
వరద బాధితులకు, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11న జగన్ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహిం చనున్నారు. ఆ మేరకు ఆయన అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీ బయలుదేరనున్నారు. తనకు మద్దతు ప్రకటిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, మునిసిపల్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా అదే రైలులో ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. జగన్, ఎమ్మెల్యేలు మాత్రం విమానంలో వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
అయితే, జగన్ ధర్నాకు ఆయనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా హాజరవుతారని జగన్ వర్గం ధీమాగా చెబుతోంది. ఆ మేరకు ఇప్పటికే జగన్ స్వయంగా సదరు ప్రజాప్రతినిధులతో ఫోన్లలో మాట్లాడుతున్నారు. గత నెలలో విజయవాడ కృష్ణానదీ తీరంలో జగన్ నిర్వహించిన లక్ష్యదీక్షకు హాజరయిన 31 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు శాసనమండలి సభ్యులు మళ్లీ ఢిల్లీ ధర్నాకూ హాజరవుతారని జగన్ వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో జగన్ ఢిల్లీ దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలెవరినీ వెళ్లనీయకుండా అధిష్ఠానం అడ్డుచక్రం వేసేందుకు ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో.. ఇలాంటి భయమే జగన్‌నూ వెన్నాడుతోంది. తన లక్ష్యదీక్షకు 31మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీ లు హాజరయినందున మళ్లీ వారంతా తన ఢిల్లీ ధర్నాకు రాకపోతే.. రాష్ట్రంలో తన పలుకు బడి పూర్తి స్థాయిలో పలచబడి పోతుందన్న భయాందోళన జగన్‌లో లేకపోలేదు. వారు వస్తేనే తాను రాష్ట్ర రాజకీయాల్లో హీరోగా నిలబడతా నని, లేకపోతే జీరో అవుతానన్న అంచనా కూడా ఉంది. ఇది పరోక్షంగా తన భవిష్యత్ రాజకీ య జీవితంపై నా ప్రభావం చూపుతుం దని మరో భయం కూడా కనిపిస్తోంది.
ఒకవేళ విజయవాడ ‘లక్ష్యదీక్ష’కు వచ్చిన ఎమ్మెల్యేల్లో సగం మంది ఢిల్లీకి రాక పోయి నా తన ప్రతిష్ఠ దెబ్బతిని, హైకమాండ్ పలుకుబడి పెరుగుతుందన్న భయాందోళన వ్యక్తిగతంగా జగన్‌నూ పట్టిపీడిస్తోంది. హైకమాం డ్ ఆంక్షల వల్ల ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్రకు రాకపోతే.. ఇక తనవైపు భవిష్యత్తులో ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చే అవకాశం లేదని, ఇది మిగిలిన నాయకు ల చేరికపై ప్రభావం తప్పకుండా పడుతుందని, అప్పుడు అసలు తన లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో.. రంగంలోకి దిగిన అధిష్ఠానం తన పరువు కాపాడుకునేందుకు తన ముందున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. జగన్ వైపు ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లకుండా కట్టడి చేసే బాధ్యతను మీదేనని విస్పష్టంగా ఆదేశించింది. దానితో సీఎం జిల్లా ఇన్చార్జి మంత్రులను రంగంలోకి దింపి, జగన్ వర్గ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నారు. ఇది ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఆదివారం తేలనుంది.