ప్రభుత్వం వేరు కాదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అన్నీ చేస్తాం. గురువారం గాంధీభవన్‌లో అన్ని జిల్లాల అధ్యక్షులతో సమావేశం పెడుతున్నాం. దీనికి హాజరు కావటానికి సీఎం కూడా సమయం కేటాయించారు. డజను మంది మంత్రులు కూడా వస్తారు. జిల్లాలకు సందేశం వెళ్లాలంటే ఇలాంటి సమావేశాలు అవసరం. ఒంటెత్తు పోకడ ఉండదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా జగన్, తెలంగాణ సమస్యలెదుర్కుంటోంది. వీటిని పరిష్కరించగలమనే నమ్మకం ఉందా?
జగన్ ఓ సమస్య అనుకోవటం లేదు. మిగిలిన పార్టీల్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. జగన్ బయటకు వెళ్లడంవల్ల ఐదు లేదా పది శాతం నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఇంకో రకంగా పూడ్చుకోవటానికి ప్రయత్నిస్తాం. ఎవరైనా ఆ వంద శాతం నుంచే తెచ్చుకోవాలిగా. పార్టీ నుంచి బయటికి వెళ్లిన వారితోమాట్లాడి సమస్యకు కారణాలేంటో తెలుసుకుంటాం. వారిని వెనక్కి తెచ్చుకోవటానికి కృషి చేస్తాం. ఇక... తెలంగాణ సున్నితమైన సమస్య. కొంత మంది తెలంగాణ అంటే... మరికొంత మంది సమైక్యాంధ్ర అంటున్నారు. హై కమాండ్ రాష్ట్రంలోని పరిస్థితిని గుర్తించింది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది.

జూలై 1లోగా తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని డెడ్‌లైన్లు పెట్టారు కదా?

ఈ అంశం నా దృష్టికి రాలేదు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయి. ఎవరికీ ఇబ్బందిలేని పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నా.

పీసీసీ అధ్యక్షుడు అంటే తదుపరి సీఎంగా చూస్తారు. కాంగ్రెస్ సంస్కృతి కూడా అదే....

అది అధికారంలో లేనప్పుడు! హైకమాండ్ ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించింది. ఏరికోరి ఈ బాధ్యత ఇచ్చినప్పుడు నా వంతు కృషి చేస్తా. మన పని మనం చేసుకుంటూ పోతే సమస్య ఉండదు. 25 సంవత్సరాలుగా అలవాటైన పనే ఇది. పీసీసీ అధ్యక్షుడు అయినందు వల్ల మరో రెండు గంటలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నేను చాలా ఈజీగోయింగ్. పార్టీని దారికి తెచ్చేందుకు అవసరమైన 'ఫార్మాట్' నా దగ్గర ఉంది.

వైఎస్ ఉన్నప్పుడు టిక్కెట్లు.. ఎన్నికల ఖర్చు అంతా ఆయనే చూసుకుంటారనే ధీమా ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఉందా?

సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చూసుకుంటారు. ఈ మేరకు నమ్మకం కల్పిస్తాం. సీఎం ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. పుట్టగానే ప్రతి ఒక్కరికీ అన్ని వచ్చేయవుకదా. ప్రభుత్వంలో చాలా జాగ్రత్తగా వెళ్లాలి.

గతంలో వైఎస్, డీఎస్‌లను జోడెద్దులు అనేవారు...మరి మీరు ఇప్పుడు అలాగే ఉంటారా?

మా ఇద్దరిని సోనియా గాంధీనే నియమించారు. ప్రజలు సోనియాకు తీర్పు ఇచ్చారు. ఇద్దరి జవాబుదారీతనం పార్టీకే. సమిష్టి బాధ్యతతో పని చేయాల్సి ఉంటుంది. పార్టీ అధ్యక్షుడిగా సీఎంకు వెన్నుదన్నుగా ఉంటానని ఆయన చెప్పారు. 2009లో ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ నాతో చిరంజీవిని పార్టీలోకి తేవాలన్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలోకి మరో కీలకనేతను తెస్తే ఆయన మనకు పోటీ కాడా అన్న చందంగా మాట్లాడా! మనకు చేతకాకపోతేనే ఇతరులు పెద్దవారు అవుతారని వైఎస్ అన్నారు. ఆ మాటలతో నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. ఒకరికి ఒకరు పోటీ అనుకుంటే పొరపాటు. నేను ఎవరికీ పోటీ కాదు. అవతల వారెవరైనా నేను పోటీఅనుకుంటే ఏమీ చేయలేను. నేను పూర్తి ఫ్లెక్సిబుల్. టెన్షన్ ఫ్రీ.

రాష్ట్ర్రంలో కుల సమీకరణలు మారుతున్నట్లు ఉన్నాయి. రెడ్లు అంతా జగన్ వైపు వెళుతున్న మాట వాస్తవం కాదా?

ఇది అపోహే. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా కాపులు అంతా అటువైపు వెళతారని అన్నారు. రెడ్లు అయినా.. కాపులు అయినా కొంతమంది వెళితే వెళ్లి ఉండొచ్చు. అందరూ వెళ్లిపోయారనుకోవటం పొరపాటు.

మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా జోడు పదవుల్లో కొనసాగుతారా?

అది పార్టీ ఇష్టం. వ్యక్తిగతం ఏమైనా ఉంటే ఈ రోజు చికెన్ తినాలా...లేక వెజిటేరియనా అనేంత వరకే! అంత మాత్రాన ఓపెన్‌గా ఉండనని అర్థంకాదు. మంత్రి పదవులు మొదలుకుని ఏ విషయంలో అయినా సీఎం అడిగితే కుండబద్దలు కొట్టినట్లు నా అభిప్రాయం చెబుతా.

108, 104కు నిధులు కావాలని అడిగారు. సమీక్ష చేశారు. ఇది మీ పరిధి దాటడం కాదా?

చాలా చోట్ల సమస్యలతో 108 వాహనాలు ఆగిపోతున్నాయి. కొత్తవి కొనకపోతే ఇబ్బందు వస్తాయి. ఈ సమస్యలపై మాట్లాడటానికి వస్తానని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి నేను ఫోన్ చేసి చెబితే... ఆయనే నా చాంబర్‌కు వచ్చారు. నా దృష్టికి ఏదీ వచ్చినా తప్పకుండా అడుగుతా. గతంలోనూ ఇలాగే చేశా! అధికారులతోనూ మాట్లాడేవాడిని!

మీకు సీఎం కావాలనే ఆశ ఉందా?

ఆ కోరిక ఉంది. వైఎస్ ఉన్నప్పుడే ఈ మాట చెప్పాను. ఆశ పడడంలో తప్పేముంది? అలాంటి ఆశయం ఉండబట్టే సక్రమ మార్గంలో వెళతాం. ఆ ఆలోచన ఉండబట్టే అన్నీ తెలుసుకుంటున్నాను.

బొత్స ఉవాచ...

* మమ్మల్ని మేము ఓడించుకోవడమే తప్ప..
ఎవరూ మమ్మల్ని ఓడించలేరు.
* నాముందు సవాళ్లు ఉండటం నిజమే. కానీ...
సవాళ్ళుంటేనే విజయం విలువ తెలుస్తుంది.
* స్థానిక ఎన్నికలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటే గెలుపు సులువే!
* ప్రభుత్వం పడిపోవాలని ఆశిస్తున్నవారు పేదలకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి.
* (ఉద్యమాల నేపథ్యంలో టెన్త్‌లో ఒక్కమార్కుతో ఫెయిల్ అయిన వారికి గ్రేస్ మార్క్ ఇవ్వాలని కడప నుంచి ఒక వ్యక్తి కోరినప్పుడు...) అవకాశం ఉంటే పరిశీలిస్తాం. మంత్రితో మాట్లాడతాను. పీసీసీ అధ్యక్షుడుగా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట దొర్లితే సరిదిద్దుకునే అవకాశం ఉండదన్నారు.

జగనే వెళ్లిపోయారు!

"జగన్ తనంతట తానే కాంగ్రెస్‌ను వీడి వెళ్లారు. ఆయనను వదులుకోవాలని పార్టీకి ఏ కోశానా లేదు. పది మందితో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చెప్పవచ్చు. నేను చెప్పేదే అంతా చేయాలంటే ప్రజాస్వామ్యంలో కష్టం. సీఎం పదవి ఇవ్వలేదని వెళ్లిపోతానంటే ఎలా? వైఎస్ హయాంలో రెండుసార్లు పార్టీ ఓటమి చెందినా, పదవులు దక్కకపోయినా ఆయన పార్టీని వీడలేదు. పార్టీని నమ్ముకుని ఉండబట్టే వైఎస్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి దక్కింది. జగన్ సీఎం కావాలని మేమూ సంతకాలు చేశాం. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం ఆయన కూడా రోశయ్యకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు చెప్పలేదు.

మేమంతా వైఎస్ చనిపోయిన బాధలో ఉంటే.. జగన్ పావురాలగుట్ట వద్దే రాజకీయాలు మాట్లాడారు. మొదట్లో ఓదార్పు యాత్రకు పార్టీ అనుమతించింది. కానీ... పార్టీలో ఉంటూ పార్టీ నేతల ఫొటోలు లేకుండా యాత్రలు చేయడం సబబా? ఆయన ఓదార్పులో ఏమేం మాట్లాడారో ఒక్కసారి ఆ వీడియోలు తెచ్చి చూస్తే తెలుస్తుంది. అయినా... ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. వారి సిద్ధాంతాల ప్రకారం వెళితే మంచిది! ఈ విషయాలన్నీ అనవసరం. కావాలంటే... మరో సందర్భంలో చర్చ పెట్టుకుందాం. (జగన్ వర్గం నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ఇన్‌లోకి అడిగిన ప్రశ్నలకు)

త్వరలో చర్యలు!

అనర్హత పిటిషన్లు ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. ధిక్కరించే వారిపై దశల వారీగా చర్యలుంటాయి. జగన్ వర్గ విమర్శలను తిప్పికొట్టలేకపోవడానికి కారణం వైఎస్‌పై ఉన్న ప్రేమే! ఏదైనా అంటే వైఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావన ప్రజల్లో కల్పిస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు.

No comments:

Post a Comment