Tuesday, August 30, 2011

కులకలం!

kulam
 
కాంగ్రెస్‌ పార్టీని పుట్టి ముంచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం కుల సమీకరణానికి తెరలేపింది. పార్టీకి ఆది నుంచీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా జగన్‌ వైపు వెళ్లే ప్రమాదం కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకత్వం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. అందులో భాగంగా కుల సమీకరణను ఎంచుకుంది. రెడ్డి- రాయలసీమ కోటాలో ముఖ్యమంత్రిగా నియమించిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చిన అవకా శాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్న అసంతృప్తి ఇంకా నాయకత్వంలో ఉన్నట్లు సమా చారం.

జగన్‌ వైపు రెడ్డి సామాజిక వర్గం వెళ్లకుండా చూడటంలో కిరణ్‌ పూర్తిగా విఫలమయ్యారన్న అభిప్రాయం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఆంధ్రా రెడ్లను గానీ, ఇటు తెలంగాణ రెడ్లను గానీ మెప్పించలేకపోతున్నారన్న భావన నెలకొంది. 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా కిరణ్‌ ఏ స్థాయిలోనూ అడ్డుకోలేకపోయారని, కేవలం ఆయన వైఫల్యం వల్లే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ గూటి కి చేరారన్న నివేదికలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరాయి. కిరణ్‌ సమర్థవంతంగా వ్యవహరించి, అందరినీ సమన్వయం చేసుకుని, వారికి అనుకూలంగా ఉన్నట్టయితే కనీసం 20 మంది కాంగ్రెస్‌లోనే ఉండిపోయారన్న భావన నాయకత్వంలో ఉంది. ముఖ్యమంత్రి సమన్వయలోపం-లౌక్యం లేకపోవడం, వేగంగా ఎత్తులు వేయకపోవడం, సీనియర్ల సలహాలు తీసుకోకపోవడం, గిరిగీసుకుని ఉండటం, కొందరికే పరిమితం కావడం వంటి కారణాలే ఈ దుస్థితికి కారణమన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మిగిలిన కులాలు చేజారకుండా ఉండేందుకు ఆయా వర్గాలకు చెందిన నేతలకు పదవులు ఇచ్చి ఆయా కులాలను సంతృప్తి పరిచే వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు ఆ పార్టీ నాయకత్వం తీసుకుంట్నున నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. వారిని సమన్వయం చేసుకోవడం కిరణ్‌కు సాధ్యం కాదని గ్రహించే కులాల వారీగా నియామకాలు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో వరసగా చేస్తున్న నియామకాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలను సంతృప్తి పరిచేందుకు ఆ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. దీనితో బీసీలు తన వైపు ఆకర్షితులవుతారని అంచనా వేస్తోంది. బొత్స సాంకేతికంగా బీసీ వర్గానికి చెందిన తూర్పు కాపు వర్గానికి చెందిన నేత అయినప్పటికీ, ఆయన కాపులతో సత్సంబంధాలు ఎక్కువగా ఉండటం కలసివచ్చే పరిణామంగా భావిస్తోంది.

అయితే, ఒక్క బొత్సకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా బీసీలకు న్యాయం చేసినట్లు కాదని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు అవకాశాలు ఇవ్వకపోతే వారిలో నెలకొన్న అసంతృప్తిని టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సద్వినియోగం చేసుకునే ప్రమాదం లేకపోలేదని నేతలు హచ్చరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ, ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు, కోస్తాలో యాదవ, మత్స్య, రాయలసీమలో బోయ, ఈడిగ, తెలంగాణలో యాదవ, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి వంటి ప్రధాన కులాలకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ దెబ్బతింటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

బొత్స బీసీ నేతగా కాకుండా కాపు నేతగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో బీసీకార్డుతో నాయకత్వం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ, దానిని కాపుల కోసం వినియోగిస్తుండటంతో బీసీలు దూరమవుతున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్యాయి. కాపులను బీసీల్లో చేర్పించే యత్నాలకు బొత్స మద్దతు పలుకుతుండటం బీసీల్లో వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా వైశ్య వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు తమిళనాడు గవర్నర్‌గా అవకాశం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది. ప్రతి పట్టణoలోనూ ఆర్థికంగా బలంగా ఉండే వైశ్య వర్గాన్ని ఆకట్టుకునే యత్నాలు ప్రారంభించింది.

రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ఏపీఐఐసీ చైర్మన్‌గా అదే వర్గానికి చెందిన శివరామ సుబ్రమణ్యానికి అవకాశం ఇచ్చినప్పటికీ, ఆయన ఇప్పటికీ సంస్థపై పట్టు సాధించలేకపోయారు. ఆయనను అధికారులతో సహా ఎవరూ లెక్కచేసే పరిస్థితి లేకపోవడంతో ఉత్సవ విగ్రహంగా మిగిలిపోయారు. అటు పార్టీకీ ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్న అభిప్రాయం నెలకొంది.ఇక కోస్తాలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని దరిచేర్చుకునేందుకు ఆ వర్గానికి చెందిన యువనేత నాదెండ్ల మనోహర్‌కు స్పీకర్‌ పదవి ఇవ్వడం ద్వారా కమ్మ వర్గానికి చేరవయ్యే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉన్న ఈ వర్గం ఓట్లబ్యాంకును కొల్లగొట్టడమే కాంగ్రెస్‌ లక్ష్యమని నాదెండ్ల నియామకంతో కనిపిస్తోంది. అయితే, మనోహర్‌ నియామకంలో రోశయ్య కీలకపాత్ర పోషించారు.

జగన్‌ నిష్ర్కమణతో దూరమయిన రెడ్డి ఓటు బ్యాంకు స్ధానంలో ప్రత్యామ్నాయంగా కాపులను తెరమీదకు తీసుకువచ్చింది. గత ఎన్నికల్లో 17 లక్షల ఓట్లు సాధించిన చిరంజీవిని తనలో విలీనం చేసుకోవడంలో అదే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కాపు, కడప, అనంతపురం జిల్లాల్లోని బలిజ వర్గాలను ఆకర్షించేందుకు చిరును ఓ సాధనంగా మలచుకుంటోంది. 4 శాతం ఉన్న రెడ్లు వెళ్లినా వారి స్థానంలో 10 శాతం ఉన్న కాపులతో నష్టనివారణ చేయవచ్చన్న వ్యూహం అధిష్ఠానం ఆలోచనలో కనిపిస్తోంది.

ఇక ఎస్సీల్లోని రెండు ఉప కులాలకూ నాయకత్వం సమ ప్రాధాన్యం ఇచ్చింది. మాల వర్గానికి చెందిన భట్టి విక్రమార్క, మాదిగ వర్గానికి చెందిన దామోదర రాజనర్శింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా మాల-మాదిగలను సంతృప్తి పరచాలన్న వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణలో ఎక్కువగా ఉన్న మాదిగలను, కోస్తాలో అధికంగా ఉన్న మాలలను ఏకకాలంలో సంతృప్తి పరిచేందుకు నాయకత్వం ఈ రెండు నియామకాలను పూర్తి చేసింది.


ఇక తాజాగా క్షత్రియ వర్గానికి చెందిన కనుమూరి బాపిరాజుకు ప్రతి ష్ఠాత్మకమైన టిటిడి చైర్మన్‌ పదవి ఇవ్వడం ద్వారా గోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు నాయకత్వం ప్రయ త్నించింది. సౌమ్యుడిగా పేరున్న బాపిరాజుకు ఆ పదవి ఇవ్వడం ద్వారా రాజు లను మచ్చిక చేసుకోవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. కేవలం 4 శాతమే ఉన్నప్పటికీ, ఆధిపత్యం, అంగ-అర్ధబలాలు దండిగా ఉన్న రెడ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ ఇన్ని కసరత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

No comments:

Post a Comment