Monday, May 23, 2011

తప్పు మీద తప్పు!




రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద పరుగెడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. అటు పార్టీ అధిష్ఠానాన్నిగానీ, ఇటు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రిని గానీ లెక్క చేసే స్థితిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు లేరు. ప్రజా బలం లేని వారిని అధికార పీఠంపై కూర్చోబెట్టడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తింది. కడప ఎం.పి. జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడింది. దీనితో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఆ పార్టీలో ఎవరికీ లేదు.

అదే సమయంలో కడపలో జగన్ రికార్డు స్థాయి మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆయనతో రహస్య ప్రేమాయణం నెరపుతున్నారు. ఫలితంగా రాజకీయాలలో కోవర్టులు అన్న పదం తెరపైకి వచ్చింది. తమ పార్టీలో కోవర్టులు చేరారని గతంలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వాపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాపోతున్నారు. తమ నాయకత్వ పటిమపై నమ్మకం లేనివారు, నమ్మకం కలిగించలేని వారు మాత్రమే ఇలా వాపోతూ ఉంటారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంత దుస్థితిలో కూరుకుపోవడానికి ప్రధాన బాధ్యతను పార్టీ అధిష్ఠానమే తీసుకోవాలి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం, ఆయనకు అపరిమిత అధికారాలిచ్చి, ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదగకుండా కట్టడి చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం కాదా? కీలక వ్యక్తులు సంస్థను వదలి వెళితే లోటు ఏర్పడకుండా ఉండటానికి ప్రైవేటు కంపెనీలు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాయి.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. వై.ఎస్. హఠాన్మరణం తర్వాత నాయకత్వ లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి పార్టీని కాంగ్రెస్ విలీనం చేసుకుంది. అయితే చిరంజీవి నాయకత్వ పటిమపై అప్పటికే ప్రజల్లో సవాలక్ష సందేహాలు ఉన్న విషయాన్ని అధిష్ఠానం విస్మరించింది. విశేష ప్రజాదరణగల సినిమా నటుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవికి నాయకత్వ లక్షణాలు ఉండి ఉంటే 2009 ఎన్నికలలో ఆయన పార్టీయే అధికారంలోకి వచ్చి ఉండేది.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పార్టీలో నాయకత్వ లోటును పూడ్చటానికి ప్రయత్నించకుండా, దానికి బదులు వై.ఎస్. నామ స్మరణ చేయవలసిందిగా పార్టీ శ్రేణులను ఆదేశించడం పార్టీ అగ్ర నాయకత్వం చేసిన మొదటి తప్పు. పార్టీపై పూర్తి పట్టురాకుండానే తొందరపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేయడం రెండవ తప్పు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ రెండు విషయాలలో తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పూర్తి అజ్ఞానంలో ఉందని భావించవలసి ఉంటుంది.

వై.ఎస్. మరణం తర్వాత వారసత్వంగా ముఖ్యమంత్రి పదవిని ఆశించి, భంగపడిన జగన్మోహనరెడ్డి, సొంత పార్టీ పెట్టుకోవ డానికి, పార్టీకి రాజీనామా చేయడానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన జూబ్లీ హిల్స్‌లోని లోటస్ పాండ్ వద్ద, పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా, 80 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో భారీ భవంతికి మునిసిపల్ ప్లాన్‌కు అనుమతి పొందారు. అంటే వై.ఎస్. మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనకు ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించుకున్న మరుక్షణం నుంచే జగన్ సొంత కుంపటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.

అదే సమయంలో వై.ఎస్. మరణం ప్రమాదవశాత్తూ సంభవించినది కాదనీ, దాని వెనుక కుట్ర ఉందనీ, ఆ కుట్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పరోక్ష పాత్ర ఉందన్న అనుమానం ప్రజల్లో కలిగేలా తన మీడియాలో కథనాలను ప్రచురించి ప్రసారం చేశారు. అంటే సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికి ప్రజల్లో కాంగ్రెస్ పట్ల, ముఖ్యంగా సోనియాగాంధీ పట్ల వ్యతిరేకత ఏర్పడేలా జగన్ వ్యూహ రచన చేశారని అర్థం చేసుకోవాలి. జగన్ ఆలోచనలను పసిగట్టడంలో విఫలమైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కేంద్ర నాయకత్వం, ఆ తర్వాతైనా విరుగుడు చర్యలు తీసుకోకపోగా, జగన్‌కు లాభించే విధంగా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని కీర్తించే పని మొదలు పెట్టారు.

కడప, పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులకు తాము చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నట్టు, తండ్రి (వై.ఎస్.)ని మంచివాడు, గొప్పవాడు అని ప్రశంసించి, కొడుకు (జగన్) దుర్మార్గుడు అంటే ప్రజలు విశ్వసిస్తారనుకోవడమే కాంగ్రెస్ నాయకత్వం చేసిన పొరపాటు.

తండ్రి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే జగన్ ఇంత అక్రమ సంపాదన చేయగలిగి ఉండేవారా? అంటే జగన్ చర్యలన్నింటినీ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖరరెడ్డి ప్రోత్సహించినట్టే కదా? వై.ఎస్. హయాంలో అవినీతి విచ్చలవిడిగా ఉండేదనీ, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయనీ ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దగ్గర నుంచి, దిగువ స్థాయి కాంగ్రెస్ నాయకుల వరకు అందరూ ప్రైవేటు సంభాషణల్లో చెబుతూ ఉంటారు.

రాజశేఖరరెడ్డి విధానాల కారణంగానే రాష్ట్రానికి ప్రస్తుత దుస్థితి దాపురించిన విషయాన్ని కూడా వారు అంగీకరిస్తారు. అయితే బహిరంగంగా మాత్రం వై.ఎస్. అంతటి గొప్పవాడు లేడనీ, ఆయన పథకాలనే తాము కొనసాగిస్తున్నామనీ, ఆయనకు తామే వారసులమనీ, వై.ఎస్. కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని భజన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రచారం అంతా జగన్‌కే ఉపయోగపడింది. అమాయకులైన ప్రజలు కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి వై.ఎస్. అనుసరించిన విధానాలు కారణమని గ్రహించలేక పోతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ నాయకుల చర్యల వల్ల, వై.ఎస్. ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయానికి వచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారు. తన తండ్రిని మహా నేతగా చిత్రించి, ఆయన ప్రారంభించిన పథకాలను తాను మాత్రమే అమలు చేయగలనన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంలో జగన్ కృతకృత్యులయ్యారు.

రాజశేఖరరెడ్డి ఏ తప్పూ చేయకపోతే జగన్ వద్ద అంత సంపద ఎలా పోగయ్యేది? ప్రజల్లో ఇటువంటి సందేహాన్ని రేకెత్తించవలసింది పోయి, వై.ఎస్.ను కీర్తించడం వల్ల పరిస్థితి రివర్స్ అయింది. ఏ అధికార పదవులూ చేపట్టని జగన్, అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? బలమైన వ్యవస్థను ఎదిరించిన వాడిని హీరోగా అభిమానించడం మనుషుల సైకాలజీ. ప్రస్తుతం దేశ రాజకీయాలలో అత్యంత శక్తిమంతురాలైన సోనియాగాంధీని, తొడగొట్టి ఎదిరించినందుకు జగన్‌కు కూడా ప్రజల్లో అటువంటి క్రేజ్ ఏర్పడింది. ప్రజల మనస్తత్వాన్ని ఔపోసన పట్టిన జగన్, కడప ఉప ఎన్నికలను తనకు - సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.

ఇటువంటి స్వల్ప విషయాలను కూడా గ్రహించలేని స్థితిలో అటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ఉంది. చర్యకు ప్రతి చర్య అనేది న్యూటన్ సిద్ధాంతం. జగన్ అవినీతి గురించి పత్రికలు ఎంత రాసినా, తాము ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలెందుకు పట్టించుకోవడం లేదని సందేహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, అసలు మర్మాన్ని విస్మరిస్తున్నారు. జగన్ అవినీతికి పాల్పడి ఉంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నదన్న సామాన్యుల ప్రశ్నకు సమాధానం లేదు. కారణాలు ఏవైనప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వ బలహీనతలను క్యాష్ చేసుకున్న జగన్, ఇప్పుడు ఏకంగా సోనియా, రాహుల్‌గాంధీలకే సవాల్ విసురుతున్నారు.

ఈ సవాల్‌ను తట్టుకోవడంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం విఫలమైతే విజయం జగన్‌నే వరిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే కాంగ్రెస్ పార్టీ ముందు రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో మొదటిది, ఆరోపణలపై విచారణకు శ్రీకారం చుట్టడం ద్వారా జగన్‌పై చర్యలకు ఉపక్రమించడం. ఇలా చేయాలంటే జగన్ దోషి అని రుజువు చేయడానికి కొన్ని ఆధారాలైనా ఉండాలి. అటువంటి ఆధారాలు ఏమీ లేని పక్షంలో జగన్ అవినీతి గురించి ఇకపై ప్రస్తావించకుండా రాజకీయంగానే ఆయనను ఎదుర్కోవడానికి వ్యూహ రచన చేయడం రెండవ ప్రత్యామ్నాయం.

ఇందుకు భిన్నంగా రాజశేఖరరెడ్డిని కీర్తిస్తూ పోయినంతకాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుందే తప్ప బలం పుంజుకోదు. ఇక పార్టీలో, మంత్రివర్గంలో కోవర్టుల విషయానికి వస్తే, అటువంటి పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా తనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిని మరిపించడానికి ప్రయత్నిస్తారు. 1995లో ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు జరిపి, అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబునాయుడు, ప్రజలు ఎన్.టి.ఆర్‌ను మరచిపోయి తనను మాత్రమే గుర్తుపెట్టుకునేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి పథకాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. ఆ తర్వాత క్రమంలో చేపట్టిన పలు ఇతర కార్యక్రమాల వల్ల అప్పట్లో ఆయన కీర్తి ఆకాశాన్నంటింది. రాజశేఖరరెడ్డి స్థానంలో నియమితులైన రోశయ్య, ప్రస్తుత సి.ఎం. కిరణ్ ఈ విషయంలో విఫలమయ్యారు. జీవిత చరమాంకానికి చేరుకున్న రోశయ్యకు అయాచితవరంగా ముఖ్యమంత్రి పదవి లభించింది. వయో వృద్ధుడైన రోశయ్య, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాలనపై ఆయన ముద్ర కనపడి ఉండేది. అది కాంగ్రెస్ పార్టీకి లాభించేది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కూడా, ఇప్పటివరకు ఈ విషయంలో విఫల మయ్యారనే చెప్పవచ్చు. మంత్రిగా కూడా అనుభవం లేని ఆయనకు ముఖ్యమంత్రి పదవి లభించిందంటే జీవిత లక్ష్యం సాకారమైనట్టే! అయితే, స్వతహాగా ఇతరులను ఎవరినీ పెద్దగా నమ్మని కిరణ్, తనకు తానుగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. 50 ఏళ్ల వయస్సులోనే ఉన్న ఆయన, ఉరుకులు పరుగులతో వ్యవహరించాల్సింది పోయి, పగలంతా ఏమి చేస్తారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అదే సమయంలో తాను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానన్న విషయాన్నీ విస్మరించి, పాత కక్షలను మనస్సులోనే పెట్టుకుని వ్యవహరించడం వల్ల కిరణ్ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు.

2009 ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో తన ఓటమికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న విషయాన్ని ఆయన ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. కిరణ్ స్థానంలో మరెవరు ఉన్నా, పాత విషయాన్ని మరచిపోయి, రామచంద్రారెడ్డిని చేరదీసి ఉండేవారు. తాను నిజాయితీ పరుడిననేది కిరణ్ నమ్మకం. అది నిజం కూడా కావచ్చు. అంతమాత్రాన ఇతరులను అనుమానించాల్సిన అవసరం లేదు. నిజానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన మోడల్ తర్వాత ఈ రాష్ట్రంలో ఇకపై ఎవరూ నిజాయితీగా వ్యవహరించలేని స్థితి. మడి గట్టుకుని కూర్చుంటే శాసనసభ్యులు దూరం అయ్యే పరిస్థితి.

అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి విలువలను పూర్తిగా వదులుకోక పోయినా, పట్టు విడుపులతో వ్యవహరించక తప్పదు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన గులాం నబీ ఆజాద్‌ను కలిసిన కొంతమంది ఎం.పి.లు (వీరిలో పలువురు కాంట్రాక్టర్లే) ముఖ్యమంత్రి కిరణ్‌కు అనుకూలంగా మాట్లాడారు. కిరణ్ వచ్చిన తర్వాత ఒక్క పైసా కమీషన్ తీసుకోకుండా నాలుగు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని ఆజాద్‌కు వివరించారు. కమీషన్ ఏమిటి? ఎంతిస్తారు? అని ఆజాద్ ప్రశ్నించగా, గతంలో అయిదు నుంచి ఏడు శాతం కమీషన్ ఇవ్వవలసి వచ్చేదని సదరు ఎం.పి.లు వివరించారు.

'అయిదు శాతం లెక్కేసుకున్నా నాలుగు వేల కోట్లకు 200 కోట్ల రూపాయలు కమీషన్‌గా వసూలు చేసే వారా? ఈ రాష్ట్రంలో ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించారా?' అని ఆశ్చర్యపోవడం ఆజాద్ వంతైంది. ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి లక్షణాలు, మరికొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. ఏవి ఎక్కువ అనే దాన్నిబట్టి అంచనా వేస్తూ ఉంటాం. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి నిజాయితీపరుడే అయి ఉండవచ్చుగానీ, సహచర మంత్రులను విశ్వాసంలోకి తీసుకోక పోవడం, పార్టీ - ప్రభుత్వ బాధ్యతలను నమ్మకం ఉన్న వారికి అప్పగించకపోవడం వంటి అవలక్షణాలు ఆయనలో ఎక్కువగా ఉన్నాయి. అన్నీ ఒక్కరే చేయడం ఎక్కడా సాధ్యం కాదు. కాంగ్రెస్‌ను కబళించడానికి జగన్ ఒకవైపు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, పార్టీని కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రి తన వ్యవహారశైలిని మార్చుకోవాలి.

పార్టీలో అత్యధికులకు సంతృప్తి కలిగేలా వ్యవహరించాలి. అందుకు కిరణ్ సిద్ధపడకపోతే కాంగ్రెస్ అధిష్ఠ్టానమైనా చొరవ తీసుకుని ఆయనను మార్చడానికి కృషి చేయాలి. నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. తన సహచరులలో అత్యధికులు అసంతృప్తికి గురవుతున్నారంటే లోపం తనలోనే ఉందని గ్రహించాలి. రాజకీయాలలో ఉన్న వారైతే, తమ నాయకత్వాన్ని పార్టీలోని సహచరులు శ్లాఘించేలా వ్యవహరించాలి. రాజశేఖరరెడ్డి అదే పనిచేశారు 1995-1999 మధ్యకాలంలో చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించారు. అందుకే వారిద్దరూ సక్సెస్ అయ్యారు. స్వంత శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉన్న వారెవ్వరూ ఇతరులను చూసి భయపడరు. అనుమానించరు. 

- ఆదిత్య


No comments:

Post a Comment